Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    3. మాంసము భక్షించు అగ్నిని నిషేధించుము.

    (నిప్పు కణికను బయట వేయవలెను.)

    4. దేవయానమునకు అనుకూలమగు అగ్నిని ఆవహింపుము.

    (రెండవ నిప్పు కణికను దక్షిణభాగమున ఉంచవలెను.)

    5. రాక్షసులు, శత్రువులు తగల బడుదురు గాత.
   
    (కపాలము - మూకుడు - నందు నిప్పుకణిక వేయును.)

    6. కపాలమా! నీవు దృఢమైన దానవు. భూమిని గట్టిపరచుము. యజమాని ఆయువును, సంతానమును గట్టి పరచుము. బంధువులను అతనికి స్వాధీనులను చేయుము.

    (దక్షిణ భాగపు నిప్పుపై మూకుడు పెట్టవలెను.)

    7. కపాలమా! నీవు ధరించుదానవు. అంతరిక్షమును దృఢపరచుము. ప్రాణమును దృఢపరచుము. అపానమును దృఢపరచుము. ఈయజమాని బంధువులను అతనికి అనుకూలురను చేయుము.

    (మొదటి కపాలమునకు తూర్పున రెండవ కపాలమును ఉంచవలెను.)

    8. కపాలమా! నీవు ధరించుదానవు. అంతరిక్షమును దృఢపరచుము. ప్రాణమును దృఢపరచుము. అపానమును దృఢపరచుము. ఈయజమాని బంధువులను అతనికి అనుకూలురను చేయుము.

    (రెండవ కపాలమునకు తూర్పున రెండవ కపాలమును ఉంచవలెను.)

    9. కపాలమా! నీవు ధరించగలదానవు. దిక్కులను దృఢపరచుము.యజమాని సంతానమును దృఢపరచుము. యజమాని బంధువులను అతనికి స్వాధీనులను చేయుము.

    (ఏడవ కపాలమును ఉంచవలెను.)

    10. ఎనిమిదవ కపాలమా! నీవు వర్ధిల్లిన రూపము కలదానవు. ఈయజమానికి ధనమునిమ్ము. సంతానము నిమ్ము. ఇతని బంధువులను ఇతనికి స్వాధీనులను చేయుము.

    11. కపాలములారా! మీరు భృగువుల యొక్కయు అంగిరసుల యొక్కయు తపోగ్నిచే తపించబడుడు.

    12. అధ్వర్యులు కపాలములను అగ్నియందు ఉంచినారు. యజ్ఞసమాప్తి తరువాత ఇంద్ర వాయు దేవతలు వానిని అగ్ని నుండి బయటకు తీయుదురు గాత.

                          ఎనిమిదవ అనువాకము

        (పురోడాశము చేయుటకు పిండిని తడుపుట చెప్పబడినది.)

    1. పిండీ! నిన్ను పాత్రయందు ఉంచుచున్నాను.

    (పిండిని పాత్రయందుంచవలెను.)

    2. ప్రణీత ఉదకములారా! మీరు 'మదన్తి' ఉదకములలో కలపండి. ఉదకములారా! మీరు సస్యధన వర్ధకులు మధురములైనవారు. పశు అభివృద్ధికారకులు. ఇది పిష్టము. రుచికరము. ఓషధి. మీరు దీనితో కలిసిపొండి.

    3. పిష్టరూప ఓషధులారా! పూర్వము మీరు ఉదకము లందు పుట్టిన వారే! కావున ఉదకములతో కలవండి.

    4. పిండిముద్దా! యజమానికి సంతానము కలుగుటకు నిన్ను మర్దించుచున్నాను.

    (పిండిని పిసుక వలెను.)

    5. పిష్టమా! అగ్నిదేవత కొరకు నిన్ను తాకుచున్నాను.

    (పిండిని తాకవలెను.)    

    6. పిష్టమా! నిన్ను అగ్నిషోమదేవత కొరకు తాకుచున్నాను.

    7. పురోడాశమా! మఖస్యశిరోసి - యజ్ఞపు తలవు.

    8. పురోడాశమా! కాలిన పెంక మీద ప్రకాశించుచున్నావు. విశ్వాయుః అసి. అనంత ఆయువువు అగుచున్నావు.

    9. పురోడాశమా! నీవు గొప్పదానవై వర్థిల్లుము. నీ యజమాని గొప్పవాడై వర్ధిల్లును గాత.

    (పెంక మీది పురోడాశము అరచేతి పరిమాణపు బిళ్ళలను చేయవలెను.)

    10. పురోడాశమా! నీవు మృదువగు పొరగలదానవు అగుము.

    11. రాక్షసులు, శత్రువులు దూరమగుదురు గాత.

    (దర్భను కాల్చి పురోడాశము చుట్టు మూడు మారులు త్రిప్పవలెను.)

    12. పురోడాశమా! సవితా దేవత నిన్ను 'నాకము' అను అగ్ని యందు పక్వము చేయును గాత.

    (పురోడాశమును నిప్పుల మీద కాల్చవలెను.)

    13. పురోడాశమా! నీ శరీరము ఎక్కువ కాలకుండును గాత. గార్హ పత్యాగ్నీ! నీవు పురోడాశ హవిస్సును రక్షింపుము.

    14. పురోడాశమా! నీవు మంత్రములతో మిళితమగుము.

    15. ఏకాయతాయ స్వాహా.

    16. ద్వితాయ స్వాహా.

    17. త్రితాయ స్వాహా.

    (గార్హ పత్యాగ్ని యందు హోమము చేయవలెను.)

                            తొమ్మిదవ అనువాకము

        (ఇందు పురోడాశము నుంచు వేదికరణము చెప్పబడినది.)

    1. స్ఫ్యా! నిన్ను తీసి కొనుచున్నాను.

    (కర్రతో చేసిన మట్టిని త్రవ్వు ఉపకరణము "స్ఫ్యా".)

    2. స్ఫ్యా! ఇంద్రుని కుడిచేత వందల ఆయుధములు ఉన్నవి. అవి వేల శత్రువులను వధించును. నీవు ఇంద్రుని కుడిచేతి వంటిదానవు. జ్వాలలు కలిగించు వాయువు వంటిదానవు.

    3. భూమీ! నీవు దేవయాగ ఆశ్రయమవు. నీయొక్క ఓషధుల వ్రేళ్లను బాధించను. "మాహింసిషమ్".

    4. భూమి మీది దుమ్మును తొలగించుట వలన 'అరరు' రాక్షసుడు దూరమయినాడు.

    5. గడ్డితో కూడిన ధూళీ! ఉత్కర ప్రదేశమునకు పొమ్ము.

    (1. ఉత్కరము - మట్టి, చెత్త వేయుచోటు. 2. గడ్డిని ధూళిని ఉత్కరమునకు తీసికొని వెళ్లవలెను.)

    6. యజ్ఞవేదీ! నీ కొరకు మేఘము వర్షించును గాత.

    (అధ్వర్యుడు యజ్ఞవేదిని చూడవలెను.)

    7. సవితాదేవా! మమ్ము ద్వేషించువారిని - మేము ద్వేషించువారిని ఎంతో దూరప్రాంతమున వేలపాశముల చేత బంధించుము. వారిని విడువకుము.

    (చెత్తను ఉత్కర ప్రదేశమున వేయవలెను.)

    8. భూమీ! నీవు దేవయాగ ఆశ్రయమవు. అరరు రాక్షసుడు అపహతుడు అయినాడు.

    రెండవసారి ధూళిని తొలగించవలెను.

    9. గడ్డితో కూడిన ధూళీ! ఉత్కర ప్రదేశమునకు పొమ్ము.

    (ఉత్కరమునకు కొనిపోవలెను.)

    10. యజ్ఞవేదీ! నీ కొరకు మేఘము వర్షించును గాత.

    (అధ్వర్యు రెండవసారి యజ్ఞవేదిని చూడవలెను.)

    11. సవితాదేవా! మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని ఎంతో దూరప్రాంతమును వేలకొలది పాశముల చేత కట్టి వేయుము. విడువకుము.

    12. అరరుడు దేవయాగమునకు అనర్హుడు. అతడు అపహతుడైనాడు.

    13. 9వ మంత్రము. (మూడవసారి ధూళిని తొలగించవలెను.)

    14. 10వ మంత్రము (మూడవసారి వేదిని చూడవలెను.)

    15. 11వ మంత్రము (మూడవసారి ధూళిని తొలగించవలెను.)

    16. ఉత్కర ప్రదేశమా! అరరు నీకు సంబంధించిన రాక్షసుడు. అతనికి స్వర్గము కలుగకుండునుగాక.

    17. యజ్ఞవేదీ! వసువులు గాయత్రీ ఛందమున దక్షిణ భాగమున నిన్ను స్వీకరింతురు గాత.

    18. రుద్రులు త్రిష్టుప్ ఛందమున పశ్చిమ భాగమున నిన్ను స్వీకరింతురుగాక.

    19. ఆదిత్యులు జగతిచంధమున ఉత్తర భాగమున నిన్ను స్వీకరింతురు గాత.

    20. సవితా దేవత ప్రేరణ కలిగించుచున్నాడు. అధ్వర్యులు వేదికి అవసరమగు ప్రదేశమును త్రవ్వుచున్నారు.

    (అధ్వర్యుడు వేది తూర్పున త్రవ్వవలెను.)

    21. యజ్ఞవేదీ! నీవు ఋతమసి - సత్యమవు.

    22. ఋతసదనమసి - సత్యస్థానమవు.

    23. ఋతశ్రీరసి - సత్యధనవు.

    (ఈ మూడు మంత్రములచే వేది యొక్క దక్షిణ, పశ్చిమ, ఉత్తర భాగములను ఏర్పరచవలెను.)

    24. వేదీ! వివిధ మంత్రములు ఉచ్చరించు ఋత్విజులు కలదానవు. అరరుడు అపహతుడైనాడు. నీవు దేవతల, పితృదేవతల హవిస్సులను ధరించుచున్నావు. కావున గొప్పదానవు అయినావు. పురోడాశ ధనవతివి అయినావు.

    (వేదిని స్ఫ్యచే శుభ్రము చేయవలెను.)

    25. పూర్వపు వారలగు వృద్ధయజమానులు హవిస్సులు సమర్పించినారు. వేదిరూపమగు భూమిని రాక్షసుల నుండి రక్షించినారు. చంద్రుని యందు అమృత కిరణములు స్థాపించినారు. ఇప్పటి యజమానులు బుద్ధిమంతులు. అప్పటి విషయములను గుర్తుంచుకున్నారు. వేదిని ఆశ్రయించినారు. యాగము చేయుచున్నారు.

                             పదవ అనువాకము

        (ఆజ్యాది హవిస్సులను గ్రహించు విధానము చెప్పబడినది.)

    1. స్రుక్కు మున్నగు వాని యందు దాగి ఉన్న రాక్షసులు దహించ బడుదురుగాక. శత్రువులు దహించబడుదురు గాత.

    (స్రుక్కు మున్నగు వానిని గార్హ పత్యాగ్నికి చూపి వెచ్చచేయవలెను.)

    2. స్రుక్కుమున్నగు హోమ సాధనము లారా! మిమ్ము చక్కగా వెచ్చచేయుచున్నాను.

    (రెండవ మారు వెచ్చచేయవలెను.)

    3. స్రువమా! నీవు గోస్థానమును నశింపచేయని దానవు. శత్రువును నశింపవేయుదానవు. అన్నము కలుగజేయుదానవు. నిన్ను శుభ్రము చేయుచున్నాను.

    (స్రువమును దర్భలచే తుడువవలెను.)

    4. జుహువా! యజమాని వాక్కును, ప్రాణమును నశింపచేయకుము. నిన్ను శుభ్రము చేయుచున్నాను.

    (తుడువవలెను.)

    5. ఉపభృతమా! యజమాని కనులను, చెవులను నశింపచేయకుము. నిన్ను శుభ్రము చేయుచున్నాను.

    (తుడువవలెను.)

    6. ద్రువమా! యజమాని భార్యను, సంతానమును నశింపచేయకుము. నీవు అన్నము కలిగించుదానవు. శత్రువును తిరస్కరించుదానవు. నిన్ను శుభ్రము చేయుచున్నాను.

    (తుడువవలెను.)

    7. యజమాని భార్య అగ్నిని సేవించుచున్నది. మంచి మనసు కలిగిఉన్నది. సంతానమును ,సువాసినిత్వమును, చక్కని రూపమును కోరుచున్నది. ఆమెనడుముకు త్రాడు కట్టుచున్నాను.

    (అధ్వర్యుడు త్రాడు కట్టవలెను.)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.