Read more!
 Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 4


    శకుంతల ఆ ఫోటోను చూసితెల్లబోయింది. ఆమె శరీరం ఆపాదమస్తకమూ వణికింది.
    "మీరు ముగించాలనుకుంటున్న నాయుడికథ ఈ పాటికి అర్ధమయుంటుంది మీకు!" అన్నది చంచల.
    "అర్ధమయింది. అయినా ఫిరంగిపురం వెడతాను-" అన్నది శకుంతల సుస్థిరస్వరంతో.
    
                                     *    *    *    *

    బస్సు ఫిరంగి పురంలో ఆగింది. శకుంతల అందులోంచి దిగి ఓసారి చుట్టూ చూసింది.
    అన్ని ప్రాంతాలలాగే ఉన్నదా ఊరు. కానీ ఆ ఊరుపేరు చెబితేనే ఎందరికో గుండెలదురుతాయి. ఆ ఊరిని గుప్పెట్లో ఉంచుకున్న ఇద్దరిలో ఒకడితో గొడవపడాలని తను వచ్చింది.
    ఫలితం ఏమవుతుందో?
    ఏమైన ఫరవాలేదు- "అమ్మా! నాకోసం వెతకవద్దు. ఈ ఉత్తరం మీకు చేరేసరికి నేనీలోకంలో ఉండను-" అని ఒక ఉత్తరం తల్లికి పోస్టు చేసి ఈ ఊరు వచ్చింది. తానిక్కడికి వచ్చినట్లు ఒక్క చంచలకు తప్ప ఎవరికీ తెలియదు.
    ఒక రిక్షావాడు ఆమెను సమీపించి- "ఎక్కడికమ్మా?" అనడిగాడు.
    "నాయుడుబాబు ఎక్కడుంటాడో తెలుసా నీకు!" అన్నది శకుంతల.
    "ఫిరంగిపురంవచ్చి నాయుడుబాబుగారు తెలుసా అంటారేమిటమ్మా-రండి-రిక్షా ఎక్కండి. మీరేమిస్తే అది తీసుకుంటాను-" అన్నాడు రిక్షా వాలా. శకుంతల మారాలోచన లేకుండా రిక్షా ఎక్కింది. ఓ పావుగంటలో రిక్షా ఒక మారుమూల సందులో ఆగింది.
    "ఏమిటీ-నాయుడిబాబు ఇల్లక్కడుందా?"
    "లేదు-దిగండమ్మా-" అన్నాడు రిక్షావాలా.
    "ఎందుకూ దిగడం-"
    "చూడండమ్మా-బస్ స్టాండుకు నాయుడుబాబు వచ్చారు. దూరాన్నుంచి మిమ్మల్ని చూపించి-మంచి మాటలు చెప్పి తిరుగు బస్సులో పంపించేయమన్నారు లేకపోతే....."
    "ఊఁ లేకపోతే...."
    "రిక్షా దిగండమ్మా-" అన్నాడు రిక్షావాలా.
    శకుంతల రిక్షా దిగుతూనే-రిక్షాను ఊతగాచేసుకుని కాలితో రిక్షావాడి ముఖంమీద తన్నింది. ఊహించని ఆ వేగం రిక్షావాన్ని ఆశ్చర్య చకితుణ్ణి చేసింది. వాడు ఠకీమని నేలమీద పడిపోయాడు.
    అప్పటికి ఆమె చుట్టూ నలుగురు చేరారు. చూడగానే నలుగురూ గూండాలని తెలిసిపోతోంది.
    "పిల్ల వంటిమీద చేయివేయక తప్పదనుకుంటాను. చాలా పొగరుగా ఉంది-" అన్నాడు వారిలో ఒకడు.
    శకుంతల ఇంకా రిక్షాను ఆనుకునే ఉన్నది. ఆ గూండా మాట లింకా పూర్తి కాకుండానే ఆమె చకచకా పనిచేసింది. అంత వేగంగా ఆమె కాళ్ళనుపయోగించి ముఖం ఎలా తన్న గలుగుతున్నదో వారికి తెలియలేదు. కానీ నలుగురూ నేలకరిచారు. వాళ్ళు లేచేలోగా శకుంతల ఆ సందులోంచి బయటకు పరుగెత్తింది.
    సందు మొగలో ఆమె ఆగిపోయింది. దారికి అడ్డంగా ఒక నడివయస్కుడు నిలబడి ఉన్నాడు.
    "తప్పుకో!" అన్నదామె.
    "ఒకరు నాకు దారి ఇవ్వడమే తప్ప-నేనెవరికీ దారి ఇవ్వను-" అన్నాడతను గంభీరంగా.
    శకుంతల అతడిని పరీక్షగా చూసింది. ఎత్తయిన విగ్రహం. గుబురు మీసాలు. వయసు నలభైకీ యాభైకీ మద్య ఉండవచ్చు. చాలా హుందాగా, గౌరవనీయుడిలా కనబడుతున్నాడు.
    "నువ్వూ నాయుడి మనిషివా?" అన్నదామె.
    "ఛీ-" అన్నాడతడు-" ఒకప్పుడు నాయుడే నా మనిషిగా ఉండేవాడు. ఒకరి మనిషిననిపించుకోవడం ఈ చౌదరికి అసహ్యం-"
    "నువ్వు.....చౌదరివా?" అన్నదామె. ఎందుకో అప్పుడామెకు కాస్త ధైర్యం వచ్చింది.
    "అవును. నీ ప్రతాపం చూశాను. నీ విద్య చాలా కొత్తగా ఉన్నది. ఒక్కతెవూ అయిదుగురిని నేలకరిపించావు. నిన్నభినందించాలనిపించి ఇక్కడ నిలబడ్డాను....."
    "అడ్డు తప్పుకో-వాళ్ళు మళ్ళీ లేచి...."
    శకుంతల మాట పూర్తిచేయకుండానే అతడు- "చూడు- ఈ చౌదరి ఇక్కడ నిలబడి వుండగా ఆ కుక్కలు అక్కన్నించి లేవవు. నేను కదిలాకనే వాళ్ళు నిన్ను తరుముతారు. నాతో వస్తావా?" అన్నాడు.
    "నీతోనా-ఎందుకు?" అన్నది శకుంతల.
    "రాగానే నాయుడి మనుషులు నీ వెంటపడ్డారంటే- వాడు నీ మీద పగబట్టాడన్నమాట. నీ ప్రాణాలమీద నీకు మోజుంటే నువ్వు నాతో రావాలి. నాతో ఉండాలి-" అన్నాడు చౌదరి.
    "నా ప్రాణాలమీద నీకూ మోజు ఉన్నదా?" అన్నది శకుంతల.
    "ఉన్నది-" అన్నాడు చౌదరి- "ఇప్పుడు నీవు అయిదుగుర్ని మట్టి కరిపించావు చూడు. ఆ విద్య అసామాన్యమైనది. అది నీకెలా వచ్చిందో తెలియదు. ఇదే మొదటిసారి అలాంటి నేర్పు చూడడం!"
    "అది నేనెక్కడా నేర్చుకోలేదు...." అన్నది శకుంతల.
    "ఊహించగలను. ప్రపంచంలో ఎన్ని రకాల యుద్ద విద్యలున్నాయో అవన్నీ నాకు తెలుసు. వాటిలో ఇది లేదు. నీవు సానపట్టని వజ్రానివి. నిన్ను సానబెడతాను-" అన్నాడు చౌదరి.
    "కానీ నేను నీతో రాబోవడం లేదు-" అన్నది శకుంతల.
    "రాక ఏం చేస్తావు?" అని నవ్వాడు చౌదరి- "నీ విద్య నాకు ఉపయోగపడుతుంది కానీ నిన్ను రక్షించలేదు. నాయుడి మీద నీకు పగవుంటే అది తీర్చుకునేందుకు నేను నీకు సాయపడతాను. ఈ అవకాశం నువ్వుపయోగించుకోకపోతే నీ పాగా తీరదు, నువ్వూ ఉండవు....."
    శకుంతల సూటిగా చౌదరివంక చూసి- "మగాళ్ళందరూ ఇలాంటి కబుర్లే చెప్పి ఆడవాళ్ళను వలలో వేసుకుంటారు-"అన్నది.
    "నువ్వు వల గురించి అన్నది నిజమే! ప్రస్తుతం నీ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. ఆ ఉచ్చు తప్పించి నా వలలోకి లాగాలనుకుంటున్నాను నేను-"అన్నాడు చౌదరి.

 Previous Page Next Page