Read more!
 Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 4


    గోపాలం ఫక్కున నవ్వాడు. సిద్దాంతి నడుస్తూ నడుస్తూ ఠక్కున ఆగిపోయాడు.
    "నడవండి సిద్దాంతిగారూ! నడుస్తూనే మాట్లాడుకోవచ్చు." చిరునవ్వుతో అన్నాడు గోపాలం.
    ఈ కుర్రకుంకలతో వాగ్వివాదం పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. ఈ కాలం కుర్రాళ్ళు! రామ రామ! బొత్తిగా పాపభీతి లేకుండా పోతుంది. ఏం చదువులో ఏమిటో? నానా టికీ నాస్తికుల సంఖ్య పెరిగి పోతుంది.
    "ఏమిటండీ గురువుగారూ ఆలోచిస్తున్నారు? అదుగో ఆ పిల్ల చంకలోవున్న ఆ మేకపిల్ల ఎంత అందంగా వుందో చూడండి!"
    "ఆఁ ఆఁ అవునవును!" అనేశాడు సిద్దాంతి గోపాలం ధోరణి అర్ధంగాక.
    "ఆ మేకపిల్లకు మరో ఆరు నెలలకు చావు వ్రాసిపెట్టి వుందనుకోండి. ఈ మధ్యకాలంలో ఎవరూ దాన్ని చంపలేరంటారు?"
    "శివునాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు నాయనా!"
    "అలాగే! అయితే ఇప్పుడేదాన్ని కొని మీకళ్ళముందే చంపిస్తాను. దానికేమంటారు?" గోపాలం సిద్దాంతి మొహంలోకి దీక్షగా చూశాడు. ఈ దెబ్బతో సిద్దాంతికి నాలుక పిడచకట్టుకపోదే? అనుకున్నాడు.
    సిద్దాంతి మొహంలో గాంభీర్యంతో మిళితమైన చిరునవ్వువెలసింది.
    "దానికి ఈనాటితో కాలం తీరిపోతేనే నీకు అలాంటి బుద్ధి పుట్టిస్తాడు పరమశివుడు." అంటూ ఇంత ముక్కు పొడుం చిటికెలోకి తీసుకొని గట్టిగా ఎక్కించాడు. ముక్కుకొనను అరచేత్తోరుద్దుకొన్నాడు. అది చూసిన గోపాలానికి కడుపులో దేవినట్లయింది.
    "తాదృశీ జాయతే బుద్ధిః యాదృశీ భవితవ్యతాః" అన్నాడు సిద్దాంతి ముక్కు తుడుచుకున్న చేతిని శాలువాను తుడుచుకుంటూ.
    "ఎలా వ్రాసిపెట్టి వుంటే అలాగే మన బుద్ధి మనచేత చేయిస్తుందంటారు?"
    "కరెక్ట్" సిద్దాంతి ఉత్సాహంగా అన్నాడు.
    "అంటే బుద్ధి స్వతంత్రంగా పని చెయ్యదన్నమాట. మానవుడు చేసే పనులకు అతడు బాధ్యుడు కాదన్నమాట. అంటే మనిషి చేసే పాప పుణ్యాలకు సంజాయిషీ అతను చెప్పుకోనక్కరలేదు. ఇది చెయ్యి! అది చెయ్యకు! అనే నీతి బోధలూ, ధర్మశాస్త్రాలూ, న్యాయశాస్త్రాలూ, అన్నీ నిరర్ధకాలే నన్నమాట!"
    సిద్దాంతి దిక్కులు చూస్తూ నడుస్తున్నాడు: కొంచెం నడక వేగం కూడా పెంచాడు. గోపాలంకూడా వేగంగా నడుస్తూ అన్నాడు.
    "సిద్దాంతిగారూ నాకో చిన్న సందేహం కలుగుతోంది"
    "ఏవిఁట్టో అది?" విసురుగా అన్నాడు సిద్దాంతి.
    "మానవుని బుద్ధి  స్వంతంత్రంగా పని చెయ్యదు కదా? అది భగవంతుని నిర్ణయానికి బద్దమై నడుస్తుందిగదా? అలాంటప్పుడు భగవంతుడు అందరిచేతా మంచిపనులే ఎందుకు చేయించడో?"
    సిద్దాంతికి చిర్రెత్తుకొచ్చింది. జవాబు తోచక తికమకపడ్డాడు.
    "ఏమయ్యా గోపాలం? నువ్వేనాడయినా గుడి కెళ్ళిన పాపాన పోయావా?" సిద్దాంతిస్వరంతో తిరస్కారం కొట్టొచ్చినట్లువినిపించింది.
    గోపాలం పకపక నవ్వాడు. "ఎందుకండీ అంత చిరాకు? నేను అడిగినదానికి మీరు జవాబివ్వనేలేదు. పోనివ్వండి. నేను మీ ప్రశ్నకు జవాబిస్తాను. చిన్నప్పుడు అమ్మతో ప్రతి శనివారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళేవాణ్ణి. ఎందుకో తెలుసా? ప్రసాదం కోసం. ఊహ తెలిశాక ఎన్నడూ వెళ్ళలేదు. నా మనస్సు ఇంకా నిర్మలంగానే వుంది. దేవాలయానికి వెళ్ళి పాపాలను ప్రక్షాళనం చేసుకోవలసిన అవసరం ఇంకా కలగలేదు." గోపాలం ఆవేశంగా అనేశాడు.
    "అంటే నీ ఉద్దేశం? గుడికి వెళ్ళే వాళ్ళంతా పాపాలు చేసిన వాళ్ళనేనా?" సిద్దాంతి స్వరంలోని తీవ్రతకు గోపాలం ఓ నిమిషం ఆగి మళ్ళీ నడక సాగించాడు.
    "నేనలా అనలేదే? కాని ఎక్కువమంది అలాంటివారనే నా అభిప్రాయం. కొంతమంది  కోర్కెలు తీర్చమనివెళ్ళితే కొంతమంది కష్టాలు తీర్చమని వెళతారు. కేవలం భక్తిభావంతో వెళ్ళేవాళ్ళు ఎంతమంది వుంటారు చెప్పండి?"
    "ఏమో నాకేం తెలుసూ! అదీ నువ్వే చెప్పూ!" వత్తిరాగం తీస్తూ అన్నాడు సిద్దాంతి.
    గోపాలానికి నవ్వొచ్చింది. నవ్వితే సిద్దాంతి మరీ ఉలుక్కుంటాడని, వచ్చే నవ్వును పెదవులమధ్య బంధించాడు.
    "ఇవ్వాళ తమరి దగ్గర చాలా ముఖ్య విషయం నేర్చుకున్నాను. ఆజన్మాంతం మీకు కృతజ్ఞుడనై వుంటాను" అన్నాడు గోపాలం మామూలుగానే. కాని సిద్దాంతికి ఆ స్వరంలో వ్యంగ్యం వినిపించింది.
    "ఏవిఁట్టో అదీ!" ప్రతి అక్షరం ఒత్తి పలికాడు.
    "పాపం చేసిన వ్యక్తి బాధపడనక్కరలేదు. భగవంతునికికూడా భయపడనక్కరలేదు."
    సిద్దాంతి ఠక్కున ఆగిపోయాడు. ఓ నిముషం ఆశ్చర్యంగా గోపాలం మొహంలోకి చూశాడు.
    "రామ! రామ! నేను అలాగన్నానా?"
    "ఇంతకుముందే కదండీ అన్నారు? బుద్ధి స్వతంత్రమైంది కాదనీ, అంతకుముందే వ్రాసిపెట్టిన ప్రకారమే ఆ బుద్ధి నడుస్తుందనీను! పుణ్యం చేయించినా, పాపం చేయించినా ఆ పరమాత్ముడే కాబట్టి మానవుడు ఎందుకు భయపడాలి?"
    "మీలాటి నాస్తికులకు ఎలా సమాధానాలు చెప్పాలో నాకు తెలియదు. మేము మా గురువులు చెప్పినదాన్ని నమ్మాం. అంతేకాని మీలా కుంటి ప్రశ్నలు వెయ్యలేదు." అన్నాడు అవధాన్లు అంతకంటే ఏం అనాలో తోచక.
    "అరే మాటల్లో చాలా దూరం నడిచాం. అలా పబ్లిక్ గార్డెన్ లోకి వెళ్ళి కాసేపు కూర్చుందాం పదండి." అన్నాడు గోపాలం. మనస్సు బాగాలేని తనకు మంచి కాలక్షేపమే దొరికింది.

 Previous Page Next Page