Read more!
 Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 3


    "ఎక్కడే నువ్వూ? కొత్త చాపులు పట్టుకురా! తొందరగా! పేగులరుస్తున్నాయ్." కేక వేశాడు సాంబయ్య.
    దుర్గమ్మ కొత్త ఉత్తరీయానికీ, కట్టు పంచకూ పసుపురాసి పరిగెత్తుకొంటూ గాబుదగ్గిర కొచ్చింది. పంచలందుకొని, వాటితోనే సాంబయ్య తలా వళ్ళూ తుడుచుకొంటూ దుర్గమ్మను చూసి "ఏమిటే వండావ్? పద! పద! వడ్డించు!" అన్నాడు.
    దుర్గమ్మ లోపలకెళ్ళి పీటవాల్చి కంచంలో భోజనం వడ్డించి, గారెలూ, సజ్జబూరెలూ గిన్నెలో పక్కన వుంచింది. సాంబయ్య తడీపొడీగా వున్న కొత్త పంచకట్టుకొని, పైపంచెతో జుట్టు సాగదీసి తుడుచుకొంటూ వచ్చి పీటమీద కూర్చున్నాడు.
    రెండేసి గారెలూ, సజ్జబూరెలూ, లుంగచుట్టి తింటున్న సాంబయ్యను కన్నార్పకుండా చూస్తూ ఎదురుగా చతికిలబడి కూర్చుంది దుర్గమ్మ. ఆమె మనసులో వున్న భావాన్ని భర్తకు ఎలా చెప్పాలో తోచక భర్తకేసి కళ్ళు మెరిపిస్తూ, సిగ్గుపడుతూ కూర్చుంది. భర్త అదేమీ పట్టించుకోకుండా తిండిలో పడిపోయాడు.
    "బూరెలు బాగా కుదిరినై" అంటూ సాంబయ్య ఇంకోపట్టు పట్టసాగాడు.
    "మరి గారెలో?" ఊరికే అంది దుర్గమ్మ, అలా అయినా భర్త తనలోని మార్పును గమనిస్తాడేమోనన్న ఆశతో.
    "ఆఁ! గారెలా? మనచేలో మినుములేగా? బలే పసందుగా..." అంటూ సాంబయ్య నోట్లో బూరె కుక్కుకొని దుర్గమ్మకేసి చూసి ఆగిపోయాడు.
    ఎందుకు ఈ రోజు దుర్గమ్మ మెరిసిపోతోంది? తనను చూసి సిగ్గుపడుతోందేమిటి? తలంటుకొని కొత్తచీర కట్టుకొన్నదా? అదా సంగతి?
    "ఎనిమిదిరూపాయలు పోతే పోయినయ్! కోక బాగుందిలే! రంగు వుంటుందంటావా?" సాంబయ్య అర్ధం చేసుకొన్నంతలో గ్రహించింది అది.
    దుర్గమ్మకు కోపం వచ్చింది. అయినా భర్త ముందు దానికి విలువలేదని ఆమెకు తెలుసు.
    "ఉంచండి! అన్నీ మీరే తినేస్తారే? వచ్చేవాళ్ళకేం పెడతాం?" అంది దుర్గమ్మ.
    సాంబయ్య బిత్తరపోయాడు. భార్య ఎప్పుడూ తనతో ఇలా మాట్లాడి ఎరగదు. ఎవరికి పెడ్తుంది? అలగాజనానికి వేరే వండుద్దిగా? మరి ఆ వచ్చేవాళ్ళెవళ్ళో? దాని పుట్టింటి తరపువాళ్ళు ఎవరైనా వస్తున్నారా?
    "ఏమేవ్? మీ తమ్ముడెవడైనా వస్తున్నాడా?" ఎద్దేవగా అడిగాడు సాంబయ్య.
    "కాదు, రావాల్సినవాడే వస్తున్నాడు." దుర్గమ్మ పెళుసుగా సమాధానం చెప్పింది.
    "నీ అక్కుదారుడే వస్తున్నాడు." మళ్ళీ అదే ధోరణిలో అన్నది దుర్గమ్మ. నోట్లో ఉన్నది గుటకమింగి, నీళ్ళు తాగి సాంబయ్య అన్నాడు:
    "అక్కుదారుడా? వాడెవడేవ్?"
    "వారసుడు, నీ వంశాన్ని నిలిపేవాడు. "కిలకిలా నవ్వింది దుర్గమ్మ.
    అర్ధంచేసుకొన్న సాంబయ్య దుర్గమ్మ నోట్లో సజ్జబూరె కుక్కాడు. దుర్గమ్మ ఉక్కిరిబిక్కిరైపోయింది.
    వేళ్ళు తెరిచీ, మడిచీ అన్నది "ఇంకా ఎనిమిది నెల్లు."
    మొదటి వారంరోజులూ దుర్గమ్మను కొత్తగా, వింతగా, శ్రద్దగా చూశాడు సాంబయ్య. ఆ తర్వాత ఆ బలుపు తీరినట్లయింది సాంబయ్యకు.
    దుర్గమ్మకు ఏడోనెల నిండగానే తమ్ముడు వచ్చాడు.
    "బావా! మా అయ్య  అప్పను తీసుకురమ్మన్నాడు. ఏకువజామున బయలుదేరుతాం." అన్నాడు దుర్గమ్మ తమ్ముడు సాంబయ్యతో.
    "ఇప్పుడిక్కడ దానికేం తక్కువయిందంట?" సాంబయ్య విసురుగా అన్నాడు.
    గడపలో నిలబడివున్న నిండుచూలాలు దుర్గమ్మ గుండెలు అవిసిపోయినయ్.
    "అదికాదు బావా? ఎడ్లయినా పుట్టింటిలోనే పురుడు పోసుకోవాలి గదా? అమ్మా అయ్యా మరీ మరీ చెప్పారు. ఎట్టాగయినా అప్పను తీసుకురమ్మని" అన్నాడు దుర్గమ్మ తమ్ముడు.
    "ఇప్పుడెట్టా వస్తుందిరా? పంటలు ఇంటికి వచ్చే తరుణంగదా? పని ఎద్దడి మోపుగా వుంది. నేను చూస్తే రేత్రింబవళ్ళు పొలంలోనే వుంటున్నానుగందా? ఇంటిదగ్గర అదికూడా లేకపోతే ఎట్టా జరుగుద్ది?" సాంబయ్య ఈసారి కొంచెం తగ్గినట్టే అన్నాడు.
    "అప్పా! ఏందేమరి?! బావ ఇట్టా అంటున్నాడు?" అక్కయ్యకేసి చూస్తూ గోళ్ళు గిల్లుకుంటూ అన్నాడు తమ్ముడు.
    దుర్గమ్మ భర్తకేసి ఆదుర్దాగా చూసింది. భర్త చలించలేదు. దుర్గమ్మ పైట చెంగుతో కళ్ళద్దుకొని, బొటనవేలితో మండిగం రాస్తూ నిలబడింది.
    "ఏంటే? అట్టా ఇదయిపోతావ్? ఇక్కడ నువ్వేం బరువులు మోస్తున్నావ్? ఈ ఎద్దడిలో నువ్వెళితే ఎక్కడి డక్కడ ఆగంకాదంటే? ఆడదానివి నీకుండొద్దే ఆ ఆలోచన?" భార్య ముఖంలోకి చూస్తూ అన్నాడు సాంబయ్య.
    "తమ్ముడూ! నేను రానని చెప్పరా అమ్మోళ్ళకి! నాకిక్కడ బాగానే వుంది లేరా!" దుర్గమ్మ గట్టిగా చెప్పటానికి ప్రయత్నించి విఫలమైంది.
    సాంబయ్య మళ్ళీ అందుకొన్నాడు.
    "చూడరా! దానికేం కష్టం లేకుండానే చూసుకొంటున్నానురా! రామికి నలకగింజలిచ్చి అచ్చంగా మీ అక్కయ్యకోసమే వుంచానురా? సలకగింజల్రా! సలకగింజలు! ఇప్పుడొచ్చి అక్కను తీసుకెళ్తానంటున్నావ్!"
    "వంటతప్ప ఊడ్పూ, పాడీ అంతా రామి చేస్తుంది. ఇంకా మీ అక్కకు పనేంటిరా? ఇంత ఉడకేసి పడేయటమేగదరా? అది చెయ్యలేకపోతే ఆ పనీ నేనే చేసుకుంటానుమరి, తప్పేదేముంది?"
    సాంబయ్య కర్రతీసుకొని దండెంమీద పంచ భుజాన వేసుకొని,  బావమరిది వంక చూస్తూ "నాలుగురోజులుంటావా!" అని అడిగాడు.
    "మాకూ అక్కడ పనులున్నాయ్! ఇంకెందుకు బావా? రేపొద్దెళ్తా" తదీ పొడిగా అన్నాడు సాంబయ్య బావమర్ది.
    "ఉండరా రెండురోజులు! అంత దూరంనుంచి వచ్చావ్." అన్నాడు సాంబయ్య పొలం బయలుదేరుతూ.
    కనుచీకటి పడుతుండగా సాంబయ్య పొలంనుంచి తిరిగి ఇంటి మొహంపట్టాడు. వీరభద్రయ్యగారి దొడ్డిదాటి మలుపు దిరిగి తనఇంటిముందు నెరాబాలోకి వచ్చిన సాంబయ్యకు, వాములదొడ్డి పెన్నెం తెరిచినట్లనిపించి, గబగబా అటుకేసి వెళ్ళాడు. దొడ్లోనుంచి ఓ మనిషి నెత్తిన మూటపెట్టుకొని, గబగబా గేటుదాటి బయటికిపోవటం సాంబయ్య కళ్ళబడింది! చీకటిలో మనిషి ఆనవాలు తెలియటం లేదు. నాలుగు అంగల్లో ముందుకెళ్ళి, చేతిలోవున్న బాణాకర్ర ఆ వెళ్ళేవాడి పిక్కలకేసి విసిరాడు. పోతున్న మనిషి బిక్కచచ్చి నిలబడిపోయాడు.
    "ఎవడ్రా నువ్వు? ఆగక్కడ?" అంటూ సాంబయ్య అతనికి ఎదురెళ్ళి నిలబడ్డాడు.
    "నేనే బావా?"
    "ఒరే! నువ్వంటరా! మరేంట్రా ఈ దొంగపని?" సాంబయ్య క్రోధంతో అడిగాడు.
    "కాదు బావా! అక్కే ఇచ్చింది."
    "ఇస్తుందిరా నీ అక్క? దానమ్మ మొగుడిసొమ్ముగదూ?" అంటూ చేతిలో ఉగ్గంకట్టివున్న తపేలా లాక్కొని బావమరిదిని నెత్తిమీద వున్న మూటతో సహా, ఇంట్లోకి నడిపించుకొచ్చాడు.
    గాబరాపడిన దుర్గమ్మ ప్రాణాలు ఉగ్గపట్టుకొని తమ్ముడికీ, భర్తకి మధ్య నిలబడింది.
    "ఎన్నాళ్ళనుంచి ఇట్లా దోచిపెడుతున్నావే!" కళ్ళెర్రజేసి అడిగాడు సాంబయ్య.
    "రామ! రామ! ఇంతవరకు మన సొమ్ము పూచికపుల్లంత ఎరుగరు. చేలో పండినయ్ గదా! ఇంట్లో రెండు గేదెల పాడి అవుతుందిగదా అని ఇచ్చాను."
    "నోరుముయ్! తప్పుడుకూతలు కుయ్యమాకు. ఎవడబ్బ సొమ్మే తేరగా పెట్టటానికి? పోతుల్లాగ వున్నారు నీ తమ్ముళ్ళు - పనిచేసుకొని బతకాలే!" అని సాంబయ్య విసురుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
    మినుములూ, కందులూ, బియ్యమూ విడివిడిగాకట్టి నింపిన మూట అక్కడ వదిలేసి దుర్గమ్మ తమ్ముడు చరచరా బయటకు నడిచాడు.

 Previous Page Next Page