Read more!
 Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 3


    "వెళ్ళు చాలా లేటయినట్లుంది. దండకం చదివావు కదా. జ్వరం తగ్గిపోతుందిలే" అన్నాను.
    
    "నీ జ్వరం నాకిచ్చెయ్యకూడదూ" అన్నాడు.
    
    అంతశక్తి ఎలా వచ్చిందో శరీరానికి తెలియదు. ఠక్కునలేచి అతని తలను రెండు చేతుల్లో పట్టుకుని నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాను. ఆ మాధుర్యానికి మత్తెక్కినట్లు మౌనంగా వెళ్ళిపోయాడు.
    
    ఆ చిన్న గుడిసెలో, కిరసనాయిల్ దీపపు మసకకాంతిలో పడుకోవడం నావల్ల కాకుండా పోయింది. ఏదో తెలియని భావావేశం శరీరాన్ని వణికించింది. జ్వరం బహుశా శరీరంలో చిట్లిన కాంతికి కళ్ళు చెదిరి వెళ్ళిపోయిందనుకుంటా, ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి" నైమిష చెప్పడం ఆపింది.
    
    సూర్యాదేవికి మాత్రం ఆ తరువాత కూడా ఆమె మాట్లాడుతున్నట్లే అనిపించింది. ఎవరో ఓ అబ్బాయి తనకోసం సుదూర ప్రాంతాల నుంచి వెతుక్కుంటూ వస్తున్నట్లే కనిపించింది.
    
    సూర్యాదేవి గుండెల్లో ఎక్కడో మొదలైన దిగులు శరీరమంతా మాయా రాక్షసుని శరీరంలా నిండిపోయింది. రోజులు గడుస్తూ వుంటే ఆ దిగులు ఎక్కువైందే తప్ప తగ్గలేదు. యూనివర్శిటీలో చేరాక కూడా ఆమె తండ్రి హోదా ఆమె వెన్నంటే వుండేది.
    
                                                3
    
    క్లాసులు ప్ర్రారంభమై అప్పటికి నాలుగైదు రోజులయ్యాయి. యూనివర్శిటీ హాస్టల్ లో మిగిలిన ఆడపిల్లల్తో వుండడం రిలీఫ్ గా వుంది. అమ్మాయిలు వెళ్ళేదారిలో గుంపులు గుంపులుగా అబ్బాయిలుండే వాళ్ళు. రకరకాల కామెంట్స్ చేసి, అందర్నీ సాగనంపి తాము కూడా క్లాసులకు వెళ్ళేవాళ్ళు.
    
    మిగిలిన వాళ్ళమాటేమోగానీ సూర్యదేవి మాత్రం అబ్బాయిల కామెంట్స్ ను వినేది. అలాంటప్పుడు తన చెవుల్ని అక్కడే తురాయిచెట్ల కొమ్మలకు తగిలించి వచ్చేస్తే బావుండునని కూడా ఆమె అనుకొనేది.    

    ఆరోజు తన క్లాస్ మేట్స్ తో కలిసి క్లాసుకు బయల్దేరింది సూర్యదేవి.
    
    ఆర్ట్స్ బ్లాక్ కు మలుపు తిరిగేచోట యధాప్రకారం ఓ అబ్బాయిల గుంపు నిలుచుని వుంది.
    
    వీళ్ళు దగ్గర కావడంతోనే వాళ్ళల్లో ఓ అబ్బాయి పాటందుకున్నాడు.
    
    సూర్యాదేవి వింటూ మెల్లగా అడుగులేస్తోంది. ట్యూన్ ని బట్టి ఆ పాట "చిటపట చినుకులు పడుతూ వుంటే" లావుంది. కానీ భాష వేరు. తెలుగే కానీ అదోలా వుంది. తమిళంగానీ, మలయాళంగానీ కాదు.
    
    సూర్యదేవికి ఆ పాట ఏమిటో తెలుసుకోవాలనిపించింది. కానీ ఎలా అడగడం?
    
    పాడుతున్న అబ్బాయి గొంతు కాస్తంత పెంచాడు. అప్పుడు స్ట్రయిక్ అయింది ఆ పాట ఏమిటో? చిటపట చినుకుల పాటనే రివర్స్ గేర్ లో పాడుతున్నాడు అంటే పదాలన్నింటినీ తిరగెయ్యడం అన్నమాట. "చిటపట" అన్న పదాన్ని వెనకి నుంచి "టపటచి" చేశాడు. మొత్తం పాటనంతా అలానే పాడుతున్నాడు. ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడం గొప్పా? లేకుంటే ఆ పాటను అలా పాడడమే గ్రేట్ అనిపించిందామెకు. ఆ పాట పాడడానికి ఎంత ప్రాక్టీస్ కావాలో.
    
    ఆ అబ్బాయిని అభినందించాలన్న కోర్కెను బలవంతంగా అణుచుకుంది.
    
    పాట అయిపోయింది.
    
    అమ్మాయిలు ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం మెట్లెక్కుతున్నారు. అప్పుడు వినిపించాయి ఆమెకు ఆ మాటలు.
    
    "రేయ్! వెధవ పాటలూ నువ్వూను, ఆమె ఎవరనుకున్నావు? భూపతిరాజు కూతురు సూర్యచంద్ర ప్రభాదేవి. నువ్విలా పాటలు పాడుతున్నావని ఆయనకు గాని తెలిస్తే నీ తల వాళ్ళింటి ముందు దిష్టిబొమ్మలా వేలాడదీస్తాడు. జాగ్రత్త"
    
    పాపం పాట పాడిన ఆ అమ్మాయి స్నేహితుడు చెప్పింది విని గతుక్కుమన్నాడు.
    
    మరుసటి రోజునుంచి ఆమె కనిపించగానే అబ్బాయిలు తమ కామెంట్స్ ని తాత్కాలికంగా నిలిపేవాళ్ళు. భూపతిరాజా అంటే అంత టెర్రర్ మరి.
    
    అలా అబ్బాయిల గుంపు మూగపోవడం ఏదో వెలితిగా అనిపించింది సూర్యాదేవికి. కానీ ఏం చేయగలదు తనకు తానై చొరవ తీసుకోవడం ఆమెకు చేతకాదు. తన రూమ్మేటు రమ్య ఆమె వేదనని మరింత ఎక్కువ చేసింది.
    
    ఓరోజు అరగంట ఆలస్యంగా రూమ్ కొచ్చింది రమ్య. హాస్టలర్స్ అంతా సాయంకాలం ఆరుగంటలకల్లా ఖచ్చితంగా హాస్టల్ కి వచ్చేయాలి. ఆ తరువాత వస్తే వార్డెన్ క్రమశిక్షనా చర్య తీసుకుంటుంది. అరగంట ఆలస్యంగా రావడమే కాకుండా వార్డెన్ ని తిట్టుకుంటూ బట్టలు మార్చుకోవడం ప్రారంభించింది రమ్య.
    
    ఏం జరిగిందో తెలియని సూర్యాదేవి అడిగింది "ఎవర్ని కసికసిగా తిడుతున్నావు?"
    
    "ఇంకెవర్ని? వృద్దకన్య అయిన మన వార్డెన్ ని. నలభై అయిదేళ్ళు వహ్చినా పెళ్ళీ పెటాకులేని ఈవిడ్ని కావాలనే వార్డెన్ గా వేశారనుకుంటా. ఇక్కడ తను వున్నది కేవలం మన శీల సంరక్షణకోసమే ననుకుంటుంది. శీల సంరక్షణకోసమే అయితే మనం యూనివర్శిటీ దాకా ఎందుకు రావాలి? మన అమ్ములు, మన అమ్మమ్మలు ఇంతకంటే బాగానే ఆ పని చేయగలరు. ఇకపోతే అరగంట ఆలస్యానికే కోతిలాగా ఎగిరింది. కుళ్ళు మనం సుఖపడిపోతున్నామని కుళ్ళు"
    
    "ఏమనిందేమిటి?"
    
    "ఇంకొకసారి ఇలావస్తే హాస్టల్ ఖాళీ చేయిస్తుందట. చుంచుముఖం అదీను. అసలు ఆవిడకి యవ్వనంలో వుండే అమ్మాయిలంటే హాలు మొత్తంగానూ, మనలాంటివాళ్ళమీద ప్రత్యేకంగానూ కసి వుంది. ఆవిడ బ్రెస్ట్ ఎప్పుడయినా గమనించావా? జెండావందనం రోజున ప్లేగ్రౌండ్ ఎలా వుంటుందో అలా వుంటుంది. కాస్తంత ఎత్తయిన బ్రెస్ట్ వున్న అమ్మాయిలంటే వళ్ళుమంట, హేవ్స్ అండ్ హేవ్స్ నాట్స్ మధ్య వున్న ఘర్షణ లాంటిదన్న మాట. సినిమాకెళ్ళాను. ఆలస్యమయింది అంటే వంటినంతా పరీక్షించి చూసింది. ముఖంలో ఏమయినా పంటిగాట్లు, గోళ్ళ గుర్తులు వున్నాయేమోననే పరిశీలన. కుర్చీకి ఆనుకోవడం వల్లే జాకెట్ నలిగిందంటే నమ్మదే. మరో స్నేహితురాలితో కలిసి వెళ్ళానంటే వినదే. ఎన్ని ప్రశ్నలు, ఎన్ని ఆరాలు తీసిందనుకున్నావు"
    
    "ఇంతకీ ఎవరితో వెళ్ళావ్ సినిమాకి?"
    
    "నువ్వు కాబట్టి నిజం చెబుతున్నాను వివేక్ తో ఆంధ్రపాలజీ" అన్నది రమ్య.
    
    ఇక ఏమీ ప్రశ్నించలేదు సూర్యాడేవి. ఏదో దిగులు గుండెల్ని నానబెడుతోంది.
    
    ఇలా జరిగిన వారం రోజులకి కాబోలు రాత్రి తొమ్మిదిన్నరకు హడావుడిగా బయల్దేరింది రమ్య. సూర్యాదేవికి ఏమీ అర్ధం కాలేదు.
    
    "ఎక్కడికి?"

 Previous Page Next Page