Read more!
 Previous Page Next Page 
తుపాన్ పేజి 2

    అతని హృదయం నవనీతం. కల్ప మూర్తి ఒకళ్ళకి ఆవగింజంతైనా కష్టం కలిగించలేడు. పెద్ద డేనుకుక్కలా నా చీర కొంగుల వెనుకనే తిరుగుతుంటాడు. ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ వెఱ్ఱిపూజ, ప్రపంచ శిఖరితమైన అతని మూర్తి, అతని భాగ్యమూ చూసి, ఇంకో స్త్రీ అయితే అతనికి దాసాను దాసురాలు కావలసిందే. సమంగా కోలగా ఉన్న అతని ముఖం చూస్తాను. విశాలమైన ఫాలము, విస్త్రుతాలైన నేత్రాలు, విపంచి రూపంగా ఉన్న నాసిక, విల్లయి పగడాలు చేర్చుకున్న పెదవులు, వియద్గంగా వికసిత హేమపద్మ ముకుళంలాంటి చుబుకము, బంగారపు అతని ఒళ్ళు, అకల్మష హృదయం ప్రతిఫలించే అతని నవ్వూ చూస్తూ ముచ్చటపడిపోతాను. ఒక్క నిమిషం అతడు లేకపోతే నాకు తోచదు. అంతే!

    దృడమైన తన బాహువులతో అతడు నన్నదుముకుంటాడనే  ఊహ  నాకు కంపరం పుట్టిస్తుంది. నా పెదవులను అతని చక్కని పెదవులతో, తనివితో తాకడం అనే ఊహ నన్ను కుంగచేస్తుంది. అతన్ని నా పురుషుడిగా, నా భర్తగా భావించుకోలేను. అతడు నా రసజ్ఞతకు ఆలంబ మైన ఒక వస్తువు మాత్రము.మోటారు  బాగా నడపగలడు. టెన్నిసులో యోధుడు, కుస్తీలో అందెవేసిన చెయ్యి. ప్రయాణాల్లో పెట్టెలు ఖాళీచెయ్యడం, టిక్కెట్లు తెప్పించడం, సర్వసౌకర్యాలను సమకూర్చడం అతనికి ఉగ్గుబాల విద్య. ఎంత కొత్త వాళ్ళయినా అతనికి భయంలేదు. వాళ్ళతో అతడు బాగా స్నేహం చేయగలడు. రైల్వే ఇంజనీర్లు, కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఎక్సైజు అసిస్టెంటు కమీషనర్లు, యినస్పెక్టర్లు_ఈ జాబితాకు అంతులేదు_అతని స్నేహితులు.

    తమ తమ ప్రయాణాన్ని నాకు తెల్పడంలో నిశాపతికీ, కల్పమూర్తికీ చాలా తేడా ఉంది. '' నీ అందం ఓ లక్ష గులాబీల పోగు హేమ సుందరీ దేవీ! నీ కళ్ళలోని గాటపుదమి నా కంఠంలోని అతి గభీరాలను గాన మధువుతో అంచులంటా నింపగలదు, మోహనమూర్తీ!'' అంటాడు నిశాపతి.

    '' హేమా! నా సర్వస్వమూ నీది. సౌందర్యానికి నిగ్గులుదీర్చే దేవతా స్త్రీలు నీ ముందర వికారంగా ఉంటారు. మా అమ్మ నీవు ఎప్పుడు కోడలుగా వస్తావో అని కలవరిస్తూంది. ఈ కాలంలో చదువుల తేడాలు పరిగనించవలసిన అవసరం....అవసరం....లేదని నా మనవి. అది నిజం కాదూ? కాదూ! '' అని అతి విశ్వాస పూరితమైన వృషభనయనాలతో నా పాదాలు పూజిస్తూ మోకరిల్లుతాడు కల్పమూర్తి.

                                      4

    కల్పమూర్తి నీడలా వస్తాడు తీర్ధమిత్రుడు. తీర్ధమిత్రుడు కర్పూర శలాక లాంటివాడు, ఆడదాని సౌందర్యమాతనిది. కళ్ళు కన్నన్ బాల కళ్ళలా నవ్వుతవి: కాంచనమాల కళ్ళలా కాంక్షిస్తవి: పుష్పవల్లి కళ్ళలా పులకరాల పూజలు సమర్పిస్తవి. ఎప్పుడూ నవ్వుతూంటాడు. ఉంగరాల అలకలు తేలు జుట్టూ, చిన్న ఫాలమూ, గుండ్రని మోమూ ఎప్పుడూ నవ్బ్వుతూనే ఉంటవి.సమమైన ముక్కు, కాయ శరీరము, ఉజ్వల శ్యామల చ్చాయ, స్పష్టతతాల్చిన మూర్తి. మిట్ట మద్యాహ్నపు  లేత  రావిచేట్టులా ఉంటాడు, పొట్టివాడు.

    తీర్ధమిత్రునితో  నడిచివస్తుంది సంతోష దేవత. విషాదంలో కూలి పోయినవారు కూడ అతడు వచ్చేటప్పటికి సంతోషాకాసంలో తేలిపోతారు. అతని అడుగుల చప్పుడు వినేటప్పటికి నా హృదయంలో సంతోషరాగాలు ఉద్బవిస్తాయి. నా పని ఇంతైనా నన్ను చేసుకోనివ్వడు. అతడు సమీపంలో ఉంటే తోచకపోవటమనేది దగ్గఱకు రాదు. ఎన్ని గంటలయినా గణ గణ మాటలాడుతాడు. అతనికి ఒక్క విషయమూ తెలియదు, తెలియని విషయమూ  లేదు. అతడు ఏ పుస్తకమూ చదవడు, అన్ని పుస్తకాలూ చదివినట్లు కనపడతాడు. ఏ పత్రికా చూడడు, పత్రికలోని వార్తలన్నీ చెపుతాడు.

    తీర్ధమిత్రుడు సంగీత పాటకుడు కాడు. అయినా తియ్యగా పాడగలడు, తన పాటల్ని తాను హార్మోనియం మీద వాయించగలడు. వాయించుకుంటూ పాడగలడుగాని అతని గొంతుకలో లోతులు లేవు. రాచుకున్న పది నిమిషాలవరకు మాత్రం సువాసనవేసే అత్తరులాంటిది అతని గొంతుక.

    '' ఆడమ్మాయి '' వలె మాట్లాడుతాడు. '' ఆడమ్మాయిలా '' నడుస్తాడు. మామూలు మాటల్లో కూడా అతని గొంతుక ఆడగొంతుకే. స్త్రీ సహజమైన జాగ్రత్తతో అలంకరించుకుంటాడు. క్రీములు, పౌడర్లు, సెంట్లు రాసుకోవడంలో నాతో సమానమైన చెయ్యి. సిల్కులలో మునిగి, సిల్కులలో తేలుతాడు.

    కల్పమూర్తితో సమానమైన చెయ్యి టెన్నిసులో, బేస్ లైన్ ఆటలో ఇతన్ని మించినవారు లేరు. '' చాపింగ్ '' లో '' హాఫ్ వాలీ '' లో మహా మాంత్రికుడు. మా స్నేహితులు చాలామంది ఇతని ఆటని  '' జిడ్డు ఆట '' అంటారు. గంటలకొద్దీ, సునాయాసంగా, చమటతో షర్టు సుంతయినా తడవకుండా టెన్నిసు ఆడగలడు. తాను ''పాయింటు''తియ్యలేడు. ఇతర్లన్నీ తీసుకోనివ్వడు. ఇతన్ని నెగ్గాలంటే '' స్మాష్ '' తోటి, '' నెట్ డ్రాఫ్'' లతోటి, నెగ్గవలసిందే. ఒక్క కల్పమూర్తి తప్ప ఇతన్ని తెన్నిసులో గెల్చేవారెవ్వరూ లేరు.

    తీర్ధమిత్రుడు కవిగాదు.కాని కవిత్వంలాంటి పాటలు అప్పటికప్పుడు కల్పించి పాడుతుంటాడు. వీళ్ళ పాటలోంచి ఓ పాదం, వాళ్ళ పాటలోంచి  ఓ పాదం కలేసి విచిత్రమైన రుచులు అందిస్తుంటాడు. ఎవరైనా అతనికి కొత్తలేదు. ఎలాంటి వాళ్ళతోనై నా నిమిషంలో స్నేహం చెయ్యగలడు.
       
                                                                    5
       
    ఇంకా త్యాగతీశర్వరీ భూషణుడు కురూపీకాడు, అందమైనవాడూ కాడూ ఆలోచిస్తే అన్నీఅందమైన రేఖలే, అన్నీ  చక్కని వట్రువలె. విలక్షణమైన విచిత్రమూర్తిత్వము అతని శరీర సౌష్టవములో ఉన్నది, అతన్ని మరవలేము. అతన్ని '' త్యాగతి '' అని మాత్రం పిలుచుకుంటాము.

    నవ్వడు, నవ్వుకన్న విలాసమయినదేదో అతని పెదవుల్లో నాట్య మాడుతూంటుంది, అతని ఫాలన అతిగంభీరకాసారని శ్చలత గోచరిస్తుంది.           
 

 Previous Page Next Page