Read more!
 Previous Page Next Page 
వెలుగుబాట పేజి 2

 

    చెప్పలేక ఆయాసపడుతూ ఆగాడు కుమార్.  ఝాన్సీ చూడలేక "సరే హొటల్ కి పద, కానీ పెళ్ళీ  గిళ్ళీ అనకు. అంతేకాదు, కొద్దిసేపయినా నీతో కలిసి ఒకే రూంలో ఉండను. నాకు వేరే రూం బుక్ చేయించు" అంది. అన్నింటికీ 'సరే సరే ' అన్నట్టు  తలూపాడు కుమార్.
    జంటగా వచ్చిన యువతీ యువకులు విడిగా రూమ్స్ కావాలని అడుగుతుంటే, అదొక మాదిరిగా చూసాడు హొటల్ మేనేజర్. ఝాన్సీ  సిగ్గుతో అవమానంతో కుచించుకుపోయింది. ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళబోతున్నప్పుడు "త్వరగా రెడీ అవండి. టైంలేదు" అన్నాడు కుమార్ ఝాన్సీ  మాట్లాడలేదు హొటల్లో అడుగుపెట్టిన దగ్గరనుంచీ ఆ అమ్మాయికి చాలా గాబరాగా ఉంది. పదినిముషాల్లో తయారయి వచ్చేసాడు కుమార్. ఝాన్సీ  అలాగే కూర్చుని ఉంది కదలిక లేకుండా.
    "అదేమిటి ఇంకా తయారవలేదూ?"
    ఇంక ఈ ఆటలు కట్టిపెట్టి అసలు విషయం చెప్పండి. ఏమిటిదంతా?"
    "నన్ను నమ్మండి వివరంగా చెప్పలేను. మూడు ముక్కల్లో చెబుతాను. నన్ను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసారు"
    "ఓ గాడ్  సారి......ఎందుకు?"
    "వినండి. అడ్డురాకండి. నా స్థానంలో మరొకర్ని వేస్తారు. ప్రస్తుతం ఆ ఊళ్లో ఉన్న ఏమ్మెల్యేగారిని ఆశ్రయిస్తే ఆ ఉద్యోగం మీకే రావచ్చును."
    ఝాన్సీ  తలవంచుకుని కూర్చుంది.
    "నా స్థానంలో రావటమా అని సందేహించకండి. మీరు రాకపోతే మరొకర్ని వేస్తారు. అందుకే ఇంత హడావుడిగా వచ్చాను.
    ఝాన్సీ  అప్పటికీ తలెత్తలేదు.
    "త్వరగా బయలుదేరండి. నా ఫ్రెండ్స బయట వెయిట్ చేస్తున్నారు. ఈ పెళ్ళి తతంగం పూర్తయ్యాక వెంటనే బస్ లో కొత్తపల్లె బయలుదేరాలి.
    ఝాన్సీ  దిగ్గున తలెత్తి కుమార్ కళ్ళలోకి సూటిగా చూసింది.
    "ఉద్యోగానికి పెళ్ళికి ఏం సంబంధం?"
    "అది.....అది.....ఆ పోస్ట్ హరిజనులకు రిజర్వ్  చేయబడింది."
    ఝాన్సీ  ముఖం వాలిపోయింది.
    మీరేం సంకోచించకండి. ఉద్యోగం కన్ ఫర్మ్ కాగానే నాకు విడాకులిచ్చేదురు కాని. ముందు విడాకులకు అనుమతి పత్రం రాసి మీ చేతిలో పెడతాను. నేను మీకే ఇబ్బంది కలిగించను. అసలు ఆ ఊళ్లోనే ఉండను. నా ఉద్యోగ ప్రయత్నాలు నేను చేసుకొంటాను."
    ఝాన్సీ  కళ్ళలోంచి నీటిబొట్లు రాలాయి. కుమార్ ముందుకు వంగి అవి తుడిచాడు. ఆమె తల వెనక్కు తీసుకుంది.
    "సారీ! మీరు బాధపడుతుంటే చూడలేకపోయాను. ఒక ఫ్రెండ్ గా ఓదార్చబోయాను అంతే, బాధపడకండి మిమ్మల్ని మీ ఇంటిదగ్గర దింపెయ్యనా?"
    ఝాన్సీ  లేచి నిలబడి తల ఎత్తకుండానే "బయట వెయిట్ చెయ్యండి. అయిదునిముషాల్లో తయారయి వస్తాను" అంది.
    బస్ వేగంగా ముందుకుపొతోంది. ఇద్దరు కూచునే సీట్ లో ఒకరి పక్క మరొకరు కూచున్నారు, ఝాన్సీ  కుమార్ లు. ఝాన్సీ  తల వంచుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా కూర్చుంది. కుమార్ ఏదో  చెప్పటానికి రెండుమూడుసార్లు ప్రయత్నించాడు కానీ గంభీరంగా వున్నఝాన్సీ  మొహం  అతని నోటిమాట బయటకు రానియ్యలేదు. చివరకు ఆమె చిరునవ్వుతో అతని వంక చూసి "ఏమిటి?" అంది.
    "హమ్మయ్య!"
    "ఎందుకు!"
    "మీరు నవ్వారు."
    ఈసారి ఝాన్సీ  కిలకిల నవ్వేసింది.

 Previous Page Next Page