Read more!
 Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 2


    "నిజంగానే వచ్చాను ఏడాది తరువాత యింక ఆగలేక. ఏలూరు అంతటి టౌనులో ఎడ్రసు తెలియకుండా మిమ్మల్ని ఎలా వెతకాలని వచ్చానో నాకే తెలియదు. అపుడు మీ నాన్నగారు డాక్టరు అని మీమాటల్లో చెప్పిన ఒక్కమాట ఆధారంతో వూర్లో రెండు రోజులు మకాం పెట్టి మిమ్మల్ని వెతకాలనుకున్నాను. ఆ ఊర్లో పాతిక మంది డాక్టర్లు పైగా వున్నారు. టెలిఫోను డైరెక్టరీ పట్టుకొని ఆ డాక్టర్లకి ఫోనున్న వాళ్ళందరికి ఫోనుచేసి అర్చన వున్నారా అని అడగడం అర్చన ఎవరూ లేరు అనగానే ఫోను పెట్టేయడం. ఫోనులేని డాక్టర్ల బోర్డులు కనిపించే కొన్ని యిళ్ళకి వెళ్ళి అదే ప్రశ్న అడిగితే అందరూ నన్ను వెర్రివాడిని అన్నట్లు చూశారు. ఆ డాక్టర్ల యిళ్ళకివీల్లి ఫలానా అర్చన అనే అమ్మాయి వున్న తండ్రిపేరు మీకు తెలుసా, ఎడ్రసు తెలుసా అని కూడా అడిగాను.
    "మీకు మతిపోయిందా అలా ఎలా వెదుకుదాం అనుకున్నారు అర్చన నవ్వుతూ అంది.
    "అవును మతేపోయింది - అర్చనా మీకోసం మతే పోగొట్టుకున్నాను. పోయిన మతి" అర్చన గాభరాగా రాజేష్ వంక చూసింది. "ఇదిగో ఇప్పుడు తిరిగి వచ్చింది."
    "ఆఖరికి ఒక డాక్టరుగారు, మీపేరు చెప్పాక అర్చన ఫాదర్ డాక్టరు రంగారావా. అరే, ఆయన ఈ మధ్యనే హార్ట్ ఎటాక్ వచ్చిపోయారు. వాళ్ళందరూ యీ ఊరు వదిలి హైద్రాబాదు వెళ్ళిపోయారు అన్నారు.
    "అవును నాన్నగారికి హార్ట్ ఎటాక్ వచ్చిపోగానే అన్నయ్య హైదరాబాదులో ఇంజనీరుగా వుంటే మేం అక్కడికి వెళ్ళిపోయాం అర్చన మధ్యలో అంది.
    "ఆ మాటతో హతాశుడైపోయాను. మీ బ్రదరు గుర్తులేదన్నాడు ఆయన. ఏలూరులో డాక్టర్లని వెతికినట్లు హైదరాబాదులో యింజనీరుని వెతకటం సాధ్యమయ్యేది కాదని మానుకున్నాను. ఏ దేముడో దిగివచ్చి మిమ్మల్ని చూపించాలని ప్ర్రార్ధించాను. ఇన్నాళ్ళకి నా ప్రార్ధన ఫలించింది. మీరిలా కనిపించారు." అర్చన రాజేష్ మాటలు, అతనిలో ఉద్వేగం గుర్తించి కాస్త అయోమయంగా చూసింది. అతనిలోని భావావేశం ఆమెకి అర్ధంకాలేదు.
    "మీరు మరీ ఎగ్జాజరేట్ చేస్తున్నారు. డ్రమెటిక్గా మాట్లాడుతున్నారు. అంతలా నా కోసం మీరు చూశారంటే మన పరిచయం ఎంత! నన్నింతలా మిస్ అయ్యారు అని. నమ్మకనే అంటున్నారా." నవ్వుతూ అంది.
    "మైగాడ్. ఇదంతా హాస్యం అనుకుంటున్నారా. ఎగ్జాజరేట్ చేశానా. అసలు నేను చెప్పవలసిన దానిలో సగం కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను. బిలీవ్ మీ అర్చనా......మిమ్మల్ని కలవాలని ఎంత అనుకున్నానో మీకెలా చెప్పను." రాజేష్ మాటల్లో నిజాయితీని అతని కళ్ళు చూపాయి. అర్చన మొహం కొంచెం ఎర్రబారింది.
    "ఎందుకంతలా నన్ను కలవాలనుకున్నారు. కారణం ఏమన్నా వుందా? లేక నా గురించి తెల్సుకోవాలన్న కుతూహలమేనా!" సందిగ్ధంగా అడిగింది.
    రాజేష్ చుట్టూ చూశాడు. ఇద్దరు ముగ్గురు కుతూహలంగా తమ సంభాషణ వింటున్నారు.
    "అదంతా ఇప్పుడు చెప్పడం కుదరదులెండి. మనం తరువాత సావకాశంగా మాట్లాడుకుందాం. ఇంతకీ ముందీసంగతి చెప్పండి మీరేం చేస్తున్నారు? పూజ ఎలా వుంది? ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? మీవారి విషయం ఏమయింది? అంతా వినాలని ఆరాటంతో కొట్టుకుపోతున్నాను."
    "ముందు మీరు చెప్పండి. మీరెక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆ యింట్లోనే వుంటున్నారా?" అర్చన నవ్వుతూ ప్రశ్నలు కురిపించింది.
    "నేనెక్కడికీ వెళ్ళడంలేదు. స్నేహితుడికి సెండాఫ్ యివ్వడానికి స్టేషన్ కి వచ్చాను. రైలులో మీరు కనబడగానే యింకేం ఆలోచించకుండా రైలెక్కేశాను. లేకపోతే మళ్ళీ మిస్ అవుతానని, టిక్కెట్టు కూడా లేదు."
    "అరే, అదేమిటి అలా ఎక్కేశారెందుకు." గాభరాగా అంది.
    "ఏం చెయ్యమంటారు? రైలు కదిలాక మీరు కనిపించారు. పక్క కంపార్టు మెంటులో మీరన్నా అరగంటసేపు ఫ్లాట్ ఫాంమీద వున్నా చూడలేదు. మరీసారి మిమ్మల్ని పట్టుకోకపోతే ఇంక జన్మలో మీరు కనబడరని వెంటనే ఎక్కేశాను వరంగల్ లో దిగి వెనక్కి ఏదో రైలులో వెళ్ళి పోతాను. టి.సి. వస్తే టికెట్టు తీసుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదు లెండి. హైదరాబాదులో మా కజిన్ సిస్టర్ పెళ్ళికి వచ్చాను. నా ఫ్రెండు ఒకడు విశాఖపట్నం వెడుతుంటే ఊరికే ఇలా వచ్చాను. నిజంగా యిలా రావడం ఎంత మంచిదయిందో చూశారా.....ఇప్పుడింక చెప్పండి మీ గురించి"
    "నేను రాజమండ్రి వెళ్తున్నాను. అక్కడ బి.యి.డి సీటు దొరికితే చేస్తున్నాను. శలవులకి అమ్మవాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్తున్నాను."
    "అంటే.....అంటే....మీవారు.....మీరు...." చుట్టుపక్కల వాళ్ళు వింటారన్నట్టు గొంతు తగ్గించి అడిగాడు.
    "చాలా గొడవలు అయ్యాయిలెండి. అన్నింటిని తట్టుకుని అందరిని ఎదిరించి నా బతుకు నేను బతుకుతానని చెప్పేశాను. బి.యిడిలో లాస్ట్ యియర్ చేరాను. ఇదయ్యాక లెక్చరరు ఉద్యోగం వస్తుంది. అప్పుడు నా అంతట నేను ఎవరిమీదా ఆధారపడకుండా బతకగలను. బి.యిడి చేస్తే కాని లెక్చరరు పోస్టులు రావటంలేదు. రాజమండ్రిలో సీటువస్తే అక్కడ చేరాను."
    "అక్కడ ఒక్కరే ఉంటున్నారా? ఎక్కడుంటున్నారు? ఎడ్రసిస్తారా? యిప్పుడైనా హాస్టల్లో వున్నారా"
    "లేదు నేను ఇంకో అమ్మాయి కల్సి చిన్న యిల్లు తీసుకొని వుంటున్నాము. యిదిగో యిప్పుడే రాసిస్తా" అర్చన నవ్వుతూ అని బేగులోంచి పెన్నుతీసి కాగితం మీద రాసిచ్చింది.

 Previous Page Next Page