ఆమె మనో మందిరంలో వెలసినవాడెవ్వడు? ఆమె మనసుకు ఒక రాయిలాంటిది తగిలింది. తరంగాలు వర్తులంగా దూరదూరంగా వ్యాపిస్తూపోయాయి. చూపందినంత దూరం ఎవరికోసమో వెదికింది.
ఓహ్! నేడు దిశదిశలు రంగులతో మెరిసిపోతున్నాయి. ఈ దృశ్యం ఇలాంటి దృశ్యంకోసమే ఆమె తన భావ ప్రపంచంలో అనేక రంగులను రంగరించింది. వేల రేఖాచిత్రాలు గీసింది. అంతలోనే కలిపినా రంగులను కాలతన్నింది. నలువైపులా రంగులధారలు కురిశాయి కురిసిన చిక్కని చక్కని రంగులు ఎటుసాగాలని తల్లడిల్లాయి. తల్లడిల్లి వెన్నెలవెలుగుల్లో కలిసిపోయాయి, కరిగిపోయాయి. ఆకాశంనుంచి లేతనీలిమ మబ్బులా రాలుతూంది.
"ప్రియుడులేక నిదురరాదు"
తారలు కళ కన్నీటిచుక్కల్లా ఉన్నాయి. నిటారుగా ఎదిగినచెట్లు తలెత్తి దేనికోసమో నిరీక్షిస్తున్నాయి. చెట్లమీది పిట్టలు ఊపిరి బిగపట్టి చూస్తున్నాయి.
చంద్రుడు వేగంగా సాగుతున్నాడు. అక్తర్ మామలా కొండమీంచి దొర్లిపోతున్నాడు. హమీదా అక్క నీళ్ళల్లో కాళ్ళు కదిలిస్తూంది. నీటిలోని చందమామను దూరదూరం నెడ్తూంది. నీటిలోని చంద్రబింబం కళ కాళ్ళు ముద్దుపెట్టుకోవడానికి వస్తున్నాడు. ఇంతలో ఒక పక్షి రయ్యిమని వచ్చింది. చంద్రుని కాంతి పడుతున్న కళ పాదాలవైపు సాగింది. హమీదా అక్క భయంతో గడగడలాడింది. అప్పుడే - అదిగో అప్పుడే కళ కన్నీటిచుక్క నీటిమీద రాలింది.
చంద్రుడు బెదిరిపోయాడు. చెదిరిపోయాడు. అమాంతంగా మంటలంటుకున్నట్లయింది. కొలను మీద బంగారు మలామ పరచుకుంది. ఆ పిట్ట కెవ్వున కేక పెట్టింది. ఎక్కడో దూరాన రైలు పెద్దగా అరచింది......ధక్ ధక్ మని సాగింది. అది గుండెల చప్పుడులా ఉంది.
పక్షి వేగంగా ఆకాశంలోకి దూసుకుపోయింది. లాలా తన చూపానినంత దూరం చూచింది. పక్షి దూసుకుపోతూనే ఉంది. ఎందుకో ఆమెకు కొండమీంచి దొర్లేరాయి గుర్తుకు వచ్చింది. చాలాసేపటివరకు లేచిపడుతున్న తరంగాల నీడలు కళ ముఖంమీద కదలాడుతూ కనిపించాయి. ఆమె వేళ్ళలో కంపనం కనిపించింది. తీవల్లో ప్రకంపనం వినిపించింది. తన స్వరం తనకే ఆశ్చర్యం కలిగించేటట్లుంది. తన ప్రశ్నలు తనకే తెలియని బికారిలా, పిలవాలనుకున్నవాడిపేరు తెలియక పరితపించే ప్రయాణికునిలా, కళ స్వరాలు కేకలయి నలువైపులా ప్రతిధ్వనిస్తున్నాయి. కళ కన్నీరు చెప్పిన కథ, కొలనువద్ద చూచిన చోద్యం లోకానికి చాటాలని కేకపెడ్తూ విసురుగా ఎగురుతూంది చిన్నపక్షి. కళ గానం ఆ కేకల్లో కరిగిపోతుంది. నడిరేయిలాంటి ప్రశాంతత ఆవరించింది.
లాలకు జాగారం చేసి అలసినట్లనిపించింది. కళలా తానూ ఎంతో దూరం నుంచి కాలినడకన వచ్చినట్లుంది. కాళ్ళు కొలను నీటిలో ఆడిస్తూ, తంబురా తలకు ఆనించుకుని సేదతీరు తున్నట్లనిపించింది.
చంద్రుని చుట్టుపట్ల నడయాడే నీడ కనిపించింది. ఎందుకో ఏడవాలనుకుంది. కళ్ళకు ఏమయిందో తెలియదు - ఏడుపు వచ్చిందికాదు.
ఆ రాత్రి ఆమె చాలా అలసిపోయింది. కాళ్ళు చెప్పినమాట వినలేదు. ఇంటిదాకా తీసికెళ్ళమని బ్రతిమాలాల్సి వచ్చింది.
స్థాయి
పొగమంచును కళ్ళలో దాచుకొని అతిప్రశాంతంగా పాకుతూంది-రాత్రి.
వెన్నెల విరిసింది. అది లాలా కన్నుల్లో దాక్కుంటూంది. ఆమె కళ్ళలో మబ్బు లున్నాయి. వాటిని కురిపించాలని చూస్తూంది. తన ఉదాసీనతను కడిగివేయాలను కుంటూంది.
గ్రీష్మ, శిశిరాలు ఆలింగనం చేసుకుంటున్నాయి. కాలం కడు సుందరంగా ఉంది. అమ్మాయిలు కూనిరాగాలు తీస్తున్నారు. అబ్బాయిలు కవితలు అల్లుతున్నారు.
ఒక్క చలివిసరుకు లాలా వణికిపోతూంది. దుప్పటి ముసుగుతన్ని ముడుచుకుంటూంది. అంతలో ఉక్కపోత, ముసుగు విసిరేస్తూంది. ఇవి ఆమె మనసులో ఉవ్వెత్తున లేచి పడుతున్న భావతరంగాలు కావు. వాస్తవంగానే వాతావరణం అస్తవ్యస్తంగా ఉంది.
ఆమె వంటరిగా వసారాలో పడుకుంది. నిద్రలో ఉన్నాననే అనుకుంది. మేలిక వచ్చి చూస్తే చంద్రుడు కనిపించాడు. అతడూ కలలు ఎరగనట్లున్నాడు. పాపం, జాగారం చేస్తున్నాడు - తనలాగే. ఇవ్వాళ పౌర్ణమి. అయినా చంద్రుని ముఖంలో కాంతిలేదు. అక్తర్ మామ ముఖంలోలా ఏదో అన్వేషణ కనిపిస్తూంది. అక్తర్ మామను శానిటోరియంలో చేర్పించారు. అతని గదిలోకి చంద్రుడు సైతం తొంగి సైతం చూడడు. చీకట్లో ఊపిరి సలపడం లేదని మొత్తుకుంటూ ఉత్తరాలు రాశాడు తల్లికి.
అది విని లాలా ఏడ్చింది. ఇంటివాళ్ళంతా నవ్వారు. వెర్రిది అన్నారు. మామకు తగిన కోడలే అన్నారు.
అక్తర్ మామను గురించి కుటుంబంలో ఎవరికీ సానుభూతి లేదు. అతడు వెర్రివాడికింద జమ.
పల్చని మబ్బులు చంద్రుని కళ్ళకు మసకలు కప్పాయి. చంద్రుని ముఖం వెలవెలపోతూంది. అయిన అందంగానే ఉన్నాడు.