Read more!
Next Page 
భారతి పేజి 1

                                 

                                 భారతి
                                                                                    __ కొమ్మూరి వేణుగోపాలరావు



    మాలతీ పొదక్రింద, సంధ్యావేళ  ఆ పరిమళాల్  నాఘ్రాణిస్తూ  పరధ్యానంగా  నిలబడింది భారతి. ఎప్పుడొచ్చిందోగాని, వెనుక నుండి పిల్లిలా  నడిచివచ్చి, మల్లిక ముందుకు వంగి  ఆమె చెవిలో "కూ" అని కూసేసరికి, భారతి ఉలికిపడి, ముఖం తిప్పి స్నేహితురాల్ని చూసి "అబ్బ! ఇతరులను  హడలకొట్టందే  నీకు  తోచదేమిటి, మల్లికా?" అంది కాస్త చిరాకు ప్రదర్శిస్తూ.

    మల్లిక  స్నేహితురాలి చిరాకును  లెక్క చెయ్యకుండా  నిర్లక్ష్యంగా  నవ్వుతూ, "కాస్త చెవిలో  కూత వేసేసరికి  హడలిపోయే  దానివి  రేపు మొగుడొచ్చి  కళ్ళు మూస్తే ఎలా నిభాయించు కుంటావమ్మా" అంది చిలిపిగా.

    "పోవే  వెకిలీ. నీ కెప్పుడూ  మొగుడూ  మొసళ్ళూనూ. అంత బులబాటంగా  వుంటే  ఈ రత్నగర్భంలో  పెళ్ళికొడుకులే  తక్కువయారా? వరించో, భరించో  ఎవరో  ఒకర్ని  చూసి కట్టుకోకూడదూ?"

    "ఆగవే, చిట్టితల్లీ, ఆగు నేను వరించటం  వగైరాలు  భవిష్యత్తుకు వదిలేద్దాం. ఇప్పుడు వర్తమానంలో  జరిగే  సమాచారమేమిటంటే  అందాల రాకుమారి  కుమారి  భారతీదేవి  హఠాత్తుగా  పెళ్ళికూతురుగా మారినదై, వరుడు...."

    ఆమె మాట పూర్తి కాకుండానే  భారతి  సర్రున  ఇటుతిరిగి, మల్లిక భుజాలు పట్టుకుని ఊపుతూ, "ఆ నాగరాజును  నేను పెళ్ళాడుతా ననుకుంటున్నావా? మొదటిసారి కనక క్షమించి ఊరుకున్నాను. మళ్ళీ వాడు మా గడప తొక్కాడంటే  రెండు చెంపలూ  వాయిస్తాను" అంది ఎర్రబడిన  కళ్ళతో.

    ఆమె కోపం  చూసేసరికి  మల్లికకు  కొంచెం  భయం వేసింది. అయినా గుండె నిబ్బరంగల పిల్ల కాబట్టి వెంటనే  తేరుకుని తేలిగ్గా నవ్వుతూ, "ఉండవే బాబూ! భుజం అంత గట్టిగా  పట్టుకుంటే  అసలే పువ్వునయ్యె, నలిగిపోతాను. ఇంతకీ నాగరాజెవడు? వాడిని  గురించి  నాకు తెలియనే  తెలియదు" అంది.

    "తెలియదూ? మరయితే  ఎందుకన్నావు  పెళ్ళి స్థిరపడిందని? అంది భారతి  స్నేహితురాల్ని  విడిచిపెట్టి.

    మల్లిక  కొంచెం  దూరంగా  జరిగి, పక్కనే ఉన్న  ఓ పూతీగెను  సున్నితంగా తాకి. కళ్ళురెపరెపలాడిస్తూ, "అనగనగా  ఓ రాకుమారి...." అంటూ మొదలు పెట్టింది.

    "ఛా! ఏమిటా  సొద?"

    "ఎదల  సొద ఇది. అనగనగా ఓ రాకుమారి. ఓ మనోహర సంధ్యవేళ  చెలికత్తెను  వెంటేసుకుని  ఆ రాజకుమారి వాహ్యాళి కెళ్ళింది. అంతట, విధివశాత్తూ  వాహనారూడుడై  అచట  కేతెంచిన  రాజకుమారుడామెను  చూసి, ప్రథమ సమాగమముననే  మోహించి, ఆమెను తక్కనన్యుల  పెండ్లియాడనని  శపథము చేసిన వాడై...."

    "ఏయ్  ఆపుతావా లేదా? ఏమిటా అల్లరి మాటలు?" అంది  భారతి కోపం నటిస్తూ.

    "అల్లరి మాటలేం  కాదు. కావాలంటే వెళ్ళి చూడు. మీ యింటికి  గంగాధరరావుగారు  వచ్చి కూర్చున్నారు." అంది హఠాత్తుగా మల్లిక, గంభీరంగా  మారి.

    "గంగాధరరావుగా  రెవరు?" అన్నది భారతి అర్ధంకాక. "రాజకుమారుడి తండ్రి."

    "హాస్యాలు మాని సూటిగా చెప్పు, మల్లికా!" చాలా సీరియస్ గా ముఖం పెట్టి అంది భారతి.

    "అదిగో, అందుకే  నిన్ను చూస్తే కోపం నాకు. నేనేం మాట్లాడినా పరిహాసంగా  తీసుకుంటావు  ఉన్న మాట చెప్పినా  ఒక్క పట్టాన నమ్మవు అంది బుంగమూతి పెట్టి మల్లిక.

    భారతి  ఆమె దగ్గరకు  వచ్చి గడ్డం  పుచ్చుకుని బ్రతిమాలుతూ. "బుద్ధి పొరపాటున అన్నానులేవే  బంగారు తల్లివిగా  ఎవరొచ్చారో, ఏం జరిగిందో  చెబుతూ సస్పెన్సులో  పెట్టి చంపక" అంది.

    ఆమె దారికివచ్చి, "పదిరోజుల  క్రితం  చెరువుకు నీళ్ళ కెళ్ళాం  గుర్తుందా?" అంది.

    "వెళ్ళాం."

    "ఏం జరిగిందీ?....అప్పుడేం జరిగిందీ?"

    సంధ్యారుణ  రాగరంజిత  మధుర సమయాన  తాను  మల్లికతో  కలిసి  చెరువు దగ్గరకు  మంచినీళ్ళ కెళ్ళింది. అంతకుముందే  గ్రామస్థులందరూ  వచ్చి మంచినీళ్ళు  పట్టుకెళ్ళిపోయినట్టున్నారు. అక్కడక్కడ  చెదురుగా తప్ప అట్టే సందడిగా లేదు. మల్లిక వంగి బిందెనిండా  నీళ్ళు  నింపుకుని, బిందెను వయ్యారంగా  చంక కెత్తుకుని, "ఊఁ త్వరగా కానీయవమ్మా  మహాతల్లి. దిక్కులు చూస్తూ  పరధ్యానం  పట్టావుగానీ" అంటూ ఎత్తి పొడిచింది.

    తాను ఉలికిపడినట్లయి, "అవునే మల్లికా. నా బిందెను కూడా నువ్వే నింపి ఇయ్యి. నీ మేలు మరిచిపోను" అంది.

    మల్లిక ఆశ్చర్యంగా కళ్ళు  పెద్దవిచేసి, ఇదీ మరీ చోద్యంగా ఉందేవ్  నీ బిందెను నేనెందుకు  నింపి పెట్టాలి? కారణముందంటావు. అడుగులకు  మడుగు లొత్తుతాను. కానీ, ఏమీలేకుండా  నీ కెందుకు గారాబం చెయ్యాలి అని" అంటూ  సాగదీసింది.

    "అట్లా  అజ అడిగితే  ఏం చెప్పను? కాస్త ఒంట్లో  నలతగా  వుందని  సాయమడిగా నంతే"

    "అహఁ అదేమీ కాదు. నిన్న పొద్దున్న పట్నమెళ్ళి  వచ్చినప్పట్నుంచీ  అదోలా  వున్నావు" అంటూ  దగ్గరకు  వచ్చి  ముఖంలో ముఖం పెట్టి చూస్తూ  "నిజం చెప్పు ఏదో దాస్తున్నావు నా నుంచి, చెప్పి తీరాల్సిందే" అంది బలవంతం చేస్తూ. 

    భారతి  ముఖం  ప్రక్కకి  త్రిప్పుకుని ఎటో చూస్తూ. "ఏమీ దాయటం లేదు ఒంట్లో బాగులేదు"అంది చలించే కంఠంతో.

    "వీసమెత్తు కూడా  నమ్మను నీ మాట. బాగుండక పోవటమేం. నిక్షేపంగా ఉన్నావు ఆ మాటకొస్తే  ఈ మధ్య  నీ అందం  ఇనుమడించింది కూడా. ఎవరన్నా  చూస్తే  ఎగరేసుకుపోయేలా  ఉన్నావు  ఏం జరిగింది నీకు? చెప్పు చెప్పవూ?" అంటూ  రెండవ చేత్తో  ఆమె చుబుకాన్ని  పట్టుకుని, ముఖం తనవైపు  తిప్పుకోవటానికి  ప్రయత్నించింది.

    "అబ్బ! ఏమిటే నీ రభస? ఏమీ లేదంటే  'చెప్పూ చెప్పూ' అని ఊరికినే  వేధిస్తావేం? నీ కంత కష్టంగా  ఉంటే నీళ్ళు పట్టి  ఇవ్వవద్దులే  నేను పోతున్నాను" అంటూ  ఆమె పట్టు విడిపించుకుని  నాలుగడుగులు  వేసి, "రేపటి నుంచి నీళ్ళకి రాను మా పిన్నిని పంపిస్తాను" అంటూ విసవిస  వెళ్ళిపోబోయింది  భారతి.

    మల్లిక కంగారుగా  ఆమె వెంటపడి  చెయ్యి  పట్టుకుని ఆపి, "నువ్వే గెలిచావులే, మహాతల్లీ. చెంపలు  వేసుకుంటున్నాను  నీతో ఇంకెప్పుడూ  వేళాకోళమాడనుగా" అంటూ  తన చంకలోని  బిందెను క్రిందపెట్టి  భారతి చేతిలోని బిందె  అందుకుని  గబగబ  నీళ్ళు నింపి తెచ్చి  "ఇదిగో, నీ మంచినీళ్ళు. దా పోదాం" అంది. ఇద్దరూ కదిలి గట్టుదిగి కిందకు వచ్చారు.

    "నీవు నిజంగానే రేపటినుంచి రావా?" అనడిగింది  మల్లిక నడుస్తూ వుండగా.

    "రాను."

    "అయితే నేనూ రాను. నువ్వు పిన్నిని పంపిస్తే  నేను మా బామ్మను  పంపిస్తాను."

    భారతికి  నవ్వు వచ్చింది. "అదేమిటి! నాతో నీకు వంతేమిటి? నాకు ఒంట్లో స్వస్థతగా లేక రానంటున్నాను. చెరువుకే కాదు. ఎక్కడికీ రాను. తెలిసిందా?" అంది దరహాసిత  వదనంతో.

Next Page