Read more!
 Previous Page Next Page 
చైనా యానం పేజి 4


                                            మూడు

    ఎట్టకేలకు 19వ తేదీన పాస్ పోర్టు లభించింది. ఫోన్ చేయగా ఆఫీసరు "అంతా సిద్దం సాయంత్రం అయిదు గంటలలోపున ఎప్పుడైనా వచ్చి మీరు తీసుకోవచ్చును" అన్నాడు. వెంటనే టాక్సీలో (మంగబాకంలోని) "శాస్త్రి భవన్" కు వెళ్ళాను. శర్మగారు దాన్ని మధ్యాహ్నమే పట్టుకుపోయారట.
    తరువాత నాకు తెలిసింది. 28నాటికి ఎవరికీ పాస్ పోర్ట్ మంజూరు కాలేదని! కలకత్తాకు బదులు డిశంబరు 4 వ తేదినీ డిల్లీలో కలుసుకోవలసి వుందని సీతా ట్రావెల్స్ వారు తెలియజేశారు.
    4వ తేదీ ఉదయం మద్రాసు నుండి (హైదరాబాదు మీదుగా ) డీల్లీకి వెళ్ళే విమానానికి టిక్కెట్టు శర్మగారిచ్చారు. ప్రతినిధి వర్గంతో కలిసి వెళ్ళుతున్నందుకు నాకు సంతోషమయింది. "ఒక్కడినే వెళ్ళినప్పటి కంటే డెలిగేషన్ తో వెళ్తే జరిగే మర్యాద గొప్పగా వుంటుంద"ని విశ్వేశ్వరావు గారు అన్న మాట జ్ఞాపకం వచ్చింది.
    4వతేదీ ఉదయం మద్రాసు నుంచి బయలుదేరిన విమానం బేగంపేట వద్ద వాతావరణం బాగులేక మద్రాసుకే తిరిగి వచ్చింది. కానీ దీన్నీ నేనో అపశకునంగా పరిగణించలేదు. మద్రాసు నుంచి బయలుదేరినప్పుడు చైనా ఎంత దూరంలో వుందో ఇప్పుడూ అంతే దూరంలో వుంది. "డిల్లీకి వెళ్ళడం మానేసి నేరుగా బొంబాయికే వెళ్ళిపోతేనో? రేపు బొంబాయి నుంచి కదా పీకింగ్ కు ప్రయాణం!" అని ఒకమారనిపించింది. ఏమయినా డిల్లీకే వెళ్ళితే డెలిగేషన్ లో చేరవచ్చు. బహుశా రాత్రి ప్లేన్ లో వెళ్ళవలసి వుంటుందేమో? ఇలా అనుకుంటూ మీనంబాకం విమానశ్రయంలోనే వుండిపోయాను. రెండు సార్లు రాజబాబు' ఇంటికి ఫోన్ చేశాను. కనెక్షన్ దొరకలేదు. క్రితం రాత్రంతా అక్కడే పడుకున్నాం మేమంతా. మావాళ్ళంతా ఇంకా అక్కడే వుండాలి. అందరితోనూ ఇంకా మాట్లాడుతున్నట్టే వుంది. రాజబాబు రష్యాకు తీసుకెళ్ళిన సూట్ కేసులోనే సామాన్లన్నీ సర్దిపెట్టాడు. 25 సీజర్ ప్యాకేట్లతో సహా! అదో పుష్పకం లాంటిది. బయలుదేరేటప్పుడు అదొక్కటే నా లగేజి.
    ఇంతకూ ఫోన్ చేస్తే యేమని చెప్పాలి? మద్రాసుకు తిరిగి వచ్చేశాననే కదా! అంచేత ఫోన్ కనెక్షన్ దొరకనందుకు నేను చింతించలేదు.
    11 గంటలకు బేగంపేట విమానాశ్రయం తెరిపి ఇచ్చిందన్న వర్తమానంతో మా విమానం మళ్ళీ బయలుదేరింది. నాతొ అల్లురామలింగయ్య, బి.యస్ నారాయణ మున్నగు వారున్నారు. హైదరాబాద్ లో దిగిపోయినవాళ్ళు దిగిపోగా, అపరాహ్నం రెండు గంటలకు నేను పాలం విమానాశ్రయం చేరుకున్నాను. అనుకున్నట్టుగానే విమానాశ్రయం లాంజిలో సీతా ట్రావెల్స్ ప్రతినిధి ఒకాయన నాకోసం తిరుగు తున్నాడు. అతనే సీతా ట్రావెల్స్ మనిషి అని ఎందుకు అనుకున్నానో నాకే తెలియదు. పలకరించి , నేను ఫలాన అని చెప్పాను. నన్ను హోటల్ జన్ పద్ లో చేర్చడానికి వచ్చానని అతడు చెప్పాడు.
    తీరా మేము హోటల్ కు వెళ్ళేసరికి విమానం సకాలానికి రానందువల్ల నా రిజర్వేషన్ కాన్సిల్ అయిపోయిందని తెలిసింది. "పోనీండి మరోచోటికి పోదాం" అన్నాను. "వీళ్ళలాగే అంటూ వుంటారు. చూస్తూండండి. ఈ హోటల్లోనే మీకు గది చూపిస్తా" నన్నాడు. అరగంటలోనే నాకు అదే హోటల్లో బస దొరికింది.
    మనదేశంలో డబ్బుకి దొరకని సదుపాయాలంటూ ఏమీ లేవు. కొద్దిపాటి వందల సంఖ్యలో వున్న ధనిక కుటుంబాలు సకల విధాల స్వర్గసుఖాలు అనుభవిస్తూ వుంటే, కోట్లకొలది దౌర్భాగ్యులు తమతమ విధిని తిట్టుకుంటూ, పందెపు గుర్రాలనూ, లాటరీ టిక్కెట్లనూ, భగవంతుళ్ళను ఆరాధిస్తూ నిత్యనరకంలో సతమతమవుతూ వుంటారు. ఇది నా దేశం! నా జన్మభూమి!
    అది భిక్షువు అపరావతారాలని చెప్పదగ్గ వారలు ఒక్క కొత్త డిల్లీలోనే (పాత డీల్లీ సంగతి సరేసరి) కోకొల్లలుగా వున్నారు. చీనాలో మారుమూల గ్రామాల్లో కూడా అడుక్కుతినే వాళ్ళు లేరు. అందుకు కారణం చీనావాళ్ళు తమ దేశం నుంచి భగవంతుణ్ణి ఏనాడో బహిష్కరించడమే అని నేనంటే నువ్వుత్తి నాస్తికుడివంటారు. ఇండియాలో నాస్తికుడిగా వుండడం అదెంతో శిక్షించదగ్గ గొప్ప నేరమైనట్టు!
    4-12-76 ఉదయం 6.00 గంటలకు మద్రాసు మీనంబాకం విమానాశ్రయం నుండి బయలుదేరింది మొదలు 6-12-76 ఉదయం 10 గంటలకు బొంబాయి శాంతాక్రుజ్ విమానాశ్రయం నుండి పీకింగ్ కు స్వేస్ ఎయిర్ లో ప్రయాణం చేసిందాకా విపులమైన దినచర్య ఒక నోటు పుస్తకంలో రాసుకున్నాను. అదెక్కడో పోవడం మంచిపనే అయింది. చీనాకు వెళ్ళేముందర నాకు జరిగిన ఎన్నో మోసాలను గురించి (కొన్నికొన్ని జ్ఞాపకం వున్నా) ఇప్పుడు రాస్తూ కూర్చోనక్కరలేదు. వాటిని మరిచిపోతేనే నయం!. అయినా మనది పవిత్ర భారతదేశమని మాత్రం అడుగడుగునా జ్ఞాపకం చేసే సంఘటనలు మనందరి జీవితాలలోనూ జరుగుతూనే వుంటాయి. అంతా శ్రీ వైష్టవులే అనే సామెత మనకి ఊరికే రాలేదు.
    డిల్లీలో నేనున్న 24గంటల కాలంలో నన్ను చూడడానికి మన తెలుగు మంత్రులెవరూ రానందుకు నేనేమీ బాధపడలేదు. వస్తేనే బాధపడేవాడ్నేమో, నేనూ తెలుగువాడినే కాబట్టి.
    4వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా భవనంలో అఖిల భారత డాక్టర్ కొట్నీస్ స్మారక సంఘం డిల్లీ శాఖ సభ్యులూ, ఉపాధ్యక్షురాలూ చైనాకు వెళుతున్న మా ప్రతినిధి వర్గానికి ఒక తేనీటి విందు ఇచ్చారు. ఇక్కడ 90ఏళ్ళు పైబడిన పండిట్ సుందర్ లాల్ గారిని కలుసుకున్నాను.
    మా ప్రతినిధి వర్గానికి డాక్టర్ విజయ్ కుమార్ బాసు నాయకుడు. మిగిలినవాళ్ళం శ్రీమతి ఇందిరా బోసు, శ్రీ జ్ఞాన్ సింగ్ ధింగ్రా, శ్రీమతి మైత్రేయీ దేవి, శ్రీ మంగేశ్ కోట్నీస్, డాక్టర్ మిస్ వత్సలా కొట్నీస్, మహాకవి శ్రీశ్రీ, ప్రొఫెసర్ డి.సి. పాండే ప్రొఫెసర్ తారాచంద్ గుప్తా అని వీడ్కోలు పత్రంలో వుంది.
    చీనా ప్రభుత్వపు సంపూర్ణ సహకారంతో విదేశాలలో చీనా ప్రజల మైత్రీ సంఘం మా ప్రతినిధి వర్గాన్ని ఆహ్వానించింది. బయలుదేరింది మొదలు తిరిగి వచ్చేదాకా ఖర్చులన్నీ చీనా ప్రభుత్వమే భరించింది.
    నాతొ 50 అమెరికన్ డాలర్లు తీసుకెళ్ళడానికి రిజర్వు బ్యాంకు ద్వారా మన ప్రభుత్వం  అనుమతించింది. (అందులో 30 డాలర్లు బొంబాయిలోని ఒబెరాయ్ - షేరాటస్ హోటల్ కు, స్వీస్ ఎయిర్ అతిధిగా ఉండి కూడా కేవలం అదనపు తిండి, డ్రింకు , ట్రంకాల్స్ కు చెల్లించవలసి వచ్చింది.)

 Previous Page Next Page