Read more!
 Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 3

 

    "నా కళ్ళకి కనిపిస్తున్నారు. మీకు కనిపించడం లేదంటే ఏం చెప్పను?" చిలిపి చిరునవ్వును ముని పంటితో అణచడానికి ప్రయత్నిస్తూ అంది వారిజ.
    "మీరు నన్ను ఆటలు పట్టిస్తున్నారు...... ఎందుకీ ఈ అబద్దాలు?" కోపంగా అన్నాడు.
     వారిజ కిలకిల నవ్వింది
    'అటాలడుతున్నది నిజమే అయినా ఆడినవి మాత్రం అబద్దాలు కావు - అయినా అంతలా ఉడుక్కోవచ్చా ఇలా" అల్లరిగా రెండు వేళ్ళూ ఒకదానితో ఒకటి జోడించి ధనస్సులా వంచి అతని ముందుకు జాపింది వారిజ. ఆణువణువూగా సౌందర్యం నింపుకున్న ఆ లావణ్య రాశికి ఈ చిలిపి తనం మరో క్రొత్త ఆకర్షణను నిండగా ముగ్ధుడాయి చూస్తూ ఊరుకున్నాడు రామచంద్ర.
    తను స్వయంగా తయారు చేసిన ఫలహారం పళ్ళెం అతని ముందుకు జరిపి "తింటూ చూడండి ...." అంటూ నవింది వారిజ. రామచంద్ర ముఖం ఎర్రబడింది. - చటుక్కున తల దించుకున్నాడు.
    "నాకేం వద్దు - మీ ఇద్దరినీ చూసి పోదామని వచ్చాను వారెప్పుడు వస్తారు?" అంటూ లేచాడు.
    "కూర్చోండి - మనం ఇంత నిష్కపటంగా మాట్లాడుకొంటున్నప్పుడు కూడా మీరు ఆత్మవంచనకు సిద్దపడటం న్యాయం కాదు. మీరు మావారి ఆహ్వానం మీద రాలేదు. అయన కోసమూ రాలేదు. ఏం తినకుండా మీరు వెళితే నన్ను నిష్కారణంగా శిక్షించిన వారవుతారు. తీసుకోండి."
    అతను మాట్లాడకుండా కూర్చుని ఫలహారం పళ్ళెం ముందుకు తీసుకున్నాడు.
అయన ఎప్పుడొస్తారు?" మళ్ళీ అడిగాడు. వారిజ కనుబొమలు ముడుచుకున్నాయి.
    "అసలు రాడు" ఉలిక్కి పడ్డాడు రామచంద్ర.
    "అదేం?"
    "అంతే నేనే అయన దగ్గరకు వెళతాను."
    'అంటే ఈ ఊళ్ళో లేరా?"
    "ఊహు ! మాది మెడ్రాస్.....నేను ఒక పని మీద ఈ ఊరు వచ్చాను. కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను!" చటుక్కున రామచంద్ర ముఖం పాలిపోయింది. చేతుల్లో తీసుకున్న ఫలహారం పళ్ళెంలో పడిపోయింది. "వెళ్ళిపోతారా?" చిలిపిగా నవ్వింది వారిజ.
    "మరి ఉండిపోనా?" ఎక్కడ "ఉలిక్కిపడ్డాడు రామచంద్ర. ఏం మాట్లాడ లేక ఫలహారం తింటున్నట్టు తల వంచుకున్నాడు. "నెమ్మదిగా తినండి కంగారేం లేదు. " మంచినీళ్ళ గ్లాసు దగ్గిర పెడుతూ నవింది ఆమె.
    "మరి మీ శ్రీమతిని తీసుకురాలేదేం?' తలెత్తి వారిజని చూశాడు రామచంద్ర.
    "నాకింకా పెళ్లి కాలేదు."
    "మరి, ఇక్కడ మీ అమ్మగారూ......"
    "మా అమ్మా, నాన్నగారూ కాకినాడలో వున్నారు. మా చెల్లాయి పెళ్ళయి అత్తవారింట్లో వుంది.....ఇక్కడ నేనొక్కడినే వుంటున్నాను."
    "వంట....?"
    "నేనే చేసుకుంటాను. పొలం పనులు చేసుకోగలిగిన వాడికి వంట ఒక లెక్క లోదా?"
    "పోనీ , ఈ నాలుగు రోజులూ భోజనానికి మా ఇంటికి రాకూడదూ?"
    "ఊహు! అది కుదరదు. "కటువుగా అన్నాడు రామచంద్ర. అతని కటుస్వరానికి ముఖం చిన్నబోయింది వారిజకు.
    "క్షమించండి - మీకు శ్రమ కలిగించటం ఇష్టం లేక అన్నాను.'
    "ఓహో! నాకు ఏది శమో, ఏది సంతోషమో మీకేం తెలుసు?"
    "తెలిసినా భోజనానికి ఇక్కడికి రాలేను. ఇది పల్లెటూరు ....నాకేం! మొగాడ్ని, బ్రహ్మచారిని ...ఏదైనా మాట్లాడితే మీ బ్రతుకేం కావాలి?" వారిక ఒక్క నిట్టుర్పు విడిచి ఇంకా వాదించకుండా ఊరుకుంది. కాఫీ కూడా పూర్తీ చేసి లేచాడు రామచంద్ర.
    "రాత్రికి భోజనం అక్కర్లేదు. అంత బాగుంది ఫలహారం ....మీ వంటమనిషి చాలా మంచిది " "అది వంట మనిషి చేయలేదు  - నేనే చేశాను.'
    'అదేం! అని అడగలేదు రామచంద్ర - సమాధానం అతనికి తెలిసిపోతోంది. ఇది గట్టిగా అనుకునేందుకు వణికి పోతున్నాడు.
    "నేను - వెళతాను.'
    "మళ్ళీ యెప్పుడు కనిపిస్తారు?"
    "ఒక ఊళ్ళో ఉంటున్నాంగా! కలవకపోతామా?"
    "అంటే మీరిక ఇక్కడికి రారన్నమాట!"
    'మీ క్షేమం కోరి......"
    "నేను మీ ఇంటికి రావచ్చా?"
    "తగినంత ప్రత్యేకమైన అవసరముంటే తప్పకుండా రండి" చేతులు జోడించి వెళ్ళిపోయాడు రామచంద్ర .....గోడకానుకుని శిలలా నించుండి పోయింది వారిజ.


                                                        2

    రామచంద్ర వస్తాడనే ఆశ ఏ కోశానా లేకపోయినా తెల్లవారుజామున లేచి ఏటి గట్టుకు బయలుదేరింది వారిజ. తనకంటే ముందుగానే అక్కడ కూర్చున్న రామచంద్రను చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. సంభ్రమంతో మిలమిల లాడాయి. సంతోషాదిక్యతతో వెలిగిపోయాయి.
    "మీరు వచ్చారు." అంది ....ఏదో అపూర్వమైన సంపద తనకు లభించిన పసిపాపలా ..ఎడంగా కూర్చుంది. "అవును .....వచ్చాను....మీ స్నేహం నాకు కావాలి."
    ఏదో పెద్ద సాహస కార్యం చెయ్యడానికి తెగిస్తున్న వీరుడిలా తలెగరేసి అన్నాడు." "అయినా స్నేహితులుగా ఉన్నంతలో తప్పేముంది " నీరసంగా అన్నాడు. ఆ మాటలు వారిజతో అంటున్నట్లు లేవు. తనకు తానూ సంజాయిషీ ఇచ్చుకున్నట్టు ఉన్నాయి. "భగవంతుడా! అనందం పట్టలేకనా గుండెలు బ్రద్దలవుతాయేమోననిపోస్తోంది. బ్రతుకునా కోసం ఇంకా ఎంత ఆనందాన్ని దాచిందని నేనాశించలేదు."
    ఆరాధనా భావంతో రామచంద్రను చూస్తూ అంది వారిజ." నిజమా...! నా స్నేహం మీకంతటి ఆనందాన్ని కలుగిస్తుందా!" వారిజ ముఖంలో తన ప్రశ్నకి సమాధానం స్పష్టంగా తెలిసిపోతున్నా అడిగాడు.....! వారిజ పకపక నవింది.

 Previous Page Next Page