Read more!
 Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 3

 

    అటువంటి వెంకట్రామయ్యగారు సాధారణంగా ఉత్తరాలు వ్రాయదు. ఏదైనా విశేషముంటే వ్రాద్దాం వ్రాద్దాం అనుకుంటూనే అయన ఆలశ్యం చేసేస్తాడు. ఈలోగా ఆ విశేషం పాతబడి పోతుంది. ఇంకెందుకులే అన్నట్లూరుకుంటాడాయన. అందుకే వసుంధర ----- "లక్ష్మీ పెళ్ళి వార్త లేవీ మన కుత్తరాల ద్వారా తెలియవు. ఎప్పుడో ఒకరోజున శుభలేఖైనా వచ్చేస్తుంది ---లేదా టెలిగ్రాం వస్తుంది ---' అంటుండేది.
    టెలిగ్రాం రాగానే ఆమె అన్న మాటల వెనక ఉన్న అర్ధం యిది .
    రాజారావు లోపలకు వస్తూ ------ 'అన్నయ్య ఇంటికెడుతున్నడుట -------స్టేషన్లో కలుసుకోమని టెలిగ్రాం యిచ్చాడు -------' అన్నాడు.
    "ఆయనదీ మీ నాన్నగారి పోలికే ----- లేకపోతె ----- ముందుగా ఉత్తరం రాయొచ్చుగా ----మనమూ ప్రోగ్రాం వేసుకుందుం------" అంది వసుంధర.
    "మన ప్రోగ్రమింకా ఆరు వారాల తర్వాత కదా -----" అన్నాడు రాజారావు వసుంధరను క్రీగంట చూస్తూ.
    'అవుననుకోండి --కానీ ముందుగా వెళ్ళి అవసర వ్యవహారాల్లో అత్తగారికి కాస్త సాయపడ్డానికి నాకేం అభ్యంతరం లేదు - అసలే ఆడపిల్ల పెళ్ళి కదా - నేనూ ......"
    "అన్నయ్య ఇంటికేందుకు వేడుతున్నాడో నాకు తెలియదు. కానీ ఆడపిల్ల పెళ్ళి గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ - ఈమారు కూడా పాపను కంటావా ?" అన్నాడు రాజారావు.
    "అల్లా అనవద్దు. ఈసారి మనకు బాబు పుడతాడు --- "అంది వసుంధర నమ్మకంగా.

                                              3
    మోహనరావుని చూస్తూనే వీధిలో మాట్లాడుకుంటున్న గ్రామస్థులు తమ కబుర్లాపి మర్యాదగా లేచి నిలబడుతున్నారు. అతను వాళ్ళను నవ్వుతూ పలకరిస్తూ ముందడుగు వేస్తున్నాడు.
    మోహనరావు వెంకట్రామయ్యగారి పెద్దబ్బాయి. అతను రైల్వేలో పెద్ద ఆఫీసరుగా పనిచేస్తున్నాడు.
    అతనికి జీతమెంత వస్తుందో, అతని చుట్టూ ఎంతమంది గొప్పవాళ్ళు తిరుగుతుంటారో , అతని బాధ్యతలేమిటో , అతని కెటువంటి పలుకుబడి ఉందొ వగైరా వివరాలు మోహనరావుకి తెలిసినంత ఖచ్చితంగానూ ఊళ్ళో వాళ్ళకి తెలుసును. కారణం వేరే ఏమీ లేదు. మోహనరావుకు ఎక్కువగా మాట్లాడ్డం చిన్నప్పాటి నుంచీ అలవాటు. ఉద్యోగం వచ్చినప్పటినుంచీ అతను తన ఉద్యోగం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు.
    మోహనరావు కబుర్లలో రెండు రకాల విశేషాలున్నాయి. ఒకటి శ్రోతలను ముగ్ధులను చేసే హాస్యం. రెండు తన్ను దెబ్బ తీయాలనుకునే ఎదుటి వాడిని క్షణమాత్రంలో చిత్తూ చేయగల వాక్చమాత్క్రుతి. ఈ రెండింటివల్లా అతని చుట్టూ చేరినవారందరూ చిన్న చిన్న ప్రశ్నలనందిస్తూ అతని మాటలను పెంచుతూ తాము మాత్రం శ్రోతలుగా ఉండిపోతుంటారు.'    
    మోహనరావు తన ఉద్యోగపు విశేషాలు వివరిస్తుంటే బోరు కొట్టిన గుమాస్తా స్నేహితుడోకతను --- "నీ గప్పాలు మాని - ఇంకేమైనా సరదా కబుర్లు చెప్పవోయ్ -- " అన్నాడు. మోహనరావు వెంటనే ---' అలా అసూయపడకు. నీకూ ప్రమోషనొచ్చి ఏనాటి కైనా అఫీసరువి కాకపోవులే ------" అన్నాడు.
    గ్రామస్థులను కలిసినప్పుడు మోహనరావు అందరి యోగ క్షేమాలూ విచారిస్తూ ఎవరెవరి పిల్లలు ఏమేం చదువుతున్నారో అడిగి తెలుసుకుని రైల్వేలో ఉద్యోగాలు రావాలంటే వాళ్ళేమేం చేయాలో సూచిస్తుండేవాడు.
    "మీవాడు స్కూలు ఫైనల్ ప్యాసయ్యాడా - మరి చదివించకుండా టైపూ షార్ట్ హ్యాండ్ నేర్పించారంటే - టక్కున ఉద్యోగం దొరుకుతుంది ----"
    మనవాడు బికాం పైనలియరా -అయిపోయి రిజల్టు వచ్చేక నాకు చెప్పండి -"
    ఇలా అతను చాలామందితో అంటుంటాడు. ఆవిధంగా అతను ఇతరుల మనసుల్లో లేనిపోని ఆశలను రేపుతున్నానని గుర్తించడు. మాములుగా సలహా ఇస్తున్నానే అనుకుంటాడు.
    మోహనరావు చేతిలో చాలా పలుకుబడి ఉంది. అతను చాలా డబ్బు సంపాదించగలడు. చాలామందికి ఉద్యోగాలు వేయించగలడు. అయితే అతను నీటికీ నిజాయితీకి నిలబడే మనిషి. జీతం డబ్బులకు మించి పై సంపాదన జోలికి పోడు. తన పలుకుబడిని స్వార్ధానికి ఉపయోగించుకునేందుకు పొరపాటున కూడా ప్రయత్నించడు.
    అతని మాటల నపార్ధం చేసుకున్న గ్రామస్థులు మాత్రం అతని గురించి లేనిపోని ఆశలు పెంచుకుని - అతను వచ్చినప్పుడల్లా - మావాణ్ణి మీరు చెప్పినట్లే టైపు పూర్తీ చేయించానండి. మావాడు బీకాం మూడో క్లాసులో ప్యాసయ్యాడండీ - వగైరా సమాచారాన్నందించి వెడుతూంటారు. ఈ సమాచారాన్నందించడం కోసం చాలా మంది అతని రాకకోసం ఎదురు చూస్తుంటారు కూడా.
    మోహనరావుకి చెప్పుకోదగ్గ దైవభక్తి ఉంది. నెలరోజుల క్రితం దగ్గర్లో లేదనుకున్న ప్రమోషన్ అతనికి లభించింది. ఆ ప్రమోషన్ వస్తే వీలైనంత వెంటనే తిరుపతి వెడతానని అతను మ్రొక్కుకున్నాడు. అందుకని సెలవు దొరకగానే - ఇంటికి బయల్దేరాడు. పనిలో పనిగా కొన్నాళ్ళు ఇంటి వద్ద కూడా గడిపి నట్లుందని అతనాశపడ్డాడు.
    మోహనరావుని చూస్తూనే వెంకట్రామయ్య చాలా సంతోషపడ్డాడు. కొడుకు వచ్చినప్పుడల్లా కొండంత బలం వస్తుందాయనకు. అయితే ఇంటికి రాగానే మోహనరావు ఇంటినీ, ఇంటి పరిస్థితిని చూస్తాడు. వాటిలో రవంత మార్పు కూడా ఉండదు. అతని ముఖం ముడుచుకు పోతుంది.
    మోహనరావు భార్య విరజకు అత్తిల్లంటే చాలా ఇష్టం. మనసు విప్పి మాట్లాడే ఆరుగురు ఆడపడుచులూ, స్వంత తమ్ముళ్ళకు మించి ప్రేమగా ఉండే మరుదులూ ఆమెకు మంచి కాలక్షేపం. మోహనరావు, విరజల గారాల కూతురు సుమారు ఎనార్ధం వయసు గల మోహినికి అక్కడ ఇంకా బాగుంటుంది.
    తండ్రిని పలకరిస్తూనే లక్ష్మీ పెళ్ళి ప్రసక్తి తీసుకొచ్చాడు మోహనరావు.
    'అప్సరసలాంటి పిల్ల ఇంట్లో ఉంటె వెతుక్కుంటూ ఒక్కళ్ళ అయినా మనింటికి రావడం లేదు --' అన్నాడు వెంకట్రామయ్య తన సహజ చమత్కార ధోరణిలో.
     "బాగుంది, ఆడపిల్ల గలవాళ్ళం మనం తిరగాలి కానీ వెతుక్కుంటూ ఎవరొస్తారు? ఆ నాగేశ్వరరావు గారికి మొదటి కూతురు పెళ్ళి సంబంధం కుదర్చడానికి నాలుగు చెప్పుల జత లరిగి పోయాయట-----" అన్నాడు మోహనరావు.
    "ఎవరూ ఆ నాగేశ్వరరావు సంగతేనా నువ్వు చెప్పేది - వాడు నాకంటే నెమ్మదస్తుడు -- " వెంకట్రామయ్య నవ్వి --- "కూతురి పెళ్ళి కోసం తిరగడం లేదని నలుగురూ గడ్డేడతారని భయపడి వాడో ఆకురాయి కొనుక్కుని ఇంట్లో చెప్పులరగదీస్తూ కూర్చునేవాడు. అలా నాలుగు చెప్పుల జత లరగాదీసే సరికి వెతుక్కుంటూ పెళ్ళి వారోచ్చేరు --- వాడేమో అందరికీ అ చెప్పు జతలు చూపిస్తూ కూర్చున్నాడు. చెప్పుల జత లరగాదీయడమే ముఖ్యమనుకుంటే నాకూ ఓ ఆకురాయి కొనిపెట్టు --- ' అన్నాడు.
    మోహనరావుకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు --- " అయితే ఏదో ఒకరోజున పెళ్ళివారే మనింటి కోస్తారంటారు?"
    "అలాగని నేనూరుకుంటాననుకున్నావేమిట్రా ------నా ప్రయత్నాలేవో నే చేస్తున్నాను. వెధవది ఎంత తిరిగినా --- ఆకురాయి లేక నా చెప్పు లరగడం లేదు - అంతే ----' అన్నాడు వెంకట్రామయ్య.
    "ఎవరైనా చూసుకుందుకు వచ్చేరా?" ఆత్రుతగా అడిగాడు మోహనరావు.

 Previous Page Next Page