Read more!
 Previous Page Next Page 
దశావతారాలు పేజి 3


    "మనకు సరిపడనప్పుడు కలిసి ఉండి మాత్రం ఏం ప్రయోజనం? మీ యిష్టం! మరొకరితో మీరు సుఖంగా ఉండగలననుకొంటే అలాగే పెళ్ళి చేసుకోండి" అంది.
    కాశీపతి కనుపాపల్లో నీటి బిందువులు నిలిచాయి. అవి చూసిన సావిత్రి మనసు కరిగిపోయింది. తుడవాలని ఒక్క అడుగు ముందుకు వేసింది. కానీ, ఆ కన్నీరు తను తుడవగలిగింది కాదు. గిర్రున వెనక్కు తిరిగి శాశ్వతంగా అతని దగ్గర నుండి వచ్చేసింది.
    "సావిత్రి కథవిన్న లక్ష్మి" నేను సంస్కారిని తప్ప పెళ్ళిచేసుకోను అని శపధం పట్టింది.
    "ఎలా తెలుస్తుందే?" అంది సావిత్రి నిరాశతో ...  
    "పెళ్ళికి ముందే అతనితో పరిచయం చేసుకుని బాగా అర్ధంచేసుకున్న తరువాతే పెళ్ళి చేసుకుంటాను" ధృడంగా అంది లక్ష్మి.
    అక్షరాలా తన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టింది ... పెళ్ళిచూపులకు వచ్చిన పెళ్ళికొడుకుతో "క్షమించండి, కొన్నాళ్ళు మనం స్నేహితుల్లా ఉందాం! ఒకరి అభిప్రాయం మరొకరం తెలుసుకుని ఒకరి నొకరం అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం! ఆ తరువాతనే పెళ్ళి ఆలోచన!" అంది నిర్భయంగా ...
    అటు పెద్దలూ, ఇటు పెద్దలూ నిర్ఘాంతపోయారు. కని విని ఎరుగని ఈ ధోరణికి ... లక్ష్మి తరపువాళ్ళు భయపడిపోయారు .లక్ష్మికి ఈ జన్మలో పెళ్ళి కాదని...
    కానీ పెళ్ళికొడుకు మాత్రం చాలా ఉత్సాహంగా "ఇన్నాళ్ళకు నా ఆదర్శాలకు తగిన వ్యక్తిని కలుసుకోగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నాడు.
    లక్ష్మి ద్వారా జరిగింది తెలుసుకున్న సావిత్రి కూడా ఆశ్చర్యపోయింది...
    "జాగ్రత్త! ఎవరినీ నమ్మకు!" అంది అప్పటికీ అనుమానం తీరక స్నేహితురాలిని హెచ్చరిస్తూ...
    "ఏడిసావ్ లేవే! నీ మొగుణ్ణి. దారుణమైన దురదృష్టం వరించబట్టి అలా సైకోలా తయారయ్యాడు. అందరూ అలా ఉంటారా?" అంది నిర్లక్ష్యంగా లక్ష్మి. అప్పటికే కాబోయే వరుడి రూపాన్ని మనసులో ముద్రించుకుంటూ ...
    పెళ్ళికాకముందే లక్ష్మి అతనితో కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్ళింది...అందరూ బుగ్గలు నొక్కుకున్నారు. గుండెలు బాదుకున్నారు. "కొంపదీసి ఏమైనా అయితే," అని భయపడిపోయారు. లోలోపల ఏదో జరగాలని కోరుకుంటు ...    
    కానీ, ఏమీ జరగలేదు. అతనితో పరిచయం అయిన కొద్దీ అతడంటే గౌరవం ఎక్కువ కాసాగింది లక్ష్మికి.  వారానికొకసారి అతడు వ్రాసే ఉత్తరాలను సావిత్రికి కూడా చూపించింది లక్ష్మి ... ఆ ఉత్తరాల్లో అతడు కురిపించే ప్రేమానురాగాలూ, ప్రకటించే సభ్యతా సంస్కారాలు, చూసి సావిత్రి కూడా లక్ష్మి చాలా అదృష్టవంతురాలని మెచ్చుకుంది.
    లక్ష్మికి వరుడు బాగా నచ్చాడు. పెళ్ళికి ముహూర్తం కూడా నిశ్చయించారు.
    తన కాబోయే భర్తను చూడటానికి సావిత్రిని ఆహ్వానించింది లక్ష్మీ...
    సంసారం వదులుకుని వచ్చిన దగ్గరి నుండి సావిత్రి ఎక్కువగా ఎవరిళ్ళకూ వెళ్ళటం లేదు. సానుభూతి చూపిస్తున్నట్లుగా నటిస్తూ వాళ్ళు ప్రదర్శించే కుళ్ళు కుతూహలాన్ని భరించలేక __ ఆ అడ్డదిడ్డపు ప్రశ్నలకు సమాధాన మివ్వలేక __
    లక్ష్మి మాట కాదనలేక వచ్చిన సావిత్రి, ఆ వరుణ్ని చూస్తోనే కొయ్యబారి పోయింది. అతడు సావిత్రిని చూసి తడబడ్డాడు. అంతలో నిర్లక్ష్యంగా "నీకు లక్ష్మి తెలుసా" అని మామూలుగా పలకరించాడు సావిత్రిని ...
    సావిత్రి నిలబడలేక పోయింది. ముఖం చూడలేకపోయింది. అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. తూలుతున్నట్లుగా నడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది.
    ఎవరు చెప్పక్కర్లేకుండానే లక్ష్మికి విషయం అర్ధమయి పోయింది.  
    ఇతడు... తను ఎంతో సంస్కారవంతుడని 'అనుభవ పూర్వకంగా, గ్రహించిన ఈ వ్యక్తి... సావిత్రి భర్తా?
    ఎంతటి స్నేహంలోను ఏ విషయమైనా ఆరాలు తీసి అడగటం సావిత్రికి అలవాటులేదు .తన కాబోయే భర్తగారి ప్రేమాను రాగాలను, అతని సంస్కారాన్ని తలుచుకుని మురిసిపోతున్న లక్ష్మి ఎంతసేపు ఆ మాటలే మాట్లాడేది కాని మరే వివరాలు చెప్పలేదు.
    కృంగిపోయి కూలబడ్డ లక్ష్మిని చూస్తే చాలా జాలి కలిగింది సావిత్రికి ...
    "పోనీలే ! అదృష్టవంతురాలివి. పెళ్ళికి ముందే, తెలుసుకోగలిగావు!" అని ఓదార్చబోయింది.
    "మరొక వ్యక్తి మాత్రం ఇంతకంటే ఉత్తముడని ఎలా అనుకోవటం? ఒకరు మరొకరిని ఎంత బాగా అర్ధం చేసుకోగలరో తేలిపోయిందిగా" అంది లక్ష్మి కన్నీళ్ళతో, ఇన్నాళ్ళుగా తాను కట్టుకున్న కలలు మేడలు ఇలా కరిగిపోవటం భరించలేక ...
    "అదీ నిజమే! దేవుడికి దశావతారాలు ఉన్నాయో, లేదో, కాని మనుష్యుల్లో మాత్రం కొందరు ఎన్ని అవతారాల్లోనైనా కనిపించగలరు!"
    ఒక్క నిట్టూర్పు విడిచింది సావిత్రి.

 

                    * * *                                                

 Previous Page Next Page