Read more!
 Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 3


    "అలాంటప్పుడు తప్పు మీదెలా అవుతుంది ?"


    ఒక ప్రైవేటు యాజమాన్యం చేత నడపబడే ఫాక్టరీలో జరిగే దారుణాల గురించి కాని, అక్కడ పరిస్థితుల కనుగుణంగా జరిగే 'మేనిప్యులేషన్స్' గురించి గాని అవగాహన లేని ఆడదామె.


    "నోటితో అన్నది సాక్ష్యంగా చెల్లదు లక్ష్మీ... ఉద్యోగం పోతుంది."


    "అంతేగా" టక్కున అందామె. "పోనివ్వండి... బతకడానికి ఇదొక్కటే మార్గం కాదుగా."


    ఒక నీటి బొట్టు ఉబికి అతడి కనుకొలకుల్లో నిలబడింది నిశ్శబ్దంగా.


    అవును... అతడు ఆ స్థితికైనా చేరింది మామూలుగా కాదు. అకుంఠిత దీక్షతో అహోరాత్రులు శ్రమించి సాధించుకున్న స్థానమది. బ్రతకడానికి ఇంతకు మించి దారిలేదన్న ఆలోచనో లేక పదిలంగా స్వహస్తాలతో అల్లుకున్న ఓ పొదరిల్లు చిరుగాలి అల తాకిడికి నేలరాలుతుంటే భరించలేని నిస్సహాయతో మరి మౌనంగా వుండిపోయాడు అలాగే.


    ఆమె తేరుకుంది అతడికన్నా ముందుగా "ఈ మాత్రం దానికే ఏదో ప్రాణాలు పోతున్నట్లు కంగారుపడడం దానికండీ? మనకున్నది ఒక్కడు. జరిగేదే జరగనివ్వండి. మనమేమీ వెండి స్పూన్స్ తో గోరు ముద్దలు తింటూనో, రాజభోగాలు అనుభావిస్తూనో బ్రతికినవాళ్ళం కాదు. ఆనందంగా కూలో నాలో చేసుకుందాం. కావాలంటే మరెక్కడికైనా వెళ్ళిపోదాం ఇంతేగా... ఎంత భయపెట్టారండీ? అయ్యో రామ. బాగున్నారు తండ్రీ కొడుకులు ఒకరికొకరు తీసిపోరు..."


    ఒక జీవిత కాలానికి సరిపడ్డ ధైర్యాన్ని, స్ఫూర్తినీ అందిస్తున్న ఆమె మాటలింకా పూర్తికానే లేదు. రిక్షా ఆగిపోయింది. చీకటిలో నిలబడ్డ ఆకారాలు చుట్టుముట్టడంతో...


    ప్రమాదాన్ని పసిగట్టిన రిక్షావాలా పారిపోయాడు.


    ముందు అర్థంకాలేదు జరుగుతున్నదేమిటో.


    ఒక మామూలు మనిషిగా రేపటి గురించి భయవిహ్వలుడై అంతవరకూ ఆలోచించాడే తప్ప అసలు రేపన్నది లేకుండా బలమైన ఏర్పాటు జరిగిపోయిందనిగాని, ఒక పిచ్చుకపై ఇలాంటి బ్రహ్మాస్త్రాన్ని యాజమాన్యం ఉపయోగిస్తుందని గాని అతడూహించలేక పోయాడు.


    నల్లటి కంబళ్ళు ఒంటికి చుట్టుకున్న నలుగురు వ్యక్తులు అమాంతం రాఘవని రిక్షాలోనుంచి లాగడమూ, ఓ పిస్తోలు పేలిన చప్పుడు వినిపించడమూ రెప్పపాటులో జరిగిపోయాయి.


    కలత నిద్రలోనుంచి కెవ్వుమంటూ కళ్ళు తెరిచిన శశి అమ్మ ఒడిలో నుంచి దూకగానే చూసింది రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న నాన్నని కాదు... భూతాల్లా నిలబడ్డ నలుగురు దృఢకాయుల్ని.


    ఓ చెట్టు చాటుకి పారిపోయి వణికిపోతూ నిలబడ్డాడు.


    "పా...రి...పో...లక్ష్మీ" గొణుగుతున్నాడు రాఘవ. ఆమె పారిపోలేదు.


    చెరిగిపోతున్న పసుపు కుంకమల్ని చీకటి నిట్టూర్పుల మధ్య శరీరాన్నడ్డం పెట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తూంది.


    "లే అడ్డంగా" అంటూనే ఓ వ్యక్తి రెక్క పట్టుకుని ఈడ్చాడు. వెనువెంటనే పిస్తోలు కసిగా మరో తూటా కక్కింది.


    "బాబూ శశీ...జాగ్రత్త" మూలుగుతూనే రాఘవ తలవాల్చాడు.


    శశీకి వినిపించింది ఆ ఒక్కమాటే. దాగని నీళ్ళు కళ్ళ అంచులకి చేరకముందే తల కొద్దిగా పక్కకి జరిపి చూశాడు.


    నాన్న పూర్తిగా చచ్చిపోయిన సూచనగా అమ్మ నాన్న గుండెలపై పడి ఏడుస్తూంది.


    పన్నెండేళ్ళ దాంపత్య జీవితపు చరమాంకానికి ఈ చీకటి ఇతిహాసపు పుటల్లో ఇలాంటి ముగింపు రాసివుందనిగాని, చేయని తప్పుకి ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తుందనిగాని తెలీని ఆమె శాపనార్థాలు పెడుతూంది ఇంత ఘాతుకానికి ఒడిగట్టిన వ్యక్తుల్ని చూస్తూ.


    ఎదగని వయసో లేక తన వయసు మించి ఎదిగిన మనసులోని తాత్వికతో శశి చనిపోయిన తండ్రి గురించి కాక చంపినా పద్ధతి గురించి ఆలోచిస్తున్నాడు విచిత్రంగా.


    కత్తుల్ని తప్ప ఇలాంటి మారణాయుధాల్ని అతడెప్పుడూ చూడలేదు. అసలు మారణాయుధాల్ని ఇంత విచ్చలవిడిగా ఉపయోగించే బార్బేరియన్ సొసైటీలో తను బ్రతుకుతున్నానని అంతవరకు తెలుసుకోలేని వయసతడిది.


    "శ...శీ" అరిచింది లక్ష్మి హఠాత్తుగా కొడుకు గుర్తుకురాగా.


    ఆ పిలుపుతో ఏ లాలసత్వం వినిపించిందో వెళ్తున్న నలుగురు వ్యక్తులూ వినోదంగా ఆగారు.


    "శ...శీ...నాన్నా" లేగదూడ కోసం ఆర్తిగా పిలిచే గోవులా ఉందామె ఆక్రందన.


    ముందుకు రాబోయాడు కాని అప్పటికే నలుగురూ అమ్మను చేరడంతో ఆగిపోయాడు.


    ఓ వ్యక్తి లక్ష్మి భుజాలను పట్టుకుంటే, మరో వ్యక్తి ఆమె చీరను లాగేస్తున్నాడు.


    ఆమె రొప్పుతూనే కలియబడింది.


    జరుగుతున్నదేమిటో శశి గ్రహించేసరికి ఆమె చీర వూడిపోయింది.


    తెల్లారని దీర్ఘరాత్రిలో తల పగిలిన తలపుల శల్యాల నుంచి రాలిపడే రుధిర బిందువుల్లా ఆమె నేత్రాల నుంచి అశ్రువులు చిమ్ముతుంటే, ఎగిసే చితిమంటల మధ్య నిలబడి అంతవరకు కొడుక్కోసం కేకలుపెట్టిన ఆమె తన స్థితి కొడుకు కళ్ళ పడకూడదని కోటి దేవుళ్ళకు మొక్కుకుంటూంది.


    అలసిపోతూంది.


    కాదు కరాళదంష్ట్రల నోట చిక్కకముందే కన్ను మూయాలని మాటువేసిన మృత్యువును మనసులోనే ప్రార్థిస్తూంది.

 Previous Page Next Page