Read more!
 Previous Page Next Page 
శ్వేతనాగు - 2 పేజి 2

    వాణి మాటలతో తాను ఓడిపోవటాన్ని అతడు మనః పూర్వకంగానే స్వీకరించాడు. అయితే ఫైకి మాత్రం మాటలలో రవంత అయినా బెట్టు సడలనీయలేదు.
    "డియర్! నేను పిరికి మందు తిన్నానని కదా నీ అభిప్రాయం? మంచిదే! ఈ శ్రీగిరి పర్వతాలలో నెలకొన్న వృద్ధ మల్లిఖార్జునస్వామి సాక్షిగా, సప్త మాతృకల సాక్షిగా కదళి భైరవుడి సాక్షిగా చెబుతున్నాను. మన బిడ్డ సాహసంలో నీ అంతటివాడు కాకూడదనే నేను కోరుకుంటున్నాను" అన్నాడతడు.
    వాణి చివ్వున చూసింది. గత కాలపు స్మృతి వీచికలు ఆమె ఆంతర్యంలో తుఫానులా చెలరేగినాయి. మనస్సాగరంలో శ్వేతనాగు తాలూకు జ్ఞాపకాలు ఉవ్వెత్తు కెరటాల వలె చెలరేగాయి.
    వాటి వెనువెంట బహుకాలం మృతప్రాయుడై పడి ఉన్న ప్రొఫెసర్ కృష్ణస్వామి జ్ఞాపకాలు వెన్ను తట్టినాయి. దుఃఖం చెలియలికట్ట దాటిన సముద్రంలా అయింది.
    "డియర్ స్వప్నా! నీవు నిదురించిన పాముని తట్టి లేపుతున్నావు. గుప్త పాశుపతాన్ని వెలికి తీస్తున్నావు. నీకు తెలుసు కదా! సాహసం నా ఊపిరి. వైజ్ఞానిక పరిశోధన నా ప్రాణం.
    "అయినా ఆ జీవితాన్ని వదిలి తల్లిగా, ఇల్లాలిగా మనోజ్ఞమయిన మరొక ప్రపంచం నిర్మించుకున్నాను. ఈ ప్రేమమయ జగత్తులో -- శ్వేతనాగు పోరాటంలో -- పొందిన అలసట అంతటినీ మరిచిపోయినాను ఎందుకు నువ్వింకా నిదురించిన నా జ్ఞాపకాలను తట్టి లేపుతున్నావు? ఒకవేళ తిరిగి నేను సాహసోపేతంగా ఆ మార్గంలోకి వెళ్లవలసి వస్తే నా బంగారు బాబుని వదలి వెళ్ళలేను, స్వప్నా! వెళ్ళలేను. ఇంకెప్పుడూ ఆ జ్ఞాపకాల అరల్ని తెరవాలని ప్రయతించకు. శ్వేతనాగు జ్ఞాపకాలను మనసు పొరల అట్టడుగున శాశ్వతంగా సమాధి అయిపొనీ!" అన్నదామె. కన్నులు దుఃఖభారంతో రవంత అరుణంచితమయినాయి. చెంపలు పద్మరాగాన్ని తలదన్నుతున్నాయి. పెదవులు రవంత అదురుతున్నాయి.
    ఈ ఉద్విగ్నతను చూచిన స్వప్నకుమార్ విచలితుడయినాడు. వాణి మనోమయ ప్రపంచంలో నిదురించిన జ్ఞాపకాలను తట్టి లేపటం తన తప్పిదమే అనిపించింది. ఆనాటి శ్వేతనాగు అయినా, ప్రొఫెసర్ కృష్ణస్వామి అయినా జ్ఞాపకానికి వస్తే ఆమె ఉద్విగ్నురాలు అవుతుంది. ఆమె ఆలోచనలు దిగంతాల అవతలి విజ్ఞాన విశేషాలవైపు దూసుకుపోతాయి.
    "వాణీ! ఎందుకలా అయినావు? ఈ స్వప్నకుమార్ జీవితంలో అదృష్టమనేది ఏదయినా ఉంటె అది నిన్ను దక్కించుకోవటమే. నా జీవితంలో ఆశించేది ఏదయినా ఉన్నదంటే అది నీవు మనశ్శాంతితో ఉండాలని మాత్రమే! అంతలో ఎలా అయినావు? నీ పెదవులు చూడు ఎలా అదురుతున్నాయో! వాటిని ఓదార్చటం ఎలాగో నాకు తెలుసులే!" అంటూ ఆమె వంకకు రెండడుగులు వేశాడు స్వప్న.
    అంతటి ఉద్విగ్నతను అరక్షణంలో మరచి పకాలున నవ్వింది వాణి. కమ్ముతున్న చీకటిలో మల్లెలు పరుచుకున్నాయి. శ్రీగిరి లోయల్లో వజ్రకాంతులు వికసించినాయి వాణి నవ్వుతో!
    "అదిరే పెదవులు నీ ఆదరాన్ని ఆశించలేదు. అవకాశం అంగలార్చే నిన్ను జీవితమంతా ఎలా భరించాలి" అన్నదామె నవ్వుతూనే! ఆశాభంగమయినందుకు, అవకాశం జారిపోయినందుకు స్వప్నకుమార్ చింతిల్లాడు.
    వాణి అరునాధరాల వంక ఆశ తీరని చూపులు చూస్తూ ముందుకు వేసిన అడుగు వెనుకకు మరలించుకున్నాడు. అతనికి ఆశాభంగమయినందుకు జాలిపడింది వాణి.
    "డియర్ స్వప్నా! నా తను మనః ప్రాణాలలో ఏది కావాలన్నా నీకోసం సిద్దంగా పరచి ఉంచుతాను. కాని ఇది సాక్షిగణపతి, కదళి భైరవుడు, నాగనాధుడు, మతంగేస్వరుడు, కపోతేశ్వరుని వంటి పుణ్య దేవతలు సంగమించిన పవిత్ర ఆరామం. పద్మాకృతిలో ఉన్న ఈ శ్రీ పర్వత సానువులలో బతుకు ఆరాటాలన్నింటినీ అధిగమించి మనశ్శాంతిని పొందాలని మనం వచ్చాము ఇక్కడ సాధారణ మానవ చాపల్యాలను ప్రదర్శించుకోవటం అల్పత్వం. ఇక్కడ మనసు నిగ్రహించుకోగలిగితే దేవతలు వరాలిస్తారు. ఇంటికి పోయాక నీవు అడిగిన వరాలన్నీ నేను ఇస్తాను. వెళ్ళిపోదాం పద. ఇక్కడ గాలి నీ ఒంటికి సరిపడినట్టు లేదు" అన్నది వాణి.
    చిన్ని కృష్ణుడు ఆమె చెవులకు వేలాడుతున్న ఇయర్ డ్రాప్స్ తో ఆడుకుంటున్నాడు.
    కృష్ణాతీరం నుంచి వారంతా కదలి వచ్చారు. కారులో కూర్చున్న తరువాత చాలా బుద్దిమంతుడైపోయినాడు స్వప్నకుమార్. వాణి అన్న మాటలు అతని మనసున నాటుకున్నాయి.ఇది పవిత్ర స్థలి!
    ఇక్కడ సాధారణ మానవ చాపల్యాలను ప్రదర్శించుకోవటం అల్పత్వం. అందునించి అతడు చాలా నెమ్మదస్తుడు అయిపోయినాడు. 'శ్రీ శైల పర్వత శ్రేణినీ విడిచిపోయేంత వరకూ బ్రహ్మచర్యం ఒక్కటే బ్రహ్మ నా నుదుట లిఖించిన రాత' అనుకుంటూ నిట్టూర్చాడు.
    వాణి పక్కన కూర్చుంటే అతని మనసులో చిలిపి ఆలోచనలు చెలరేగుతాయి. కాని ఆమె అడ్డుగోడలు కడుతుంది. అందునించి ఆ బాధను మరిచిపోయేందుకు ఆమెతో ఏదయినా మాట్లాడాలనిపించింది. మనస్సు చంపుకోవటమంటే మృతప్రాయమే కదా! దాన్ని స్వప్నకుమార్ భరించలేకపోయినాడు.
    "వాణీ! శ్రీ పర్వతాలు పద్మాకృతిలో ఉన్నాయని అన్నావు. పర్వతాలు పూవుల్లా ఉంటాయా - రాళ్ళలా ఉంటాయి కాని....." అన్నాడు ఏదో ఒకటి మాట్లాడాలని.
    అతని అర్ధ స్వప్నావస్థను అర్ధం చేసుకుని జాలిపడి నవ్వుకుంది వాణీ. బాబుని ఇద్దరిమధ్యా కూర్చునేలా చేసింది. కన్నవారి కన్నులలోకి చిత్రంగా చూస్తున్నాడు వాడు. వారి తొడలమీద చేతులు ఆనించి దర్జాగా కూర్చున్నాడు.
    "డియర్ స్వప్నా! అవును, శ్రీ శైలక్షేత్రం పద్మాకృతిలోనే ఉంది. శ్రీశైలానికి ప్రదక్షిణాలు చేయాలంటే రెండు విధాలు. పద్మప్రదక్షిణ, రామ ప్రదక్షిణ అని రెండు విధాలుగా చేస్తారు. అంత ఓపిక మనకు లేవు కాబట్టి గుడి చుట్టూ తిరిగి సర్డుకుపోతున్నాం.
    శ్రీపర్వతానికి ఎనిమిది ద్వారాలున్నాయి. అవి పద్మ దళాలవంటివి. వాటిలో త్రిపురాంతకం, సిద్దేశ్వరం,మహేశ్వరం ప్రధానమయినవి. ఆనంద నందిని, భద్ర, విపుల చారు ఘోష, సరస్వతిలాంటి నదులు పద్మపత్రాలకు అంతర్గతమయిన తంతువుల వంటివి. ఎనిమిది దళాల మధ్య పద్మానికి నాలుగు కేసరాలుంటాయి. ఘంటాకుండము, చంద్రకుండము సారంగేశ్వరము, వరాకుండము అని పేరు కలిగిన నాలుగు తీర్ధాలు ఆ కీసరాల వంటివి.
    ఎనిమిది దళాల మధ్య నాలుగు కేసరాల ఆకృతిలో కర్ణికారం అనేది జీవస్తానం. శ్రీశైల పద్మానికి కర్ణికారం మల్లిఖార్జునుడే!" అంటూ వివరించింది వాణి.
    అద్భుతమయిన ఆమె విషయ పరిజ్ఞానానికి అచ్చెరువు పడిపోయినాడు స్వప్న! తాను చాలాసార్లు శ్రీశైలం వచ్చాడు.
    అక్కడ పాతాళగంగ, భ్రమరాంబ, అందరూ చూచి వచ్చే సాక్షిగణపతి, కపోతేశ్వరుడు, సప్త మాతృకలు, నవనందులు - ఇవన్నీ తాను చూచాడు. వాణికి శ్రీశైలం రావటం ఇదే ప్రధమం కావటం నించి అవన్నీ ఆమెకు దగ్గరుండి వివరించవలసిన వాడు తనే అనుకున్నాడు. తీరా వచ్చాక శ్రీశైలాన్ని గురించి తనకా పాఠాలు చెప్తోంది వాణీ. అతడు ఈ సంఘటనతో ఆ ప్రతిభుడు అయినాడు. విభ్రాంతుడయినాడు.
    ఆమెను ఎప్పుడు, ఎలా మాట్లాడించాలని ప్రయాత్నించినా తన వంతు ఆశ్చర్యపడటమే అవుతోంది. అందునించి పెదవులు కుట్టేసుకుని కూర్చున్నాడు. ఓటమి అనే బరువు ఎత్తుకుని కుంగిపోతున్న తండ్రి వంక నవ్వుతూ చూచి కేరింతలు కొట్టసాగాడు చిన్నారి కృష్ణుడు.

 Previous Page Next Page