Read more!
 Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 2


    "ఆ! ఆ కుదురైన పిల్లే, ఇంత గ్రంథ సాంగురాలయింది. ఏమిటో పూర్వకాలపు రోజులే మేలనిపిస్తోంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువులంటు బయలుదేరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తయారవుతున్నారు."
    __ఇలా చెలరేగుతున్నాయి వ్యాఖ్యానాలు-వాళ్ళందరి మధ్య కుర్చీలో కూర్చుని ఉన్నారు చంద్రశేఖరంసార్- ఆయన పైకి మామూలుగా కూర్చున్నట్లు కనిపిస్తున్నా, ఒక్కసారిగా ఎంతో జబ్బుపడి లేచినట్లున్నారు.
    తన చుట్టూచేరి అందరు ఎన్నో రకాలుగా సానుభూతి వచనాలు పలుకుతోంటే ఒక్కదానికీ సమాధానం చెప్పకుండా అలాగే కూచున్నారు-కొందరు కుతూహలం పట్టలేక ఔచిత్యం కూడా మరచి, చంద్రశేఖరంగారినే ఏవేవో ప్రశ్న లడుగుతున్నారు. వాళ్ళకి కూడా చంద్రశేఖరం ఏ సమాధానమూ చెప్పటం లేదు. చంద్రశేఖరం గారి భార్య సుమతి ఆవేదన భరించలేక అలమటించి పోతుంటే చూడలేక మత్తుమందు లిచ్చి పడుకోబెట్టేశారట!
    మురళి చంద్రశేఖరంగారిని చూశాడు. పసిపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు-ఆ ఏడుపుకి కొందరు మురళిని చూశారు.
    "తగుదునమ్మా, అని ఇక్కడకే వచ్చాడు!"
    "ఆ ఏడుపొకటి?"
    "ఛ! వీళ్ళు పిల్లలుకాదమ్మా! పెద్దవాళ్ళ పాలిటి యమదూతలు!"
    అందరూ తనను ఒక రాక్షసుణ్ణి చూసినట్లు చూస్తూంటే అక్కడ నిలవలేక వచ్చేశాడు మురళి-జీవం లేనట్లుగా ఉన్న చంద్రశేఖరంగారి ముఖం అతణ్ణి వదలటంలేదు-దాన్ని వెన్నంటి మనసును మధిస్తోంది. మరొకముఖం-అమాయకంగా ఉన్న మంజులత ముఖం-ఇంటికి వెళ్ళకుండా తిన్నగా రవి దగ్గిర కొచ్చాడు-రవి యధాప్రకారంగా ఏష్ ట్రే పక్కన పెట్టుకుని సిగరెట్లు త్రాగుతూ తన బృందంతో పేకాట ఆడుతున్నాడు-మురళి పులిలా రవిమీదపడి రవి షర్ట్ పట్టుకుని "దుర్మార్గుడా! నువ్వే కారణం! నీ మూలంగానే నేనిలా సర్వనాశనం అయ్యాను-" అని ఏడుస్తూ, తిడుతూ, అరుస్తూ రవిని కొట్టబోయాడు. రవి ఒక్క విదలింపు విదలించాడు మురళిని-అల్లంత దూరాన వెళ్ళిపడ్డాడు మురళి__రవి కోపంగా మురళిని చూస్తూ "ఏమిటీ! నేను దుర్మార్గుణ్ణా? విశ్వాసఘాతకుణ్ణా? నేను చేసిన ఉపకారాలన్నీ మరిచిపోయావా? కుక్కలాగ నా వెంట వెంట తిరిగావు, నీకు అవసరమున్నన్ని రోజులూ-ఇప్పుడు నీ అవసరం తీరిపోగానే శ్రీరంగ నీతులు వల్లిస్తున్నావా? ఒక్కసారిగా నువ్వు మంచి బాలుడివయిపోయి, నన్ను విలన్ ని చేద్దామనుకుంటున్నావా? చంద్రశేఖరం సార్ ని నువ్వు తక్కువ ఏడిపించావా? గుర్తుచేసుకో!"
    మురళి రెండు చేతులతో జుట్టు పీక్కున్నాడు-అవును! తను దుర్మార్గుడు! రవి కంటె తనే దుర్మార్గుడు! ఇప్పుడు తనకు తను ఎలాంటి శిక్ష విధించుకోవాలి? ఏంచేస్తే మంజులత తిరిగి తమ దగ్గిరకి వస్తుంది? ఏ రకంగా చంద్రశేఖరంసార్ ముఖంలో మళ్ళీ చిరునవ్వు కనిపిస్తుంది? అబ్బ! ఎంత మంచివారు చంద్రశేఖరం సార్! అలాంటి వ్యక్తికి.... ....


                                      2


    తెలుగు క్లాసంటే విద్యార్ధులకి చాలా సరదా! హాయిగా, యధేచ్చగా అల్లరి చెయ్యటానికే ఆ క్లాసు! 'తెలుగుకూడా చదివేదేమిటి? ఆ తెలుగుకి ఒక క్లాసు, ఒక లెక్చరర్ కూడా దేనికి? పాపం, విద్యార్ధులు సైన్స్ సబ్జెక్ట్స్ చదివి చదివి అలిసిపోయి ఉంటారని కాస్త కులాసాకి పెడతారు తెలుగు క్లాసులు' ఇదే విద్యార్ధులలో చాలామంది అభిప్రాయం....ఆ తెలుగు పుస్తకాలు కూడా భలేగా ఉంటాయి. ఆడవాళ్ళ అవయవాల వర్ణనలూ, ప్రేమలూ, విరహాలూ కోయెడ్యుకేషన్ కూడా ఉందేమో, ఆ క్లాసులు మరింత సరదాగా ఉంటాయి. ఆడవాళ్ళు తలలు వంచుకుని ఓరగా ఒకరి నొకరు చూసుకుంటూ, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు__ఇక మొగపిల్లలు ఈలలూ, దరువులూ, ఒకటేమిటి?-తమ ఉత్సాహాన్ని నానా రకాలుగా ప్రదర్శిస్తారు. ఇక, శృంగార వర్ణన లొస్తే, ఇద్దరు ముగ్గురైన లేచి నిలబడి "ఆ భాగం నాకు సరిగా అర్ధంకాలేదు సార్! మళ్ళీ వివరిస్తారా?" అని అడుగుతారు-లెక్చరర్ సమాధానం చెప్పేలోగానే మిగిలిన వాళ్ళు విరగబడి నవ్వటం మొదలు పెడతారు.

 Previous Page Next Page