Read more!
 Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 2


    "వాళ్ళకి పిచ్చా? జనాన్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నంలో ఇదో భాగం! మిస్ ఐశ్వర్య రాజశ్రీ గారి బర్త్ డే ఇవ్వాళ! వాళ్ళమ్మ పిలిచి చెప్పింది. చూడు శ్రీ! రేపు నీ బర్త్ డే! తలంటి పోసుకుని కొత్త పట్టుచీరె కట్టుకొని పొద్దున్నే గుడికెళ్ళు. బీదసాదలకు దాన ధర్మం చెయ్! శుభంగా ఉంటుంది" అని. అంటే ఈ పిల్ల వింటుందా. "దేవుడూ లేదూ, దయ్యమూ లేదూ. గాడిద గుడ్డూ లేదు. మమ్మీ! నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే నన్ను గుళ్ళకీ గోపురాలకీ పంపలేవు! పోతే - ఆ రెండో సజెషన్ ఉంది చూశావూ - పేదలకి డబ్బు పంచమని! అందులో గొప్ప పబ్లిసిటీ జిమ్మిక్కు ఉంది మమ్మీ! ఐశ్వర్యరాజశ్రీ అమెరికాని జయించి ఇండియాని కొల్లగొట్టడానికి వస్తోందని అందరికీ తెలియాలిగా! బ్యాంక్ నుంచి ఓ పాతికలక్షలు తెప్పిస్తాను. ఓ హెలికాఫ్టర్ ఎంగేజ్ చేస్తాను. ఇంక చూడు! రేపట్నుంచి ఎక్కడ చూసినా నా పేరే! పాతికలక్షలతో పాతిక కోట్ల పబ్లిసిటీ మమ్మీ! భలే మంచి చౌకబేరం!"


    "శ్రీ! ఆత్మవిశ్వాసం వేరు! అహంకారం వేరు" అంది వాళ్ళమ్మ, కొంచెం మందలింపుగా.


    వాళ్ళమ్మ అలా అనగానే ఈ పిల్ల చెలరేగిపోయి "అమ్మా! నీకూ నాకూ ఎప్పుడు ఏ విషయంలో పడి చచ్చింది గనక! ఫర్ హేవన్స్ సేక్, నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు! నీ పూజామందిరం వైపు నేను రాను" అంది. బ్యాంక్ నుంచి డబ్బు వచ్చినప్పుడు శూశాను బాస్! బస్తానిండా నోట్లు! అర్రె! తబియద్ ఖుష్ హోగయా! జన్మ తరించి పోయిందనుకో! అన్నాడు బాలూ ఉత్సాహంగా.


    అతని మాట పూర్తయ్యేలోపల హెలికాఫ్టర్ సరిగ్గా వాళ్ళు ఉన్నవైపే రావడం మొదలెట్టింది. క్రమక్రమంగా దాని ఆల్టిట్యూడ్ తగ్గుతోంది. కింది కిందికి వస్తోంది హెలికాఫ్టర్. అది అక్కడే దిగే సూచనలు కనబడేసరికి అలర్ట్ గా అయిపోయాడు బాలూ.


    సరిగ్గా అక్కడే దిగింది హెలికాఫ్టర్. అక్కడ చెట్ల మధ్య కొంతమేర చదును చేయబడి ఉంది. మేక్ షిఫ్ట్ హెలీపాడ్ అది.


    ఇంజను ఆగినా రెక్కలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. గాలికి ఎగిరిపోతున్న జుట్టుని చేత్తో అదిమిపట్టి కిందికి దిగింది ఒక అమ్మాయి.


    "గుడ్ మార్నింగ్ మేడమ్!" అన్నాడు బాలూ, దాదాపు అటెన్షన్ లో నిలబడుతూ.


    నోటెంబడి మాటరానట్లు కళ్ళప్పగించి ఇదంతా చూస్తున్నాడు కాశీ.


    ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఊరికే 'అందమైన అమ్మాయి' అంటే సరిపోదు. ఆ అమ్మాయిని చూసేదాకా 'అందం' అనే పదానికి అసలు అర్థమేమిటో తెలియదన్నమాట. పొడుగ్గా ఉంది ఆ అమ్మాయి. ఐదడుగుల పదకొండు అంగుళాలు ఉండొచ్చు. అంత పొడుగూ, అంత అందం ఉన్న ఇంకే అమ్మాయి అయినా కూడా, ఓ ఐశ్వర్యారాయ్ లాగా, ఓ సుస్మితా సేన్ లాగా ఏ ప్రపంచ సుందరి పోటీకో వెళ్ళి ఉండేది.


    "మేడమ్! నాకో పది నోట్లు దొరికాయండీ! తీసి జాగ్రత్తచేశా!" అన్నాడు బాలూ జేబులో ఉండగానే పది నోట్లు లెఖ్ఖపెట్టి బయటికి తీస్తూ. నిజానికి అతను పాతిక నోట్లపైనే పట్టేశాడు.


    "ఇలా ఇవ్వు! ఇవి ఊళ్ళోవాళ్ళకి! నా సర్వీసులో ఉండే ఎంప్లాయీస్ కి కాదు" అని నిర్మొహమాటంగా వాటిని తీసుకుని, వానిటీ బాగ్ లో వేసుకుంది ఆ అమ్మాయి.


    "ఆడ షైలాక్!" అని మనసులోనే తిట్టుకుంటూ ఓరగా కాశీవైపు చూశాడు బాలూ.


    కాశీ పరిస్థితి మాటల్లో వర్ణించడానికి వీల్లేని విధంగా ఉంది. అతను ఏదో అద్భుతాన్ని చూసినట్లు చూస్తున్నాడు. అనుకోకుండా ఓ అప్సరస తనకు ఎదురైతే ఎలా దిగ్భ్రాంతి పొందుతాడో అలా దిగ్భ్రమ చెంది చూస్తున్నాడు. తప్పు అతనికి కాదు. తప్పు ఆ అమ్మాయిదీ - ఆమె అందానిదీ. ఆమె అహంకారానిదీ, ఆమె డబ్బుదీనూ!


    ఓరకంటితోనే ఐశ్వర్యవైపు చూశాడు బాలూ.


    ఆమె కాశీని పట్టి పట్టి చూస్తున్నట్లు చూస్తోంది.


    "నీ పేరేమిటి?" అంది ఐశ్వర్య ప్రతి అక్షరంలో తన అధికారాన్ని చూపిస్తూ.


    "కాశీ" అన్నాడు కాశీ కలలో మాట్లాడుతున్నట్లుగా.


    "బెనారస్ కాదా?"


    "ఆ ?"


    "వందరూపాయల నోటు నీ కాలిదగ్గరే పడి ఉన్నా తీసుకోలేదేం?" అంది ఐశ్వర్య.


    "పరుల సొమ్ము పాముతో సమానం!" అన్నాడు కాశీ.


    చిత్రంగా అతనివైపు చూసింది ఐశ్వర్య. 'ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా?' అన్న భావం ఆమె కళ్ళలో కనబడుతోంది.


    "తోటలో ఏం చేస్తున్నావ్?" అంది గద్దిస్తున్నట్లు.


    బాలూ కలిపించుకుని భయభక్తులతో చెప్పాడు.


    "వీడిది మా ఊరేనమ్మా! అనాధ. తల్లీతండ్రీ లేరు. నా దగ్గరకొస్తే నేను మీ దగ్గరకి..."


    ఐశ్వర్య తన మాటలు వినిపించుకోవడం లేదని గ్రహించాడు బాలూ.


    ఆమె చూపులు బాలూ, కాశీల వెనక ఉన్న ఇంకేదో దృశ్యం మీద కేంద్రీకరించి ఉన్నాయి. ఆమె పెద్ద కళ్ళు మరింత పెద్దవయ్యాయి. వాటిలో భయం చోటుచేసుకుంది.

 Previous Page Next Page