Read more!
 Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 4


    "ఒరేయ్ ప్రసాద్, వసంతని ఆ ఆఫీసుకి తీసుకెళ్ళు దగ్గిరుండి.....యింటర్య్వూ వుంది గాబోలు దానికి" వెంకట్రావుగారు ఆఫీసు కెళ్ళేముందు కొడుకుతో అన్నారు. ఆడపిల్లలకి అంతంత చదువులు ఎందుకు అన్న అయన ఆడపిల్లలకి డిగ్రీలు చదివించే స్థాయికి చేరి, ఆడపిల్లా, ఉద్యోగం చేస్తుందా....మతిపోయిందా అని తిట్టే అయన వసంత ఉద్యోగం చేయడానికి రాజీ పడిపోయారు. పరిస్థితులతో మనిషి ఎలా రాజీ పడతాడో , పరిస్థితులు మనుషులని ఎలా కృంగదీస్తాయో అయన మాటలే చెప్పాయి అందరికి.
    "నీకేం రోడ్లు కొత్త.....నీ తోకలా నేనెందుకె వెనకాల. వెళ్ళవా ఏమిటి, పెద్ద ఉద్యోగం చేస్తావేమో ...' ప్రసాద్ తండ్రి వెళ్ళాక సణిగాడు.
    "నీవేం రానక్కరలేదు, నేవెళ్ళగలను." వసంత పౌరుషంగా తలెగరేసింది.
    'అయ్యో....కొత్తాఫీసు.....ఏదేక్కడో దానికేలా తెలుస్తుందిరా ... వెళ్ళు దాంతో. అయినా యింట్లో చేసే పాటు ఏముంది " చటుక్కున ఆ మాట అనేసాక ఆవిడ నొచ్చుకుంది.
    అప్పటికే ప్రసాద్ మొహం మాడిపోయింది. తల్లి వంక చురుగ్గా చూసి చెప్పులు వేసుకుని విసురుగా బయటకు వెళ్ళి నిలబడ్డాడు.
    
                                              *    *    *    *
    ఇంటర్వ్యూకి మొత్తం పాతికమంది అమ్మాయిలు వచ్చారు. టైపు, షార్ట్ హాండ్ పాసయిన వాళ్ళే అందరూ. అందరిలోకి కాస్త స్మార్టుగా వున్నవాళ్ళు ముగ్గురు వసంతకి పోటీగా నిలబడ్డారు. ఆ ముగ్గురి వంకే చూస్తూ కూర్చుంది బెంగగా వసంత. ఇంటర్వ్యూ వచ్చేవరకు వున్న ఆత్మ విశ్వాసం కాస్త సడలిపోయింది.... ఆమె మొహంలో దిగులు చూసి ఒకమ్మాయి చనువుగా నవ్వుతూ అంది." మీకిది మొదటి యింటర్వ్యూనా" అంది.
    'అవును, ఎందుకలా అడిగారు" అంది వసంత కుతూహలంగా.
    "ఇలాంటి యింటర్వ్యూ లెన్నో చూసాను, యిప్పుడు అలవాటయి పోయింది నాకు. నాకు మొదటిసారి మీలాగే బెంగపడ్డాను రాదేమోనని.... మీ మొహం చూస్తుంటే తెలిసిపోయింది మొదటిసారని. డోంట్ వర్రీ. మీకీ ఉద్యోగం వస్తుందని నాకెందుకో అన్పిస్తుంది. మా అందరిలోకి మీరే స్మార్టుగా వున్నారు. ఆ అమ్మాయి మాటలకి వసంత మొహంలో మళ్ళీ రంగు వచ్చింది. కళ్ళు సంతోషంగా నవ్వాయి. థాంక్స్ . మీనోటి చలవ వల్ల ఒస్తే.....
    'ఈ ఉద్యోగం మీకంత అవసరమా....' వసంత కట్టుకున్న చీర వంక చూస్తూ అడిగిందా అమ్మాయి.
    అవసరం కాబట్టే వచ్చాను. ఒక్క చీర కొనుక్కుందామన్నా , ఒక సినిమాకి వెళ్ళాలన్నా నాల్గురూపాయల గాజులు కొనాలన్నా ప్రతిదానికి అమ్మని నాన్నని వేధించి, పదిసార్లు అడిగి అడిగి లేదనిపించుకుని అన్నింటికి అమ్మా నాన్న మీద ఆధారపడకుండా నా ఖర్చులకైనా సంపాదన ఉండాలని వుద్యోగం చెయ్యాలనుకుంటున్నాను...... ఆ అమ్మాయి అదోలా నవ్వింది. 'మీరు చీరలకి, సినిమాలకి అంటున్నారు.....ఇందులో కనీసం పది పదిహేను మంది ఒక పూటకి తిండి దొరుకుతుందని ఉద్యోగం చెయ్యాలనుకునేవారుంటారు....కాని నిజంగా ....ఉద్యోగం అవసరం వుండే వాళ్ళకి దొరకవు ఉద్యోగాలు, ఇంట్లో తిని కూర్చోలేక కాలక్షేపం అంటూ వచ్చే అమ్మాయిలకి లేదా పెద్ద రికమండేషన్లు తీసుకొచ్చిన వారికీ, యింకా మాట్లాడితే భర్తల సంపాదన వెయ్యి రూపాయలు దాటిన వాళ్ళకే వస్తాయి. నాలాంటి బీదవారికి , రెక్కలే ఆధారంగా ఒక కుటుంబం ఆధారపడి ఉండేవారికి దొరకవు. ఉద్యోగాలిచ్చేటప్పుడూ టిప్ టాప్ గా స్మార్ట్ గా ముస్తాబయిన వాళ్ళనే కోరుకుంటారు. ఆమాత్రం ఆడంబరంగా తయారవగలిగిన వాళ్ళకి ఈ ఉద్యోగం ఎండుకన్నది , ఎవరూ ఆలోచించరు." విరక్తిగా, చూస్తూ అంది. వసంత గతుక్కుమంది. నిజమే, చుట్టూ వున్న పాతిక మంది అమ్మాయిలలో మూడోవంతుల మంది నీరసంగా, ఈసురో మంటూ, యింటర్వ్యూ కి వచ్చినా అది సామాన్యమైన చవక వాయిల్ చీరలతో వారి స్థితి గతులు మొహం మీదే తెలిసేటట్టున్నారు. వారి కళ్ళలో ప్రతిఫలించే నిరాశా నిస్పృహలు చూస్తుంటే ఈ ఉద్యోగం రాదని ముందే తెలిసినట్టున్నారు. వారు నిల్చున్న తీరులో వారు మోస్తున్న బతుకు భారం స్పష్టంగా కనిపిస్తుంది.....ఆ అమ్మాయిలతో పోల్చుకుంటే నిజంగా తను వారికంటే ఎంతో మెరుగు అన్పించింది ఆ క్షణంలో వసంతకి. రెండు పూటలా తిండికి, బట్టకి, లోటు లేని తనే ఉద్యోగం కోసం ఇంత ఆరాటపడ్తుంటే పాపం వారి మీద ఆధారపడిన కుటుంబాలున్న వాళ్ళకెలా వుంటుందో....ఆ క్షణాన ....తను ఏదో కొత్తగా కళ్లిప్పి చుట్టూ ప్రపంచాన్ని కొత్తగా చూస్తున్నట్లనిపించింది వసంతకి. తనతో మాట్లాడిన అమ్మాయి చాలా బీదగా దైన్యంగా కనిపిస్తుంది . నల్లగా, పొట్టిగా , పీలగా తెల్లటి నేత చీరలో వచ్చిన ఆమెకి దగ్గిర దగ్గిర పాతికేళ్ళుఉంటాయి. గిడసబారిన వంకాయిలా ఎదుగు బొదుగు లేకుండా వుండిపోయినట్టుగా వుంది. పాపం ఆ అమ్మాయి యింటి పరిస్థుతులేమితో అంత విరక్తిగా మాట్లాడిందంటే జీవితంలో అప్పుడే విసిగి వేసారిందన్నమాట.....
    నన్నడిగితే ఒక కుటుంబంలో వెయ్యి రూపాయల సంపాదన పైన ఉన్నవారి కుటుంబ సభ్యులలో మరొకరికి ఉద్యోగం, అందులో ఆడపిల్లలకి యివ్వకూడదన్న రూలు పెడితే యీ నిరుద్యోగ సమస్య సగం అన్నా తగ్గుతుందేమో ..." ఆవేశంగా అంది అ అమ్మాయి.
    'అది న్యాయంగాదూ..... వెయ్యి రూపాయలు యీ రోజుల్లో ఏ మూలకి...."
    'అందులో సగం అన్నా లేని సంసారాలని దృష్టిలో పెట్టుకునే ఆ మాటంటూన్నాను వసంతగారూ. యింట్లో భర్త వెయ్యి రూపాయలు సంపాదిస్తుంటే భార్య ఉద్యోగం చెయ్యకపోయినా అ కుటుంబం ఆర్ధికంగా అవస్థ పడదు. అలాగే తండ్రి మంచి సంపాదనలో వుంటే పెళ్ళికాని అమ్మాయిలు చేయడం అనవసరం. ఆడవాళ్ళకి ఉద్యోగాలు యిచ్చేటప్పుడు ఆ ఇంట్లో మగవారి సంపాదన తెలిసి యివ్వాలని రూలు పెడితే నిజంగా ఉద్యోగాలవసరం ఉండేవారికి కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. ఏ కాలేజిలో చూడండి, ఏ పెద్ద పెద్ద ఆఫీసుల్లో చూడండి పనిచేసే ఆడవాళ్ళలో సగం మంది భర్తలు, తండ్రులు పెద్ద హోదాల్లో వుండేవారే. మాలాంటి అనామకులకి, నిజంగా ఉద్యోగం లేకపోతే దినం వెళ్ళని వాళ్ళని పట్టించుకునే వారెవరు -- భర్తలు సంపాదిస్తుండగా చీరలకి, నగలకి, ఉద్యోగం చేస్తూ యింకోరి పొట్ట కొట్టడం అన్యాయం కాదంటారా....' ఆ అమ్మాయి చాలా ఆవేశంగా అంది.
    "అలా అయితే స్త్రీ ఆర్ధికంగా ఎన్ని యుగాలయినా మగవాడి మీదే ఆధారపడి బతకాల్సి వుంటుంది. యింక మనం ఏం ప్రగతి సాధించగలం. విదేశాలలో స్త్రీ, పురుషులు యిద్దరూ అర్దిమగా ఒకరి మీద ఒకరు ఆధారపడరు గనకే అక్కడ పురోభివృద్ది కనిపిస్తుంది. అక్కడి స్త్రీలలో ఆత్మవిశ్వాసం, పురుషుల అధికారానికి తల ఒగ్గి బతికే బానిస వైఖరి కనపడదు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చెయ్యకుడదంటే ఎన్నాళ్ళయినా మన బతుకిలాగే ఉండవూ....' ఏం చెప్తావన్నట్టు వసంత ధీమాగా చూసింది. వాళ్ళిద్దరి మాటలు విని నలుగురైదుగురమ్మాయిలు చూట్టూ మూగారు.
    "ఆత్మాభిమానం, పురోభివృద్ది , ఆత్మగౌరవం అన్నీ 'ఆకలి తర్వాతే వసంతగారూ. రెండు పూటలా తిండికి నోచుకోని వాళ్ళకి అవన్నీ ఆలోచించే తీరిక వుండదు. విదేశాలలో మాదిరి స్త్రీ పురుషు లిద్దరూ ఉద్యోగాలూ చేసినా సరిపోయేటన్ని లేవు. అక్కడివారిలా పేపర్లమ్మి, పాల సీసాలు సప్లయ్ చేసి, హోటళ్ళు తుడిచి , కూరలమ్మి ఏ పనిపడితే ఆ పని చేయడం ఆత్మ గౌరవానికి భంగం అనే ఆలోచనలని  అధిగమించలేని మనకి అన్ని ఉద్యోగాలు లేవు - ఉద్యోగాలంటే ఆఫీసులో చేసేవే అని అనుకునే స్థాయి నుంచి దాటే వరకు స్త్రీ పురుషు లుద్దరూ ఉద్యోగాలకి ఎగబడితే యీ నిరుద్యోగ సమస్య ఎన్నటికీ తీరదు. అంతవరకు మాలాంటి వారికీ ఇక్కట్లు తొలగవు ' నిరాశ నిస్పృహల మధ్య నిట్టురుస్తూ అంది. వసంత ఉద్యోగాలకి ఎగబడక పొతే అలాంటి పనులు మీరూ చెయ్యొచ్చుగా అని అనాలను కునే లోపలే ఫ్యూను వసంత పేరు పిలిచాడు.

 Previous Page Next Page