Read more!
 Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 4


    కళ్ళు తెరిచాడు. చుట్టూ చీకటి. పక్కగదిలోనుంచి వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. అర్థరాత్రిపూట ఒక స్త్రీ రోదనం. దూరంగా కుక్క ఏడుపు.    


    అమ్మ ఏడుస్తూ వుంది. ఎందుకో తనకు తెలుసు.


    కాని ఆ కుక్క ఎందుకు ఏడుస్తూ వుందో!


    శరత్ సీలింగ్ కేసి వెర్రివాడిలా చూస్తున్నాడు. కొత్తగా కట్టిన ఆ సిమెంట్ భవనం అద్దాల మేడలా తోచింది. ఎవరో దానిమీద రాళ్ళు విసురుతున్నారు. అద్దాలు విరిగి శరత్ మీద పడుతున్నాయి. శరత్ వళ్ళంతా గాయాలు. శరీరంలోని రక్తం అంతా కారిపోయింది. కేవలం రక్తం లేని మాంసం ముద్దలా పడివున్నాడు.  


    కాలూ చెయ్యీ ఆడించడానికి శక్తి లేనట్టు వుంది.


    అయినా బుర్ర పని చేస్తూనే వుంది. చాలా చురుగ్గా పనిచేస్తూ వుంది.  


    తను ఇంతకాలం పదిలంగా పెరిగింది అద్దాలమేడలోనా?


    నాన్న.... కాదు.... రామనాధం గారు.... నిజంగా ఆ మాటలు అన్నారా? తను పొరపాటుగా వినలేదు కదా?


    పొరపాటు కాదు.... ఇంకా.... అమ్మ.... కాదు.... కాదు.... సుశీలమ్మ ఏడుస్తూనే వుందిగా! తను విన్నది నిజమే!    


    పాపం సుశీలమ్మ.... కాదు.... కాదు.... అమ్మ.... ఆమె అమ్మే.... తనకోసం గుండెలు అవిసిపోయేలా ఏడుస్తూ వుంది పాపం!  


    ఆమె అమ్మే.... తన రక్తమాంసాలను పంచి ఇవ్వక పోయినా గుండెల్లోని మమకారాన్ని పంచి ఇచ్చింది.  


    కాని తనలో ఆ అమ్మ రక్తం లేదు.


    తను ఎవరి రక్తమాంసాలు పంచుకొని పుట్టాడు?


    తనలో ఎవరి రక్తం ప్రవహిస్తూ వుంది?


    తనెవరు - తనెవరు?


    శరత్ కిటికీనుంచి బయటికి చూడటానికి ప్రయత్నించాడు బయట చీకటి ఏమీ కన్పించడం లేదు.


    "నేనెవర్ని?"


    "నువ్వు నా బిడ్డవు!" చీకటి సమాధానం ఇచ్చినట్టు అన్పించింది.   


    శరత్ బుర్రలో ఏదో భయంకరంగా ప్రేలింది.


    రెండు చేతుల్తో తల పట్టుకొని దిండు మీద తల అటూ ఇటూ తిప్పాడు అశాంతిగా.  


    తను ఎవరు?


    తను చీకటి బిడ్డా?


    అంటే? తను అక్రమ సంతానమా?


    తన కన్నతల్లి తనను పరిత్యజించిందా?


    తన పుట్టుక తన తల్లిని అంత భయపెట్టిందా?


    ఈ అమ్మ.... ఈ సుశీలమ్మ.... తనతోపాటు తన జీవిత రహస్యాన్ని కూడా గుండెల్లో దాచుకొని ఇరవై రెండేళ్ళు పెంచిందా?


    ఆ రహస్యం తనతోపాటు ఆడుతూ పాడుతూ నీడలా పెరిగిందా?


    శరత్ కళ్ళు తెరుచుకొని చీకట్లో ఎవరి ముఖాన్నో చూడటానికి ప్రయత్నిస్తున్నట్టు చూడసాగాడు.


    తన తల్లి.... తనను చీకట్లో కనిపారేసిన తల్లి ఎలా వుంటుందో? ఆమె తనను ఎందుకు పారేసింది? ఎక్కడ పారేసింది?   


    తన తండ్రి.... ఎవరు? తన తల్లిని మోసం చేశాడా?


    తను ఇరవై రెండేళ్ళు "అమ్మా" అంటూ పిల్చిన "అమ్మ" తన అమ్మ కాదా? రామనాధం తనకు తండ్రి కాడు. తనకు వాళ్ళేమీకారు. వాళ్ళ రక్తం తనలో లేదు.    


    ఇంతకాలంగా తన రక్తం పంచుకొని పుట్టాడని భ్రమపడుతున్న తమ్ముడికీ తనకూ ఎలాంటి రక్తసంబంధం లేదు. ఈ విషయం తమ్ముడికి తెలిస్తే? తనను ఇంతవరకూ అభిమానించినట్టు అభిమానిస్తాడా తనను చిన్నచూపు చూడడూ?


    ఇంతకాలం తనది అనుకుంటున్న ఈ ఇల్లు తనది కాదు. తన చిన్నప్పుడు కట్టుకున్న పేక మేడకూ దీనికీ భేదం లేదు. తన కళ్ళముందు తను కట్టుకున్న పేకమేడ కూలిపోయింది. అద్దాలమేడ విరిగి పడిపోయింది.  


    మామయ్యకు - కాదు, వెంకట్రామయ్యగారికి - ఈ విషయం తెలుసా? తెలిసే వుండాలి. కాని ఆయన కూతురు భారతికి....?


    చిన్నప్పుడు తనను చూడగానే "మీ అబ్బాయేనా? ఎంత అందంగా వున్నాడండీ! ఎవరి పోలికా?" అని అడిగేవారు అందరూ.   


    అమ్మ నవ్వుతూ "వారు వాడిపోలికే!" అనేది. తన అంతాన్ని చూసి మురిసిపోయేది.       


    "ఈ వెధవ పెద్దవాడైతే ఎంతమంది ఆడపిల్లల్ని చుట్టూ తిప్పుకుంటాడో!" అనేది.


    సుశీలమ్మ అమ్మ కాగలిగింది కాని రామనాధం గారు తండ్రి కాలేకపోయారు.


    అమ్మ తనకు ఈ రహస్యం ఎందుకు చెప్పలేదు? చిన్నప్పుడు తెలిసి వుంటే ఇంత అశాంతి వుండేది కాదేమో? కాని ఇటువంటి పిల్లల్ని పెంచుకొనే వాళ్ళంతా ఆ రహస్యాన్ని దాచే పెంచటానికి ప్రయత్నిస్తారు. కాని ఎప్పుడో ఒకసారి భూకంపం రానే వస్తుంది. ఆ రహస్యం బయట పడుతుంది.   


    ప్రసిద్ధ రచయిత బాల్ జాక్ కూడా చీకటి బిడ్డేనట. అతన్ని కన్నతల్లి అనాధ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయిందట. ఊహ తెలిశాక అతనికి తను అనాధ అని తెలిసిపోయింది. తల్లిని ఒక్కసారి స్పృశించాలనే కోర్కె బలంగా వుండేదట. కాని అతనికి ఆ కోర్కె తీరనేలేదు.

 Previous Page Next Page