Read more!
 Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 4


    ఇంక... ఉద్యోగ పర్వంలోని ముచ్చట్లలో మచ్చుకికొన్ని -


     నా అదృష్టమేమోకాని, ఏడెనిమిది మందిమి ఒక బ్యాచ్ గా వుండేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్ అవర్ లో కొంచెం ఎక్కువ దూరంలోనే వున్న కలెక్టరాఫీసులో వున్న అయ్యర్  క్యాంటీన్ కి అందరం కట్టకట్టుకొని వెళ్లేవాళ్ళం.  మా అష్ట దిగ్గజాలు హాస్యం పండించడంలో ఒకరిని మించిన  వారింకొకరు.  క్యాంటీన్ కి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ  హాస్యపు జల్లులే కాదు... , జడివానే  కురిపించేవాళ్ళం. ఆఫీసులో కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పనిచేసేవాళ్ళం. సమయమూ తెలిసేది కాదు .పని పెండింగ్ అంటూ లేకుండా అయిపోయేది.  హృషికేశశర్మ  అని ఒక కొలీగ్ వుండేవాడు. మాది లోపలి గదిలో పక్కపక్క సీట్లు. అతన్ని  కావాలని "హృషీకేశవ శర్మా....!" అని పిలిచేవాడిని. సరియైన పదం 'హషీకేశ' కాని, 'హృషీకేశవ' కాదు. అందువల్ల అతను వెంటనే  'నాకు 'వ' లేదయ్యోయ్.... !" (వ లేదు) అనేవాడు. దానిని నేను 'వాలు ఏదయ్యోయ్' గా మార్చి "నీ 'వాలు' ఏదో నాకు  తెలియదయ్యోయ్!" అనేవాడిని. ఈ సంభాషణకి చిలువలు పలువలు జేర్చిహాయిగా నవ్వుకునేవాళ్ళం.


     హృషీకేశ శర్మ హాస్యం అతనికే సొంతం. కావాలన్నా, రావాలన్నా మరొకరికి పట్టుబడదు. తాను చిరునవ్వు నవ్వుతూ ఇతరులను పొట్ట పగిలేటట్లు నవ్వించేవాడు. ఆయన చేతిరాత ముత్యాల కోవలా వుండేది. పని వంక పెట్టలేనట్లుండేది.  ఇంకా రికార్డ్స్ మెయిన్ టెనెన్స్  అధ్బుతం. ఆయన  అలమార తలుపు తీస్తే,ఫైల్స్  అమరిక చూస్తే ముచ్చటవేసేది.  ఒకసారి ఆయన నెలరోజులు సెలవులో  వెళ్లాడు. ఆయన స్థానంలో ఇంకొకరిని  వేశారు. ఆయన తిరిగి జాయినయ్యాక పైల్స్  అన్నీ  చిందరవందరగా  వున్నాయి. కావలసిన ఫైల్ కోసం  ఎంతో వెతకాల్సి వచ్చేది.  ఒకసారి అలా వెతుకుతూ  ఏడ్వలేక నవ్వుతూ "ఏమిటో ... .నేను సెలవు నించి వచ్చేసరికి ఫైల్స్ వాటి స్థానంలో అవి వుండడం  మానేశాయి" అన్నాడు.  ఆ ఫైల్స్ ని చిందరవందర చేసిన వాడి మీద చిందులు తొక్కలేదు.  ఆ ఫైల్స్ కే కర్తృత్వం ఆపాదించి అవివాటి స్థానంలో  వుండడం లేదన్నాడు. ఎంతటి సునిశిత హాస్యం...?!


    'పని ఎగవేసి తప్పించుకు తిరిగేవాళ్లని ధన్యులు' అనేవాడు శర్మ. మరి, 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు' అన్నాడు కదా... సుమతీ శతకకారుడు!


     అదే ఆఫీసులో మాకు ఒక ఆఫీసర్ వుండేవాడు. పేరు బ్రహ్మాజీ. మనిషి మహ జిడ్డు శ్రీ. ఆయన తగులుకున్నాడంటే ఫెవికాల్ ఎందుకూ పనికిరాదు.  ఆయన్ని  'బ్రహ్మాజీ' బదులు 'బ్రహ్మజిడ్డు' అని, దానికి షార్ట్ ఫారంగా 'బ్రహ్మజి' అనేవాడు శర్మ.

 
    మరో కొలీగ్.... శాస్త్రి  వుండేవాడు. మాటల్ని కూడా మహా పొదుపుగా వాడేవాడు. ఏదో విషయం చెప్పబోతూ 'బందరు నుండి బెజవాడకు ....' అంటూ ఆ సంఘటన ఏదో చెప్తున్నాడనుకోండి. 'నుండి'  దాకా  చెప్పేసరికి ఏ ఫోన్ కాల్ వచ్చో, ఎవరో పిలిచినందుకో మాట్లాడడం ఆపి వేశాడనుకోండి... మళ్లీ చెప్పేటప్పుడు 'నుండి' పదం దగ్గర మొదలుపెట్టి  మిగతా కథ చెప్పేవాడు. అంతటి పొదుపరి ఆయన. దాంతో ఆయన ఊరికీ, పేరుకీ కూడా పొదుపు పట్టించేశాం. ఆయన ఊరు అవనిగడ్డ, అవని తీసేసి గడ్డ వుంచాం.  ముందున్న ఇంటిపేరూ, మిగిలిన పేర్లూ తీసేసి 'గడ్డ శాస్త్రి' అని కొత్తపేరు పెట్టాం. ఆ కొత్తపేరు విని ఆయన హాయిగా నవ్వుకునేవాడు.


    మాకు మూర్తి అని ఒక మంచి కోలీగ్ వుండేవాడు. ఎంతటడి స్పురద్రూపో అంతటి హాస్యప్రియుడు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్  లగా ఆలోచనలూ, అభిరుచులూ బాగా కలియడంతో మేమిద్దరం చాలా సున్నితంగా వుండేవాళ్ళం. అతను అంటుండేవాడు -


    "నిన్ను తీసుకుపోడానికి యమదూతలు వచ్చినా నీ జోక్ లతో వాళ్ళని ఏడ్పించి (కళ్ళనీళ్ళ పర్యంతం నవ్వించి) తరిమివేస్తావు. వాళ్ళువెళ్ళి యమునితో మొరపెట్టుకుంటే యముడు స్వయంగా  వచ్చినా ఆయన్ని నిలబెట్టి నవ్వించికాని - ఆయనవెంట  పోవు. నీ శవాన్ని పాడె మీద పడుకోబెట్టినా అది మధ్య మధ్య లేచి నాలుగు జోక్ లు  చెప్పి నవ్వించి మళ్ళీ పడుకుంటుంది. నీ శవం  కాలుతున్నప్పుడు కూడా మధ్య మధ్య లేచి నవ్విస్తూ మరీ కాలిపోతుంది." అనేవాడు.


    నా హస్య భాషణానికి ఎంతటి గొప్ప కితాబు! ఆ ఆత్మీయుడు మూర్తి కిందటి సంవత్సరం ఏమి బావుకుందామనో పరలోకానికి పరుగులు పెట్టేశాడు. మనుషులు మరుగైనా వారి హాస్యం నిలేచే వుంటోంది నా మనసులో. అందుకనే దాన్ని శాశ్వతపరచడానికి గ్రంథస్థం చేస్తున్నారు.


    హాస్యంగా మాట్లాడి ఇతరులను నవ్వించగలగడమే కాదు.. , ఇతరులు చెప్పిన జోక్స్ ని, హాస్య సంభాషణని అర్దం చేసుకుని అస్వాదించగల నేర్పూ వుండాలి. అప్పుడే  పరస్పరం  ఆనందించగలరు.  హాస్యంగా మాట్లాడగలగడం  ఒక యోగం అయితే, అర్దం చేసుకుని  ఆనందించగలగడం  ఒక మహాయోగం!  అటువంటి మిత్రులు దొరకడం ఒక మహా మహాభోగం. ఈ విధంగా చూస్తే నేనూ ఒకమహా యోగినే, ఒక మహామహా భోగినే!


    ప్రపంచ ప్రఖ్యాత ఫన్ డాక్టర్ వి. చంద్రశేఖర్ గారితో నాకు పరిచయం వుండేది. నిమిషాలలో మేకప్ మార్చుకుని గాంధీ, నెహ్రూ, రామకృష్ణ పరమహంస.. .ఇలా ఏ వేషాన్నైనా  వేయగల ఏకైక రూపశిల్పి ఆయన. ప్రఖ్యాత నేపథ్యగాయని యస్. జానకికి ఆయన మామగారు. ఆమె బాగా పేరులోకి వచ్చిన కొత్తలో ఒకసారి ఆయన్ని అడిగాను -


    "ఏమండీ... మీ కోడలు మీ దగ్గరే వుంటోందా?" అని.

 
    వెంటనే ఆయన - "లేదండీ.. .మా కోడలు దగ్గరే మేముంటున్నాం" అన్నాడు.


    కొడుకూ, కోడళ్ళ దగ్గర వుండడానికి ఆయన నెల్లూరు నుంచి మద్రాసుకి మకాం మార్చారు.  ఆ విషయాన్ని అంత చక్కగా సున్నిత  హాస్యంతో మేళవించి చెప్పారు.

 
    నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒక ఆడిట్ పార్టీ అన్ స్పెక్షన్ కి  వచ్చింది. వాళ్లలో ఒకాయన పేరు నాయర్. పరాయి ఊళ్ళో ఆయనకి ఏమీ తోచక నాతో కబుర్లు చెప్తూ కూర్చునేవాడు.


    నేను నవ్విస్తూ మాట్లాడుతుండేవాడిని. ఆయన కళ్ళనీళ్ళు వచ్చేటట్లుగా నవ్వుతుండేవాడు. ఓసారి ఆయన అన్నాడున-


     "మోహన్ గారూ... మీరు  ఈ డిపార్ట్ మెంట్ లో చేరారు కాని, డాక్టర్ అయ్యింటేనా - మీ హాస్యంతో రోగులకి సగం జబ్బు తగ్గించేసేవారు" అన్నాడు.


    రోగుల మీద నా హాస్యం ప్రయోగించే అవకాశం, అవసరం రాలేదు కాని..., ఆఫీసులో నా క్రింది వాళ్లచేత పనిచేయించడానికి అది గొప్ప 'కిక్' ఇచ్చేది.


    మాది పోస్టల్ డిపార్ట్ మెంట్ .మిగతా డిపార్టుమెంట్స్ కి ఆరున్నర గంటలు పని అయితే మాకు ఎనిమిది గంటలు. పేరుకి ఎనిమిది గంటలు అయినా ఇంకా ఎక్కువగా పనిచేయాల్సి వచ్చేది. బండ పని కావడంతో చాలా విసుగు అనిపించేది. అందువల్ల మధ్యలో హాస్యాన్ని సాండ్ విచ్ చేస్తుంటే అంత బండ పనీ..... పిండి అయిపోయేది. అన్ని గంటలూ ఇట్టే గడిచిపోయేవి. జోక్స్ ని అసంధర్బంగావదలకుండా,  సందర్భోచితంగా అప్పటికప్పుడు సృష్టించేవాడిని.

 
     ఒకసారి పక్క సెక్షన్ లోకి ఒక సాయిబుగారు  కొత్తగా వచ్చి చేరాడు.  ఆయన ఆకారాన్ని ఈ విధంగా వర్ణించాను -

 Previous Page Next Page