Read more!
 Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 3


    'ఆ పాప బాగుంది కదూ! చిన్న పాప! ముద్దొస్తోంది' అంది శిల్పకి ఆపాపని చూపిస్తు ఫెర్నాండిస్. "ఊ" అంది తనివితీరా వాళ్ళని చూస్తూ ఊహలలో తేలిపోతున్న శిల్ప.
    భార్యాభర్తలిరువురూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే పాప కొంచెం వంగినట్టనిపించింది. 'అయ్యో పాప' అంది. అంతలోనే తల్లి పాపని గట్టిగా గుండెలకి అదుముకోవడం చూసి తృప్తిగా నిట్టూర్చింది. ఈ రెండు అప్రయత్నంగానే జరిగాయి. శిల్ప నోట్లోంచి ముత్యాలు రాలినట్టు వచ్చిన ఆ నాలుగు మాటలు సిస్సర్ ఫెర్నాండిస్ ని ఎంతగానో తృప్తిపరిచాయి. ఆ ముందు పడవ వెళ్ళినంత దూరమూ తను పడవనీ పొమ్మంది ఆమె. శిల్ప మొహంలో తృప్తీ, సంతోషం చూసి ఆమె పొంగిపోయింది.
    ఆ రోజు రాత్రి అనేక పుస్తకాలు చదివింది. ఒక నిర్ణయానికొచ్చింది. రోజూ వీలున్నప్పుడల్లా తీసుకెళ్ళేది శిల్పని. అన్నింటికన్నా శిల్ప దృష్టి పిల్లలున్న తల్లులమీదే పడడం, ఆ తల్లీబిడ్డలని శిల్ప పరికించి చూసి, తృప్తి పడడం గమనించి, అలాంటి చోటికే తీసుకెళ్ళేది. వాళ్లని చూసినప్పుడల్లా, శిల్ప పొందే ఆనందాన్ని చూసి బహుశా శిల్ప అటువంటి తృప్తిని కోరుకుంటోందేమోనని అనుమానపడింది. క్రమేణా పిల్లల గురించి కబుర్లూ, వాళ్ళ బొమ్మలు చూపించి కథలు చెప్పడం మొదలెట్టింది ఆమె. శిల్పలో చైతన్యం కలగడం గమనించి తృప్తిగా నిట్టూర్చింది.
    ఊటీ బడికి చలికాలంలో సెలవులిస్తారు. ఎందుకంటే మంచుపడుతూ వుంటుంది, ఆ కాలం అప్పుడు పిల్లలు ఆ చలికి తట్టుకుని చదువుకోలేరు కనుక.
    రాగిణి శిల్పని తీసుకెళ్లడానికొస్తే, కొన్ని విషయాలు ఆమెతో మాట్లాడాలనుకొంది సిస్టర్ ఫెర్నాండిస్. రమ్మని రాసింది. కానీ, 'తనకి కొన్ని ముఖ్యమైన నృత్య కార్యక్రమాలుండడం వల్ల తాను రాలేకపోతున్నాననీ, ఏ ఫ్లయిట్ లో పంపిస్తున్నారో చెబితే, ఎయిర్ పోర్టుకెళ్ళి రిసీవ్ చేసుకుంటాననీ ఉత్తరం రాసింగి రాగిణి.
    ఉత్తరం చదివి నిట్టూర్చింది సిస్టర్ ఫెర్నాండిస్. తన అభిప్రాయాలన్నీ ఉత్తరంలో రాసి రాగిణికి పోస్టు చేసింది! వీలైనంత టైము శిల్పతో గడపమని ఆ ఉత్తరంలోని సారాంశం.
    ఏర్ పోర్ట్ లో రాగిణిని చూడగానే శిల్ప కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన మౌనాన్ని బద్దలుకొట్టి తల్లిఒడిలో పడుకుని గట్టిగా అరుస్తూ కేరింతలు కొడుతూ ఆమెతో ఆడుకోవాలనుకుంది. గబగబా పరుగెత్తుకొచ్చి రాగిణిని చుట్టేసింది. 'అమ్మా...... అమ్మా......' అని అరవాలనుకుంది. అంతలోనే రాగిణి చెల్లెలు భరణి 'శిల్పూ...... దా......' అంటూ ఎత్తుకుంది. రాగిణి ఏర్ పోర్ట్ లో ఎదురయిన ఎవరితోనో మాట్లాడుతోంది. దాదాపు పదిహేను, ఇరవై నిమిషాలవరకూ వారి మాటలు తెగలేదు. రాగిణి ప్రోగ్రాం పెట్టించాలని వాళ్లూ వివరాలడుగుతున్నారు.
    'భరణీ...... ఈ లోగా నువ్వెళ్ళి లగేజ్ తీసుకో శిల్పూ...... నువ్వు అక్కతో వెళ్ళి సామాన్లు తీసుకోమ్మా..... నే వచ్చేస్తున్నాను' అంది శిల్పకేసి చూసి. శిల్ప ఉత్సాహమంతా నీరుకారిపోయింది. మౌనంగా భరణి చెయ్యిపట్టుకొని లగేజి దగ్గరకెళ్లింది. అక్కడొక పావుగంట పట్టింది సామాన్లు తెచ్చుకోడానికి. సామాన్లు తీసుకొని కారు దగ్గరికి నడిచారు. అప్పటికి రాగిణి కారు దగ్గరకొచ్చింది. శిల్ప దగ్గర కూర్చుంటూ "శిల్పూ...... మీ స్కూలు బాగుందా?" లాలనగా అడిగింది రాగిణి. "ఊ....." అంది మెల్లగా తలూపుతూ. "ఇంకా ఈ తలూపడమే తప్ప మాట్లాడడం నేర్చుకోలేదన్నమాట." అంది రాగిణి.
    శిల్ప మనస్సు చివుక్కుమంది. అయినా వారందరినీ చూసిన తన్మయత్వంలో, ఆమె మాటలు బాధనిపించలేదు. "అక్క నీకోసం మంచి మంచి గౌనులు కుట్టించింది. బొమ్మలు కొంది.".... చెప్పుకుపోతోంది భరణి. శిల్ప మనసు ఆ మాటలు వినడంలేదు. కారు ఇంటిముందు ఆగింది. రాగిణి తల్లి సరోజిని కారుదగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చింది. "అదుగో అమ్మ...... నీకోసం కారు దగ్గరికి వచ్చింది." అంది భరణి. శిల్ప కారు దిగి ఆమె దగ్గరికి పరుగెత్తింది. ఆమె శిల్పని ఎత్తుకుని రెండు బుగ్గలూ పట్టుకుని గట్టిగా ముద్దెట్టుకుంది. "శిల్పూ..... శిల్పూ" అంటూ రాగిణి ఆ రోజంతా శిల్పని వదల్లేదు. శిల్పకెంతో సంతోషంగా వుంది. కొత్తగౌనులు ఎంతో బాగున్నాయి. బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. అక్కకూడా తనకి అన్నం తినిపించి, తనతో ఆడుకుంటూ తనతోపాటే ఎక్కడికీ వెళ్ళకుండా వుంది. "అక్కా..... రాత్రి నీ దగ్గరే పడుకుంటాను. అమ్మ దగ్గర పడుకోను." అంది."అలాగే" అంది నవ్వుతూ శిల్ప బుగ్గలు నిమురుతూ రాగిణి. శిల్ప ఆ మాత్రం మాట్లాడిందంటే ఎంతో సంతోషంగా వుంది తనకి.
    భోజనాలయ్యాక శిల్ప గబగబా వచ్చి రాగిణి మంచంమీద పడుకుంది. "నీకు అమ్మొద్దా, అక్క దగ్గరికి వెళ్ళిపోయావ్" అడిగింది సరోజిని. నవ్వీ నవ్వనట్టు నవ్వి ఊరుకుంది శిల్ప. "అమ్మకి గుడ్ నైట్ చెప్పవూ?" అంది రాగిణి. "గుడ్ నైట్" అంటూ వెంటనే అటుకేసి తిరిగి పడుకుంది శిల్ప. సరోజిని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. రాగిణిని గట్టిగా కౌగిలించుకుని పడుకుంది శిల్ప. ఆ ఆలింగనంలో ఏదో సుఖం, ఏదో తృప్తి, అనిర్వచనీయమైన అనుభూతి - ఇదేనేమో మాతృత్వంలోని తీయదనం! అనుకుంటూ నిద్రలోకి జారుకుంది రాగిణి.
    ఉదయం బాగా పొద్దెక్కేవరకు మెలుకువరాలేదు. కళ్ళు తెరిచేసరికి శిల్ప కాళ్ళు తన పొట్టమీద వేసి హాయిగా పడుకునుంది. "పిచ్చిపిల్ల" అనుకుంటూ మెల్లగా కాళ్లను తీసి పక్కకు పెట్టింది. శిల్ప ఒక్క నిముషం నిద్ర డిస్టర్బ్ అయినట్లు లేచి చూసి, మళ్ళీ వెంటనే కళ్లు మూసుకుని పడుకుంది. వెంటనే లేస్తే ఎక్కడ లేచిపోతుందోనన్న భయంతో మరో ఐదు నిముషాలు అలాగే మంచిమీద పడుకుంది రాగిణి, మెల్లగా శిల్ప తలపైన జోకొడుతూ.
    కాఫీ కప్పుతో లోపలికొచ్చిన సరోజినీ ఆ దృశ్యాన్ని చూసి నవ్వుకుంది. "రక్త సంబంధం మాగ్ నెట్ లాగా దానికదే ఆకర్షింపబడి తెలుసుకుంటుందేమో, లేకపోతే ఈ పిల్ల వచ్చినప్పటినుంచీ ఒక్క క్షణమైనా వదలకుండా రాగిణి చుట్టూ తిరుగుతోంది." అనుకుంది.
    రామానుజం స్నానంచేసి వస్తూ, భార్య అలా కాఫీ గ్లాసుతో ఆగిపోవడం చూసి, ఆయనా ఆగారు "ఏమిటలా చూస్తున్నావ్?" అంటూ. సరోజిని మాట్లాడకుండా సైగచేస్తూ చూపించింది, రాగిణి శిల్పలను చూడమని.
    అటు చూసిన రామానుజం నిట్టూర్చారు. అది చూసిన సరోజినీ లోపలికి వెళ్ళిపోయింది.
    శిల్పని జోకొడుతూ, మళ్ళీ నిద్రలోకి జారుకున్న రాగిణి, భరణి రాకతో కళ్ళు తెరిచింది. అప్పటికే భళ్ళున తెల్లవారిపోయి, ఎండ వేగంగా కిటికీలోంచి గదిలోకి పడుతోంది చుర్రుమంటూ. "అక్కా నీకు కల్చరల్ సెంటర్ సెక్రటరీనుంచి రెండుసార్లు ఫోనొచ్చింది. పడుకున్నావని చెప్పాను."
    "లేపకపోయావా?" కంగారుగా లేస్తూ అంది రాగిణి. "మళ్ళీ చేస్తానన్నాడు. ఒక అరగంట ఆగి. శిల్పూ నిద్రలేవలేదా?" అంటూ శిల్ప దగ్గరకెళ్ళింది భరణి.
    అప్పుడే కళ్ళు తెరిచింది శిల్ప. భరణి ఆమె బుగ్గలని గట్టిగా గిచ్చుతూ "ఊటీకెళ్ళాక శిల్ప ఇంకా తెల్లబడింది కదే అక్కా" అంది భరణి.
    "ఊ..... కల్చరల్ సెంటర్ సెక్రటరీ పేరేమిటి?"
    "నేనడగలేదు." శిల్ప బుగ్గలు గట్టిగా నొక్కుతూ అంది భరణి.
    "అబ్బా!" అంది బాధగా శిల్ప, ఇంచుమించు అరిచినట్టుగా "ఏమిటే గోల!" విసుక్కుంది రాగిణి.
    ఆమె అలా విసుక్కోవడం కొత్త కాకపోయినా ఎందుకనో శిల్పకి బాధనిపించింది.
    రాగిణి గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయింది, టవల్ తీసుకుని పళ్ళు తోముకోవడానికి.

 Previous Page Next Page