Read more!
 Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 3

    "అలాగే సార్!" అన్నాను.

    అయిదున్నర  గంటల ప్రాంతంలో  డాక్టర్ గారు పిలుస్తున్నారని ముందుగా నాకు కబురొచ్చింది వెళ్ళాను.

    "రా అమ్మా కూర్చో" అన్నారు.

    "ఫరవాలేదు సార్" అన్నాను కూర్చోలేదు.

    "శ్రీశ్రీగారికి కడుపు  పొంగిన విషయం మీకు  తెలుసుగా?" అన్నారు.

    "తెలుసు" అన్నాను.

    "కారణం తెలుసా?" అన్నారు.

    "మాకెలా  తెలుస్తుంది సార్?" అన్నాను.

    ఆయనకెవరో  నాటుమందు వాడారమ్మా" అన్నారు.

    నేను బిక్కచచ్చిపోయాను  నా పరిస్థితి గమనించి "ఎందుకలా  భయపడతావమ్మాయి" అని అడిగారు.

    "కాదు సార్! నేనే శ్రీశ్రీగారి దగ్గర పనికొచ్చి  రెండేళ్ళు  కావస్తోంది. నా ఇంటి గృహప్రవేశంనాడు  తప్పితే  అసలు మా ఇంట్లో  ఆయన భోజనం చెయ్యలేదు" అన్నాను.

    "ఇలాంటి  ప్రయోగాలకి  భోజనం చెయ్యాల్సిన  అవసరం లేదమ్మా" అన్నారు.

    "నన్ను మీరు అనుమానిస్తున్నారా?" అని అడిగాను.

    "నా డ్యూటీ నేను చేస్తున్నాను, జరిగిపోయినదానికి ఎవర్ని  అనుమానించి ఏం లాభం? ఇప్పుడు  శ్రీశ్రీగారి ఆరోగ్యం  గురించి భయపడాల్సింది  లేదు. నువ్వు వెళ్ళమ్మా" అన్నారు.

    ఆ గదిలోంచి  బైటకెలాగొచ్చానో  నాకే తెలీదు.

    డాక్టర్ మాటాడినదానికి  నా ముఖాన  నెత్తురు చుక్కలేదు. 'ఇదేం గొడవరా దేవుడా' అనుకున్నాను. అవమానంతో  శరీరం  దహించుకుపోతోంది.

    డాక్టరుగారి గదిలో  నుండి  ఏడుపులూ, అరుపులూ వినిపిస్తున్నాయి.

    డాక్టరుగారి  మందలింపులతో పాటూ, మధ్యలో  రెండు మూడు గొంతులు కూడా  వినిపిస్తున్నాయి.

    శ్రీశ్రీగారికి  మెళకువ  వచ్చేసినట్టుంది. 'సరోజా' అని రెండు మూడుసార్లు  పిలిచారు, వెళ్ళాను.

    "అలాగున్నావేమిటీ?" అని అడిగారు.

    "ఏమీలేదు" అన్నాను.

    "డాక్టర్ గారేమైనా  అడిగారా?" అన్నారు.

    ఆశ్చర్యంతో  "మీకు తెలుసా?" అన్నాను.

    "నాకేం తెలీదుకానీ, లోపల  ఆ అరుపులూ, ఏడుపులూ  ఏమిటి?" అని అడిగారు.

    నేను జరిగిందంతా  చెప్పి, "ఇప్పుడు  మీ ఆవిడతోపాటూ  మరో ముగ్గురు కూడా  లోపల  డాక్టర్ గారి దగ్గర వున్నార"ని చెప్పాను.

    "ఇప్పుడీ  గొడవంతా  ఎందుకు సరోజా!" అన్నారు.

    "అదేమిటి? నన్నంటారేమిటి? మీరడిగారు  గనుక  డాక్టర్ గారు చెప్పిన మాట మీతో చెప్పాను. ఆయన అడిగిన మాటకి ఆత్మహత్య  చేసుకోవాలనిపిస్తోంది" అంటూ వస్తున్న  ఏడుపు  ఆపుకొంటూ  బయటకివచ్చి, వరండాలో కూర్చున్నాను.

    అరగంట తర్వాత  డాక్టర్ గారి  గదిలో  నుండి అందరూ బయటికి వచ్చేశారు.

    మనసు పరిపరివిధాల  పోతోంది. ఇక ఇంటికిపోతే  మంచిదనుకొని, శ్రీశ్రీగారితో  చెప్పి వెళదామని  ఆయన గదిలోకి  వెళ్ళాను.

    ఆవిడ  ఆయన పక్కనే  కూర్చున్నారు.

    "నేను వెళ్ళొస్తానండీ" అని శ్రీశ్రీ గారితో  చెప్పాను.

    'ఇలా రా' అని  చేత్తో  సౌంజ్ఞ చేశారు.

    ఆవిడ  లేవబోయారు. శ్రీశ్రీ గారావిడవైపు  కన్నెర్రచేసి  చూశారు.

    తరువాత  నా వైపు  తిరిగి, "జరిగిందేదో  జరిగిపోయింది. నాకేం ఫరవాలేదు. నేను బాగానేవున్నాను. నువ్వు హాయిగా  ఇంటికివెళ్ళి  రేపు ఉదయం  ఎనిమిది గంటలకి  రా. కారు పంపుతాను" అన్నారు.

    ఆవిడ మాట్లాడబోయి  ఊరుకున్నారు. ఆవిడ  మౌనానికి  నాకాశ్చర్యం వేసింది.

    నేను బయలుదేరి  వచ్చేశాను. ఆలోచనలతో  ఆ రాత్రంతా నిద్రలేదు.


                                 *         *         *          *


    మరుసటిరోజు  వెళ్ళేసరికి  శ్రీశ్రీగారు దిండుకి  ఆనుకొని  కూర్చున్నారు.

    ఆరోగ్యం  గురించి  ప్రశ్నించాక, బాగానే వుందన్నారు.

    "నీ ముఖం ఏమిటలా  తయారయ్యింది. రాత్రి నిద్ర పోలేదా? డాక్టర్ నీతో మాట్లాడింది మొదలు నీలో మార్పు వచ్చింది. ఎందుకు అనవసరంగా మనసు పాడుచేసుకుంటావు? నేను హాయిగానే వున్నాను. అన్నీ మర్చిపో. అసలే అది నీ మీద మండిపడుతోంది. ఏదికానీ  నలభై ఏళ్ళ నుండి పడుతున్న వ్యాధి బాధనుండి  బయటపడ్డాను. అదిచాలు. ఈ విషయం  సాగదీసి గొడవచేస్తే  ఎంతమాత్రం  మంచిదికాదు. తర్వాత  నీ ఇష్టం...." అంటూ, "నాక్కొంచెం  కాఫీ  తెప్పించు" అన్నారు.

    "కాఫీ  ఎందుకండీ. హార్లిక్స్ బలంకదా?" అన్నాను.

    "వెధవ హార్లిక్స్, బోర్ కొడుతోంది" అన్నారాయన.

    "అయితే  ఓవల్టిన్  కొననా?" అని అడిగాను.

    "డబ్బులేవీ?" అన్నారు.

    "అదేమిటి? ఆరువేలున్నాయిగా?" అన్నాను.

    "దాని దగ్గరున్నాయి" అన్నారు.

    "అడిగితే  ఇవ్వరా?" అని అడిగాను.

    "అడిగి చూడు" అన్నారు.

    ఇంతలో  ఆవిడ కార్లో దిగారు.

    "ఏవండీ! వారికి హార్లిక్స్  తాగి మొహం  మొత్తిందట. ఓవల్టీన్  కొంటే  బావుంటుందేమో" అన్నాను.

 Previous Page Next Page