Read more!
 Previous Page Next Page 
చక్రవ్యూహం పేజి 3

    "ఇందులో వుండే థ్రిల్ నీకేం తెలుసక్కా ?   ఎంత సస్పెన్స్,  మరెంత థ్రిల్.  డిటెక్టివ్ ఇందులో మస్త్ షార్ప్ తెలుసా? నాకు డిటెక్టివ్ అవ్వాలని వుందక్కా!" అన్నాడు.
    చాల్చాల్లేగాని...ఇలాంటి పిచ్చి పుస్తకాలు చదవడం మానేయ్..." మందలిస్తున్నట్టుగా  అంది అవని.
    "ఇవి పిచ్చి పుస్తకాలా?  ఎంత కష్టపడితే ఇలాంటి నవలలు రాయగలరో తెలుసా?  ఒక్కసారి నువ్వు చదివి చూడక్కా!"
    తమ్ముడితో వాదించి లాభం లేదనుకుంది.  ఆ గది వాళ్ళిద్దరి  కోసమే.    రెండు సింగిల్      కాట్ లు,  టేబుల్,  రెండు చెయిర్లు..టేబుల్ ల్యాంప్.
    ఓ పక్క షెల్ప్ లో   డుంబు పుస్తకాలు.
    కళ్ళు బరువెక్కినట్టు అనిపించాయి అవనికి.  నిద్ర ముంచుకు వస్తుందేమోననిపించింది.  మరో అరగంట తర్వాత తల్లి భోజనాలకు పిలిచింది.
    అవనికి తినాలని లేదు.  కానీ రాత్రిపూట డిన్నర్  అందరూ కలిసే తీసుకోవడం అలవాటు.  అందుకే బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరకి నడిచింది.
    డుంబు డిటెక్టివ్ పుస్తకాన్ని తన మంచం మీద వున్న పరుపు కింద దాచి లేచాడు.
    "డల్ గా  వున్నావేంటమ్మా ?"అడిగాడు భోజనాలప్పుడు తండ్రి.
    "మరేం లేదు.  కాస్త హెడ్దేక్ గా వుంది."
    డిన్నర్ పూర్తయ్యేసరికి  రాత్రి పది అయింది.  నిద్ర ముంచుకొస్తోంది.
    తన గదిలోకి వెళ్తుండగా ఫోన్ మోగింది.  ఇంత రాత్రివేళ తనకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరై వుంటారా?  అని ఆలోచిస్తూనే ఫోన్ దగ్గరకెళ్ళి రిసీవర్ ఎత్తి "హలో"  అంది.
    తెరలు తెరలుగా నవ్వు. ఉలిక్కిపడింది అవని.  అప్పటివరకూ మరిచిపోయిన మధ్యాహ్నం సంఘటన మళ్ళీగుర్తొచ్చింది.
    "హ..లో..  ఏం..టి.. హత్య చేస్తానని చెప్పినా భయం వేయడం లేదా.   ఓ..కే.. ఓ..కే..విష్ యు ఆల్ ద బ్యాడ్ లక్...నువ్వు ఫినిష్..ఏ అర్ధరాత్రో  చచ్చిపోతావు. గుడ్ నైట్.. కాదు కాదు.. బ్యాడ్ నైట్.."  ఫోన్ పెట్టేసిన శబ్దం.
    అంత చలిలోనూ అవని మొహమంతా స్వేదం. అవని రిసీవర్ ఎత్తడం భయంగా ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు వినడం గమనించింది డుంబు మాత్రమే.
    "ఏమైందక్కా?"   అవని ఫోన్  పెట్టేస్తుండగా ఆమె చేతులు వణుకుతూ వుండడం గమనించి అడిగాడు డుంబు.
    "ఏం...ఏం లేదు"  అంది తడబాటును కప్పి పుచ్చుకుంటూ అవని.
    "ఫోన్ లో ఎవరైనా బెదిరించారా?" డుంబు అడిగేసరికి ఉలిక్కిపడి తమ్ముడి మొహంలోకి చూసింది.
    తనని ఫోన్ లో బెదిరించిన విషయం తమ్ముడికి ఎలా తెలుసు?
    "అదేంటక్కా.. అలా చూస్తావు?  అచ్చు 'చస్తావు జాగ్రత్త'  నవల్లో హీరోయిన్లా?"  అన్నాడు డుంబు.
    వెంటనే తేరుకుని "అదేం లేదుగానీ... అదేంట్రా అలా అనేశావు?" అంది అవని.
    "చస్తావు జాగ్రత్తలో హీరోయిన్ ని విన్ ఇలానే బెదిరిస్తాడు.  అప్పుడు డిటెక్టివ్ వచ్చిహీరోయిన్ని కాపాడతాడు.  నువ్వు కూడా ఆ నవల్లో హీరోయిన్ లా  ఫోన్ పెట్టేసి వణికిపోతుంటే డౌటొచ్చి  అడిగాన్లే!"  అన్నాడు తాపీగా.
    తేలిగ్గా  ఊపిరి పీల్చుకుంది వాడిది డిటెక్టివ్ నవలల పిచ్చే అని అర్ధమయ్యాక. కానీ,ఇంకా వణుకు తగ్గడంలేదు.  తననెందుకిలా ఫోన్ లో బెదిరిస్తున్నాడు.
    తలంతా వేడెక్కినట్టయింది.
    తన గదిలోకి వెళ్ళింది. డుంబు ఏదో డిటెక్టివ్ నవల చదువుకుంటున్నాడు.
    తండ్రి ఎన్నిసార్లు మందలించినా వినడు.  టెక్ట్స్ బుక్స్ మధ్య పెట్టుకొని చదువుకుంటాడు.  వాడ్ని మార్చటం ఎవరివల్లా కాదని అర్ధమైంది.
    అవనికి నిద్ర రావడంలేదు.
    ఉదయం ఆఫీసుకు ఫోన్ చేసి బెదిరించారు. రాత్రి ఇంటికి ఫోన్ చేసి బెదిరించారు.
    ఈ విషయం అనిరుద్రకు చెప్పాలా? వద్దా? అన్న ఆలోచనలో పడింది.
    ఈ సంవత్సరమే  పెళ్ళి చేసుకుంటానన్నాడు.  రెండేళ్ళుగా తామిద్దరూ ప్రేమించుకుంటున్నా, ఎప్పడూ అడ్వాన్సవ్వలేదు.  తన సాన్నిహిత్యాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోలేదు.
    అనిరుద్ర గుర్తుకు రాగానే అవని పెదవుల  మీద చిర్నవ్వు వచ్చి చేరింది.
    తన బర్త్ డే  రోజు మాత్రం "నేను నిన్నుస్పర్శించొచ్చా?"  అని అడిగాడు.
    తనకా పదానికి అర్ధం తెలియలేదు.
    "స్పర్శించడమేంటి?"  అని తను అమాయకంగా అడిగింది.
    "నువ్వు   స్పర్శించొచ్చు అంటేనే చెప్తాను. కాదు కాదు నీకే తెలుస్తుంది" అన్నాడు.
    "హమ్మో..నువ్వేదో మాస్టర్ ప్లాన్ లో  వున్నట్లున్నావు.  పెళ్ళయ్యేవరకూ  తొందరపడ్డం నాకిష్టంలేదు"  అంది అవని.
    "ఇది తొందరపడ్డం కాదు.  తప్పనిసరిగా చెయ్యాల్సిన పని"  అన్నాడు అనిరుద్ర.
    "అంటే ఏం చేస్తావు?"
    "స్పర్శిస్తా!"
    "అబ్బ..ఆ స్పర్శించడానికి అర్ధం చెప్పు.  నీలా నేనూ తెలుగులో బ్రైట్ కాదులే" అంది అవని.
    "నీ శీలానికి  ఏం కాకుండా స్పర్శిస్తా సరేనా?"
    "అంటే...నా బట్టలు రిమూవ్ చేయవుగా..." మొహమంతా ఎర్రగా కందిపోతుండగా  అంది.
    పెద్దగా నవ్వి "చేయను"అన్నాడు.
    "అయితే సరే"  అంది.
    "అయితే కళ్ళు మూసుకో"  అన్నాడు అనిరుద్ర.
    "అదిగో...నేను కళ్ళు మూసుకుంటే నువ్వేం చేసేది నాకెలా తెలుస్తుంది?"
    "తెలిస్తే నువ్వేం చేయనియ్యవు.   రెండేళ్ళు కనీసం నీ భుజం చుట్టూ, సినిమాథియేటర్ లో లైట్సాఫ్  అయ్యాక కూడా చెయ్యి వేయనివ్వలేదు"   వళ్ళుమండి  అన్నాడు అనిరుద్ర.
    "సరే...అయితే ఓ కండిషన్...ఓ కన్ను తెరిచి వుంచుతా..."
    "నీ ఇష్టం..."  అయిష్టంగానే ఒప్పుకున్నాడు.
    ఓ కన్ను మూసి,  ఓ కన్ను తెరిచి చూస్తోంది.
    అనిరుద్ర ఆమె మొహం మీదికి వంగాడు.
    అవని పెదాలు వణుకుతున్నాయి.
    అవని పెదాల దగ్గరా తన పెదాలు చేర్చబోయాడు అనిరుద్ర.
    వెంటనే చేయి అడ్డం పెట్టింది అతని పెదాలు తన పెదాలకు  'టచ్'  కాకుండా.
    కోపంగా చూశాడు అనిరుద్ర.
    "పెదాలు ఎంగిలి చేస్తావా?"  అడిగింది అవని.
    "ఊహూ...సబ్బు పెట్టి తెల్లగా తోమి వాషింగ్ పౌడర్ తో  ఉతుకుతా"కచ్చగా అన్నాడు అనిరుద్ర.
    "కోపమా?"  అంది చేయి అడ్డు తీస్తూ.
    "లేకపోతే...ప్రేమికులంతా చెట్టాపట్టాలేసుకుని బైక్ మీద అటో కాలు, ఇటో కాలు వేసుకుని తిరుగుతుంటే,నువ్వు మాత్రం ఎట్ లీస్ట్  నాలుగైదు అడుగులైనా మెయింటైన్ చేయాలంటావు... భుజం మీద చేయి వేయనీయవు..పెళ్ళయ్యాక  కూడా...ఏమో.. నాకు డౌటే..."
    అవనికి నవ్వొచ్చింది.  అనిరుద్ర మొహంలోకి  చూశాక జాలేసింది.
    నిజమే..తను అనిరుధ్రని  దూరంగా వుంచుతూ వస్తోంది.
    దానిక్కారణం తను ఆడపిల్ల.
    సంప్రదాయం...పద్ధతీ..అంటూ బ్రతుకు వెళ్ళదీసే కుటుంబం.
    పెళ్ళి కాకుండా తనకు ఏమైనా  అయితే?  అనిరుద్ర మంచివాడే...పాతకేళ్ళుదాటినా,  తమ పరిచయం అయి రెండెళ్ళే  అయినా సిన్సియర్ గా  తన కోసమే పెళ్ళి చేసుకోకుండా ఆగాడు.  అతని మీద జాలి,  ప్రేమగా మారి,  రెండు కళ్ళు మూసుకుని  'సరే' అంది.
    అతను ముద్దు పెట్టుకోవడం అయిపోయాక కళ్ళు తెరిచి అడిగింది 'స్పర్శంచడం'  అంటే ఇదేనా?" అని.
    "ఊహూ ...దీన్ని 'చుంబన స్పర్శ' అంటారు.  ఇంకా చాలా స్పర్శలున్నాయి.  మరి కొన్నింటిని టచ్ చేయనా?"   ఉత్సాహంగా అడిగాడు  అనిరుద్ర.
    "వద్దు..పెళ్ళయ్యాకే అవన్ని..."అంది అవని.
    ఆమెకూ ఈ అనుభవం బాగానే వుంది.
    అనిరుద్రకు సిగరెట్,  పాన్  లాంటి అలవాట్లు లేవు...కనీసం అకేషనల్ గా  కూడా మందు పుచ్చుకోడు.
    అతని పెదాలు ఎర్రగా,  లేతగా వుంటాయి అమ్మయి పెదవుల్లా.
    అతను తన పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ వుంటే ఆమెలో చిన్న కంపన.     
                    *            *            *
    ట్రింగ్..ట్రింగ్..
    ఉల్కిపడి కళ్ళు తెరిచింది అవని.  గోడ గడియారం వంక చూసింది. పన్నెండు గంటలను  సూచిస్తోంది గడియారం.  హాలులో వున్న ఫోన్ అదేపనిగా మ్రోగుతుంది.
    భయంతో వణికిపోయింది  అవని.
    మళ్ళీ ఫోన్...అదీ..ఇంత అర్ధరాత్రి వేళ.  వెళ్ళాలా? వద్దా?...
    తను ఫోన్ తీయకపోతే...నాన్నొచ్చి ఫోన్ తీస్తాడు...నాన్నాని బెదిరిస్తే...
    వెంటనే లేచి హాలులోకి వెళ్ళింది.  రిసీవర్ ఎత్తింది.
    ఆమె గుండె చప్పుడు సృష్టంగా వినిపిస్తోంది.
    "హ..లో.."  అంది లోగొంతుకతో.
    "డీలక్స్ రూమ్ కావాలి.  రేపటికి బుక్ చేయగలరా?  పాజిబులిటీ వుందా?"
    అటువైపు నుంచి ఓ మగగోంతు.
    తేలిగ్గా నిట్టూర్చి...
    "మీకే నెంబర్  కావాలి?"   అడిగింది ధైర్యం కూడదీసుకొని.
    "ఇది హొటల్ మనోరమ కాదా?"
    "రాంగ్ నెంబర్"  అని ఫోన్ పెట్టేసింది.
    మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ తన గదిలోకి వస్తుంటే మళ్ళీ ఫోన్ మోగింది.  భయంతో బిగుసుకుపోయింది.
    "అర్దరాత్రి ఫోనేమిటమ్మా?"  అంటూ తండ్రి గొంతు వినిపించింది.
    "రాంగ్ నెంబర్ నాన్నా.."  అంటూ ఫోన్ దగ్గరకు పరుగెత్తుకు వెళ్ళి ఫోన్ లిప్ట్ చేసి,  వెంటనే పక్కకు పెట్టేసింది.
    ఏం మాటలు వినాల్సివస్తుందోనన్న భయంతో,  తర్వాత తన గదిలోకి నడిచింది.
    తెల్లారేవరకూ తనకు ఫోన్ రాదు.  తెల్లారాక ముందు రిసీవర్ క్రెడిల్ చేస్తేసరి...అనుకుంది.
    గదిలో డుంబు డిటెక్టివ్ నవల దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నాడు.
    టేబుల్లైట్ ఆఫ్ చేసి,  బెడ్ లైట్ వేసి మంచం మీద నడుం వాల్చింది.
    రేప్పొద్దున్నే ఫోన్ లో   తనను ఎవరో ఆగంతకుడు బెదిరించిన విషయం అనిరుధ్రకు చెప్పాలని నిశ్చయించుకుంది.
                 *           *          *
    "అదేంటి.. రాత్రి ఫోన్ పక్కన పెట్టేసింది అవని"  తండ్రి గొంతు విని దిగ్గున లేచింది  అవని.
    పొద్దున్నే లేచి రిసీవర్ క్రేడిల్ చేద్దామనుకుంది. టైం చ్వ్హూసింది,  ఆరున్నర.
    "మైగాడ్... అప్పడే తెల్లారిపోయిందా?"  పరుగెత్తుకెళ్ళింది హాలులోకి.
    అప్పటికే  తండ్రి రిసీవర్ సరిగ్గా పెట్టి అవనివైపు చూస్తూ...  "రాత్రి నిద్రమత్తులో ఫోన్ పక్కన పెట్టేసినట్టున్నావమ్మా!" అన్నాడు.
    "అవునవును నాన్నా"   అంది ఏమనాలో తోచక.
    సూర్యనారాయణ స్నానం చేయటానికి బాత్రూం వైపు వెళ్తూంటే  ఫోన్  మోగింది.
    "మనక్కూడా ఫోన్లు వస్తున్నట్టున్నాయమ్మ...ఇంత  పొద్దున్నే మనకు ఫోన్  చేసేవారెవరూ?"   అన్నాడు బాత్రూం లోకి   వెళ్తూ సూర్యనారాయణ.
    " నేను  చూస్తాన్లే...నువ్వెళ్ళు నాన్నా" అంటూ రిసీవర్ ఎత్తింది.
    అదే గొంతు...అదే నవ్వు..
    "ఫోన్ ప్రక్కన పెట్టేసావా పాపా...ఫోన్ పెట్టేస్తే నేను ఫోన్ చేయలేననిధైర్యమా?  తప్పు కదూ!  మరి ఆ తప్పుకు పనిష్మెంట్ వుండాలిగా...  అందుకే చిన్న యాక్సిడెంట్...నీ ముద్దుల ప్రియుడికి... అదే అనిరుద్రకు... ఆ విషయం నాకు తెలియజేసినా,  నువ్వు రిసీవ్ చేసుకోవడానికి వీల్లేదు.  ఎందుకంటే నువ్వి ఫోన్ పెట్టేసావుగా... ఇంకెప్పడూ అతి తెలివి ప్రదర్శిచకు...అర్ధమైంది.  పాపా...బై..."
     ఫోన్ కట్ అయింది.
    మొహమంతా చెమట్ల పట్టేశాయి.
    అనిరుధ్రకు ఏమైంది?
    ఆలోచిస్తూ వుండగానేమళ్ళీ ఫోన్ మోగింది.
    ఫోన్ రిసీవ్ చేసుకోవాలా?  వద్దా?  అనే సందిగ్ధంలో వుండగానే ఫోన్ అదే పనిగా మోగుతూ వుండిపోయింది...
    రిసీవర్  ఎత్తింది.
    "హలో ..  అవనిగారేనా?  జార్జి హాస్పిటల్  నుంచి మాట్లాడుతున్నామండీ....నిన్న అర్దరాత్రి అనిరుద్ర అనే  అతడ్ని అడ్మిట్  చేసుకున్నాం. చిన్న యాక్సిడెంట్ కేసు... అతనికి   స్పృహ వచ్చాక,   మీ ఫోన్ నెంబర్ ఇచ్చి,  మీకు ఇంటిమేట్ చేయమన్నాడు.  కంగారు పడవద్ధన్నాడు.  థాంక్యూ మేడమ్...వుంటాను మేడమ్."
    ఫోన్ పెట్టేశారు అవతలి వైపు.  అవని చేయి రిసీవర్ మీద బిగుసుకుంది.
                *           *             *
    కైనెటిక్ హొండా  జార్జి హాస్పిటల్ ముందు పార్క్ చేసి,  పరుగెత్తినంత వేగంగా రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది.
    "ఎక్స్ క్యూజ్ మీ.. అనిరుద్ర అని .. రాత్రి యాక్సిడెంట్ అయింది. "
    రూమ్ నెంబర్ చెప్పింది రిసెప్షనిస్ట్.
    తలకు బ్యాండేజీ వుంది.  చేతులు గీరుకుపోయాయి.  తలదిండును ఆనుకొని కూచొని వున్నాడు అనిరుద్ర.
    అతడ్ని చూడగానే ఏడుపు  తన్నుకొచ్చేసింది అవనికి.  అసలే సెన్సిటివ్...
    "హాయ్... అవనీ... ఏంటా ఏడుపు చిన్నపిల్లలా...   చిన్న యాక్సిడెంట్... అంతే...ఎవరో చూడకుండా గుద్దేశారు. పాపం వాళ్ళే... అడ్మిట్ చేసి వెళ్ళారు.  అతనెవరో కూడా చూడ్లేదు.  అన్ కాన్షియస్ గా వుండిపోయా.  తెల్లారి మెలుకువ వచ్చి  చూస్తే బెడ్ మీద వున్నాను. నువ్వు కంగారు పడవద్దనే ఫోన్ చేయమన్నాను.  సారీ ఇవ్వాళ ఈవినింగ్ పిక్చర్ కు  వెళ్దామనుకున్నాం కదా... నో ప్రాబ్లమ్.. సాయంత్రానికి ఓ.కె.  డాక్టర్ రాగానే బిల్ పే  చేసి వెళ్దాం"  అనిరుద్ర చెప్పకుపోతున్నాడు.
    కానీ,  అవని మనసు మాత్రం ఆందోళనతో   నిండివుంది.  ఇది మామూలు యాక్సిడెంట్ అయితే తనింతగా కంగారుపడేది కాదు.
    కావాలని,  కేవలం తన మీద కోపంతో...ఇప్పడే అనిరుధ్రకు అసలు విషయం చెప్పేస్తే?  ఇలాంటి పరిస్ధితిలో చెప్పడానికి ఆమెకు మనసు ఒప్పలేదు.
    ఈలోగా డాక్టర్ వచ్చాడు.
    "హౌ  ఆర్యూ యంగ్ మేన్... నథింగ్ టు వర్రీ...చిన్న దెబ్బలు...ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నా సరిపోయేది.  డబ్బులు ఎక్కువై  మా హాస్పిటల్ కు  వచ్చారు. మరోలా అనుకోకు యంగ్ మేన్.  నేను కాస్త సరదాగా మాట్లాడతాను.  మీరిక వెళ్ళొచ్చు.   ఉంటామన్నా అభ్యంతరం లేదు.  రూమ్ రెంట్ అయిదొందలు వేస్ట్.  అయినా మీ ఫ్రెండ్ ఇవాళ్టి వరకే బిల్ పే చేశాడు.  ఆ తర్వాత మీ ఇష్టం"  అంటూ నాన్ స్టాప్ గా   మాట్లాడాడు.
    "ఏంటి బిల్ పే  చేసారా?  ఎవరు? "  ఆశ్చర్యంతో అడిగాడు అనిరుద్ర.
    "ఎవరా?అదేంటి మేన్... రాత్రి నిన్ను జాయిన్ చేసినతనే...బిల్లు కట్టేశాడు."
    అనిరుద్ర లేచాడు.  అతని వెంటే అవని.
                    *           *         *
    "నాకు ఆశ్చర్యంగా వుంది అవనీ...పాపం చిన్న యాక్సిడెంట్ చేసి నైతిక బాధ్యతగా ఫీలయి,  బిల్లు కూడా కట్టాడు. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చేసి,  తమకేమీ పట్టనట్లు వెళ్ళిపోయే ఈ రోజుల్లో..."
    అవని అనిరుద్ర చెప్పే మాటలు వినడం లేదు.  హాస్పిటల్ నుంచి కామత్ హొటల్ కు వచ్చి ఇడ్లీ ఆర్డర్ చేశారు.
    రాత్రి తనకు యాక్సిడెంట్ చేసి,  మొరాల్టీ ఫీలయి హాస్పిటల్ లో జాయిన్ చేసిన పెద్దమనిషిని పొగుడుతుంటే అవని మాత్రం అన్యమనస్కంగానే వుంది.
    ఆ పెద్దమనిషి వికృతి రూపం తనకు తెలుసు.  కేవలం తన మీద కోపంతో అనిరుద్రకు యాక్సిడెంట్ చేశాడు.
    ఆ విషయం అర్ధరాత్రి అనిరుద్ర ఫోన్ చేసినా తనకు తెలిసే అవకాశం లేకుండా   తనే  రిసీవర్ తీసి పక్కన  పెట్టింది.

 Previous Page Next Page