Read more!
 Previous Page Next Page 
ఆపరేషన్ మేడిపండు పేజి 3

    ఆ నవ్వులో ఆహ్వానం లేదు. పలకరింపు లేదు. నా నవ్వు చాలా అందంగా వుంటుంది సుమా అని చెప్పడానికి నవ్వినట్లుంది.
    ఆమె ఆలా దారిన పోయేవారిని చూసి నవ్వుతోంది. టెలిఫోన్ ఎత్తి హలో అని నవ్వుతోంది. ఎదురుగా  వున్న పుస్తకం కదిపి నవ్వుతోంది. ఎవరైనా పలకరించినా  నవ్వుతోంది. పలకరించకపోయినా నవ్వుతోంది. శూన్యంలోకి చూస్తూ కూడా నవ్వుతోంది.
    రాజు ఆమెను సమీపించాడు. ఆమె అతణ్ణి చూసి కూడా నవ్వింది.
    ఆ నవ్వు తనలోని శూన్యానికేనని తెలిసినా  రాజు ఆ నవ్వులోని అందాలకి ముగ్ధుడై సంతోషించాడు. తన జేబులోంచి పర్మషన్ స్లిప్ నీ, ఉత్తరాన్నీ అతడామెకు అందించాడు.
    "జస్టే మినిట్ ప్లీజ్ " అందామె  పలుకులో తేనెలను ప్రవహింపజేస్తూ.
    రాజుకు ఆమె సమక్షం ఎంత  బాగున్నదంటే నిజంగా ఒక్క నిముషంలోనే తననక్కణ్ణుంచి పంపివెయదుగదా అని భయపడ్డాడు.
    ఆమె ఆ కాగితాలు  చూసింది. ఎవరికో ఫోన్ చేసింది. రాజుకేసి చూసి నవ్వింది.
    ఆ నవ్వు రాజులోని  శూన్యానికే__ అయినా  మళ్ళీ అతడు సంతోషించాడు.
    ఆమె సూచనలందుకుని ఒకచోటకు వెళ్ళాడతడు.
     అక్కడ ప్రయివేట్ సెక్రటరీ  చంద్రమోహన్ నవ్వుతూ అతణ్ణి  పలకరించి,
    "నా పేరు  చంద్రమోహన్. అంతా  నన్ను సీఎం అని పిలుస్తారు . నేను ప్రోఫేసర్ట్ అజేయ్  ప్రైవేట్ సెక్రటరీని. అయినా అంతా నన్ను సీఎం అంటారు. మీరూ నన్నలాగే గుర్తుంచుకోవచ్చు" అన్నాడు.
    ఈ పరిచయం ఇలా ఎందుకు మొదలయిందో రాజుకు  అర్థంకాలేదు. అతడు అమాయకంగా , "ప్రోఫేసర్ని నేనిప్పుడే కలుసుకోవచ్చా?" అన్నాడు.
      సీఎం  అందుకు   బడులివ్వకుండా తన సీట్లోంచి లేచి పక్కనున్నర్యాక్ నుంచి ఓపైలు తీసుకునివచ్చి  మళ్ళీ సీట్లో కూర్చున్నాడు. పైలు తెరచి అతడి పేరు, ఇంటిపేరు తండ్రిపేరు, తల్లిపేరు, పెళ్ళికాకమునుపు తల్లి ఇంటిపేరు  వగైరాలన్నీ అడిగి  తెలుసుకున్నాడు. ఒకటో తరగతి నుంచి పి హెచ్ డి స్కాలర్ షిప్ దాకా రాజు ఏమేం సాధించాడో అడిగాడు. "గుడ్! యూ ఆర్ బ్రిలియంట్  చాప్....."అన్నాడు సీఎం.
    తనను ఎన్నిక చేసేది డైరెక్టరో, డైరెక్టర్  పర్సనల్  సెక్రటరీయో అర్థంకాక, ఆ విషయం పైకి అడగలేక అవస్థపడుతూ, "థాంక్యూ" అన్నాడు రాజు.
    సీఎం చురుగ్గా "కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ మీకూ అలా అనిపించడం లేదూ?" అనేశాడు.
    "వాట్ సర్?" అన్నాడు రాజు కంగారుగా.
    "సర్! ఇట్స్ ఓకే" అన్నాడు సీఎం సంతృప్తిగా.
    పాపం- రాజుకి అర్థంకాలేదు. సీఎం అది అర్థచేసుకున్నవాడిలా, "సాధారణంగా వినయగుణం వున్నవాళ్ళు మిత్రుల్నీ తన క్రిందివారినీ  కూడా ఎంతో గౌరవిస్తూ మాట్లాడతారు. వారు పై అధికారులను ప్రత్యేకంగా గౌరవించాలంటే తేడా  చూపించాలి కదా! అందుకోసం బ్రిటీష్ వాళ్ళు మనకిచ్చిపోయిన పదం సర్.
    మిత్రుల్ని సర్ అనం. జూనియర్స్ ని సర్ అనం. మనకాట్టే ప్రయోజనం కాని పెద్దల్ని కోదా సర్ అనం. అందువల్ల మన ఆఫీసుల్లో సర్ అన్న పదం విశిష్టతను పొందింది. ఇది బాసులకీ, బాసులాంటి వారికీ ప్రత్యేకతనిచ్చే పదం. దియాలో ప్రవేశించాలనుకునేముందు ఈ మాత్రం మీరు తెలుసుకోవడం మంచిది. అయితే చాలామందికిది అభ్యాసం కాక తర్వాత చిక్కుల్లో పడుతుంటారు.
    ఎందుకంటే పెద్దవాళ్లు ఇది చెప్పరు. మనసులో పెట్టుకుంటారు. నాబోటిగాళ్ళైతే చెబుతారు. మరిచిపోతే గుర్తుచేస్తూంటారు. అందుకని చాలామంది ఈ అభ్యాసం నాతో ప్రారంభిస్తారు" అంటూ జ్ఞానబోధ చేశాడు సీఎం.
    రాజుకు అర్థమైంది. ప్రొఫెసర్ అజేయ్ ని తను సర్ అని పిలివాలి. పొరపాటున కూడా సర్ అనడం మరిచిపోకూడదు. మరిచిపోతే ఆ విషయం మనసులో పెట్టుకుని ఆయన తననిబ్బందులు పెడతాడు. అలా జరక్కుండా వుండడానికి తను ఆయన పర్సనల్ సెక్రటరీని కూడా సర్ అనాలి. అనకపోతే  సీఎం తనకు గుర్తుచేస్తాడు.
    అజేయ్ విషయమెలాగున్నా   సీఎంతనని సర్ అనకపోతే ఊరుకోడు. రాజుకిప్పుడీ విషయం కూడా స్పష్టమైంది. రాజుకీ విషయమంత సులభంగా అర్థంకావడానికి కారణముంది. ఇలాంటి వాతావరణమే యూనివర్సిటీలోనూ వుంది. దీన్ని తాము సర్ కల్చర్ అని ముద్దుగా పిల్చుకుంటారు.
    "థాంక్స్ " అని వెంటనే "థాంక్యూ సర్" అనేశాడు రాజు.
     సీఎం ముఖం వికసించింది. "యు హావే వెరీగుడ్ ప్యూచర్ "అన్నాడు.
    "నేను  ప్రోఫేసర్ని ఎన్నింటికి కలుసుకోవాలి?" అన్నాడు రాజు విషయానికి వస్తూ.
    "ఒక వారం తర్వాత....." అన్నాడు  సీఎం తాపీగా.
    "మరి ఈ ఉత్తరం....సర్" అన్నాడు రాజు వాళ్ళను తప్పుపట్టలేక.
    "ఇది రాసినపుడు ప్రొఫెసర్ కు వేరే అపాయింట్ మెంట్ లేదు. తర్వాత అనుకోకుండా టూర్ పడింది. నిన్ననే వెళ్ళారాయన. రావడానికి వారం పడుతుంది..."
    రాజుకు మనసులో కోపం వచ్చింది. పేదవాడి కోపం  పెదవికి చేటు అని తెలుసు కాబట్టి డాన్ని బయటకు రానివ్వలేదు. అసహనాన్ని వీలైనంతగా అదుపుచేసుకుని, "నేను మళ్ళీ  ఎప్పుడు రావాలి.....సర్?" అన్నాడు. ఈ సర్ అతడికి వెంటవెంటనే  స్పూరించడం లేదు. ప్రొఫెసర్  దగ్గరైతే వేరు-స్వార్థమున్నచోట మానవశరీరం ఆటోమేటిక్ మెషిన్ కదా....
     సీఎం అతడివంక జాలిగా చూసి. "అది తెలుసుకుందుకు ఇంత దూరం రావడం కంటే మా ఇంటికి వెళ్ళడం మంచిది" అన్నాడు.
    "మీ ఇంటికైనా ఇంత దూరం రావాలి కదా....సర్!" అన్నాడు రాజు వీలైనంత అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ.
    "నేను కాంపస్ లో వుండడంలేదు. విశాఖపట్నం-మువ్వలవానిపాలెంలో నామకాం. మీరు నన్నక్కడ కలుసుకోవచ్చు. ఎల్లుండి సాయంత్రం  ఆరింటికి-సరేనా?"
    "మీరు రోజూ ఆపీసుకి అంత దూరం నుంచి వస్తారా సర్!" అన్నాడు రాజు. నిజానికతడీ ప్రశ్నజవాబుకోసం వేయలేదు. సర్ అనడం మెదడులో వాక్యనిర్మాణానికి ముందే స్ఫురించడంవల్ల అభ్యాసం కోసం అడిగాడు.
    "ఎంతసేపు-ఆఫీసుబస్సులో- అరగంట" అన్నాడు  సీఎం. అతడీ మాటలను పొడిపొడిగా అనడానికి కారణం ఒక్కటే-అతడికి  అజేయ్ తో పనిచేసి చేసి సర్ అనడం బాగా అలవాటైపోయింది. ఇతరుల వద్ద సర్ పదాన్ని తప్పించుకోవాలని అతడా పదం ఇమడనివిధంగా పొడిపొడిగా మాట్లాడుతూంటాడు.
    రాజు ఇంకేమీ ప్రశ్నలు వేయలేదు. పర్మషన్ స్లిప్ మీద  సీఎం సంతకం పెట్టించుకుని అక్కణ్ణించి బయటపడ్డాడు.
    రిసెప్షనిస్టును చేరుకునేలోగా కారిడార్లో అతడికిద్దరు సైంటిస్టులు ఎదురయ్యారు. వారు ఆప్రాన్ (తెల్లకోటు) ధరించివుండడంవల్ల అతడు వారిని సైంటిస్టులుగా గుర్తించాడు. వాళ్లిద్దరూ తమలో తాము నెమ్మదిగా మాట్లాడుకుంటూ వెడుతున్నారు. అయితే తమ సంభాషణను రహస్యంగా వుంచాలనీ వారనుకున్నట్లు తోచదు.
    "ప్రొఫెసర్- నీటి నుంచి హైడ్రోజన్ గురించి పబ్లిక్ లో చెప్పకుండా వుండాల్సింది" అని వారనుకోవడం రాజుక్కూడా వినిపించింది.      
                                *    *    *
    తనకు నిర్దేశించబడి గదిలో రాజు ఆటమిక్ స్ట్రక్చర్ గురించి చదువుతున్నాడు. నిర్దేశించబడిన గది అని ఎందుకనాల్సివచ్చిందంటే రాజు ఆ గదికి అద్దె చెల్లించడంలేదు. పవన్ అది స్నేహధర్మమంటాడు.
    రాజు ఆ ఇంట్లో భోజనం కూడా చేస్తూంటాడు. ట్యూషన్  ఫీజు అంటుంది పవన్ భార్య చిరునవ్వుతో. అలాంటి చిరునవ్వుతో కూడిన ఆదరణ భారతీయ గృహిణులకు మాత్రమే సాధ్యం.
    అందుకే రాణిపట్ల వాంఛ కలిగినప్పుడల్లా 'తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టకు' అని  మనసు రాజును హెచ్చరిస్తూంటుంది. అయితే వాసాలు లెక్క పెట్టె ధైర్యం రాజుకీ లేదు. ఆడది చొరవ చేస్తే ఏమో కానీ-తనకు తానుగా రాజు చొరవ చేయలేడు- పెద్దలు పెళ్ళి చేసి శోభనం గది ఏర్పాటుచేసేదాకా!
    రాజు పుస్తకం చదువుతూండగా రాణి వచ్చింది. అడుగుల చప్పుడుకు తలెత్తి చూశాడు రాజు. రాణిని చూసి మనసులో చిన్నగా నిట్టూర్చాడు.
    రాణి ఆకర్షణీయంగా వుంటుంది. అయితే చూడగానే ఈమె ఆడపిల్ల అని కొట్టవచ్చినట్లు తెలిపేలాంటి డ్రస్సు వేసుకోదు. మోకాళ్ళ కిందకు దిగే చుడీదార్లో ఆమె చూడముచ్చటగా వుంటుంది తప్పకొలతల అంచనాలకు తావివ్వదు.
    అప్పుడప్పుడు రాజుకు ఆమెను అందాలపోటీల దుస్తులో చూడాలనిపిస్తుంది. కానీ ఆమెను చూస్తే సెక్స్ రే కళ్లు కూడా దుస్తుల్ని దాటి వెళ్ళలేవు.
    "నాకో మంచి అయిడియా వచ్చింది" అంది రాణి అతడి నిట్టూర్పును గమనించకుండా.
    'అది దుస్తుల విషయంలో అయితే బాగుండును' అనుకున్నాడతను మనసులో.
    "నువ్వు పిహెచ్ ది సంగతి మరిచిపో. ఏదో ఒక కంప్యూటర్  కోర్సు చేయి. అమెరికా అయినా వెళ్ళొచ్చు. ఇన్ స్టిట్యూటైనా పెట్టొచ్చు. రెండింట్లో నేను నీకు  తోడుండగలను. అందుకు నాకు రెండేళ్ళు పడుతుంది కాబట్టి  నీకూ అంత టైముంది" అంది రాణి  అతడింకా ఏమీ అడక్కుండానే.
    "నీ జ్యోతిష్కుడేమంటున్నాడూ?" అన్నాడు రాజు ఆమె మాటలు ఆకళింపు చేసుకుని.
    "ఈ దేశం పిహెచ్ డిలు చేసినవాళ్ళు స్వంతంగా ఏమీ చేయలేరు. వాళ్ళు ఉద్యోగాలకు  తప్ప పనికిరారు. నీ ఉద్యోగం మన పెళ్ళికి ప్రతిబంధకమని జ్యోతిష్కుడు చెప్పాడు. ఆయనమాట తప్పదు. ఇందిరాగాంధీ పుట్టినప్పుడే దేశానికి ప్రధానమంత్రి అవుతుందనీ, ఆ తర్వాత తన అంగరక్షకుల చేతుల్లోనే మరణిస్తుందనీ సంవత్సారాలు తేదీలతో సహా చెప్పినవాడాయన. అందుకని నాకు నీ పిహెచ్ డి అంటే భయం" అంది రాణి.
    "ఆ జ్యోతిష్కుడి వయసెంతేమిటి?" అన్నాడు రాజు వెటకారంగా.
    "వయసు  పాతిక దాటితే  హాస్యానికైనా, జోస్యానికైనా నేనెవరితోనూ స్నేహం చేయమని నీకు తెలుసు" అంది రాణి.
    "అది తెలుసు కాబట్టే వయసడిగాను. పాతికేళ్లవాడు ఇందిరాగాంధీ పుట్టినప్పుడు  జోస్యమెలా చెప్పాడుట?" అన్నాడు రాజు.
    "అయ్యో! జోస్యమంటే భవిష్యత్తోక్కటేనా? భవిష్యత్తు చెప్పగలిగినవాడు గతం చెప్పలేడా? నా జ్యోతిష్కుడు గతంలో కూడా జ్యోతిష్కుడేనట. అప్పటి విశేషాలు కూడా చెబుతూంటాడు" అన్నది రాణి.
    ఇలా వెంటవెంటనే తెలివిగా సమాధానాలు చెప్పేవాళ్ళుంటే రాజుకు చాలా ఇష్టం. అతడు తమాషాగా నవ్వుతూ, "కంగారుపడకు. నా  ఉద్యోగం విషయంలో చివరి ప్రయత్నంలో వున్నానులే! అది ఫలించకపోతే నువ్వు చెప్పినట్లే చేస్తాను" అన్నాడు.
    "బాగా ఆలోచించి చెప్పు-నిజంగా ఇది నీ చివరి ప్రయత్నమా?"
    "దీనికి ఆలోచించడమెందుకు?"
    "ఏమీ లేదు. చివరి ప్రయత్నం కాకపోతే ఏమోగానీ- చివరి ప్రయత్నమైతే మాత్రం ఫలితం నాకు తెలుసు. అది ఫలించదని జ్యోతిష్కుడు చెప్పాడు"
    రాజు నవ్వాపుకోలేకపోయాడు. అతడు నవ్వుతూంటే, 'ఆ నవ్వెంత బాగుందీ! అనుకుంది రాణి. అప్పుడే ఆమెకు వదిన మాట కూడా గుర్తొచ్చాయి. ఒకసారి రాజు నవ్వు బాగుంటుందని తనంటే "అబ్బాయికి అమ్మాయి నవ్వు నచ్చిందంటే అది ప్రేమ. అమ్మాయికి అబ్బాయి నవ్వు నచ్చిందంటే అది వయసు" అని నవ్వింది.
    అందుకని రాజు నవ్వు తనకు నచ్చినందుకు సిగ్గుపడి అక్కణ్ణించి వెళ్ళిపోయింది చటుక్కున రాణి!
                               *    *    *
    మువ్వలవానిపాలెంలో సిటీబస్సు దిగి టైమ్ చూసుకున్నాడు రాజు.
    ఆరి కావడానికింకా పదకొండు నిముషాలుంది.
    అతడు ఎవర్నీ వాకబు చేయకుండానే సులభంగానే  సీఎం ఇల్లు పట్టుకోగలిగాడు. బయట్నించే చూసి ఇల్లు చాలా బాగుందే అనుకున్నాడు.
    ఇంటిచుట్టూ నాలుగడుగుల పిట్టగోడ. అందులో ఒక చిన్నగేటు. గేటు దాటితే చిన్నపోర్టికో. పోర్టికోనానుకుని పెద్ద ఇల్లు. పోర్టికో అటూ ఇటూ, ఇంటిచుట్టూ మరీ చిన్నది కాదనిపించే  తోట. పూలమొక్కలు కనిపిస్తున్నాయి. చెట్లున్నాయనిపిస్తున్నాయి.
    రాజు ముందుకువెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు.
    పదహారేళ్ల  కుర్రాడు ధుమధుమలాడుతూ వచ్చి తలుపుతీశాడు, కేబుల్ టివీలో ఎ స్పోర్ట్స్ చానెలో చూస్తుండగా డిస్టర్బయిన వాడి ముఖమది!
    "చంద్రమోహన్ గారున్నారా?"
    "లేరు" కొట్టిచ్చినట్లుంది సమాధానం. సర్ అనమన్న  సీఎం తన ఇంట్లోవాళ్లకి  ఎలాంటి శిక్షణ ఇస్తున్నాడో ఆ కుర్రాణ్ణి చూసి  తెలుసుకోవచ్చు. అయితే మేనర్సు కూడా అవసరాన్ని బట్టే కదా! సమాజంలో  కొందరికి మేనర్సు అవసరం వుండకపోవచ్చు. లేదా ఎక్కడ ఎప్పుడు మేనర్సు చూపాలో ఖచ్చితంగా వారికితెలిసుండవచ్చు.
    తానేలాగున్నానా అని రాజు ఒకసారి తనను తాను చూసుకున్నాడు.
    యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ స్థాయికి ఏమాత్రమూ దిగలేదతడు.
    మరి ఆ కుర్రాడలా ఎందుకు మాట్లాడేడా అనుకుంటూ,"చంద్రమోహన్ గారు ఆరింటికి నన్ను రమ్మని చెప్పారు" అని తలెత్తి  చూస్తే  తలుపుతీసిన కుర్రాడు లేడు.
    తను చెప్పాల్సింది చెప్పెశానన్న తృప్తితో ఆ కుర్రాడు రంగంనుంచి తప్పుకున్నట్లున్నాడు. అదృష్టం-ఇంకా మొహంమీదే  తలుపులు భళ్ళున మూయలేదు.
    అవసరం తనదికాబట్టి రాజు-తలుపులు మూయకపోవడాన్నే ఆహ్వానంగా భావించి లోపల అడుగుపెట్టాడు. అది చిన్నగది, ఎక్కువగా చెప్పుల జతలున్నాయి. అక్కణ్ణించి మూడు దారులు కనిపిస్తున్నాయి. తను కుడివైపు వెళ్ళాలా, ఎడమవైపు వెళ్ళాలా, తిన్నగా పోవాలా అనే సందేహం కలిగిందతడికి.
    రాజు తన ఆలోచనలకు పదునుపెట్టగా ఇందాకా తలుపుతీసిన కుర్రాడు ఎడమ వైపునుంచిగానీ వచ్చాడా అనిపించింది. అందుకని అతడు ఎడమవైపుకి నడిచి గుమ్మానికి వేలాడుతున్న తెరను తొలగించాడు.
    అప్పుడు రాజు కళ్ళు జిగేల్ మన్నాయి.
    ఒక యువతి అప్పుడే  జాకెట్ వేసుకున్నట్లుంది. కండువాను బొందులో దోపబోతూఅచ్చం మలయాళీ కన్యలా వుంది. రాణినెలా చూడాలని కలలు కంటున్నాడో ఆ యువతినలా చూడగిలిగేడతడు. మసకవెలుతుర్లో ఆమె ముఖసౌందర్యం తెలియడంలేదు కానీ- రాజు దృష్టికూడా ఆమె ముఖంమీద లేదు.
    "పోరా వేధవా- నీ కిక్కడేం పని! నీ గదిలోకి పో" అందా అమ్మాయి అతణ్ణి  చూస్తూనే.
    రాజు ముందు వెనుకడుగు వేశాడు. తెర వెనక్కు తప్పుకున్నాడు.
    తర్వాత ఆ పిల్ల అన్న మాటలు ఆకళింపు  చేసుకోసాగాడు. పరాయి ఆడపిల్ల దుస్తులు వేసుకుంటూండగా వెళ్లి చూడ్డం తప్పే-కానీ  తను కావాలని తప్పు చేయలేదే! పూర్వాపరాలాలోచించకుండా ఆ పిల్ల తనను వెధవా అనడం బాగుందా?
    అప్పుడు  రాజుకు స్పూరించింది. ఆ అమ్మాయి తనని తన గదిలోకి పొమ్మంది కానీ ఆ ఇంట్లో తనకు గదెక్కడుందీ? అంటే ఆ అమ్మాయి తనని  పరాయివాడనుకో లేదు. వెధవా అంది కాబట్టి బహుశా తమ్ముడనుకునివుంటుంది. మసకవెలుతురు కదా..... ఒక విధంగా చెప్పాలంటే ఇందాకటి పదహారేళ్ల  కుర్రాడిది ఇంచుమించు తన పర్సనాలిటీయే!
    అయితే ఇంట్లో అడుగుపెట్టే సమస్య అలాగే వుండిపోయింది. ఇంకా రెండుదారులు మిగిలిపోయాయి. అందులో ఏది?
    సాధారణంగా ఇళ్ళ డ్రాయింగు రూమ్ లు తిన్నగానే వుంటాయి. పక్కగదుల్లో వుండవు. అలాగనుకుని మధ్యగుమ్మం తెర తప్పించాడు రాజు.
    అది చూడ్డానికి రీడింగ్ రూమ్ లాగుంది తప్ప డ్రాయింగ్ రూమ్ లా లేదు.
    ఇందాకటి కుర్రాడి వీపు కనిపిస్తోంది. వాడు కుర్చీలో కూర్చున్నాడు. టేబిల్ మీద ఏదో పుస్తకముంది. వాడి వాటం  చూస్తూంటే తీవ్రంగా ఎంట్రెన్స్ పరీక్షలు ప్రాక్టీసు చేసున్నట్లున్నాడు. అలాంటివాడిని డిస్టర్బ్ చేశానే అని రాజు  నొచ్చుకున్నాడు.
    ఈసారి ఏ సంకోచం లేకుండా రాజు కుడిగుమ్మం వైపు దారితీశాడు.
    తెరను తప్పించబోయాడు కానీ మళ్లీ సంకోచం వచ్చింది. ఇందాకటి అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆ వెంటనే  'వెధవా' నీకిక్కడేం పని' అన్న మందలింపూ గుర్తుకొచ్చింది.
    క్షణం తటపటాయించి మొండిదైర్యంతో తెరను తప్పించి చూస్తే-మొత్తంమీద అనుకున్నంతా అయింది.
    లోపల ఒక ప్రౌడవనిత తన ఒంటికి చీర చుట్టబెట్టుకునే ప్రయత్నంలో వుంది. ఆమె అటుతిరిగి వుండడంతో రాజును చూడలేదు.

 Previous Page Next Page