Read more!
 Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 2

   
    అయన బరువు, బాధ్యత సగం తీసుకొని భారం తగ్గించాల్సిన అయన పెద్ద కొడుకు గత రెండేళ్ళుగా నిరుద్యోగిగానే మిగిలిపోయాడు. ప్రసాద్ బి.కాం పాసయి రెండేళ్ళుగా ప్రయత్నించని ఉద్యోగం లేదు. పెట్టని అప్లికేషన్ లేదు. వెళ్ళని యింటర్వ్యూ లేదు. అప్లికేషన్ల కి , యింటర్వ్యూలకి అయిన ఖర్చుతో ఓ కిళ్ళీ కొట్టు పెట్టుకున్నా బాగుపడే వాడినేమో అని దిగులు పడ్తాడు. పాతికేళ్ళ మగవాడికి పనిపాట ఉద్యోగం లేకుండా యింట్లో కూర్చోడం అంత నరకం మరోటి వుండదు. ఏదో నేరం చేసినట్లు తండ్రి కంట బడడానికే బిడియపడ్తాడు ప్రసాద్. ఒక్కొక్క ఉద్యోగానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆశ నిరాశకంగానే తండ్రి ఏమనక పోయినా అయన విడ్చిన నిట్టుర్పూ అతని గుందేలాని సూటిగా తాకేది. యింట్లో ఎవరేం విసుక్కున్నా తనమీదే నన్నట్టుగా, తనూరికే తిని కూర్చున్నాడని అందరూ హేళన చేస్తున్నట్టుగా గిలగిలలాడ్తాడు. ఉద్యోగం రాని బాధ, చిరాకు అంతా అతని మొహం మీదే కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడకుండా, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా వుండే కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు బాధపడ్తారు. కొడుకు అప్రయోజకుడుగా మిగిలాడని అప్పుడప్పుడు విరక్తిలో విసుగోచ్చినా తరువాత వాళ్ళు బాధపడ్తారు. ప్రసాద్ పాపం తన చేతిలో వున్నంతవరకు అన్ని బ్యాంకి పరీక్షలకి కట్టి రాస్తూ వున్నాడు. బ్యాంకి క్లర్కు పరీక్ష పాసవటం కూడా అంత సుళువు కాదని, డానికి వేలాది మంది తనలాంటి వాళ్ళు వెడ్తున్నరని , బ్యాంకి క్లర్కు ఉద్యోగానికి జీతాలెక్కువని అందరూ ఎగబడడంతో వాటికి కాంపిటేషన్ పెరిగి పోయిందని అర్ధం అయింది. చేసేదేం లేక దేముడి మీద భారం వేసి పేపర్లో వాంటెడ్ కాలమ్స్ చూస్తూ కూర్చుంటాడు ప్రసాద్.
    ఏం, ఉద్యోగాలు మగాళ్ళే చెయ్యాలేమిటి, నేను చేస్తాను, నేనిప్పటి నించి పెళ్ళి చేసుకోను. చేసారుగా అక్క పెళ్ళి - చాలు, అన్నయ్యకే దొరక్కపోతే నాకు దొరకదని రూలుందేమిటి అంటూ దబాయిస్తుంది. యిరవై ఒక్కఎళ్ళ మూడో పిల్ల వసంత. చూడగానే తెలివైన, చురుకైన మొహం అనిపిస్తుంది. తెల్లటి తెలుపు కాకపోయినా పెద్ద పెద్ద కళ్ళతో, చిన్ననోరు నొక్కులజుత్తు , మంచి ఫిగర్ చూపరులని ఆకర్షించే అందం ఉంది. చదువులోనూ చిన్నానాటి నుంచీ చురుకే వసంత. అందానికి తోడు అలంకరణ చక్కగా చేసుకుంటుంది. ఆమె అభిరుచులకి కోరికలకి ఆ యింట్లో పుట్టడం వల్ల పుల్ స్టాప్ పెట్టవలసి వచ్చింది గాని, కాస్త వున్న వాళ్ళింట్లో పుడితే, రోజుకో డ్రస్సు వేసుకుంటే యింకెంత బాగుండేదాన్ని, ఛా! ఛా!యీ వాయిల్ చీరలే గతి రోజూ..... ఒక్క సరదా తీరదు యీ యింట్లో అందుకే ఉద్యోగం చేసి సంపాదిస్తే తనకి నచ్చే చీరలు, మాచింగ్ దండలు, గాజులు, బ్యాగులు, ....ఎన్నెన్ని చిల్లర ఖర్చులుంటాయి. అవన్నీ తీర్చుకోవచ్చు. యింట్లో ఏదడిగినా లేదు లేదు అన్నమాట తప్ప వుందని వాళ్ళ నోట రాదు. ఆడపిల్లకి చదువు లేకపోతే పెళ్ళి కాదన్న భయంతో చదివిసృన్నారు, కాని లేకపోతే మూల కూర్చోపెట్టి పెళ్ళి చేసేవారు. కాలేజి కి వెళ్ళే పిల్ల నలుగురిలో వెల్తి పడ్తుందని , అందరూ హేళన చేస్తారని వాళ్ళకేం తెలుసు. అనుకుంటుంది వయసు వచ్చినా బుద్ది వికసించని వసంత. యింటి పరిస్థితి , తండ్రి జీతం తెచ్చినా యీ కాలం పిల్లలందరి కోరికల లాంటి కోరికలుండే వసంత తన కోరికలు తీర్చుకోవాలంటే ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించుకుంది. పెళ్ళి చేసినా వాళ్ళు తెచ్చే సంబంధం ఏ గుమస్తా నో తెచ్చి కట్టబెడతారు. పెనం మీదనించి  పొయ్యిలో పడ్డట్ట\వుతుంది. ఛా...ఛా.... ఆ చాలీచాలని జీతం, పిల్లలు రోగాలు , రోచ్చులు -ఆ లైఫ్ చచ్చినా వద్దు. హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది తను.... అనక....ఎప్పుడో ....నచ్చినవాడ్ని ....తనే చూసుకుంటుంది ఏం, తనకేం తక్కువ అందం వుంది. డబ్బు లేదు. అది సంపాదిస్తుంది. అప్పుడు ఏ అఫీసరో తనని ఏరి కోరి .....వసంత ఆలోచనలలా సాగుతాయి. అది వసంత తప్పు కాదు, ఆ వయసుది! ఆమె మీద సినిమాలు, పుస్తకాలు ప్రభావం చాలా వుంది.... పుస్తకాలు చదివి రంగు రంగుల కలలు కంటూ కలల్లో బతికే ఈనాటి అమ్మాయిలలో వసంత ఒక్కర్తి. అందుకే యింట్లో దెబ్బలాడి బి.ఏ. కాంగానే పెళ్ళి వద్దంటూ టైపు, షార్ట్ హాండ్ నేర్చుకుని, ఉద్యోగం చేస్తానంటూ తయారైంది. పెద్దకూతురి పెళ్ళి అలా అవడం, కొడుకు సంపాదన లేకపోవడం, ఆర్ధిక యిబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబం రోజులు మారాయి. ఆడపిల్లలూ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుందన్న విరక్తిలో వసంత యిష్టాన్ని ఎవరూ కాదనకుండా వూరుకున్నారు. ప్రస్తుతం వసంత ఉద్యోగాల వేటలో వుంది.
    ఇంట్లో ఐదుగురు పిల్లలున్నా చేతివేళ్ళలా అందరూ ఒకలాగ వుండరని రూపులోనే కాక బుద్దుల్లో ఒకరికొకరికి సహస్రాంతం తేడా వుందనడానికి వసంత మాలతిని చూస్తె ఎవరన్నా చెప్పగలరు. పదిహేనేళ్ళ పిల్లలా వున్నా జీవితంలో ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్నదానిలా మాటల్లో, చాతల్లో కనిపిస్తుంది. యింట్లో పరిస్థితి మాలతి ఆకళింపు చేసుకున్నట్టుగా ఎవరూ చేసుకోరు. 'లేదు, లేదు అని ఏడిస్తే వస్తుందా.....నాన్న సంపాదన తెలిసీ అలా సాదిస్తావెందుకే అమ్మని --' అని అరిందలా వసంత చీరల కోసం సినిమాల కోసం కాల్చుకు తిన్నప్పుడల్లా అంటుంటుంది మాలతి. 'ఆ పెద్ద నీతులు వల్లించకు. వెధవ ముసలమ్మ కబుర్లూ నీవూను, నీకక్కరలేక పొతే మూల కూర్చో, నాకెందుకు చెపుతావు' అంటూ గయ్ మంటుంది వసంత. మాలతి నవ్వి వూరుకుంటుంది. 'నీకంటే చిన్నది దాన్ని చూసి బుద్ది తెచ్చుకోవే' అని తల్లి మందలిస్తే మరింత ఉక్రోషం వస్తుంది వసంతకి. 'నేను దానిలా ఏ కోరికలూ లేకుండా వుండడానికి జడ పదార్ధాన్ని కాదు, ప్రాణం వున్న మనిషిని' అంటూ ఎగుర్తుంది. "మా తల్లి రేపు ఆ మొగుడు ఎలా భరిస్తాడో.... మాట అంటే చాలు మీద పడతావు. నీ కోరికలు తీర్చలేక సన్యాసుల్లో కలుస్తాడు " తల్లి విసుగ్గా అంటుంది. "కోరికలు తీర్చలేని వాడుని అసలు చేసుకోదమ్మ అక్క ....ఓడ లాంటి మేడ, మేడలాంటి కారుతో ఆజానుబాహువు, అరవింద దళాయకాక్షుడు ప్రేమిస్తున్నానంటూ పూలమాల తీసుకొచ్చిన వాడినే చేసుకుంటుంది గాని అపట్రాల్ గుమాస్తానీ, స్కూలు టీచరునీ కట్టుకోదమ్మా....' వసంతని ఉడికిస్తుంది మాలతి. "ఆ....అవును, వస్తాడు , చేసుకుంటాను. మధ్య నీకెందుకు ఏడుపు. మహా బుద్దిమంతురాలివి , నోట్లో వేలెడితే కొరకలేని ముద్దరాలివి, అమ్మ నాన్న తెచ్చిన గుమస్తాని బుద్దిగా కట్టుకుని పతివ్రతలా బతుకు పదికాలాలు. హేళనగా ఎత్తిపోడుస్తుంది వసంత. ఛా.... ఛా.....సరదాపడి కాస్త ఆ చీర కొనమంటే యింట్లో అంతా ఉపన్యాసాలు యిచ్చేవారే.....ఉద్యోగం దొరికితే మిమ్మల్ని ప్రాధేయపడే అక్కరలేదు. అంతవరకు గతిలేక అడిగాను" దుమదుమ లాడ్తుంది.
    "ఓయ్....కలల రాణి.... గుమస్తా ఉద్యోగానికి నెలకి పదిహేలివ్వరె తల్లీ రోజుకో చీర కొనుక్కోడానికి .....' ప్రసాద్ వెక్కిరించి అట పట్టిస్తాడు. అంతా కలిసి వేళాకోళాలాడితే ఉక్రోషం పట్టలేక లేచిపోతుంది విసురుగా వసంత.
    "ఏదో దేముడి దయవల్ల డానికో ఉద్యోగం దొరికితే కాస్త ప్రాణం తెరిపిన పడ్తుంది. యీ సాధింపులు లేకుండా, మాకియ్యా వద్దు పెట్ట వద్దు . చీరలే కొనుక్కుంటుందో , సినిమాలే చూస్తుందో మహాతల్లి." ఆవిడ ప్రాణం విసిగి ఓ నమస్కారం పెడ్తుంది కాంతమ్మ.

 Previous Page Next Page