Read more!
Next Page 
శిక్ష పేజి 1

                                 


                                శిక్ష
    
                                                ----డి. కామేశ్వరి

 

                           


    
    ప్రభాతసమయం! తూరుపు తొలిరేఖలు అప్పుడే విచ్చుకోడం ఆరంభించాయి.
    'అన్నపూర్ణ అనాధ శరణాలతం' అప్పుడప్పుడే నిద్రమేల్కొంటూంది. ఆ సమయంలో అందరిగుండెలు చెద్దిరేట్టు గణగణలాడిందిగంట. ఆ ఘంటారావానికి ఎక్కడివాళ్లికి అక్కడ నిద్రమత్తువదిలిపోయింది. పిల్లలంతా నిద్రకళ్ళతోనేలేచి బిలబిల లాడుతూ బయటికి పరుగెత్తారు. కొత్తగా వచ్చిన 'అనాధకి' సాగతం యీయడానికి.
    శరణాలయం ఆవరణలో చిన్నమండపం ఆ మంటపంరెండు స్థంభాలకి వ్రేలాడగట్టిన ఓ పెద్ద గంటవుంది. ఆశరణాలయంలో చేర్చటానికి తమబిడ్డ అని చెప్పుకోడం ఇష్టంలేనివారు ఆ మండపంలో బిడ్డనివదిలి గంట మోగించి తమ పని పూర్తి అయినట్టు చకచక వెళ్ళిపోతారు, తమ ఉనికి ఎవరూ గుర్తించకముందే.
    ఆ గంట మోగిందంటే మరో అనాధ వచ్చిందన్న విషయం శరణాలయంలో అందరికీ తెలుసు.
    ఆ మండపంలో ఓ పసిపాప కెరు కేరున ఏడుస్తూంది. శరణాలయంలో పిల్లలంతా ఆ పసిపాప చుట్టూ మూగారు. 'పెద్దక్క సుగుణ' ఏడుస్తున్నపాపని పొత్తిళ్ళతోసహా ఎత్తుకుంది "అమ్మో! ఈ  పాప ఎంత అందంగా వుందో చూడండర్రా!" ఆశ్చర్యానందాలతో అంది అబ్బ ఎంత తెల్లగా వుంది.!" "అరే, ఎంత ఒత్తుజుత్తో" చూడనీ అక్కా" నాకోసారి యీయక్కా" పిల్లలంతా సుగుణ చేతిలో పాపని     ఆరాటంగా చూశారు.
    "వుండడర్రా పాపం ఏడుస్తూంది. ముందులోపలికి తీసికెడదాం. "సుగుణ పాపని ఎత్తుకుని లోపలికి నడిచింది. పిల్లలంతా వెంటనడిచారు.
    ఈ గలాభాకి మెలకువ వచ్చిన ఆయాలు వళ్ళువిరుచుకుంటూ లేచి సుగుణ చేతిలో కొత్త పాపని చూసు "మరొకర్తా ఇలా కనడం మా మొహానపారేయడం. ఇంతింత పసివోళ్ళని వదిలిపోవడానికి ప్రాణం ఎట్టా వప్పుతుందో" ఆయాగొణిగింది. అంత ఉదయాన్నే నిద్రలేపిన గొడవకి విసుక్కుంటూ గుమస్తా పంచెసవరించుకుంటూ లోపల్నించి వచ్చాడు. సుగుణ "కొత్తపాప పంతులుగా ఎంత బాగుందో "చూడండి!" అంది గుమస్తా ఆ పిల్లని ఎగాదిగా చూసి "మరి అభాగ్యురాలన్న మాట, ఊ, దీని నెంబరెంత-పద, ఆఫీసు రూములోకి తీసుకురా రిజిష్టర్ లో రాసుకుంటాను" అంటూ ఆఫీసు రూముకి వెళ్ళాడు. ఆపిల్ల దొరికిన టైము, పుట్టుమచ్చలవివరాలు, మెడలో తిరుపతి వెంకటేశ్వరుడిరాగి బిళ్ళ-వివరాలు, రాసుకుని ఏడుస్తున్న ఆ పిల్లని చిరాగ్గా చూసి "ఊ, తీసుకుపో..దాని కింత పాలో ఏవో పట్టండి" అన్నాడు.
    "పాపకి పేరేం పెడదాంపంతులుగారూ.....సుగుణ అడిగింది.
    గుమస్తా ఆవలిస్తూ చిరాగ్గా "ఆ, బారసాల మహోత్సవం చేసి నామకరణం చేద్దాం లేండి ఘనంగా తర్వాత. ఫో.....ఫో......తీసుకుపో" అన్నాడు వ్యంగ్యంగా. ఆ తిరస్కారాలు, ఆమాటలు కొత్తవిగావు గనక ఆ పిల్లలు ఏంబాధపడలేదు. సుగుణ ఉత్సహంగా "తెల్లారగట్లమనకి దొరికింది 'ఉష' అని పేరు పెడదాం" అంది. పిల్లలంతా 'ఉష-ఉష. బాగుందక్కా' అంటూచప్పట్లు కొట్టారు.
    "ఆ...!ఆ సరే, బాగుందిముందు దానికింత ఏదోటిపట్టండి, ఇల్లెగరకొట్టిచంపుతుంది." గుమాస్తామరోసారి ఆవలించిగదిలోకి వెళ్ళాడు.
    సుగుణ పిల్లనెత్తుకొనిలోపలికి నడిచింది. పిల్లలంతా లోపలికి పరిగెత్తారు. ఒక అమ్మాయి వంటగదిలోకి వెళ్ళి యిన్ని పాలడిగితెచ్చింది మరో అమ్మాయి సీసా కడిగి పాలుపోసియిచ్చింది. సుగుణపాలుపట్టింది. పాప ఏడుపు ఆగింది. ఏడ్చి ఏడ్చి అలిసిపోయిపొట్టనిండగానే కళ్ళుమూసుకుంది. సుగుణ నెమ్మదిగా ఓ పక్కమీద పడుకోబెట్టి" పదండర్రా....తొందరగా మొహాలవి కడగండి" అంటూ అందరిని తరిమింది. సుగుణ ఉష వంక చూసినిట్టూర్చి అక్కడనుంచి కదిలింది.
    అనాధ శరణాలయంలోకి మరొక 'అనాధ' వచ్చిందటే తమతో పాటు ఆ నరకంలో మగ్గుతుంది అన్న భావం కాస్త జ్ఞానం వచ్చినవాళ్ళకి కల్గుతుంది. అందుకే సుగుణ ఉషని చూసి అంత చక్కని పాప ఏగొప్పింటిబిడ్డో-ఎంత పాపం చేసుకొనిపుట్టి ఇలా అనాధఅయిందో! ఏతల్లి పాపఫలమో-అంటూ విచారించింది. ఆ జ్ఞానంలేని పసివాళ్ళు మరొక కొత్తపాప దొరికిందని సంబర పడ్డారు.
    అన్నపూర్ణ అనాధ శరణాలయం నూరు సంవత్సరాల క్రితం రంగాపురం జమీందారు రంగరాజుభార్య జ్ఞాపకార్ధం కట్టించింది. అప్పట్లో కేవలం దిక్కు మొక్కు లేనిపిల్లకి ఆశ్రయం కల్పించేదిమాత్రంగా వుండేది. వందమంది పిల్లలకి తక్కువ లేకుండా ఆశ్రయం ఇవ్వగలదిగా వుండేది. ఆయనతర్వాత అయనకొడుకు రావ్ బహద్దూర్ మంగరాజు హయాంలో ఆ అనాధ శరణాలయానికి ఇంకా ఎక్కువవసతులు, సదుపాయాలు సమకూర్చారు. ఊరికే తిండి బట్టసమకూర్చడంతో  సరిపుచ్చకుండా ఉచితంగా మెట్రిక్ వరకు చదువు చెప్పించి పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు వుంచుకొని చదువు పూర్తయి వాళ్ళకో దారి ఏర్పడే వరకు అక్కడ వుంచే ఏర్పాట్లు చేశారు. ఆడపిల్లల్ని పెళ్ళాడటానికి ఎవరన్నా ముందుకు వస్తే శరణాలయం ఆధ్వర్యాన జరిపించిపంపిస్తారు.
    కాలక్రమేణా జమీందారీలు పోయాయి. మంగపతి రాజుగారికొడుకు రంగారావు జమీందారు అయ్యాక జమీందారులకే భరణాలు ఏర్పడ్డాయి. వారితో పాటు వారి అనాధశరణాలాయానికి కూడా కొంత గ్రాంటు ముట్ట చెపుతూంది ప్రభుత్వం. తాహతకుమించిందే అయినా రంగారావు ఆచార ప్రకారం వంశ పారం పర్యంగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం శరణాలయాన్ని సాధ్యమైనంత చక్కగా తీర్చిదిద్దాలని, అభివృద్ధిలోకి తేవాలని కృషి చేస్తున్నారు యజమాన్యాన్ని వహించి.
    దేవుడు వరం యిచ్చినా పూజారివరం యివడన్నట్టు జమీందారులు ఎంత ఆదుకొన్నా ప్రభుత్వంగ్రాంటు ఇస్తున్నా ఆ యిస్తున్నది అనాధల పొట్టకొట్టిమధ్య వాళ్ళు పొట్ట నింపుకొంటారు. వచ్చేడబ్బు సగం మేనేజరుగుమాస్తా వగైరా సిబ్బంది పంచుకుంటారు. మిగతా డబ్బుతోకొనే సరుకులు సగం వంటవాళ్ళు, నౌకరు వంతులవారీ పంచుకొంటారు. అంటే ఆదాయంలో ఒకవంతు మాత్రం అనాధ బాలబాలికలకి ఉపయోగిస్తారు. అంతా లాలూచి అయి ఎవరూ ఏమనేందుకు ఆస్కారం వుండనంత పకడ్బందీగా వ్యవహారం నడిపిస్తారు. ఇదంతా పై వాళ్ళకి తెలియకపోయినా ఆ అనాధలకి తెలుసు. తెల్సినా నోరు తెరిచి అదేం అని అడిగే హక్కు ఆ నిర్భాగ్యులకి లేదు. ఆ శరణాలయంలో నెలల పిల్లలనించి పద్దెనిమిదేళ్ళ వరకు రకరకాల వయసు పిల్లలు పెరుగుతున్నారు. పదేళ్ళ వయసువచ్చాక ఆడపిల్లల పడక హాలు వేరు, మగపిల్లలకి వేరుగా వుంటాయి, ఒక్కొక్క హాలులో పాతిక కొయ్యమంచాలు అలాంటివి ఆడపిల్లలకి రెండు మగపిల్లలకి రెండు వున్నాయి. వంటగది- భోజనశాల ప్రార్ధనా మందిరం- ఆఫీసు రూము స్నానాల గదులు పెద్ద ఎత్తునే వుంది. ఆ అనాధ శరణాలయంలో యిద్దరు వంటవాళ్ళు యిద్దరు ఆయాలు- నల్గురు నౌకర్లు, తోటమాలి, ఒక గుమస్తా వున్నారు. వుండటానికి అంతమంది సిబ్బంది వున్నా తినడానికి తప్ప పిల్లలు ఆలనా పాలనా చూసేవారెవరూ లేరు. పిల్లల గదులన్నీ దుమ్ముకొట్టుకునే వుంటాయి. బాత్ రూములన్నీ కంపు కొడ్తూనే వుంటాయి. భోజనశాల అంతా తడితడిగా జిడ్డుతోనే వుంటుంది ఎప్పుడూ, గిన్నెలన్నీ మసితోనే వుంటాయి. పిల్లలంతా ఎప్పుడు ఆకలి చూపులతో దైన్యంగానే వుంటారు. పిల్లలంతా ఎప్పుడు భయంభయంగా బిక్కు బిక్కుమనే చూపులతో కనిపిస్తారు. ఆకలివేస్తున్నా నోరుతెరిచి కావాలని చెప్పుకోలేదని దైన్య స్థితివారిది. ఏడాది నిండని పసివాళ్ళు కూడా ఏడ్చినా తిండిదొరకదని, గంట కొట్టితే తప్ప ఆకలి అని అడిగినా ఏడ్చినా అంతేనన్నసత్యం గ్రహించేస్తారు. అంచేత భోజనంగంట వినపడగానే అంత పసివాళ్ళ కళ్ళలో కూడా వెలుగు కనబడుతుంది. ఎక్కడాలేని ఉత్సాహంతో కళకళలాడిపోతారు పిల్లలు ఆ టైములో, పెద్ద పిల్లలు జ్ఞానం తెల్సిన వాళ్ళు రెండు మూడేళ్ళు నిండని పసివాళ్ళు'ఆకలి అక్క!' అంటూ ఏడుస్తూంటే జాలితో కరిగిపోయి దగ్గరకు తీసుకుని ఓదార్చడం తప్పు ఏం చెయ్యలేని అసహాయులు-ఓ రెండు మూడేళ్ళు ఆ శరణాలయంలో పెరగగానే శరీరం ఆ అలవాట్లకి అలవాటుపడి, పేగులుఎండిపోయి ఆ పెట్టేతిండికి అలవాటు పడిపోయిఆకలిమాట మర్చిపోతారు.

Next Page