Read more!
 Previous Page Next Page 
అందరూ మేధావులే  పేజి 3

                                 

    అందరూ మేధావులే!?!
                                                                                       - కండ్లకుంట శరత్ చంద్ర   

పార్ట్ - 2

    సీతాఫల్ మండీ రైల్వేస్టేషన్. ఫ్లాట్ ఫారమ్ వెలుగులోనూ, రైలుపట్టాలు చీకట్లోనూ, సగం చెక్క బెంచీలు... చీకటి వెలుగుల్లోనూ ఉన్నాయి. సమయం...రాత్రి పది!
    నార్ల రాజశేఖర్ ప్లాపయిన సినిమా ప్రొడ్యూసర్ లాగా, చిట్ ఫండ్ పెట్టి...దివాళా తీసిన వ్యక్తిలాగా, పంక్చరైన స్కూటర్ టైరులాగా...మొహాన్ని వేళ్ళాడేసుకుంటూ...ప్లాట్ ఫారమ్ మీదికి వచ్చాడు.
    ప్లాట్ ఫారమ్ మీద...అక్కడక్కడా కలిపి...ఒ అయిదారుగురుదాకా మనుషులున్నారు.
    అతడు...ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు.
    "ఇప్పుడు...రైలు వస్తుందా?"
    "వస్తుందనే అనుకుంటున్నాను. ఐతే...ఇప్పుడో, ఇంకెప్పుడో మాత్రం నాకు తెలీదు."
    "అదేమిటి?"
    "నేను ప్రయాణీకుణ్ణి కాను. టైమ్ పాస్ కోసం వచ్చాను."
    "ఓహ్! ఇంతకూ...ఆ వచ్చేరైలు...కాచిగూడ నుండి, సికిందరాబాద్...రూట్ లో వస్తుందా...లేక... సికిందరాబాద్ నుండి, కాచిగూడ వైపా?"
    "పో పోవయ్యా...నేనేమైనా... ఎంక్వైరీ ఆఫీసు క్లర్కును అనుకున్నావా?"
    "ప్లీజ్ సర్...చెప్పండి." అర్ధించాడు.
    "అరే...నాకు తెలీదు. వచ్చినప్పుడు...చూడు."
    "అది కాద్సార్! అది...ఏ ప్లాట్ ఫారమ్ మీదికి వస్తుందో తెలిస్తే...ఆ రైలుపట్టాల మీద పడుకుంటాను."
    "ఏంటీ?" ఆ వ్యక్తి కీచుగా అరిచాడు.   
    "అవును సార్...ఆత్మహత్య చేసుకుందామని."
    "ఏయ్...పిచ్చిపిచ్చిగా ఉందా! ఏం మాట్లాడుతున్నావ్?"
    "మంచిమంచిగా ఉంది. ఆత్మహత్య చేసుకుంటానని తెలుగులోనే కదండీ చెప్పాను..."
    "నీ పేరేమిటి?" కంగారుగా అడిగాడు ఆ వ్యక్తి.
    "నార్ల రాజశేఖర్."
    "చూడు రాజశేఖర్...నువ్వూ...."
    "నార్ల రాజశేఖర్!"
    "ఊఁ! సరేగానీ...రాజశేఖర్...నువ్వూ..."
    "నార్ల...నార్ల రాజశేఖర్."
    "ఓరి నీ ఇంటిపేరును...బొందలో పెట్ట! సరే...నార్ల రాజశేఖర్...నువ్వు...ఆత్మహత్య ఎందుకు చేస్కోవాలనుకుంటున్నావ్?"
    "అది నేను చెప్పను."
    "చెప్పకపోతే...రైలు ఏ పట్టాలమీదికి వస్తుందో నేనూ చెప్పను."
    "ఐతే...వేరేవాళ్ళను అడుగుతా..." అని రాజశేఖర్ వెళ్ళిపోసాగాడు.
    'వీడి అసాధ్యం కూలా!' అని మనసులో అనుకుంటూ...గబగబా...నార్ల రాజశేఖర్ వెనకే నడిచాడు ఆ వ్యక్తి.
    నార్ల రాజశేఖర్, మరో వ్యక్తిని అడిగి, రైలు ఏ ప్లాట్ ఫారమ్ మీదికి వస్తుందో కనుక్కుని...వేగంగా...ప్లాట్ ఫారమ్ చివరిదాకా నడిచి...క్రిందికి దిగేసి...పట్టాల మీదికి వెళ్ళాడు.
    "ఒరేయ్...ఆగు, ఆత్మహత్య మహాపాపం." అరిచాడు ఆ వ్యక్తి.
    "పో...పోవయ్యా. నన్ను చావనివ్వు." అన్నాడు నార్ల రాజశేఖర్ పట్టాలమీద...వైకుంఠం సీన్ లో...విష్ణువు పాడుకుంటున్నట్లుగా...పడుకుంటూ.
    "ఒరేయ్...లేవరా బాబూ." ఆనాడు ఆ వ్యక్తి అరుస్తూ.
    "అబ్బబ్బా! చచ్చిపోయేటప్పుడు...ప్రశాంతంగా చావనివ్వకుండా...ఏంటయ్యా నీ బాధ, గొడవా...ఆఁ! పో...పో..."
    "బాబూ...రాజశేఖర్..."
    "నార్ల రాజశేఖర్."
    "ఒరేయ్...వొంట్లో కాల్షియం తగ్గిందని డాక్టర్ చెప్పాడని, శ్మశానంలోనికి వెళ్ళి...కాష్టంలో ఎముకలు ఏరుకొచ్చి, వాటిని చూర్ణం చేసి తినే...తిక్కలోడిలా ఉన్నావే! లే...లేలే..." ఆరిచాడు ఆ వ్యక్తి.
    "అబ్బా! అసలే....గాలి సరిగ్గా లేదని, ఉక్కపోస్తోందని నేను ఏడుస్తుంటే....సూర్యకాంతం తమ్ముడిలాగా...ఏంటయ్యా నీ నసుగుడు. ఏదైనా...అట్టముక్క దొరుకుతుందేమో చూడు. వీలైతే...విసురు." అన్నాడు నార్ల రాజశేఖర్.
    "ఏమిటీ...నేను విసరాలా? నువ్వు...ఆనందంగా...ఆత్మహత్య చేసుకుంటావా?  నేను, నీ కంటికి చద్ది దినపత్రికను చదివే మొద్దుమొహంలా కనిపిస్తున్నానా? మర్యాదగా...లేస్తావా...పోలీసులకు ఫోన్ చెయ్యనా?"
    దూరంగా రైలుకూత వినిపించింది.
    అంతే!! ఆ వ్యక్తి...నార్ల రాజశేఖర్ వంక కోపంగా చూసి, క్రిందికి వంగి...రైలు పట్టాల మీది నుండి, అతణ్ణి లాగబోయాడు.
    అయితే...నార్ల రాజశేఖర్...ఆ వ్యక్తికన్నా బలవంతుడు. తాను లేవకుండా...రివర్సులో ఆ వ్యక్తిని లాగి...తన ప్రక్కన పడుకోబెట్టుకున్నాడు.
    "ఒరేయ్! వదలరా...నన్ను వదులు..." ఆ వ్యక్తి గింజుకోసాగాడు.
    "కూఁ...ఛుక్ ఛుక్ ఛుక్..." దూరంగా రైలు శబ్దం.
    "ఒరేయ్...నా పెళ్ళానికి నేనొక్కడినే మొగుణ్ణిరా! ఒరేయ్...నన్ను విడవరా. ఏదో...పుణ్యం చేద్దామని వస్తే.... నన్ను చంపుతావా..." ఆ వ్యక్తి గింజుకుంటూ ఏడవసాగాడు.
    రైలు వేగానికి...పట్టాలలో ప్రకంపనం!
    రైలు వేగంగా...దూసుకొచ్చింది!!
    "ఆఁ...." ఆ వ్యక్తి పెట్టిన కేక...రైలు శబ్దంలో కలసిపోయింది.
        *    *    *
    విద్యానగర్ లోని ఓ రెస్టారెంట్! సమయం...రాత్రి పదిన్నర.
    "ఒరేయ్! అది వారపత్రికో, మాసపత్రికో కాదు. మెనూ కార్డు. అంత లీనమైపోయి చదువుతున్నావేంటి?" అడిగాడు శేషు రవిని.
    "రేయ్...డబ్బు ఖర్చుపెడుతున్నాం. ఇక్కడ ఏమేం ఉన్నాయో...ఆ మాత్రం చదవకపోతే ఎలా?" అన్నాడు రవి.
    "ఎప్పట్లా చికెన్ బిర్యానీ వద్దు. కాస్త వెరయిటీగా ఆర్డరిద్దాం. నాకు గొర్రె లివర్ కావాలి. అలాగే...తలకూడా." అన్నాడు కిరణ్, నాలుకను పెదవులకు అద్దుకుంటూ.
    "వారం రోజుల్లో జరగబోయే కబడ్డీ పోటీలకు...ఇప్పటినుండే బలం సంపాదించాలిగా!
    "ఊఁ...మటన్ తిందాం...చికెన్ వద్దు ఈసారి." అన్నాడు శేషు. అందరూ ఆర్డరిచ్చారు.
    "వెజ్ నూడిల్స్." అన్నాడు రామశాస్త్రి.
    మిగతా ముగ్గురూ పగలబడి నవ్వారు.
    "కోకిల మధ్య కాకిలాగా...మాలో నువ్వొక్కడివే వెజిటేరియన్ వి. నువ్వూ ముక్క తినటం అలవాటు చేసుకో శాస్త్రి." అన్నాడు శేషు.
    "కాకులూ...కోకిలలూ...పురుగులు తింటాయి. అంచేత, నీ పోలిక బాగాలేదు. కౄరమృగాల మధ్య...ఆవులాగా అను. బావుంటుంది." అన్నాడు శాస్త్రి, చురక అంటిస్తున్నట్లుగా.
    "అంటే...మేము కౄరమృగాలమా!" అన్నాడు రవి, వెటకారంగా.
    "మరి...వాటికీ, మీకూ ఏం తేడా? కనీసం అవే నయం. దేవుడు వాటికి ఆహారంగా ఇచ్చిన వాటిని, అవి తింటున్నాయి. మీరు అలా కాదు. రుచులకోసం అమాయకమైన ప్రాణులను తింటున్నారు." అన్నాడు శాస్త్రి.
    "నువ్వూ మా కులంలో పుట్టి వుంటే తెల్సేది." అన్నాడు శేషు.
    "కులం గురించి మాట్లాడడం అనవసరం. నేను ప్రాణం గురించి మాట్లాడుతున్నాను." అన్నాడు శాస్త్రి.
    "అబ్బ...ఛా...! అయినా...నీకేం తెల్సురా...నాన్ వెజ్ లోని మజా!" అన్నాడు కిరణ్.
    "జీవాలను పెంచి, చంపుకుతినడం మజానా! అది మానవుడికి పంటలు పండించడం...తెలీదు. ఇప్పటి పరిస్థితి అలా కాదే!" అన్నాడు శాస్త్రి.
    "ఏరా...నువ్వేదో పెద్ద అహింసావాదిలా ఫోజుకొడుతున్నావ్. ఏం? మొక్కలలో, ఆకులలో ప్రాణం ఉండదా?" ఇలాంటి చర్చలలో...'అహింసావాదం' పేరు చెప్పే శాఖాహారుల వాదనను చీల్చిచెండాడేందుకు వాడే బలమైన అస్త్రాన్ని వదిలాడు కిరణ్.
    "ఉంటుంది. మనం ఆహారం కోసమే...దేవుడు వాటిని సృష్టించాడు. కానీ, జంతువులను మాత్రం....మన ఆహారం కోసం కాదు." అన్నాడు శాస్త్రి.
    "ఛా! అలాగని దేవుడు నీకు చెప్పాడా?" అడిగాడు శేషు.
    అందరూ ఫక్కున నవ్వారు.
    శాస్త్రి సమాధానం చెప్పలేదు.
    అందరూ...భోజనం ముగించి, బయటికొచ్చి...శేషు కారు ఎక్కారు. వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్స్. శేషు, తన స్నేహితుడి కారు తెచ్చాడు. కారు...ఉస్మానియా యూనివర్శిటీ వైపు వెళుతోంది.
    "హ...లో...." ఓ కొత్త కంఠం.
    జలుబు చేసిన గేదె...అరుపులా ఉంది... ఆ కంఠం.
    కారు సడెన్ బ్రేక్ తో ఆగింది.
    అందరూ...డిక్కీ వైపు చూసారు. అంబాసిడర్ కార్లలాగా...డిక్కీ అంటే...కారు వెనక...సంపూర్ణంగా మూసుకుపోయి ఉండదు...ఈ రోజుల్లో రోడ్లమీద తిరిగే... తొంభై శాతం కార్లలో! కారు బ్యాక్ సీట్ వెనక...కాస్త స్థలాన్ని వదులుతారు! అదే డిక్కీ.
    "ఏయ్...ఎవర్రా నువ్వు?" కోపంగా అడిగాడు కిరణ్.
    ఆ వ్యక్తి...చిద్విలాసంగా నవ్వుతున్నాడు. ఆ వ్యక్తి చేతిలో...రివాల్వర్ ఉంది. రమణారెడ్డి వొంట్లోనుండి....పది కిలోల మాంసం మైనస్ చేస్తే ఎలా ఉంటుందో...ఆ వ్యక్తి శరీరం అలా ఉంది.
    "రేయ్...బక్కోడా! ఎవర్రా నువ్వు? దిగు...దిగుబే!" అన్నాడు శేషు.
    "చూడు నాయనా! వయసులో...నీకంటే పెద్దవాడిని. పైగా...నా చేతిలో...నల్లగా తళతళ మెరుస్తూ...ఈ బుజ్జిముండ ఉంది చూసారు కదా! కనీసం...దీనికైనా మర్యాద ఇవ్వచ్చుగా! పాపం...దీనికి నాకున్నంత సంస్కారం లేదు. తిక్కవాగుడు వాగితే...పాపం...దీనికి వాంతొస్తుంది. ఇందులో ఉండే ఇనుపగుండును వాంతి చేసుకుంటుంది. ఏం....నాయనా....అర్ధమయ్యింది కదా!" అన్నాడు ఆ వ్యక్తి.
    "అసలు...ఎవరు మీరు? మీకు ఏం కావాలి?" అడిగాడు శాస్త్రి.
    "ఇదీ...బుద్ధిమంతుడి లక్షణం అంటే! నా పేరు...ధర్మవ్యాదుడు. మీరు...ఈ వాహనాన్ని...సరాసరి....జీడిమెట్లదారిలోనికి తీసుకెళ్ళండి."
    నలుగురూ మొహామొహలు చూసుకున్నారు.
    "మీరు ఆలస్యం చేసినా, పారిపోజూసినా, అరిచినా, వెధవ తెలివితేటలు ప్రదర్శించినా...దీనికి వరుసగా వాంతులౌతాయి. ఆ తర్వాత మీ ఇష్టం."
    శేషు, ఏం చేద్దామన్నట్లు...మిత్రులవంక చూసాడు. మిత్రులు ఏం ఆలోచిస్తున్నారో....అర్ధం కాలేదు.
    "ఏం నాయనా! మచ్చుకు...వీణ్ణి కాల్చెయ్యనా?" రివాల్వర్, కిరణ్ కణతలకు గురిపెట్టి అడిగాడు.
    "ఒరేయ్ శేషూ...వెళ్ళరా...ఈయన చెప్పినట్లు చెయ్యి." భయంతొ అరిచాడు కిరణ్.
    కారు ముందుకు పరుగెత్తింది.
    అరగంటలో...జీడిమెట్ల దాకా వచ్చేసింది.
    రోడ్డుమీద అంతా చీకటి.
    "కారు...ఓ ప్రక్కన ఆపు నాయనా." అన్నాడు.
    కారు ఆగింది.
    "దిగండి నాయనా!" అన్నాడు, తానూ దిగుతూ.
    అందరూ దిగారు.    

 Previous Page Next Page