Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 3


    "ఆరోజు మీరు చెప్పింది అంతా నమ్మకుండా వచ్చేయటం చాలా పొరపాటు చేశాను అనిపిస్తుంది" అన్నాడు మెల్లగా.


    "పోన్లెండి ఇప్పుడు ఆ విషయం ఎందుకు ఇప్పుడు నన్ను నమ్మారు. నాకు చాలా సంతోషంగా ఉంది" అంది.


    "మిమ్మల్ని ఈ ఖయిదులోనుండి తప్పిస్తాను. మీకు స్వేచ్ఛ కల్పిస్తాను" అన్నాడు ఆవేశంగా.


    "స్వేచ్ఛ" అంటూ అదోలా నవ్వింది.


    "అదేమిటి అలా నవ్వుతున్నారు!" అయోమయంగా అడిగాడు.


    "లేకపోతే ఏమిటి! నాకు మీరు స్వేచ్ఛ కలిగిస్తారా! నన్ను ఈ ఇంట్లోంచి తప్పించగలననేనా మీ ఉద్దేశం! ఆ పనిమాత్రం మీరు చెయ్యలేరు. నామటికి నన్ను వదిలెయ్యండి. బ్రతికినన్నాళ్ళు ఈ ఇంట్లో ఖయిదుగా జీవచ్ఛవంలా బ్రతకటం లేదా ఏదయినా మందుమింగి చావటం అది ఒక్కటే నేను చెయ్యగలిగింది" అంది కన్నీళ్ళతో.


    ఆ మాటలకి అతని బండహృదయం  కాస్త కదిలినట్టయింది.


    "మీరు ఎందుకలా అనుకుంటున్నారు! నేను మిమ్మల్ని ఈ ఇంట్లోంచి తప్పించలేననా మీ ఉద్దేశం. వెయ్యిమంది లక్షమంది కృష్ణమౌళీలని అయినా ఎదిరించి మిమ్మల్ని ఇక్కడినుండి తప్పించగలను" అన్నాడు ఆవేశంగా.


    "నన్ను ఇక్కడనుండి తప్పించగానే పనికాదు. అవమానాలు హేళనలు ఎన్నో మీరు భరించవలసి వుంటుంది. అతని మనుష్యులు మిమ్మల్ని వెంటాడి ఒక్కర్నిచేసి ఏమైనా చెయ్యగలరు. ప్రాణం తియ్యడానికి అయినా వెనుకాడరు. నావలన రక్తపాతం అవటం నాకు ఇష్టంలేదు. అందుకే మిమ్మల్ని ఈ విషయంలో జోక్యం కలగజేసుకోవద్దు అంటున్నాను. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఫోన్ లో ఇవన్నీ చెప్పటం ఇష్టంలేక మిమ్మల్ని రమ్మని చెపుతున్నాను. ఈ విషయం పూర్తిగా మర్చిపోండి" అంది ప్రాధేయ పడుతూ.


    "అడుగు ముందుకు వేసిన తరువాత వెనక్కి అడుగెయ్యటం నా పద్ధతికాదు. చెప్పండి అసలు జరిగింది ఏమిటి? మీరు హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళటంలేదు" అడిగాడు.


    ఆమె త్వరగా సమాధానం ఇవ్వలేదు.


    జయరాం ఆ విషయంలో ఆమెకు ధైర్యం చెప్పి పర్వాలేదు చెప్పమంటే చెప్పింది.


    అతని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. కృష్ణమౌలి అంత దుర్మార్గుడా?


    అతని మాట వినకపోతే హాస్పిటల్ కి వెళ్ళకుండా యింటిలో పడేసి ఉంచుతాడా?


    పారిపోవడానికి చూస్తే బెదిరించి భయపెడతాడా! ఆమెను లొంగదీసుకోవాలని చూస్తాడా!


    చెప్తా ఈ జయరాం అంటే ఏమిటో తెలిసివచ్చేలా చేస్తా. ఇందుని పెళ్ళి చేసుకుంటానని శపధం చేశాడుగా అతని యింటిలోవున్న అంబికను తనతో తీసుకెళ్ళిపోతే తనంటే ఏమిటో తెలుస్తుంది.


    తెలిశాక ఏం చేస్తారు! తను కల్సుకుంటే అతని కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి విరిచేయగలడు.


    ఇది తనకి ఒక ఛాలెంజీగా అయింది.


    అదీ మంచిదే అనుకున్నాడు మనసులో కోపంగా.


    అంబిక అతనివేపు రెప్పవాల్చకుండా చూసింది.


    "పద నా వెంట బయలుదేరు" అంటూ ఆమె చెయ్యిపట్టుకున్నాడు. భయంగా చూసింది.


    "నీకు ఏం భయంలేదు, నేను ఉన్నాను పద" అన్నాడు ధీమగా.


    "నిజంగా అంటున్నారా మీరు ఆ మాటలు" అడిగింది నమ్మకం కుదరక.


    "నీకు ఇంకా నామీద నమ్మకం కుదరలేదా! త్వరగా బయలుదేరు" అన్నాడు. నమ్మకంగా చెపుతూ ఆమె మణికట్టుపై అతని చెయ్యి మరింత బిగుసుకుంది. అప్రయత్నంగా ఆమె తనచేతివేపు చూసుకుంది.


    జయరాం దృష్టికూడా ఆమె చేతిపై పడింది.


    ఇద్దరూ ఒక్కసారిగా తలలు పైకెత్తి ఒకరి ముఖంలోకి ఒకరు పరీక్షగా చూసుకున్నారు.


    ఆమె కళ్ళు కాంతితో తళుక్కుమన్నాయి.


    అతని కళ్ళల్లో కంగారు కనిపించి చప్పున వదిలేశాడు.


    ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు లీలగా కదిలి వెంటనే మాయమయింది.


    "పదండి త్వరగా వెళ్ళిపోదాం" అన్నాడు.


    ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి, బీరువా తెరిచి రెండు చీరలు తీసుకొని మరో గదిలోకి వెళ్ళి తిరిగి అయిదు నిమిషాలలో వచ్చేసింది.


    జయరామ్ ఆమెవైపు పరీక్షగా చూసి అలా ఉండిపోయాడు.


    అంబిక చీర మార్చుకొచ్చింది. చేతిలో పేపరుచుట్టిన చిన్న ప్యాకెట్ ఉంది.


    కట్టుకున్న చీర బాగా ఎంతో పాతది. వాయిలు చీర వెల్చిపోయి ఉంది. అక్కడక్కడ చిరుగులుపట్టి కూడా వుంది. ఆ చీరలో ఆమె ఇంకా పేదపిల్లలా అదోలావుంది.


    "ఏమిటి ఈ చీర కట్టుకున్నారు!" అడిగాడు ఆశ్చర్యంగా. ఆమె అదోలా నవ్వి "ఈ యింటిలోనుండి అతని సొమ్ము ఏమీ పట్టుకెళ్ళకూడదని నా ఉద్దేశం. అందుకే నేను ఈ ఇంటికి ఏ చీరలతో అయితే వచ్చానో, వెళ్ళేటప్పుడు కూడా ఆ చీరలతోనే వెళ్ళిపోవాలని, నేనను కట్టుకున్న చీర ఈ ప్యాకెట్ లో వున్న చీరతో వచ్చాను, అలాగే వెళ్ళిపోతున్నాను" అంది.


    "అలాగే" అంటూ నవ్వి పదండి అంటూ ముందుండి దారితీశాడు. నౌకర్లు ఎవరు చూడకుండానే వెళ్ళి కూర్చుంది. గేట్ మెన్ చూసి దగ్గరకు వస్తుంటే కారులోనుండి అంబిక చెప్పింది.


    కృష్ణమౌళిగారు రమ్మని ఫోనుచేస్తే వెళుతున్నాను అని.


    అతడు ఏమీ అనలేదు. కారు స్టార్టయింది.


    అతను డ్రయివ్ చేస్తుంటే పక్కనే కూర్చుంది.


    "మనం ఇప్పుడు ఎక్కడికెళుతున్నాం మీ యింటికా?" మనసులో ఉత్సాహాన్ని పైకి కనబరచకుండా మెల్లగా అడిగింది.


    "కాదు" ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు.


    "మరి ఎక్కడికి వెళుతున్నాం" భయంగా అడిగింది.


    "మీరు భయపడనవసరం లేదు. మిమ్మల్ని నా ఫ్రెండ్ యింట్లో అట్టే పెడతాను. మీకు ఏం భయంలేదు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ చాలా మంచివాళ్ళు, పరిస్థితి అర్ధం చేసుకుంటారు" అన్నాడు ఆమెకు ధైర్యం చెబుతూ.


    "ఏమిటో నాకు చాలా భయంగా వుంది. కొత్తవాళ్ళమధ్య నేను" అంది. ఆపై ఏమి మాట్లాడాలో తోచనట్లు అలా ఉండిపోయింది.


    "ఏం ఫర్వాలేదు నేను రోజూ వచ్చి చూసి వెళుతుంటాను" అన్నాడు.

 Previous Page Next Page