Home » Ladies Special » Morning Sickness

మార్నింగ్ సిక్‌నెస్‌ మంచిదే!

 


మాతృత్వం గొప్ప వరమే! కానీ అదో క్లిష్టమైన ప్రయాణం కూడా. తల్లిని కాబోతున్నానని తెలిసిన క్షణం నుంచి బిడ్డను ప్రసవించేదాకా, స్త్రీని రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో ‘మార్నింగ్‌ సిక్‌నెస్‌’ ఒకటి. అయితే ఈ మార్నింగ్‌ సిక్‌నెస్‌ విషయమై జరిగిన ఓ పరిశోధనతో... ఈ సమస్య వల్ల లాభమే కానీ నష్టం లేదని తెలుస్తోంది. ఈ వివరాలు ఇవీ...


ఏమిటీ మార్నింగ్‌ సిక్‌నెస్‌!

గర్భవతిగా ఉన్నప్పుడు వాంతులు, వికారంతో కూడిన ఇబ్బందినే మార్నింగ్‌ సిక్‌నెస్‌ అంటారు. ఈ సమస్య సాధారణంగా ఉదయం వేళల్లో మొదలై, రోజు గడిచేకొద్దీ సర్దుకుంటుంది కనుక ఆ పేరు వచ్చింది. గర్భవతులుగా ఉన్న స్త్రీలలో కనీసం 80 శాతం మందిలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనిని ఓ తప్పనిసరి పరిస్థితిగానే భావిస్తుంటారు.

 

ఇంతకీ ఈ మార్నింగ్‌ సిక్‌నెస్‌ ఎందుకు వస్తుందన్నదానిమీద ఇప్పటివరకూ ఓ స్పష్టత లేదు. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలోని హార్మోనులలో వచ్చే మార్పుల కారణంగానే మార్నింగ్ సిక్‌నెస్‌ వస్తుందని మాత్రం ఊహిస్తున్నారు. మార్నింగ్ సిక్‌నెస్‌ వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తనప్పటికీ... చిన్నా చితకా ఇబ్బందులు మాత్రం తప్పవు. మనసంతా అలజడిగా, పనులు చేసుకునేందుకు అడ్డంకిగా ఉండే ఈ సమస్య ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూడటం తప్ప మందులు కూడా అంతగా ఉపయోగం ఉండవు.

 

మంచిదేనట!

మార్నింగ్‌ సిక్‌నెస్‌ వల్ల ఇబ్బందులు ఉన్నమాట నిజమే. మరి దీని వల్ల గర్భవతులకు ఏమన్నా మేలు జరుగుతోందా అని పరిశీలించే ప్రయత్నం చేశారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం గర్భం దాల్చిన ఓ 797 మందిని ఎన్నుకొన్నారు. వారందరినీ కూడా రెండో నెల మొదలుకొని ఎనిమిదో నెల వరకూ ఒక డైరీని రాస్తూ ఉండమన్నారు. అందులో తమ ఆరోగ్యం సమస్యలను నమోదు చేయమని సూచించారు.

 

పరిశోధన కోసం ఎన్నుకొన్న 797 మంది అభ్యర్థులలో దాదాపు 60 శాతం మంది మార్నింగ్‌ సిక్‌నెస్‌కు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొన్నారని తేలింది. ఆశ్చర్యకరంగా వీరిలో గర్భస్రావం మాత్రం చాలా తక్కువగా నమోదైంది. మార్నింగ్ సిక్‌నెస్‌ ఇబ్బంది పడని స్త్రీలతో పోల్చుకుంటే, ఆ సమస్యను ఎదుర్కొన్న గర్భవతులలో గర్భస్రావం అయ్యే ప్రమాదం దాదాపు 75 శాతం తక్కువ నమోదైంది.

 

ఇంతకీ మార్నింగ్‌ సిక్‌నెస్‌ రావడానికీ పిండం ఆరోగ్యంగా ఉండటానికీ కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు స్పష్టమైన జవాబు ఉందంటున్నారు పరిశోధకులు. గర్భవతులు తినే ఆహారంతో పాటుగా రకరకాల సూక్ష్మక్రిములు కూడా శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఇవి గర్భస్థ శిశువుకి హాని చేసే ప్రమాదం లేకపోలేదు. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మన శరీరం చేసే పోరాటంలో భాగంగా కలిగే ఇబ్బందే మార్నింగ్‌ సిక్‌నెస్‌. కాబట్టి ఇకమీదట మార్నింగ్‌ సిక్‌నెస్‌ వస్తే అదేదో వ్యాధి అనుకుని బెంబేలెత్తిపోవడం మానుకుని... కడుపులో శిశువు క్షేమంగా ఉండబోతోందని తృప్తి చెందాలన్న మాట!

 

- నిర్జర.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.