Home » Ladies Special » infertility

 

వందేళ్లనాటి ఈ చిట్కాతో సంతానం ఖాయమట!

 

 

సంతానలేమి... ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య! ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని తిరగని చోటు ఉండదు. చికిత్స కోసం పెట్టే ఖర్చుకి లెక్క ఉండదు. కానీ నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు దీనికో పరిష్కారాన్ని కనుగొన్నారు. వందేళ్లనాటి ఓ చిన్నపాటి చికిత్సతో సంతోనలేమికి చెక్ పెట్టవచ్చని నిరూపించారు.

ఒకప్పుడు సంతానలేమి ఉన్న స్త్రీలలో, సంతానాన్ని ఉత్పత్తి చేసే భాగాలలో ఏదన్నా లోపం ఉందా అని తెలుసుకునేందుకు ఓ పరీక్ష చేసేవారట. దీన్ని hysterosalpingography (HSG) అంటారు. ఇందులో భాగంగా Fallopian tubes స్పష్టంగా కనిపించేందుకు అందులోకి ఏదన్నా ద్రవపదార్థాన్ని పంపేవారు. సాధారణంగా ఇందుకోసం గసగసాల నుంచి తీసిన నూనెని (iodised poppy seed oil) నింపేవారు. ఆశ్చర్యంగా ఇలా గసగసాల నూనెతో Fallopian tubesని శుభ్రం చేయగానే చాలామందిలో సంతానం కలుగుతుండేది. అంటే పరీక్ష కాస్తా చికిత్సగా మారిపోయిందన్నమాట! ఎప్పుడో 1914లో మొదలైన ఈ తరహా పరీక్ష క్రమేపీ మరుగునపడిపోయింది. ఇప్పుడు సంతానలేమికి కారణాలను పరీక్షించేందుకు, లోపాలను సవరించేందుకు ఆధునికమైన చికిత్సలు అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్లోని 27 వైద్య బృందాలతో కలిసి మళ్లీ ఆనాటి చికిత్సలోని ప్రామాణికతను గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం సంతానలేమితో బాధపడుతున్న 1119 మంది స్త్రీలను ఎంచుకున్నారు.

ప్రయోగం కోసం ఎంచుకున్న స్త్రీలలో కొందరి Fallopian tubesని గసగసాల నూనెతో ఫ్లష్ చేశారు. మరికొందరికి కేవలం మామూలు నీటితో ఫ్లష్ చేశారు. ఆరునెలలు తిరిగేసరికి నూనెతో చికిత్స పొందినవారిలో 40 శాతం మంది సంతానాన్ని పొందారు. నీటితో ఈ చికిత్సని పొందినవారు 29 శాతం మంది మాత్రమే సంతానాన్ని పొందారు. ఈ చికిత్సలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నమోదు కాకపోవడం మరో విశేషం.

ఇంతకీ ఈ చికిత్స ఇంతలా విజయవంతం కావడానికి స్పష్టమైన కారణం ఏమిటో మాత్రం పరిశోధకులు కనిపెట్టలేకపోయారు. బహుశా Fallopian tubesలో అడ్డుగా నిలిచే మలినాలను తొలగించడం వల్ల సంతానం సాధ్యపడుతూ ఉండవచ్చని మాత్రం భావిస్తున్నారు. గసగసాల నూనె వల్ల అందులో చేరిన ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోయేందుకు ఆస్కారం లభిస్తూ ఉండవచ్చు.

అదీ విషయం! ఇక మీదట సంతానం కోసం ఎవరన్నా తమ దగ్గరకు వచ్చినప్పుడు వైద్యులు ఒకేసారి IVFలాంటి ఖరీదైన చికిత్సల జోలికి పోకుండా... ముందుగా ఈ చిన్నపాటి చిట్కాను పాటించి చూడాలని పరిశోధకులు కోరుతున్నారు. సంతానం కోసం వైద్యులని సంప్రదించేవారు కూడా ఓమారు ఈ చికిత్స గురించి వైద్యుని సంప్రదించాలని సూచిస్తున్నారు. గసగసాల నుంచి తీసిన నూనె ఇప్పటికీ Lipiodol® Ultra-Fluid పేరుతో ఎలాగూ అందుబాటులోనే ఉంది.

- నిర్జర.

 





Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.