సాధారణంగా లైంగిక సమస్యలు ఎదుర్కొంటూ వైద్యుల వద్దకు వచ్చే వారు కానీ, వైద్యుల సలహా కోసం ప్రశ్నలు పంపేవారు కానీ ఎక్కువగా అడిగేది పురుషులైతే- సామర్థ్యం తగ్గిపోతోందని, స్త్రీలైతే కోరిక కలగడం లేదని, ఈ సమస్యకు పరిష్కారం సూచించమని. కోరిక తగ్గడానికి ఎన్నో కారణాలుంటాయి. వైద్యులు కౌన్సిలింగ్ ద్వారా వారి సమస్య కనుగొనడం, తగిన పరిష్కారం సూచించడం చేస్తారు. వీరు ఎదుర్కొనే సమస్యలకు అసలు కారణం మానసికిమైనవే అయి ఉంటాయి. తక్కువ మందికి శారీరకపరమైన సమస్యలుంటాయి.
మానసికపరంగా ఎదుర్కొనే సమస్యలో పైన చెప్పిన దానికి విభిన్నమైనవి కూడా ఉండొచ్చు. ఆ సమస్య ఎదుర్కొంటున్నామని ఎవరూ వైద్యుల వద్దకు రారు. ఆ సమస్య కోరిక ఎక్కువగా కలగడం. ఇలా ఎక్కువగా కలుగుతున్న వారు దానిని చాలా గొప్ప విషయంగా భావించుకుంటూ ఆ కోరిక తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కుతారు. దానివల్ల దుష్పరిణామాలు ఎదురైనప్పుడే వైద్యుల వద్దకు వస్తారు.
కోరిక సాధారణ స్థాయికన్నా ఎక్కువగా కలగడం కూడా ఓ సమస్యే అని గుర్తించాలి. కోరిక ఎక్కువగా కలిగినప్పుడు అక్రమ సంబంధాల జోలికి పోవడం తగ్గించుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారాలేమిటంటే… వివాహం కానివారైతే వివాహం చేసుకోవడం ఒక పరిష్కారం. అతి సులభమైన పరిష్కారమిది. ఇక్కడ నుంచే మరో సమస్య మొదలుకావచ్చు. అవి అనేక రకాలుగా ఎదురవుతాయి.
పురుషుడి అతి వాంఛ వల్ల స్త్రీ అతని పట్ల విముఖత పెంచుకోవచ్చు. కోరిక తక్కువగా ఉన్న యువతితో వివాహమైతే? అప్పుడు సమస్య మరో మలుపు తిరుగుతుంది. ఎటు తిరిగి ఎటు వచ్చినా కోర్కె తక్కువగా ఉండడం వల్ల కలిగే అనర్థమయితే ఉంటుందో ఎక్కువగా ఉన్నందువల్ల ఎదురయ్యే పరిణామాలు అదే విధంగా ఉంటాయి. సమస్య ఎటువంటిదైనా సరైన పరిష్కారమార్గమే వెతుక్కోవాలి.