Home » » Telugu Serial - Rampandu Leelalu
Home » » సిల్లీ ఫెలో - 100
Home » » మై డియర్ రోమియో - 6
Home » » సిల్లీ ఫెలో - 107
Home » » సిల్లీ ఫెలో - 113
Telugu Serial - Rampandu Leelalu

రాంపండు లీలలు (ఉడ్ హాస్ ఫర్ యూ)

రాంపండూ – పెసరట్ల సుబ్బీ

-ఎమ్బీయస్ ప్రసాద్

“సుబ్బీ – ఈ పేరు ఎలా ఉంది?”

“గొబ్బెమ్మలా ఉంది.

“జోక్ కాదు, నిజంగా ఒకసారి నమసులో అనుకుని చూడు. సు....బ్బి.... మెత్తగా, హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ఆస్వాదమో మరోటో లేకపోతే ‘ఆ’ తో వచ్చే ఇంకో దానిలాగానో లేదూ”

నా కేమీగా లేదు”

“తొందరపడి నీ అజ్ఞానాన్ని ఒప్పేసుకోవద్దు. నిదానించు. నాలుగుసార్లు అనుకుని చూడు. సు......బ్..... బి..... అహ్”

“ఇంతకీ అదేదో నీ కొత్త లవర్ పేరయివుంటుంది. అంతేనా? అంత పాతపేరుకింత కవిత్వం ఎందుకు?”

“పాత పేరేమిట్రా? అది మన తెలుగు పేరు. నేటివ్ నేమ్, అనూష్కా రాబైష్కా అని రష్యన్ పేర్లు పెట్టుకోవాలా? నీకు అయిదు నిమిషాలు టైమిస్తున్నాను. ఆ పేరు తలచుకుని నిన్ను నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని చూడు. మనసులో చిలక ఎగిరిపోతున్నట్టు, చుట్టూ కారు వసంతం కమ్మేసినట్టు, కాళ్ళు తెలిపోతున్నట్టు....”

“ఒయ్, నువ్వు కవిత్వం చెప్పే ప్రయత్నాలు ఆపేయ్. తెలుగుబాష ఖూనీ అయిపోతుంది. నువ్వన్న ఫీలింగు లేవీ నా మనుస్సులో మెదలటం లేదు. నువ్వేదైనా చెప్పేడ్చేదేదైనా ఉంటే చెప్పేడు. లేదా ఏడ్చేసి చెప్పు”.

“నీకు బుర్ర లేదన్న సంగతి నాకు చిన్నప్పుడే తెలుసు. హై స్కూలు రోజులనుంచి చూస్తున్నాను. ఎప్పటికైనా బుర్ర ఎదగకపోతుందా, వీడికి అబ్జర్వేషన్ పెరక్కపోతుందా అని..... అబ్బే.....” ఈ బాల్య మిత్రులలో సుబ్బి ప్రేమలో పడికొట్టుకుపోతున్న యువకుడే

రాంపండు. ముందు వెనకా ఎవరూ లేని అతనికి డబ్బు వచ్చే ఏకైక సాధనం వాళ్ల బాబాయ్ నెలనెలా ఇచ్చే పాకెట్ మనీయే. ప్రేమలో పడుతూండడం అనే పెద్దపనిలో తలమునకలుగా ఉంటుంటాడు. కాబట్టి ఉద్యోగం లాటి చిన్నచిన్న వ్యాపకాలేమి పెట్టుకోలేదు. అయినా అతని ఫ్రెండ్స్ ఎవరూ కూడా ఉద్యోగాలు చేసే బాపతు కాదు. ప్రస్తుతం సుబ్బి పేరులో గొప్పతనాన్ని గుర్తించలేక పోతున్న (ఆ రకం ఫ్రెండ్స్ లో) అనంతం కూడా ఒకడు. పూర్తిపేరు అనంతశయనం. తల్లిదండ్రీ కాలుమీద కాలు వేసుకుని తిన్నా తరగనంత ఆస్తి ఇచ్చిపోయారు. కానీ కాలు మీద కాలు వేసి పెట్టేవాడ్ని అమర్చి పెట్టకపోవడంతో తనే వెతుక్కున్నాడు. 

అచలపతి అనే సహచరుని. అనంతం పనులన్నీ – ఆలోచించడంతో సహా – అచలపతే చూసుకోవడంతో అనంతం బుర్ర తుప్పుపట్టిపోయిందని రాంపండు లాంటి వాళ్ల అనుమానం. ప్రజలలా అనుకుని పోతున్నారని అనంతానికి తెలుసు. అందుకే ఉక్రోషంతో. “ఒరేయ్, నీ సర్టిఫికెట్లు నువ్వే ఉంచుకో, ప్రేమా, దోమా వ్యవహారాలన్నీ నీకే! నేను హాయిగా లక్కీ బ్యాచిలర్ గా గడిపేస్తున్న వాణ్ని. నా వాళ్ళ క్కావలసిన సాయం ఏదైనా ఉంటే చెప్పు. చేతనైతే చేస్తా. లేకపోతే హాయిగా క్లబ్బుకి పోతా” అన్నాడు.

రాంపండు దిగొచ్చాడు. “మైడియర్ అనంతం! నువ్వు సాయంత్రం నేను చెప్పిన చోటుకు రావాలి. సుబ్బిని చూడాలి. నా సెలక్షన్ని మెచ్చుకోవాలి. ఆ తర్వాతే ఏమైనా సాయం కావాలంటే అడుగుతా” అన్నాడు.

“సరే ఎక్కడ చూడాలి? నీ సంగతి నాకు తెలియదా? ఏదో హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేసి ఉంటావు. ఎక్కడ?............. కాకతీయ గ్రాండా?” “కాకతీయా కాదులే. ఆ దగ్గర్లోనే.....”

ఆ ప్రకారం రాంపండు చెప్పిన చోటుకి వెళ్ళి చూడగా “భూగోళం రీత్యా చూస్తే రాంపండు చెప్పినది కరెక్టే ననిపించింది. అది కాకతీయాకు దగ్గర్లోనే గుడిసెల మధ్య ఉంది.

‘కానీ ఇంత నాసిరకం హోటల్లో గర్ల్ ఫ్రెండుకి డిన్నర్ ఇచ్చేస్థాయికి దిగజారాడా మనవాడు? వచ్చీ రాగానే అడగాలి’ అనుకున్నాడు అనంతం విరిగిన కుర్చీల్లో కూచోడానికి అవస్థపడుతూ.

అంతలోనే రాంపండు రావడం, అక్కడ సర్వర్ ని పిలిచి ‘సుబ్బిని పిలు’ అని చెప్పడం జరిగిపోయాయి.

హోటల్ గురించి అడగదలచుకున్న ప్రశ్న వాయిదా వేసి, “ఒరే రంపండూ, మరీ పాతకాలం పేరెందుకు పెట్టిందిరా వాళ్లమ్మ?” అని ఉత్సుకతతో అడిగేడు అనంతం.

“ఎందుకంటే తన పేరు సావాలమ్మ కాబట్టి” అని రాంపండు జవాబు చెప్పేడు.

“సావాలమ్మ అమ్మ మాత్రం.....”అని అనంతం అనుబంధ ప్రశ్న వేసేటంతలో ఓ అందమైన అమ్మాయి చకచకా వచ్చి “అల్లం పెసరట్టాండి? ఉల్లిపాయా? లేపోతే రెండూ కలేసి ఏసేయమంటారా?” అనడిగింది హుషారుగా.

అనంతానికి బుర్ర తిరగ నారంభించింది. ఆ తిరుగుతున్న బుర్రలోకే ఆ అమ్మాయిని సుబ్బిగా రాంపండు పరిచయం చేయడం, అలా వెళ్లగా చూసి తన సెలక్షన్ బాగుందాని అడగడం, పెసరట్లు పోయడంలో సుబ్బి నైపుణ్యాన్ని వర్ణించడం, పెళ్లి ఎక్కడ చేసుకుందాం అనుకుంటున్నాడో చెప్పడం – ఇవన్నీ దూరాయి.

గబగబా బయటకు లాక్కొచ్చి అడిగేశాడు. “ఒరేయ్, మీ బాబాయ్ అసలే పరమ ఛాందసుడు ఇలా పెసరట్ల సుబ్బిని చేసుకుంటానంటే ఒప్పుకుంటాడ్రా? నీకు ఇచ్చే పాకెట్ మనీ కూడా ఇవ్వడం మానేస్తే నువ్వేం తింటావ్? మీ సుబ్బికేం పెడతావ్?” అని.

“అందుకే కదరా నిన్ను పిలుచుకుని వచ్చింది. నువ్వేదైనా చేసి మా ఇద్దరికి పెళ్లి జరిగేట్లా చూడాలి”.

“నేనా!?” “నువ్వంటే.... అచలపతి..... నీకెక్కడ బుర్రేడిచిందిలే! అచలపతికి నా కేసు పూర్వాపరాలు చెప్పి సలహా అడుగు”.

అచలపతికి పూర్వాపరాలు చెప్పనవసరం లేకపోయింది. రాంపండు కథ ముందే తెలుసున్నట్టు మాట్లాడేడు.

రాంపండు బాబయ్య గురించి కూడా చాలా చెప్పాడు. ఆయన రాంవరం సింహాద్రిరావు గారని చాలా డబ్బు సంపాదించాడు. కష్టార్జితమే. భార్య పోయింది. పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు. చాలా ఖరాఖండీ మనిషి కావడంతో పిల్లలతో పడలేదు. ఎవరితోనూ కలవడు. విడిగా హాయిగా ఉంటున్నాడు. వంట చేసి పెట్టడానికి వెంకమ్మ గారనే విధవావిడ ఉంది.

సింహాద్రిగారు జిహ్వ చావల్యం మనిషి కావడంతో వెంకమ్మ గారిని మాటిమాటికి టిఫిన్లు చేసిపెట్టమని అడుగుతాడు. వేరే చోట ఉంటే రాకపోకలు కష్టమని తిండీ, బట్టా పెట్టి ఇంట్లోనే ఉండమన్నాడు. సుష్టిగా తినడం, పేపరు చదువుకోవడం, డబ్బు వడ్డీలకు తిప్పుకోవడం తప్ప వేరే పనులేమీ లేవు.

తన వంశం వాడే కదాన్న జాలితో రాంపండుని నెలకోసారి పిలిచి కాస్త డబ్బు ఇచ్చి, ఇంకొన్ని చివాట్లు పెట్టి పంపుతాడు.

ఇదంతా వినగానే అనంతానికి ఐడియా వచ్చేసింది. “ఆయనకి చిరుతిళ్లు ఇష్టం కాబట్టి రాంపండుగాడు ఓ నాలుగు కిలోలు పుల్లారెడ్డి స్వీట్స్ పట్టుకెళ్ళి..... కాదు, కాదు సుబ్బి చేసిన పెసరట్లు పట్టుకెళ్లి ఇచ్చి మీ క్కాబోయే కోడలు చేసినవని చెప్పి.....”

“సర్, ప్రస్తుతానికి అవేమీ తినే స్థితిలో లేడండాయన. బాగా తిని, తిని అజీర్తి చేసింది. రెండు నెలలపాటు లైటుగా తినమన్నాడు డాక్టర్. హఠాత్తుగా ప్రాణభయం పట్టుకుంది. రోజూ శాస్త్రుర్లు గారిని పిలిపించి పురాణం చదివించుకుంటున్నాడు” అన్నాడు అచలపతి.

“ఇన్ని వివరాలు నీకెలా తెలుస్తాయి, అచలపతీ? ఏం తింటావ్?” అనడిగాడు అనంతం. “మీకు పెట్టేదే సర్”. అన్నాడు అచలపతి అతి క్లుప్తంగా. అనంతానికి నమ్మకం చిక్కలేదు. అయినా దాని గురించి ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేసి, అహాన్ని పక్కకు పెట్టి జనాభిప్రాయంతో ఏకీభవిస్తూ “ఆచలపతీ, మన రాంపండు గాడి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కాస్త ఆలోచించి చూడు. నాక్కాస్త తలనొప్పిగా ఉంది. ప్రస్తుతం ఆలోచించడానికీ కష్టంగా ఉంది” అన్నాడు లౌక్యంగా.

“దీనిలో ఆలోచించడానికి ఏమీ లేదు సర్. రాంపండు గారూ సుబ్బిని వాడులుకోనంటున్నాడు. ఆయన మనసు మారదంటున్నారు. అంటే అటునుండి నరుక్కురావాలంటే పెద్దాయన మనసు, అంటే ఆలోచనా విధానం మార్చుకురావాలి. అన్నాడు అచలపతి అతి కూల్ గా.

“అది నిజమే, కానీ పాతకాలం మనిషి ఆయన ఏం మారతాడు? ప్రేమంటే ఆయనకేం తెలుస్తుంది? ఏ పన్నెండో ఏటో పెద్దవాళ్లు చెప్పిన పిల్ల మెళ్లో తాళికట్టి సంసారం చేసే ఉంటాడు. వీడెళ్లి అడిగితే ప్రేమా, దోమా ఏమిటి పోరా అంటాడు” అంటూ పాయింటు లాగేడు అనంతం. “మీరు చాలా కరక్టుగా చెప్పారు సర్. అందుకే ఆయన చేత కల్పనారాణి నవలలు చదివించమంటాను. ఆయన దృక్పథంలో తప్పకుండా మార్పు వస్తుంది”.

“కల్పనారాణా? అంటే ఆరడుగుల ధనవంతుడు మధ్య తరగతి అమ్మాయి కాదు కాబట్టి! ఆవిడ చాలా నవలలు రాసింది. ఏ వయస్సు వారైనా, ఏ లెవెల్ వారైనా సరే ప్రేమకు అతీతులు కారని చాటి చెబుతాయని. అవి చదివి వినిపిస్తే సింహాద్రిగారు తప్పకుండా మారుతారని నా నమ్మకం సర్”.

“అలాటివి చదివి వినిపిస్తానంటే కర్ర పుచ్చుకుంటాడు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావ్.

“పురాణం శాస్తుర్లు గారికి లంచం పెట్టడం ద్వారా....” అన్నాడు.

అచలపతి తేలిగ్గా. సింహాద్రిగారు పడకకుర్చీలో పులిలా కూచుని ఉన్నాడు. ఎదురుగా శాస్తుర్లు గారు మహాభారతం శ్రావ్యంగా పాడి వినిపిస్తున్నాడు. శంతనుడు పెళ్లి చేసుకోమని సత్యవతిని ఎలా బతిమాలుతున్నాడో మరీ మరీ చదువుతున్నాడు. సింహాద్రి గారికి విసుగు పుట్టింది.

“మరీ అంత సాగదీయడం ఎందుకండీ శాస్తుర్లు గారూ! ఏవిటో పిట్ట కథలు. చేపలు పట్టేదాన్ని చూసి ఒక రాజుగారు అంత అంగలార్చడం దేనికి? రాజే ఏమిటి, అంతకుముందు ఓ ఋషి గారు కూడా మహా మోహపడిపోయాడన్నారు. లోకంలో జరిగే విషయాలా ఇవి?”

“ఎంతమాట సెలవిచ్చారు? అప్పటికాలమే అనేముంది.... ఇప్పుడు కూడా చూస్తున్నాం. రాజాధిరాజులాటి పారిశ్రామికవేత్త కొడుకు ఒక సినిమా నటినీ, అదీ ఇంకో ఏక్టర్ తో కొంతకాలం కాపురం చేసినదాన్ని .... వరించి పెళ్లాడలేదూ? ప్రేమ బాబూ, ప్రేమ...... దాని మహత్తు అలాటిది. ఆ మధ్య మా మనవడు ఓ పుస్తకం తెస్తే చదివా. కల్పనారాణి అనే ఆవిడ రాసింది. నిజంగా జరిగిన కథని పేర్లు మార్చి రాసానని ముందు మాటలో రాసుకుంది. ప్రేమ గురించి ఏం రాసిందని....”? చెబుతూంటే శాస్తుర్లు గారు కళ్లు అర్థనిమీలితాలయిపోయాయి.

సింహాద్రి గారికి పంతం వచ్చింది. “ఏమిటండీ గాడిద గుడ్డు ప్రేమ? రేపా పుస్తకం పట్టుకురండి. దాన్నిండా ఎన్ని అవకతవకలున్నాయో చెబుతాను” అంటూ ఛాలెంజ్ చేశాడు.

నెల తిరక్కుండానే రాంపండు అనంతానికి ఫోన్ చేశాడు.

“మా బాబయ్య నిన్ను చుడ్డామనుకుంటున్నాడ్రా” అని.

“నన్ను చూద్దామని తహతహలాడే వావాళ్లేవరినీ నేనిప్పటిదాకా చూళ్ళేదు. నా గురించి ఏం చెప్పావేమిటి?” అని అడిగేశాడు సూటిగా.

“అబ్బే, చెప్పేందుకేముంది, మాటల్లో నీ గురించి చెపితే రేపాదివారం లంచ్ కి పిలు అన్నాడు. పెద్దాయన పిలిచాక వెళ్లకపోతే నొచ్చుకుంటాడు. నీకు పనీ, పాటా ఏముంది కనక. వెళ్లు”.

“నాకు సుబ్బితో పాటలు పాడే పని ఉంది. నువ్వు వెళ్లరా. మా బాబయ్య ఏమీ తినేయడులే”

ఇందులో ఏదో తిరకాసు ఉందని అంతరాత్మ ఘోషిస్తున్నా అనంతానికి అదేమిటో అంతు పట్టలేదు. సుబ్బి వ్యవహారంలో ఒక స్నేహితుడిగా మా వాడికి బుద్ది చెప్పద్డా అని ఇంటికి పిల్చి తిట్టడానికి ముసలాయన వేసిన ఎత్తేమో ఇది అన్న శంక ఒకటి ఎలాగూ ఉంది. సంప్రదిద్దామంటే సమయానికి అచలపతి ఊళ్లో లేడు. ఏమైతే అయిందని ఆదివారం సింహాద్రి గారింటికి వెళ్ళాడు. ఆయన రిసీవ్ చేసుకున్న తీరు చూడగానే అనుమానాల మాట దేవుడెరుగు.... ఉబ్బితబ్బిబ్బవడానికి వీల్లేనంత లెవెల్లో ఆశ్చర్య పోవలసిన అగత్యం ఏర్పడిపోయింది అనంతానికి.

“రండి, రండి........... మిమ్మల్ని చూడాలని ఎన్నాళ్ల నుండో అనుకుంటున్నాను. మా వాడితో మీ ప్రస్తావన వస్తే ‘అయ్యో నాకు తెలియకపోవడమేమిటి? మా బెస్టు ఫ్రెండు’ అనేశాడు.

ఇక అక్కణ్నుంచి మిమ్మల్ని చూడాలనీ, మీ సలహా కోరాలని ఒకటే ఇది. నా ఆహ్వానాన్ని మన్నించి మీరు రావడం నా అదృష్టం”. అంటూ ముసలాయన కౌగిలించుకున్న తీరు చూస్తే అనంతానికి ఆశ్చర్యంతోపాటు, అపనమ్మకం కూడా వేసింది ఇది కళా? నిజమా?’ అని.

తనగురించి ఇంత ఇదిగా ఎదురు చేసేవాళ్ళుంటారని ఎప్పుడూ అనుకోకపోవడం తప్పని తనని తాను తిట్టేసుకున్నాడు అర్జంటుగా. ఇంతలోనే పనిమనిషి వచ్చి “చిన్నయ్య రాంపండు గారూ ఫోన్ చేసారండి” అనడంతో జరుగుతున్నది వాస్తవమే అని తెలిసింది.

మెట్లు దిగి ఫోన్ అందుకునే సరికి రాంపండు కంఠమ్ ఆదుర్దాగా వినిపించింది. “ఎంత సేపయిందిరా నువ్వు వచ్చి? కొంపదీసి కల్పనా రాణి నువ్వు కాదని చెప్పెశావా?”

“ఇప్పుడే వచ్చాను. మీ బాబయ్య నన్ను చూసి ఆహా, ఓహూ అంటున్నాడు. నువ్వు ఫోన్ చేసి మంచి సీన్ చేడగొట్టేశావ్. అవునూ, మధ్యలో కల్పనారాణి గొడవేమిటి?” అన్నాడు అనంతం విసుగ్గా.

“అది చెప్దామనే ఫోన్ చేశా. మా బాబయ్య నిన్ను చూసి అంత ఇదవడానికి కారణం ఏమిటనుకుంటున్నావ్? ఆయన అభిమాన రచయిత కల్పనా రాణి నువ్వేనని అనుకుంటున్నాడు..... అలా నోరెళ్ళబెట్టావేమిటి?...... ఫోన్ లో ఆవులించినా పేగల్లెక్కపెట్టగలనులే! క్లియర్ గా చెప్తాను. సరిగ్గా అర్థం చేసుకో. నీ సలహా.... నీదేమిటిలే.... మీ అచలపతి సలహా బాగా పని చేసింది. మా బాబాయి ఛాలెంజ్ చేసి కల్పనారాణి నవలలు చదివించుకున్నాడుగా. క్రమంగా నచ్చడం మొదలు పట్టాయి. పోను, పోను వీరాభిమాని అయిపోయాడు. రోజంతా అవే చదివించుకుని, చదివించుకుని మొత్తం నవలలు అన్నీ చదివి పారేశాడు. ఇక అప్పన్నుంచి ఆ రచయిత్రిని కలవాలని ఒకటే కలవరింతలు”.

“మంచిదే. ఆ పబ్లిషరు నడిగితే ఆవిడ ఎడ్రసు చెబుతాడుగా. మధ్యలో నాపేరెందుకు చెప్పావ్?” అడిగాడు అనంతం అతి చికాగ్గా. రాంపండు కూడా విసుక్కున్నాడు అనంతం తెలివితక్కువతనానికి “ఆవిడని పిలిస్తే నాకేం లాభంరా? ఆవిడ నా తరపున వాదిస్తుందన్న నమ్మకం ఏముంది? అందువల్ల నా స్వంత బుర్ర.... నీలా అచలపతి బుర్ర ఉపయోగించి కాదోరేయ్.... నాసొంత బుర్ర.... అది ఉపయోగించి ఒక ప్లాను చేశా. ‘కల్పనారాణి కల్పితమైన పేరు. ఆ కలం పేరు పెట్టుకుని ఫలానా మా క్లాసు మెటు అనంతశయనమే ఈ కథలు రాస్తాడ’ని చెప్పా. అందుకే నీకీ ఆహ్వానం. ఆయన నీ భక్తుడిప్పుడు, ఆస్తులు, అంతరాలు పట్టించుకోవద్దని, నన్నూ సుబ్బిని ఆశీర్వదించమనీ నువ్వు చెప్పు. అంతేకాదు..... ఇది ముఖ్యంగా గుర్తుంచుకో, నువ్వసలే మతిమరుపుగాడివి. నాకిచ్చే పాకెట్ మనీ చాలదని చెప్పు. ఓ లక్ష ఇలా పడేయమను. ఆయన ఎప్పుడు పోతాడో, ఆస్తి ఎప్పుడు కలిసి వస్తుందో తెలియదు. ఈ లోపున మేం హోటల్ పెడదామనుకుంటున్నాం. సుబ్బి పెసరట్లు పోస్తుంది. నేను గల్లా పెట్టె దగ్గర కూచుంటా. అందుచేత వట్టి అక్షింతలతో సరిపెట్టక పెట్టుబడికి ఓ లక్ష.... పోనేఏ రెండు లక్షలు....”

“నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది గానీ నాకీ విషయం ముందు ఎందుకు చెప్పలేదు?” అనంతం అడిగేడు పళ్ళు నూరుకుంటూ.

రాంపండు పెళ్ళున నవ్వాడు. “ఏడిచినట్లే ఉన్నాయి. నీ తెలివితేటలు. ఇది ముందు చెబితే ఏ పూలినా ఒప్పుకుంటాడురా? అందుకే చెప్పలేదు. సర్లే వెళ్లి పని చూడు. రెండు లక్షలకు తక్కువయితే పుచ్చుకోనని చెప్పు” అని అనంతం చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేసేశాడు.

ఆ తరువాత అనంతం పడ్డపాట్లు పగవాడికి కూడా వద్దు. ముసలాయన కథలెలా రాస్తారని, మూడ్ ఎలా వస్తుందనీ, అసలిలాటి ఐడియాలు ఎలా వస్తాయని వంద రకాల ప్రశ్నలు ఉత్సాహంతోనే అడిగినా వాటికి జవాబు చెప్పడం అతనికి ప్రాణ సంకటం అయిపొయింది. అన్నిటికంటే గొప్ప కష్టం కల్పనారాణి రాసిన పుస్తకాల ప్రస్తావన వచ్చినప్పుడు! “అతకని మనసులు’ లో సౌజన్య పాత్ర అలా ఎందుకు మలిచేరు? మధ్యలోనే రైలెక్కేస్తే పోయేడిగా?” అని అడిగాడు సింహాద్రిగారూ. ఆ పుస్తకం ఏదో అనంతం చదివితేగా! అందుకని రైలు సమయానికి వచ్చి ఉండదు’ లాటి జవాబేదో ఇచ్చాడు. ముసలాయన తెల్లబోయాడు. అలాగే “మాలోకమే మా లోకం”, “అంతరాల సంగతి అంతే!”, బంధాలన్నీ బంద్” నవలల విషయంలోనూ ఇంచుమించు అలాటి సమాధానాలే ఎదురయ్యాయి. రచయితలు మూడీ మనుషులని వినివుండడం చేత సర్దుకుని “భోజనాలు చేద్దాం రండి” అని పిలిచాడు.

భోజన సమయానికి రాంపండు అందుకున్నాడు. హమ్మయ్య అనుకున్నాడు అనంతం. ఈ టాపిక్ తప్పినందుకు సంతోషించినా రాంపండు సైగల భాష అర్థం కాక అవస్థ పడవలసి వచ్చింది. సింహాద్రిగారు వంటింట్లోకి వెళ్లగా చూసి “ఒకే అనేశాడా?” అని అడిగేడు రాంపండు ఆదుర్దాగా.

“ఏదీ, ఇక్నా మొదలు పెట్టలేదే! భోజనాల దగ్గర ఆ సంగతి ఎత్తుదాం” అని హామీ ఇచ్చాడు. భోజనం చేస్తూ సింహాద్రిగారు అసలు విషయం చెప్పాడు. “మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించిన కారణం ఒకటి వుంది. మీరు పుస్తకాలు రాస్తారు గానీ అవి ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయో బహుషా తెలుసుకోలేరు. మీ పుస్తకాలు చదివి మారిన వ్యక్తిని కాబట్టి ఆ విషయం మీకు చెప్పి మీ ఆశీస్సులు.... నా జంటే చిన్నవాళ్లు కదా... పోనీ అభినందనలు పొందుదామని పిలిచాను. నేనూ ఒకప్పుడు పెద్దకుటుంబాల వాళ్లు చిన్న కుటుంబాల జోలికి వెళ్లకూడదని అనుకునేవాన్ని కానీ ఈనాడు నేను మారిన మనిషిని డానికి కారణం మీ పుస్తకాలు!” అని ఎఫెక్టు కోసం కాస్త ఆగాడు. ప్రశంసలు స్వీకరించడానికి అనంతం తన పంకించి నోరు విప్పబోయేటంతలో సింహాద్రి మళ్ళీ అందుకున్నాడు.

“ఉదాహరణకి మనం దోసెలు, పెసరట్లు అవీ తింటాం. బాగున్నాయనుకుంటాం. కానీ దాని వెనుక ఉన్న మనిషి ఎవరు అని పట్టించుకోం... జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో తెలుసుకోమని ఆత్రేయ చెప్పినట్లు ఇంత రుచైన పెసరట్లు చేసిన ఆ అమృత హస్తం ఎవరిదని ఒక్కసారి ఆలోచిస్తే మనకు వాళ్ల మీద ప్రేమ పుట్టుకు వస్తుంది...”

ఇదే సమయమని రాంపండు డొక్కలో పొడవడంతో అనంతం నోరు విప్పబోయాడు,

“అందుకే మీ రాంపండు పెసరట్ల సుబ్బిని...” అంటూ చెప్పడానికి నోట్లోని స్వీటు అటూ, ఇటూ, సర్దుకోబోతుండగానే ముసలాయన వాక్యం పూర్తి చేసేశాడు. “....

అందుకే మా వంటావిడ వెంకమ్మను నేను ప్రేమించడం మొదలు పెట్టాను. అసలు నాకు మొదటినుండీ ఆమె పట్ల ప్రేమ ఉందనుకుంటాను. కానీ పైజాతి అహంభావంతో కళ్లు మూసుకుని ఉన్నాను. మీ పుస్తకాల ధర్మమాని నా కళ్లు తెరుచుకున్నాయి. అందుకే మా వివాహ వార్త మీతోనే మొదటిగా చెప్పి... వెంకమ్మా... ఇలా రా!” అని పిలిచాడు.

అనంతం పక్క సీట్లో ఉన్న రాంపండు తూలినట్టయ్యాడు. అనంతం కంగారుపడి “రాంపండు” అని అనబోయాడు.

సింహాద్రిగారు తన ధోరణిలోనే ఉన్నాడు. “రాంపండు సంగతి చెప్పేదేముంది? ఇన్నాళ్లూ ఏదో నాకు తోచినది నెలనెలా ఇచ్చేవాణ్ణి నాకు సంసారం ఏర్పడుతుంది. కాబట్టి ఇకపై అలా ఇవ్వడం కుదరదు. వెంకమ్మ ఏమంటుందో మరి! తనకు కూడా పిల్లల్ని కని, గొప్పగా పెంచాలని ఆశ. వారసులకోసం ఆస్తి దాచకపోతే ఎలా? రాంపండు కేముంది? హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు. మీ “లోకానికి సవాల్” లో హీరో డబ్బున్న తండ్రిని కాదని బయటకు వచ్చి ఆటో నడిపి.... ఏరా రాంపండూ, నువ్వది చదివావా?.... అరె, వీడేడి....” అంటూ ఖంగారుపడ్డాడు

సింహాద్రిగారు, అప్పటికే రాంపండు కింద మూర్చపడి వున్నాడు! ఊరు నుండి వచ్చాక ఆచలపతిని మందలించేడు –

“నీ సలహా బెడిసి కొట్టింది. పపాపం రాంపండు సంగతి ఏమయిందో తెలుసా?”

“విన్నాను సర్. సుబ్బి చెప్పింది. ఇంకా ఏమైనా కావాలంటే సాయంత్రం పార్కులో కలిసినప్పుడు అడుగుతాను” అన్నాడు అచలపతి కూల్ గా.

“ఇది రెండో మలుపా? సుబ్బి ఎప్పట్నుంచి తెలుసు నీకు?”

“ముందునుండీ నా ఫ్రెండే! రాంపండు గారు వచ్చి తన చేత హోటల్ పెట్టిస్తాననడంతో కాస్త ఊగింది.

ఇప్పుడాయన పెసరట్లకే అరువు పెట్టే స్థితికి రావడంతో రాంపండు గారికి రాంరాం చెప్పేసింది.”

“పాపం, ఆ భగ్న హృదయుడి హృదయం ఎప్పటికి రిపేరవుతుందో కదా!” అంటూ వాపోయాడు అనంతం. మీ కాయన సంగతి తెలియనిదేముంది? అతి త్వరలోనే అయిపోతుంది” అన్నాడు అచలపతి.

నిజమే! పదిహేను రోజులు తిరక్కుండా రాంపండు కంటబడింది షాలిని!!!!

(హాసం పత్రిక సౌజన్యంతో ...)


సిల్లీ ఫెలో - 100

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 100

 

- మల్లిక్

"బాబోయ్... ఇలా తర్జనభరజనలు చేసి ప్రయోజనం లేదు. నువ్వు వెంటనే వెళ్ళిపో... ఆ మోహన్ గాడికి

ఏదయినా నీకు తోచింది చెప్పు. సీత వీపుమీద చెయ్యితో తోసాడు బుచ్చిబాబు.

బట్టలు తీసెకెళ్ళాలా?" అడిగింది సీత.

"ఊ... నీ సూట్ కేస్ తీసుకుని వెళ్ళు"

"ఇంతకీ ఎన్ని రోజులు వాళ్ళింట్లో వుండాలి?"

"అబ్బా! నేను తర్వాత వచ్చి మాట్లాడ్తా కదా నువ్వెళ్ళు.

"కూరా, చారు అన్నీ అయిపోయాయి. నువ్వు అన్నం మాత్రం వండుకో"

"సరే సరే సరే... నువ్వు పద"

సీత సూట్ కేసు నడుకుని వెనక తలుపుగుండా బయటికెళ్ళి పోయింది.

బుచ్చిబాబు పరుగెత్తుకుంటూ వెళ్ళి ముందు తలుపులు తెరిచాడు.

ఎదురుగా పర్వతాలరావు కోపంగానూ, పార్వతమ్మ అయోమయంగానూ నిల్చుని వున్నారు.

"అదేంట్రా! ఒంటరిగా వుండి హోటల్ తిండి తిని నీ మతేమైనా చలించిందా పాపం?" అడిగింది పార్వతమ్మ.

"కాదు... దెయ్యం పట్టింది తింగరెధవకి" ముక్కులు పొంగిస్తూ అన్నాడు పర్వతాలరావు.

"రండి... రండి" లోపలికి రండి నాన్నా! బాగున్నావా అమ్మా?" అంటూ వారి చేతిలోని సూట్ కేసులు అందుకుని

లోపలికి దారి తీసాడు బుచ్చిబాబు.

ఆ ఇద్దరూ అతని వెనకాలే లోపలికి వచ్చారు.

"ఆ! ఏం బాగోడమోలే? నువ్వెళ్ళిన దగ్గర్నుంచి నీ మీద బెంగపెట్టుకున్నా చూడు ఎలా చిక్కిపోయానో పాపం"

అంది పార్వతమ్మ.

"నువ్వేం చిక్కలేదు. బాగానే ఉన్నావే" అన్నాడే బుచ్చిబాబు సూట్ కేసులు హాలులో ఓ మూల పెడుతూ.

"ఆ! నోరు తెరిచింది పార్వతమ్మ.

"వచ్చిన వెంటనే మొహాన దభీలున తలుపేసేసి పావుగంట బయట నిలబెట్టి అప్పుడు కుశలప్రశ్నఇస్న్నావా

ఏబ్రాసివెధవా? సాలు తలుపులు ఎందుకేసావు? లోపల ఏం వెధవపని చేస్తున్నావు?" మండిపడ్డాడు

పర్వతాలరావు.

 

 


మై డియర్ రోమియో - 6

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 6

 

స్వప్న కంఠంనేని

 

బైక్ ని తోసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు వైభవ్.
ఇంటికి చేరుకోగానే "బాబాయ్'' అంటూ అతనికి ఎదురొచ్చింది పింకీ.
వైభవ్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం. అతనికి ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. వైభవ్ తండ్రి పెద్ద మోతుబరి రైతు.
సిటీ అవుత స్కర్ట్స్ లో పొలాలు కొని వాళ్ళీ మధ్యే పల్లెటూరు నుంచి సిటీకి మకాం మార్చారు.
వైభవ్ చిన్నన్నయ్యకింకా పిల్లలు లేరు. పెద్దన్నయ్య కూతురే పింకీ.
వైభవ్ కి పింకీ అంటే ప్రాణంతో సమానం.
పింకీనెత్తుకుని లోపలికి నడిచాడు.
సోఫాలో కూర్చుని షూస్ విప్పుతుండగా తల్లి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది.
"నాన్నగారు లేరా అమ్మా?'' అడిగాడు వైభవ్.
"లేరురా. ఏదో పని మీద బయటకెళ్ళారు'' అని చెప్పిందామె.
ఇంతలో వైభవ్ పెద్దన్నయ్య మహేష్ బయటనుండి వచ్చాడు. వైభవ్ కి మహేష్ అంటే విపరీతమైన గౌరవం.
లేవబోతున్న వైభవ్ ని కూర్చోమంటూ అడిగాడు మహేష్.
"ఎరా కొత్త కాలేజీ ఎలా వుంది?''
"బానే వుంది అన్నయ్యా ...'' అన్నాడు వైభవ్. క్షణంపాటు అతని కళ్ళముందు హానిత, మీనా, రాజాలు మెదిలారు.
"ఊ! బాగా చదువుకో'' అని చెప్పేసి లోపలికెళ్ళిపోయాడు మహేష్.
వైభవ్ తన రూమ్ కెళ్ళి స్నానం చేసి బయటకొచ్చేసరికి హాల్లో పెద్ద వదిన మాధవి చిన్నాన్న అనిల్, చిన్న వదిన సుధలు క్యారమ్స్ ఆడుతూ కనిపించారు.
వైభవ్ కూడా వెళ్ళి ఆటలో కూర్చున్నాడు.
వున్నట్టుంది అనిల్ అడిగాడు.
"కాలేజీ ఎలా వుందిరా? ఎవరూ ఏడిపించడం లేదు కదా?''
వైభవ్ చిరాగా అన్నాడు "ఎందుకేడిపించడం లేదు? బాగానే విసిగిస్తున్నారు. కాకపొతే మరీ అతిగా టీజ్ చేస్తున్నారు''
"ఎందుకు? ఏమైంది?'' ఆసక్తిగా అడిగింది సుధ.
"ఆడపిల్లలు కదా ఎందుకులే అని ఊరుకుంటుంటే మరీ నెత్తికెక్కి విసిగిస్తున్నారు. ఛీఛీ'' పైకి వినబడేట్లే గొణుక్కున్నాడు వైభవ్.
"ఏమిట్రా? ఆడపిల్లలు ఏడిపిస్తున్నారా?'' అడిగాడు అనిల్.
"అవును'' బుంగమూతి పెడుతూ అన్నాడు వైభవ్.
ముసిముసిగా నవ్వుకున్నారు వదినలిద్దరూ.
వాళ్ళ నవ్వుచూసి ఉక్రోషంగా అన్నాడు వైభవ్.
"రేపట్నుంచీ చెప్తాను వాళ్ళ పని! ఎందుకొచ్చిన గోడవలే అని ఊరుకుంటుంటే బైక్ లో గాలి కూడా తీసేశారు.''ఆటయ్యాక అందరూ భోజనాలు చేశారు.
తరువాత వైభవ్ తన గదిలోకి వెళ్లాడు.
వైభవ్ వెనుకే వెళ్ళారు వదినలిద్దరూ.
"ఆ అమ్మాయిల పేర్లేంటి?'' అడిగింది మాధవి.
"ఏ అమ్మాయిలూ?'' ఆశ్చర్యంగా అడిగాడు వైభవ్.
"నిన్నేడిపిస్తున్నారే వాళ్ళు'' అంది సుధ.
"ఓ! మీరింకా ఆ విషయం మర్చిపోలేదా?వాళ్ళ పేర్లు హానిత, మీనా'' అన్నాడు వైభవ్.
"హనితా! పేరు భలే విచిత్రంగా వుందే'' అంది మాధవి.
ఒక్క క్షణం వైభవ్ కి హానిత గుర్తుకొచ్చింది.
ఆమె వాలుకళ్ళు, సంపెంగలాంటి ముక్కు, గులాబీ పెదవులు, సన్నగా, పొడుగ్గా, హూ కేర్స్ అన్నట్లుగా వుండే ఆమె నిర్లక్ష్యపు అవతారం.
"సర్లే! మేం వెళ్తున్నాం. నువ్వు పడుకో'' అంటూ అక్కడ్నుంచి నిష్క్రమించారు మాధవి, సుధలు.
ఆ రాత్రి వైభవ్ పడుకోబోయే ముందు తన డైరీలో రాసుకున్నాడు.
"హానిత! పేరే కాదు మనిషి కూడా విచిత్రంగా వుంది. అందమైన విచిత్రం''
హానిత తలెత్తి చూసింది.
ఎదురుగా నీలిరంగులో సముద్రం.
తెల్లటి నురగతో అలలు ఎగిసి పడుతున్నాయి.
వైట్ షర్టు, జీన్స్ వేసుకుని వుందామె.
ఆకాశానికేసి చూసింది.
ఆకాశమంతా నల్లగా, చిక్కటి చీకటితో నిండివుంది.
ఆ చీకట్లోంచి హానిత చూస్తుండగానే మిణుకుమిణుకుమంటూ నక్షత్రాలు పుట్టుకొచ్చి మెరవసాగాయి.
ఆ నక్షత్రాల్ని చూస్తూనే హానిత సంబరంగా ...
"ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యూ ఆర్'' అని అరుచుకుంటూ నక్షత్రాల్ని లెక్కపెట్టసాగింది.
పదో అంకె లెక్కపెట్టగానే సడెన్ గా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది.
నక్షత్రాలన్నీ గబగబా అటూ ఇటూ మారిపోసాగాయి.
క్రమంగా నక్షత్రాలన్నీ ఒక చోటికి చేరుకొని ఏదో రూపాన్ని సంతరించుకున్నాయి.
మొదట్లో హనితకు ఆ రూపం ఏమిటో అర్థం కాలేదుగానీ కొంతసేపటికి ఆ రూపానికి ఒక స్పష్టత ఏర్పడింది.
అది ఒక గుర్రం!
హానిత నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తూ గుర్రాన్ని చెయ్యూపుతూ పిలిచింది.
చుక్కల గుర్రం కిందికి దిగి హానిత ముందు ఆగింది.
గుర్రం మీద బంగారు కళ్ళెం, బంగారపు జీను వేసి వున్నాయి.
హానిత ఎగిరి గుర్రం మీద కూర్చుంది.
గుర్రం ఎక్కగానే హానిత చేతిలో ఒక బంగారు కొరడా ప్రత్యక్షమైంది.
హానిత కొరడా ఝుళిపించగానే గుర్రం పరిగెత్తడం ప్రారంభించింది.
సముద్రం ప్రక్కన ఇసుకలోంచి నురగల మీద కదం తొక్కుతూ పరుగెత్తుతున్న గుర్రం కాస్తా సడెన్ గా సముద్రం మీదుగా ఆకాశంలోకి లేచింది.
హానిత పైప్రాణం పైనే పోయినట్లనిపించింది.
ఒకవేళ నక్షత్రాలు కనుక విడిపోతేనో? అనుకుంది మనసులో.
ఆలోచన రాగానే ఆమె గుండె గుభేలుమంది.
కిందకి చూసింది.
గుర్రం సముద్రం మీదుగా పోతోంది.
సముద్రంలోకి చూసిన హానిత కళ్ళు తిరిగినట్లనిపించింది.
గుర్రాన్ని వాటేసుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది.
అలా ఎంతసేపో ప్రయాణించింది గుర్రం.
గుర్రం నేలమీద నడుస్తున్నట్లనిపించి కళ్ళు తెరచి చూసింది.
పర్వతాల మీదుగా పరుగెడ్తోంది గుర్రం.
ఆఉపచ్చతి చెట్లు, లోయలతో నిండివున్న పర్వతం.
హానితకక్కడ రాజా, వైభవ్, సురేష్ మరికొందరు క్లాస్ మేట్స్ కనిపించారు.
"హలో హనీ!'' అంటూ ఎదురొచ్చాడు రాజా.
"హాయ్'' అంది హానిత గుర్రం దిగకుండానే.
అలాగే గుర్రాన్ని వాళ్ళవైపుకు నడిపించిందామె.
హనితని చూస్తూ వైభవ్, సురేష్ టో అన్నాడు.
"ఎవరీ అర్థనారి? ఆ హెయిర్ కట్ ఏమిటో? ఆ స్కర్టు ఏమిటో? ఆ ప్రవర్తన ఏమిటో? పాయింట్ ఫైవ్ లా వుందే!''
హానిత కోపంగా చూసింది వైభవ్ వైపు.
వైభవ్ చిరునవ్వుతో చూస్తున్నాడు తననే.
గుర్రాన్ని వైభవ్ దగ్గరకు నడిపించింది. గుర్రాన్ని వెనక్కి తిప్పి దాని వెనుకకాళ్ళ దగ్గర డొక్కలో ఒక్క పోతూ పొడిచింది. గుర్రం ఎగిరి వెనుక కాళ్ళతో ఒక్క తాపు తన్నింది.
"తిక్క కుదిరిందా? లేకపొతే నన్నాట పట్టిస్తావా?'' అంటూ గర్వంగా గుర్రం దిగింది హానిత.
వెనక్కి తిరిగి చూసేసరికి రాజా కిందపడి పొట్టని చేత్తో పట్టుకుని ఏడుస్తున్నాడు.
వైభవ్ అక్కడే నిలబడి ఈ చోద్యాన్నంతా చిద్విలాసంగా చూస్తున్నాడు. గుర్రం తన్నింది వైభవ్ ని కాదని, రాజానని అప్పుడర్థమయింది హనితకి.
కోపంగా కొరడా ఝుళిపిస్తూ గుర్రం దగ్గరకెళ్ళింది హానిత.
"నేనొకళ్ళని తన్నమంటే నువ్వు ఒకళ్ళని తంతావా? అంతా నీ ఇష్టమేనా? నువ్వు గుర్రానివికావు, గాడిదవే'' అంటూ కోరడాని పైకెత్తింది.
హఠాత్తుగా చుక్కల గుర్రంలో నక్షత్రాలన్నీ అటూ ఇటూ పరుగులు తీసాయి.
గుర్రం మీద పర్వతంలాంటి మనిషి ఆకారం కింద మారింది.
ఆ మనిషిని చూసి హానిత ఆశ్చర్యపోయింది.
"గుర్రం మీనా ఎలా అయిందబ్బా?'' అనుకుంది.
మీనా హనితని చూస్తూ 'చచ్చిపోవా ప్లీజ్'' అంది.
సడెన్ గా హనితకు మెలకువ వచ్చింది.
"బాబోయ్ ఇది కలా?'' అనుకుంది.
టైం చూసుకుంది.
ఏడయింది.
"కాలేజీకి వెళ్ళాలి'' అనుకుంటూ లేచి తయారవడం మొదలుపెట్టింది.


సిల్లీ ఫెలో - 107

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 107

- మల్లిక్

"అయితే నన్నిప్పుడు సిల్లీగా విగ్గు పెట్టుకోమంటున్నావా ఏంటీ కొంపదీసి... నా వల్లకాదు బాబూ!!"

"భలేవాడివే... మేమెందుకంటాంరా నాయనా"... అంటూ స్టవ్ మీంచి కాఫీ దించేసి కప్పులోకి పోసి బుచ్చిబాబుకిచ్చింది.

"నాన్నారేరే అమ్మా?" అడిగాడు బుచ్చిబాబు.

"కూరగాయలు తేడానికి మార్కెట్ కెళ్ళారు.

"నేను హాల్లో న్యూస్ పేపరు చదువుకుంటూ కాఫీ త్రాగుతా"

బుచ్చిబాబు కాఫీ కప్పుతో హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్ తిరగేస్తూ కాఫీ త్రాగాడు. ఖాళీ కప్పు టీపాయ్ మీద పెడ్తుండగా పర్వతాలరావు చేతిలో కూరగాయల సంచితో వచ్చాడు.

"ఏరా... వెధవాయ్... తీరుబడిగా ఇప్పుడు లేచావా?" అని బుచ్చిబాబుని ప్రేమగా పలకరించి "హుష్..." అంటూ సోఫాలో కూలబడ్డాడు పర్వతాలరావు.

రెండు క్షణాల తర్వాత మొహం చిట్లించి చోస్తూ బుచ్చిబాబుని అడిగాడు "అవునుగానీ! పొద్దున్న పాలవాడొస్తే నేను పాలు పోయించుకున్నా... వాడేమో అమ్మగారు లేరా సార్? అని అడిగాడు. అమ్మగారెవరు?"

ఊహించని ఆ ప్రశ్నకి బుచ్చిబాబు చాలా కంగారు పడిపోయాడు. చచ్చాన్రా నాయనా... ఇప్పుడేం చెప్పాలి? అని సతమతమైపోతుండగా సడెన్ గా ప్లాష్ లా అతనికి ఆలోచన తట్టింది.

"అంటే అదీ... మరేమో నేను చీరకట్టుకుని పడుకుంటాను కదా... వాడు తెల్లారేవచ్చి బెల్లు కొడ్తే నేను నిద్రమత్తులో అలానే లేచి పాలు పోయించు కుంటుంటాను. వాడేమో ఆ అవతారంలో నన్ను చొసి నేనని అనుకోకుండా అమ్మగారు అనుకుంటాడు... హి హి హి"

"మరి మీసాలు ఉంటాయ్ కదరా పింజారీ వెధవా?" అనుమానంగా చూస్తూ అడిగాడు పర్వతాలరావు.

"తెల్లారి ఆ మసక వెలుతురులో వాడికి మీసాలు ఎక్కడ కనిపిస్తాయ్ నాన్నా..."

"మరి క్రాఫింగో?"

"అమ్మగారు తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుందేమో అనుకుని ఉంటాడు."

"అవునండీ.. వీడేమో చక్కగా బొట్టూ కాటుకా కూడా పెట్టుకుని పడుకుంటాడట పిచ్చి సన్నాసి" అప్పుడే అక్కడికి మంచినీళ్ళ గ్లాసుతో వచ్చిన పార్వతమ్మ అంది.

"వెధవ... వెధవన్నర వెధవ.. సన్నాసెధవ.. పింజారీ వెధవ... ఏబ్రాసి వెధవ... తింగరెధవ..." సోఫా కోడుకేసి తల కొట్టుకుంటూ బాధగా అన్నాడు పర్వతాలరావ్.


 


సిల్లీ ఫెలో - 113

 

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 113

- మల్లిక్

 

"నేను వంట చేస్కోవాలి!" అంటూ ఖాళీకప్పులు తీసుకుని లోపలికెళ్ళింది రామలక్ష్మి.

మోహన్ సోఫాలో కదిలాడు.

తను ఇలా కూర్చుంటే లాభంలేదు. సీత దగ్గర చనువు తీస్కోవాలి. తియ్యతియ్యగా మాట్లాడాలి" అనుకున్నాడు.

అతను అలా అనుకుంటుండగానే సీత లేచి నిలబడింది.

"అదేంటి లేచిపోయారు? కాసేపు కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు.

"లేదండీ.. పాపం వదినగారు ఒక్కరే అవస్థ పడుతుంటారు. నేవెళ్ళి  ఆవిడకి వంటలో సాయం చేస్తాను"

మోహన్ ఏదో అనబోయేంతలో సీత గబుక్కున లోపలికి వెళ్ళిపోయింది.

"వదినా? అంటే నేనేంటి? అన్నయ్యనా?" అనుకుని కసిగా జుట్టు పీక్కున్నాడు మోహన్.

"ఏంటో కిల్లారికిత్తిగాడిలా అలా జుట్టు పీక్కుంటున్నావ్? ఆ?... హిహిహి" ఉలిక్కిపడి గుమ్మం వైపు చూసాడు. అక్కడ మేనేజర్ ఏకాంబరం నిలబడి ఉన్నాడు.

మోహన్ ఉలిక్కిపడ్డాడు.

ఇప్పుడీ కిల్లారికిత్తిగాడెందుకు కొచ్చాడు?

రెండు క్షణాల తరువాత తేరుకుని "ర" ... రండి సార్ అన్నాడు.

"అదేంటి? నీకు నత్తి ఎప్పటినుండి వచ్చిందోయ్? ఆ? హిహిహి" అంటూ లోపలికి వచ్చి మోహన్ ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు.

మోహన్ చటుక్కున లేచి నిలబడ్డాడు.

"ఫరవాలేదు కూర్చోవోయ్! నేను ఆఫీసులోనే నీకు బాస్ ని. బైట ఫ్రెండునే" అన్నాడు ఏకాంబరం.

ఫ్రండా? ఇదెప్పటి నుండి?

అయోమయంగా అనుకున్నాడు మోహన్.

"కూర్చోవోయ్!" మరోసారి గట్టిగా ఏకాంబరం.

మోహన్ అతనికి ఎదురుగా కూర్చున్నాడు.

"ఊ.... ఆఫీసులో ఎలా వుందోయ్ నీ సీటు" అడిగాడు.

"చాలా హెవీగా వుంది సార్" చెప్పాడు మోహన్.

"ఊ... ఊ.... నాకు తెలుసు! ఆ బుచ్చిబాబు లేడూ.. ఆ కిల్లారి కిత్తిగాడి సీటు చాలా లైట్ గా ఉన్నట్టుంది... రేపు నీ ఫైల్సు సగం అతనికిచ్చెయ్"

మోహన్ తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు.

నిన్నటిదాకా డింగాల డిప్పి అని పొగిడిన బుచ్చిబాబుని ఈవేళ కిల్లారి కిత్తి అని తిడ్తున్నాడు.

"అలాగే సార్" అన్నాడు మోహన్ అతివినయం ప్రదర్శిస్తూ.

"సరేగానీ సీత కనబడదేం? ఇంట్లో లేదా?" హఠాత్తుగా అడిగాడు ఏకాంబరం.

మోహన్ ఉలిక్కిపడ్డాడు.

వీడు సీత గురించి అడుగుతున్నాడేం? సీత గురించి వీడికెందుకు? కొంపదీసి వీడిప్పుడు సీత కోసం రాలేదు కదా?"

"ఏంటోయ్! అడుగుతుంటే సమాధానం చెప్పవేం? సీత వెళ్లిపోయిందా?" మళ్ళీ అడిగాడు.

"అబ్బే లేద్సార్. వంట గదిలో వుంది సార్" మోహన్ అయోమయంగా అన్నాడు.

"అలాగా? నేను రమ్మన్నానని చెప్పు."

మోహన్ గతుక్కుమన్నాడు.

అయితే వీడు సీత కోసమే వచ్చాడన్నమాట. ఇలా ముసలోళ్ళు కూడా కాంపిటిషన్ కొస్తే కష్టమే! అనుకున్నాడు.

"ఇప్పుడే పిలుస్తాను సార్" అని లోపలికెళ్ళాడు మోహన్.

ఒక నిముషంలో సీత, మోహన్ బయటికి వచ్చారు.

"నమస్కారమండీ" అంది సీత ఏకాంబరాన్ని చూస్తూ. ఆమె మొహంలో అయోమయం.

"నమస్కారమమ్మా. రారా.. కూర్చో" అన్నాడు.

సీత ఏకాంబరం ఎదురుగా సోఫాలో కూర్చుంది.

"నువ్వు కూడా కూర్చోవోయ్."

మోహన్ సీత ప్రక్కన కూర్చోబోయాడు.

"నువ్విలా నా ప్రక్కకొచ్చి కూర్చోవమ్మా... అతను ప్రక్కన కూర్చుంటే నీకు ఇబ్బందిగా వుంటుంది పాపం. నేను పెద్దాడినేగా... ఫరవాలేదు" అన్నాడు ఏకాంబరం.

సీత ఏకాంబరం పక్కన కూర్చుంది.

హమ్మ కిల్లారికిత్తిగా! ఎంత దెబ్బకొట్టావురా! అనుకుంటూ ఏకాంబరం ఎదురుగా కూర్చున్నాడు మోహన్.

"చూడమ్మా... నీకు ఉగ్యోగం చేయడం ఇష్టమేనా?" అడిగాడు ఏకాంబరం సీతని.

ఇష్టమే అన్నట్టు తల ఊగించింది సీత.

"మరి మా ఆఫీసులు టెంపరరీగా ఎవరినయినా అపాయింట్ చేస్కుందామని మంచి క్యాండిడేట్ ఉంటే చెప్పమని బుచ్చిబాబుకి చెప్పాను. నీకు చెప్పాడా?"

"లేదండీ" అంది సీత.

ఏకాంబరం ఆశ్చర్యంగా చూసాడు. "ఏంటీ చెప్పలేదా? అంటే నిన్ను మించి క్యాండిడేట్ కాదని అనుకున్నాడేమో..." అంటూ గొల్లున నవ్వేసాడు.

సీత మొహమాటంగా నవ్వింది. మోహన్ లోపల్లోపల పళ్ళు నూరాడు.

"నిన్ను చూస్తుంటే చాలా తెలివైనదానిలాగా, చాలా చలాకీదానిలాగా కనిపిస్తున్నావు... నీకు నేను ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటున్నా. అఫ్ కోర్స్... టెంపరరీగానే అనుకో... నీ కిష్టమేనా?" అడిగాడు ఏకాంబరం.

"ఇష్టమేనండీ...." సంతోషంగా అంది సీత.

"వెరీగుడ్. రేపే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిపో"

సీత భుజం తట్టాడు ఏకాంబరం.

మోహన్ మొహం పాలిపోయింది.


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.