The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Psycho
సైకో - 17

"కాదు నాకు అందమయిన భార్య వుందని ... అవునూ, మన ఇంటి అడ్రెస్, ఫోను నెంబరు ఇచ్చావా?'' అనడిగాడు. అతడు మాట్లాడుతున్నదేమిటో అర్థమయిన గాయత్రి మొదట తెల్లబోయింది, తర్వాత ఆకులా కదిలిపోయింది.

ఆమె స్థితిని గమనించే స్థితిలో లేడు జయంత్ ... చెప్పుకుపోతూనే వున్నాడు. "ఈ తరహా క్లాత్ స్టోర్స్ లో సేల్స్ బోయ్స్ ని, గరల్స్ అందమయిన వాళ్లనే సెలెక్టు చేస్తారు. ఎందుకో తెలుసా? అందమయిన వాళ్ళు ఏ డ్రెస్ చూపించినా ఎదుటి వ్యక్తికీ అందంగానే కనిపిస్తుంది. అందుకని ...'' గాయత్రి కాళ్ళ క్రింద భూమి కదిలిపోతున్నట్టుంది. కాని, అప్పటికే జయంత్ కారు డోరు తెరిచాడు. షాప్ కుర్రాడు ప్యాకెట్స్ కారులో పెట్టాడు. కుర్రవాడు వద్దంటున్నా పదిరూపాయలు టిప్ ఇచ్చాడు జయంత్.

తాను ఎలా ఆ కారులో కూర్చుందో ఆ కారు ఎప్పుడు బయల్దేరిందో ఆమెకి తెలియదు. ఆమె మస్తిష్కంలో పెద్ద విస్ఫోటం ... గుండె అట్టడుగు పొరల్లో కదలిక మొదలయింది. దుఃఖం చెదపుట్టలా రేగుతోంది. గుండె గొంతుకకి అడ్డుపడిన ఫీలింగ్. అలాగే కళ్ళు మూసుకుని డాష్ బోర్డుమీద తల ఆన్చి కూర్చుంది.

"అప్పుడే ... 'డే డ్రీమ్స్' లోకి వెళ్లిపోయావా? దీనినే ఇంగ్లీషులో మెంటల్ ప్రాస్టిట్యూషన్ అంటారు. ఒక వేలియమ్, ఒక కంపోజ్ టాబ్లెట్ ఇవ్వలేనిది ఒక సెథిడ్రిన్, ఒక మార్ఫిన్ ఇంజెక్షన్ ఇవ్వలేని మత్తు ఇటువంటి స్వీట్ సిక్స్ టీన్స్ ఇస్తాయి. ఈ దేశంలో సజావుగా కాపురం చేస్తున్న వారిలో సగంమంది మనసులో ఒకరి రూపాన్ని నింపుకొని మరొకరికి శరీరాన్ని అప్పగిస్తున్న వారే ... ఏమంటావ్ మై స్వీట్ హార్ట్ ...'' అలవోకగా నవ్వుతూ అడిగాడు.

కాని అతడి నోటినుంచి వెలువడుతున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క ఫిరంగిలా ఆమె గుండెల్ని ఛిద్రం చేశాయి. ఆమె గుండె భగభగలకి ఆమెలోని దుఃఖం సయితం ఆవిరయిపోయింది ... కన్నీళ్ళు రాని స్థితి. నోటమాట రాక చేష్టలుడిగి చూస్తుండి పోయింది. గుండె కొట్టుకుంటోంది, ఊపిరాడుతోంది, కాని కళ్ళు మూతలు పడడం లేడు. పెదవులు తెరిపిడి పడడం లేదు. సజీవ శవంలా ఆమె అతడి పక్కనే ఫ్రెంట్ సీట్లో!

మరో పదినిముషాలలో కారు అతడి బంగ్లా చేరుకుంది. ఆ పదినిమిషాలూ అతడు ఏదో ఒకటి మాట్లాడుతూనే వున్నాడు. కారు హారన్ వింటూనే గేటు తెరచి పట్టుకున్నాడు గూర్ఖా, కారు పోర్టికో ముందాగింది. హుందాగా కారు దిగాడు జయంత్ అతడి వెనుకే ప్యాకెట్స్ తీసుకుని గూర్ఖా. అయిదు నిముషాలు ఆలస్యంగా కారు దిగిన గాయత్రి నెమ్మదిగా లోపలి వెళ్ళింది. ప్యాకెట్స్ విప్పి ఎవరి డ్రెస్ వారికి ఇస్తున్నాడు జయంత్, గుర్ఖాని కూడా మర్చిపోకుండా.

"ఎందుకుబాబు, హాస్పిటల్ కే చాలా ఖర్చుపెట్టావు ఇప్పుడు ఇంత ఖర్చుపెట్టి ఇవెందుకు?'' అని అంటున్న తండ్రి తన అడుగుల సవ్వడికి తల తిప్పడం చూసింది. తెల్లని పట్టుపంచెలు చూసి మురిసిపోతున్న బామ్మ కూడా తనని గుచ్చి గుచ్చి చూడడం ఆమె గమనించకపోలేదు.

సరిగ్గా ఆ స్థితిలో అడిగింది తల్లి "అదేమిటి బాబు, మా అందరికీ పేరుపేరున కొత్తబట్టలు తెచ్చి మీరు మాత్రం ఎందుకు తెచ్చుకోలేదు?'' అని.

ఆ మాటలు వింటూనే షార్ప్ గా రియాక్టయ్యాడు జయంత్. "ఈ మాట అడగవలసింది నన్నుగాదు, మీ అమ్మాయిని, ఇప్పటికే వీటన్నిటికీ చాలా ఖర్చయిపోయిందని మీ అమ్మాయి ముఖం నయాపైస అంత అయ్యింది. ఇహ మాకు కూడానా?''