.png)
"ఎందుకొచ్చావిక్కడికి?''
"నీకోసం సాగర్ - నాకిప్పుడర్థమయ్యింది ... నువ్ లేకుండా నేను వుండలేనని ... నీతో ప్రేమను నటిస్తున్నానని భ్రమపడ్డాను గానీ నిజంగా నీ ప్రేమలో బందీనయిపోయానన్న సంగతి అప్పుడు తెలీలేదు. "నువ్ కాదంటే నా జీవితం అంతం చేసుకుంటాను''
"శృతీ ... దయచేసి వెళ్ళిపో'' అసహనంగా అన్నాడు.
"నేను ఎక్కడికి వెళ్ళను ... నీతోనే వుంటాను. నన్ను పెళ్ళి చేసుకోవద్దు ... నీ యింట్లో సర్వెంటుగా వుండనీ ... కానీ నీతోనే నేనుండాలి- నన్ను వెళ్ళమని అనకు సాగర్ ... ప్లీజ్''
"మదన్ సంగతేమిటి?''
"మదన్ మనిషి కాదని తెలుసుకోవడానికి నాకింత కాలం పట్టింది. అతనికి రోజుకో కొత్త అమ్మాయి కావాలి. హి ఈజ్ సెక్స్ మానియాక్ సాగర్ - అతని ఆకర్షణకు లొంగి అతను చెప్పినట్టల్లా ఆడాను! కానీ నిజం తెలిశాక నీ దగ్గర కొచ్చాను. ఇప్పుడు నాకున్న ప్రపంచం నువ్వు ఒక్కడివే''
సాగర్ కి ఆమె మీద జాలి కలిగింది. "ఐటూ పిటీ యూ శృతీ ... కానీ మనిద్దరం కలిసి ఉండటం అసంభవం ... దయచేసి వెళ్ళిపో''
హఠాత్తుగా ఆమె ముఖంలో కోపం కనిపించింది. దాంతోపాటు ద్వేషం - "ఆల్ రైట్ ... వెళ్ళిపోతాను ... కానీ ఓ విషయం గుర్తుంచుకో! నేను ఆత్మహత్య చేసుకుని చస్తాను. కానీ నువ్వు హత్య చేసినట్లు నలుగురికీ తెలిసేట్లు కన్పిస్తాను. అప్పుడు నువ్వు జీవితాంతం జైల్లో మగ్గిపోవాలి. మరో అమ్మాయిని పెళ్ళి చేసుకునే అవకాశమే నీకు రాదు''
"శృతీ! ... దయచేసి వెళ్ళిపో ... నువ్వేం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు''
ఆమె కోపంగా వెళ్ళిపోయింది.
ఆ రాత్రంతా ఆలోచిస్తూనే వున్నాడు తన భవిష్యత్తంతా అగమ్యగోచరంగా ఉన్నట్లనిపించింది. ఆనందంగా గడిచిపోతున్న జీవితం ఒక్కసారిగా అల్లకల్లోలమై పోయింది. అందుకు కారణం ఒకే ఒకటి - రాంగ్ గాళ్! ప్రియురాలిని ఎన్నుకోవటంలో చేసిన ఒకే ఒక తప్పు- మొత్తం జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. కానీ తను మాత్రం ఏం చేయగలడు? ఎలాంటి ప్రియురాలిని ఎన్నుకోవాలో ఏ పుస్తకాల్లో వుంటుంది?
అంతా లక్ - అంతే - ఏదేమయినా మళ్ళీ క్రొత్తజీవితం ప్రారంభించాలి. తప్పదు. ఎప్పుడు తెల్లవారిందో తెలీదతనికి. తలుపు తట్టిన చప్పుడయింది. లేచి తలుపు తీశాడు. ఎదురుగ్గా పోలీసులు.
"నిన్ను అరెస్ట్ చేస్తున్నాను''
ఆశ్చర్యపోయాడు. "నన్నా?''
"అవును''
"ఎందుకు?''
"శృతిని హత్య చేసినందుకు''
"నేనా?''
"అవును-ఆమెను కత్తితో పొడిచి పారిపోయావ్ గానీ శృతి చాలా ఇంటెలిజెంట్ గాళ్ - నీ పేరు గోడ మీద రక్తంతో రాసింది''
కొద్ది క్షణాలు సాగర్ నోటివెంబడి మాట రాలేదు. తర్వాత నవ్వు వచ్చింది. "మీకు మతిపోయింది. శృతిని నేనెందుకు చంపుతాను?''
"రివెంజ్''
అతను వాళ్ళతోపాటు జీపులో కూర్చున్నాడు. ఇప్పుడు భయం కలగటం లేదు. తప్పకుండా మరో అంకిత లాంటి మనిషి నాకు సాయం చెయ్యకపోతారా? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఒకే జీవితకాలం అనుభవించాలా? ఏమో - ఇది కూడా ఏ పుస్తకంలోనూ రాసిలేదు. అనుభవించి తెలుసుకోవటమే.
-: అయిపొయింది :-
|
|

