.png)
లిన్ డార్టన్ తిరిగి వచ్చేటప్పటికి రాత్రయింది. గదికి వచ్చేప్పుడే దారిలో ధాబాలాంటి హోటల్లో ఇద్దరికీ డిన్నర్ ఏర్పాటు చేసి వచ్చాడు. భవానీకి పగలంతా బాగా పడుకోవటం వల్ల రాత్రి హుషారుగా వున్నట్లనిపించింది.
డిన్నర్ పూర్తీ చేసుకుని వచ్చేటప్పటికి రాత్రి 11 గంటలు దాటింది. ట్విన్ బెడ్స్ పక్క పక్కనే వున్నాయి. లిన్ ఒకవైపు భవానీ మరోవైపు మౌనంగా పరుండి భుక్తాయాసం తీర్చు కుంటున్నారు.
"ఏంటీ భవానీ! ఉత్తరంలో- చాలా విషయాలున్నాయి మాట్లాట్టానికి అని వ్రాశావు. నీ ప్రాబ్లమ్ ఏంటీ? నిస్సంకోచంగా చెప్పు! నేనేమైనా నీకు సాయం చేయగలనా? ఖజురాహో విడిచి వెళ్ళే సమయంలో నీ కలయిక సంతోషంతో బాటు దుఃఖాన్ని పంచుతుంది. చెప్పు, ధైర్యంగా ఒంటరిగా ఇలా నీవు వచ్చావంటే, యు ఆర్ ఎ డేరింగ్ లేడీ. మా దేశాల్లో మామూలేననుకో!'' అంటూ లిన్ ఇద్దరి మధ్య ఆవరించిన నిశ్శబ్దాన్ని దూరం చేశాడు.
భవానే ఈ పర్యాయం మౌనంగా లిన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. లేచి కూర్చుంది. ఏం చెప్పాలో. తన సమస్యను ఎలా విప్పి చెప్పాలో ఆలోచించసాగింది. ఒకటి రెండుమార్లు లిన్ ను చూసి మళ్ళీ తలదించుకుంది. "మీరు నిజంగా నాకు సహాయం చేయగలరా లిన్!''
"యస్, సర్టేన్లీ! మనీ ప్రాబ్లమా! నా దగ్గర చాలా వుంది''
"డబ్బు ప్రాబ్లమ్ కాదు''
"మరేంటీ? ఎనీథింగ్ పర్సనల్?''
"అవును. నాది వ్యక్తిగత సమస్యే! మీరు తప్పకుండా సహాయం చేస్తానంటేనే చెబుతాను. లేదంటే ఒక ఫ్రెండ్ గా బై చెప్పి వెళ్ళిపోతాను''
"ఇదిగో ప్రామిస్!'' అంటూ లిన్ భవానీ చేతిని తన చేతిలోకి తీసుకుని తన చేతిని వుంచాడు.
భవానీకి ధైర్యం వచ్చింది. లిన్ అరచేతిని ఆవేశంగా ముద్దు పెట్టుకుంది దుర్గ. ఆమె తోలి ముద్దులోని స్పర్శ లిన్ హృదయాన్ని కదిలించింది.
"నేను అమ్మా, నాన్నలతో పోట్లాడి వచ్చాను'' అంటూ కళ్ళనీరు పట్టుకుంది భవానీ.
"ఏం జరిగింది?''
"సమస్య పాతదే! అందరికీ ఎదురయ్యే సమస్యే! పెళ్ళి జరక్కపోతే ఏదో అనర్థం జరిగిపోయినట్టుగా భావించే మా సమాజంలో నేను ఇమడలేక పోతున్నాను మిస్టర్ లిన్!''
"ఏం చేయాలని నిశ్చయించుకున్నావ్?'' లిన్ ప్రశ్నలు సూటిగా వున్నాయి.
"మీతో వచ్చేయాలని నిర్ణయించుకుని వచ్చాను. నా నుండి మీకు ఎటువంటి ఇబ్బందులూ వుండవని హామీ యిస్తున్నాను. ఒక స్నేహితురాలిగా స్థానమిచ్చినా చాలు. మీకు సహకరించటానికి నాకు అవకాశం కల్పిస్తే చాలు. నేను ఇంతకంటే ఎక్కు వేమీ చెప్పలేను లిన్!''
"చూడు భవానీ, నేను ఎక్కడ వుంటానో, ఏం చేస్తూ తిరుగుతానో నాకే తెలియదు. నాకు బంధాలు నచ్చవు. అందుకే ఇంతవరకూ ఒంటరిగానే వుండిపోయాను. నేనెవరినీ ప్రేమించలేదు. 'ఖజురాహో' వచ్చాక ప్రేమలోని మాధుర్యం నా హృదయంలో చోటు చేసుకుంది. ఆ ప్రేమ ఒక వ్యక్తికీ పరిమితమైంది కాదు. జంతువులతో, మొక్కలతో కూడా అదే ప్రమతో మాట్లాడతూ నవ్వుతూ తిరగాలనిపిస్తూ, తిరుగుతూ వుంటాను. నన్నెవరేమనుకుంటూన్నారో గమనించను. హద్దుల్లో జీవించటం నాకు చేతకాదు భవానీ! మరి నీవు ఇక్కడ పుట్టిన దానివి, బాగా ఆలోచించు''
"అన్నీ ఆలోచించే ఒక నిర్ణయానికొచ్చాను. మీరు నాకు తోడుంటే విషాన్నైనా త్రాగి జీర్ణించుకోగలను. ఎన్ని కష్టాలనైనా ఓర్చుకోగలను''
"నా తరపు నుండి ఎటువంటి షరతులూ వుండవు. అలాంటి స్వేచ్చనే నేనూ కోరుకుంటాను. ఐనా 'ఖజురాహో' భవానీ, శీలభద్రుడికి పెట్టిన పరీక్ష లాగా నీకు నేను ఒక పరీక్ష పెట్టదలచుకున్నాను ....''
"ఏమిటా పరీక్ష?''
"పెళ్ళంటే, ఐమీన్ మీ పద్ధతిలో పెళ్ళంటే నాకిష్టం లేదు. మనసులు కలిశాక మంగళ సూత్రానికంత విలువ నా దృష్టిలో లేదు. మరి అవేమీ జరగకుండా ఈ రాత్రి నీవు నాతో గడుపగలవా? ఎటువంటి షరతులూ నా కిష్టముండవని నీకు ముందే చెప్పాను ...'' భవానీని పరీక్షగా చూస్తూ అన్నాడు లిన్!
"ఇప్పుడు మీరు అడిగినది షరతు క్రింద రాదా?''
"వెరీ గుడ్ క్వశ్చన్! యూ ఆర్ రైట్ భవానీ! ఇది కూడా నీ ధైర్యానికి పరీక్షే తప్ప మరోలా అనుకోవద్దు ...'' అంటూ మళ్ళీ "నీకిష్టమైన షరతులుంటే చెప్పు'' అన్నాడు లిన్.
ఏమీ మాట్లాడలేని దుర్గాభవానీ లిన్ ఒడిలో వాలిపోయింది. తన చూపును అతడి చూపుతో కలిపింది.
*****
ఖజురాహో మీద పరిశోధన పూర్తీ అయింది. అనంతమైన దారుల్లో అసంఖ్యాకమైన యాత్రికులు ఎ దారైనా ఏదో ఒక మజిలీ చేర్చక తప్పదు. మళ్ళీ దారి మొదలౌతుంది. ప్రయాణం మళ్ళీ కొనసాగుతుంది. తను వెళ్ళిపోయే ముందు చివరిసారిగా పలుకరించాలన్న మనసుతో ఖజురాహో శిల్పాల దగ్గర నిల్చున్న లిన్ డార్టన్ కు వీడ్కోలు చెబుతూ "మళ్ళీ ఎప్పుడొస్తావ్?'' అని అడుగుతున్నట్టుగా అగుపించాయి ఆ శిల్పాలు.
ఒకరితో మరొకరు, ఎవరెంత చెప్పుకున్నా, చెప్పలేని దెంతో ప్రతి ఒక్కరి జీవితంలో మిగిలిపోతూనే వుంటుంది. మళ్ళీ నిరీక్షణ ... ఆగిపోయినదేదో పూర్తీ కాలేదన్న ఆవేదన, మిగిలిపోయినదేదో మౌనంగా ఆగిపోయినదెక్కడో నన్న అసంతృప్తి-అందుకేనేమో యుగాల నుండి "ఖజురాహో'' ఎదురు చూస్తూనే వుంది. ఎందరు వచ్చివెళ్ళినా, మరెవరికోసమో ఎదురుచూసే యీ ఖజురాహో గురించి ఎంత రాసినా, ఎంత చెప్పినా, వ్రాయలేని దెంతో, చెప్పలేనిదెంతో మిగిలిపోయిందన్న భావనే చివరకు తనకు మిగిలిపోయిందా?'' అనుకున్నాడు లిన్ డార్టన్.
*** అయిపొయింది ***
|
|

