.png)
చెంచమ్మను చూస్తూనే ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. సాక్షాత్తూ దేవత చెప్పిందని ఆ చంద్రరేఖ పని పట్టవచ్చు. అందుకే సంభాషణను ఆయన తన దారిలోకి మార్చుకున్నాడు.
"అవున్రా ... ఇదంతా ఎవరిపనో తెలుసా?''
చెంచమ్మ అలా అన్న వెంటనే భూపతిరెడ్డి మధ్యలో దూరాడు. 'అదంతా నా పనిరా' అని ఆ దేవత అంటుందని ఆయనకీ తెలుసు. "ఇంత ఘోరం జరగడానికి కారణం మన ఊరిలోని మంత్రగత్తె అని కూడా తెలుసు తల్లీ''
"శెభాష్ ... నిజం గ్రహించావురా బిడ్డా. దేవత ఊర్లో లేకుంటే మంత్రగత్తెలే రాజ్యమేలుతార్రా'' చెంచమ్మ పళ్ళు పటపట కొరికింది.
"ఆ మంత్రగత్తె పీడ వదిలించుకుంటాం తల్లీ'' భూపతిరెడ్డి ఐడియా గ్రహించాడు దామాచారి. అందుకే అలా అన్నాడు.
"అట్లానే బిడ్డల్లారా! మంత్రగత్తెలు ఊర్లోవుంటే నేను రాను'' చెంచమ్మ చెప్పింది.
"లేదు తల్లీ నువ్వు రావాల. మమ్మల్నెప్పుడూ కాపాడుతుండాల'' జనం అరిచారు.
"మంత్రగత్తె ఉనికే లేకుండా చేస్తాం. జాతర జరిపిస్తాం. నువ్వు మమ్మల్ని కరుణించాలి'' భూపతిరెడ్డి ప్రార్థించాడు.
"అన్నీ అయ్యాకే వస్తాం. మీ పనులు మీరు చేయండి'' అంది చెంచమ్మ.
"నీ ఆజ్ఞ అయిందికదా ... ఇక చూడు మా ప్రతాపం'' దామాచారి జనంవంక చూస్తూ అన్నాడు.
"మీ ఇష్టం. నేను చెప్పింది చేయకపోతే ఊరు వల్లెకాడై పోతుంది'' అని చెంచమ్మ మౌనం వహించింది. జనం ఒక్కసారిగా ముందుకు ఉరికారు. గంగమ్మతల్లి గుడిలోంచి వెళ్ళాక మునుపే ఆమె పాదాలకు నమస్కరించాలన్న వారి కోరికతో అక్కడంతా తొక్కిసలాట ప్రారంభమైంది.
"ముందు మనం చేయాల్సిన పని ఒకటుంది'' భూపతిరెడ్డి జనాన్నుద్దేశించి గట్టిగా అరిచాడు.
చెంచమ్మ పాదాలను తాకాలని ప్రయత్నిస్తున్న జనం అలా ఆగిపోయారు. అంతమంది ఉన్నా క్షనంసేపు నిశ్శబ్దం పేరుకుపోయింది. "ఊరుకోసం ... దేవత తిరిగి గుడిలోకి రావడంకోసం మీరు ఏం చేయమన్నా చేస్తాం'' రాఘవరావు సైనికుడిలా ధృడచిత్తంతో అన్నాడు.
"అవును ... అవును'' జనం అరిచారు.
"ఆ మంత్రగత్తె పని పటాలి'' దామాచారి కళ్ళు కసితో క్రూరంగా మెరుస్తున్నాయి.
"మనం చేయాల్సింది అదే'' అన్నాడు భూపతిరెడ్డి. ఉన్మాదంతో ఊగిపోతున్న జనం ఊర్లోకి బయల్దేరారు. రెచ్చిపోయిన జనాన్ని తమ గుప్పిట్లోనే ఉంచుకోవడానికి భూపతిరెడ్డి అరుస్తున్నాడు. "ఇది ఇంతకాలం మనల్ని మోసం చేసింది. ఊరు ఊరునంతా శ్మశానం చేయడానికి పూనుకుంది. దానికి నీతిలేదు, నియమంలేదు, దేవుడులేడు, పిశాచాలతోనే దాని స్నేహం, దెయ్యాలతోనే దాని సహవాసం. అది చేయని ఘోరంలేదు. ఇళ్ళను కాల్చేసింది, పశువుల్ని చంపేసింది. మనం ఇలా వదిలేస్తే ఊరికే చేతబడి చేస్తుంది'' ఎప్పుడైతే ఆయన చేతబడి అన్నాడో జనం మరింత కోపంతో పెట్రేగిపోయారు. ఈ ఘోరాన్ని వాళ్ళు పరిగెట్టడం ప్రారంభించారు.
అదే సమయంలో చెంచమ్మను ఎలా బాగుచేయాలా అని ఆలోచిస్తున్న చంద్రరేఖ చిట్టి భోజనానికి పిలుస్తున్నా లేవకుండా మంచంమీద పడుకుంది. ఆమె ఇంటికి సమీపించిన జనం ముందుగా ఆమె ఇంటిముందున్న తడికల్ని పీకివేసి లోపలికిపోయారు. అంతమంది జనం ఇంటిమీద ఎందుకు పడుతున్నారో అర్థంకాని చంద్రరేఖ పైకి లేవబోయింది. "ఇదిగో ఇక్కడ'' చంద్రరేఖను గుర్తించిన ఒకడు అరిచాడు.
తనమీద ఎవరో ఏదో కుమ్మరించినట్టు తెలుస్తూనే వుండి చంద్రరేఖకి. అది ఏమిటో తెలియడంలేదు. కానీ మరుక్షణంలోనే అది కిరసనాయిల్ అని వాసనబట్టి తెలుసుకుంది. ఏం చేయబోతున్నారు తనని? జనం ఎందుకంత ఆవేశంతో వున్నారు? ఆమె ఆపైన ఆలోచించే సమయంకూడా చిక్కలేదు. ఈ గందరగోళానికి చిట్టి బయటికి వచ్చాడు. "వాడ్ని కూడా వదలకండర్రా'' దామాచారి అరవడం తరువాయి ఒకడు తన చేతిలోవున్న కిరోసిన్ డబ్బాను చిట్టిమీద బోర్లించాడు.
ఇది గమనించిన చంద్రరేఖ ఒక్క ఉదుటున చిట్టి దగ్గరికి రాబోయింది. ఇది గ్రహించిన ఒకడు ఆమె చేయి పట్టుకున్నాడు. వాడి పశుబలం ముందు ఆమె ప్రయత్నం వ్యర్థమైంది. "ఇంకా చూస్తారేమిటి? ఇది ఇంకొక్క క్షణం బతికున్నా ఆ గంగమ్మతల్లి మనల్ని జన్మలో క్షమించదు'' భూపతిరెడ్డి అలా అరవడంతోనే మరింత కిరసనాయిల్ ని ఆమెమీద కుమ్మరించారు జనం. చంద్రరేఖకి ఏం జరుగుతూ వుందో అర్థమైంది. భూపతిరెడ్డి జనాన్ని తనమీద ఉసికోల్పాడని తెలిసింది.
తను కాదన్నందుకు భూపతిరెడ్డి ఎంత దారుణానికి ఒడిగట్టాడో గ్రహింపు కొచ్చింది. ఇలాంటి రాక్షసుడ్ని ఏం చేసినా పాపంరాదు. ఇల్లు కాలిపోయినప్పుడు, పశువులు చనిపోయినప్పుడు, తనను శ్మశానంలో చూసినప్పుడు జనం ఎందుకు తనను అనుమానంగా చూశారో అర్థమైంది. ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు గుంపులోంచి దూసుకొచ్చిన అగ్గిపుల్ల ఆమెపైన పడింది. ఠక్కున మంటలు పైకి లేచాయి. చిట్టి ఏడుస్తూ దగ్గరికి రాబోయాడు. మరో పుల్లవచ్చి అతనిమీద పడింది. అతనూ అంటుకున్నాడు.
చంద్రరేఖ, చిట్టి సజీవదహనం అవుతూంటే భూపతిరెడ్డి, దామాచారి పెదవులమీద విరిసిన విషపునవ్వు ఆ ఎర్రటికాంతిలో భయంకరంగా కనిపిస్తోంది. ఎప్పుడైతే చంద్రరేఖ, చిట్టిని మంటలు ఆక్రమించుకున్నాయో జనం వెనక్కి జరిగారు. మధ్యలో కాలిపోతున్న వాళ్ళిద్దర్నీ చూసి మంత్రగత్తె పీడ వదిలిందని జనం సంతోషిస్తున్నారు. బట్టలు కాలుతుంటే ఒళ్ళంతా చాకులతో కోస్తున్నట్టు మంటలు పుడుతున్నాయి చంద్రరేఖకి. జనం అజ్ఞానం చూస్తుంటే ఆ సమయంలో ఆమెకి జాలేసింది తప్ప కోపం రాలేదు.
అయితే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఊర్లోని స్త్రీల మానప్రాణాల్ని కొల్లగొడుతున్న భూపతిరెడ్డి, దామాచార్ని మాత్రం ఆమె క్షమించలేకపోయింది. ఆ సమయంలో కూడా ఊరి బాగుకోసం ఆలోచిస్తున్న ఆమెకు ఠక్కున తను చేయాల్సింది గుర్తుకొచ్చింది. ఇక ఆలస్యం చేయలేదు. మండుతున్న తన ఒంటినంతా స్వాధీనంలోకి తెచ్చుకుని ముందు వరసలో నిల్చొని తన సజీవదహనాన్ని ఆనందంగా తిలకిస్తున్న భూపతిరెడ్డి దగ్గరికి పరుగెత్తింది.
అతను ఏం జరుగుతూ వుందో గ్రహించేలోపునే అట్లానే చేతులు చాచి బలంగా కౌగిలించుకుంది. క్షణంలో ఆయనకు కూడా మంటలు లేచాయి. ఇదంతా గ్రహించిన చిట్టి తన పని తనకు గుర్తొచ్చినట్టు దామాచారిని తన చేతులతో బంధించాడు. "అయ్యయ్యో ... రక్షించండి'' అని దామాచారి అరుస్తున్నాడుగానీ జనంలో ఎవరూ ముందుకు వెళ్ళడానికి సాహసించడంలేదు. చంద్రరేఖ, చిట్టి ఎంత ఘోరానికి ఓడిగాట్టారో అర్థమైందిగానీ వాళ్ళని ఎలా రక్షించాలో తెలియలేదు జనానికి. అప్పటికే మంటలు తప్ప మనుషులు కనిపించడంలేదు.
దామాచారి, భూపతిరెడ్డి మంటలకు తట్టుకోలేక అరుస్తూ పరుగులు ప్రారంభించారు. చంద్రరేఖ, చిట్టి కిందపడిపోయారు. మరో ఐదు నిముషాల్లో వాళ్ళు నలుగురూ మరణించారు.
----- అయిపొయింది -----
|
|

