The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Itlu Nee Chiluka
ఇట్లు నీ చిలుక 159

గెస్ట్ హౌస్ లో రాత్రికి సెట్ బలవంతంగా ఆ అమ్మాయిని అనుభవించే సీన్ తలచుకుంటే అప్పుడే చిరునవ్వు మొదలైంది సెట్ మనుషులకి. వారానికో నెలకో ఇలాంటి సినిమా చూస్తుంటారు వాళ్ళు. హీరోయిన్ లా బావుంది అనుకున్నారు వాళ్ళు మనసులోనే. "కార్లో కూర్చో పెట్టండి'' అందరూ వీథికి ఓ పక్కగా ఆపిన కారు దగ్గరికి బయల్దేరారు. వాళ్ళు ఇంటిమెట్లు దిగుతుండగా ఒక్కసారి కేకలు, అరుపులు మిన్నుముట్టాయి.

ఏమైందో తెలియక ఎవరికి వారు ఠక్కున ఆగారు. వీథిలో కలకలం రేగింది. కొందరు పరుగులు తీస్తున్నారు. మరికొందరు ఇదంతా మామూలేనన్నట్లు నింపాదిగా నడుస్తున్నారు. అమ్మాయిలూ మరికొంతమంది పురుషులు అర్థనగ్నంగా ఎటు వున్న వాళ్ళు అటే లేచి పరిగెడుతున్నట్టు కనిపించారు పోలీసులు.

అంత గందరగోళం ఏ సమయంలో జరుగుతుందో బాగా తెలుసు కాబట్టి సావిత్రి తన మనుషుల్ని తొందర పెట్టింది. ఇందుమతిని పట్టుకున్న ఆమె మనుషులు వేగంగా ఆమెను నడిపిస్తున్నారు. సెట్ డ్రైవర్ చటుక్కున ముందుకు దూకి డోర్ తెరచినట్టు పట్టుకున్నాడు. ఇంకో సెకను ఆగి వుంటే ఆమెను లోపలి తోసేసేవారే. కానీ అప్పుడు జరిగిందా సంఘటన.

ఓ పోలీస్ జీప్ ఠక్కున ఇంటి ముందాగింది. వెనక కూర్చుని వున్న శతరూప ఒక్క ఉదుటున కిందకి దూకి కారులోకి తోస్తున్న తన కూతురిని పట్టుకుని బయటికి లాగేసింది. మరుక్షణంలో ఇంటిని పోలీసులు చుట్టుముట్టేశారు.

రెండు రోజులు సపర్యలు చేశాక ఇందుమతి కోలుకుంది. కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా తల్లి శతరూప పక్కనే బత్తాయి జ్యూస్ కలుపుతున్న కవిత కనిపించారు. "ఎక్కడున్నాను?'' అని అంది ఇందు. అంతలో ఎవరిదో దగ్గు వినిపిస్తే అటుకేసి చూసింది. దగ్గుతో పాటు పడుకున్నదల్లా పైకి లేచిన అమ్మమ్మ కనిపించింది. ఆమె పెదవులమీద చిర్నవ్వు పౌర్ణమి రోజున సముద్రంలో పడిన వెన్నెల చారలా వుంది. "మనింట్లోనే'' చుట్టుపక్కల పరిసరాల్ని కనిపెట్టి అంది. తమ ఊర్లో తామున్నామన్న భావన ఇందుమతికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తోంది.

"అమ్మా ...!'' గుండెల్నిండా పిలిచింది శతరూపను.

"ఏమిటి ...?'' నవ్వుతూ దగ్గరికి వచ్చింది.

"ఆ బాస్టర్డ్ భరణి గాదని పోలీసులు అరెస్ట్ చేశారా?'' అసహ్యం ముఖమంతా వూరగా ప్రశ్నించింది.

"ఆ వాడినే ఏమిటి ... చిత్ర, సావిత్రి అంతా కటకటాల వెనకున్నారు'' అని లోపలికి వెళ్ళబోయింది శతరూప.

"అమ్మా ...!'' మళ్ళీ పిలిచింది ఇందుమతి.

ఏమిటన్నట్టు నొసలు చిట్లించింది శతరూప.

"నువ్వు నీ కథ ముగిస్తూ ఓ వాక్యం అన్నావు గుర్తుందా? మగాళ్ళు చాలామంది కానీ వాళ్ళు చేసే మోసం ఒక్కటే అని చెప్పారు. నా కథ మొదలు పెడుతూ నేను చెప్పే వాక్యం ఏమిటో ఊహించగలవా? మగాడు ఒక్కడే కానీ వాడు చేసే మోసాలు మాత్రం చాలా'' అంది ఇందుమతి వేదాంత ధోరణిలో తనలోపల పేరుకుపోయిన వేదన అంతా ఆ మాటలతో బయటికి కొట్టుకుపోయినట్టు తల్లిని చూస్తూ హాయిగా నవ్వింది ఇందుమతి.

--- అయిపొయింది ----