.png)
ఆమె ఆపకుండా చెబుతూనే వుంది. “పెళ్ళిలో లాభం పురుషుడికే గానీ స్త్రీకి కాదు. మీకు లాభం వుంది కాబట్టే మళ్ళీ అదే తంతు వుంది. లేకుంట మీరెప్పుడో దానికి తిలోదకాలు ఇచ్చేవాళ్ళు. సంఘంలో వుండే కట్టుబాట్లు, నీతి నియమాలు, నైతిక విలువలు- అన్నీ పురుషులకు అనుకూలంగా వుండడమే ఇందుకు సాక్ష్యం.’’ ఆమె మాటలు ఆపినా ఆవేశం మాత్రం అలాగే వుందని ఆమె ముఖమే చెబుతోంది.
“ఏ విధంగా చూసినా మీకే లాభం తెచ్చే పెళ్ళిని మేమెందుకు గౌరవించాలి? పెళ్ళి రెండేళ్ళకే రద్దయిపోవాలని భావించే మీలాంటి మగాడితో ఎందుకు జీవితాంతం కలిసి బతకాలి?’’ ఆమె వేసిన ప్రశ్న కత్తిలా మెడమీద వేలాడుతున్నట్టు అతను తలను అటూ ఇటూ తిప్పుతున్నాడు గానీ నోరు విప్పలేకపోతున్నాడు.
“అదంతా నిజమేనని ఒప్పుకుంటున్నాను లిఖితా, నా తప్పు నేను తెలుసుకున్నాను. అందుకే నాతో వచ్చెయ్యమని అర్థిస్తున్నాను.’’
“ఇప్పుడు ఈ నంగి ఏడుపులు ఎందుకేడుస్తున్నారో కూడా నాకు తెలుసు. మీ అవసరాలను తీర్చడానికి మిమ్మల్ని పడకలో పంచుకోవడానికి ఎవరూ వూరికే రారని తెలుసుకున్నారు గనుక. అంతే తప్ప నా మీద ప్రేమతో కాదు’’
“నో … లిఖితా …. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ’’ అతను పిచ్చి పట్టిన వాడిలాగా అరిచాడు.
“అలాగంటే నేను నమ్మే స్థితిలో లేను. నా మీద తట్టుకోలేనంత ఇష్టమే వుంటే రెండోరోజే నా కోసం వచ్చేసే వాళ్ళు కానీ మీరు రాలేదు. నేను వచ్చేశాక మరో ఆడపిల్ల కోసం తీరిగ్గా ట్రయల్స్ వేశారు. కానే మీకు దొరకలేదు. అందుకే జీతం, బత్తెం లేకుండా పడివుండే నా కోసం వచ్చారు. ఒకప్పుడైతే మీ నంగి మాటలన్నీ నమ్మి మీతోపాటే, భర్తే దేవుడని అనుకుంటూ మీతో వచ్చేసేదాన్ని. నిజమైన ప్రేమ ఎంత ఉదృతంగా, ఎంత ఉన్నతంగా వుంటుందో ఇప్పుడు తెలుసుకున్నాను గనుక మీతో రాను’’ ఖచ్చితంగా చెబుతున్న ఆమెను అతను కళ్ళార్పకుండా చూస్తున్నాడు.
“అంటే!’’ మగాడు కాబట్టి వెంటనే అతనికి భార్యమీద అనుమానం వచ్చింది.
“నేను ఒకతన్ని ప్రేమించాను. అలాగని అనడం కంటే నన్నొకతను మీలా రెండేళ్ళకో, సంవత్సరానికో కాకుండా జీవితాంతం నన్నొదిలి వుండలేనంత గాఢంగా ప్రేమిస్తున్నాడు’’ అతని రియాక్షన్ కోసమే అన్నట్టు ఆగింది.
అతను వూహించని మలుపు అది. అందుకే అతను చేష్టలుడిగి చూస్తున్నాడు. “ఎవరతను?’’ చివరికెలాగో గొంతు పెగల్చుకోగలిగాడు.
“అతని వివరాలు తెలుసుకుని ఏం ప్రయోజనం? ఇప్పుడు అతని దగ్గరికే వెళుతున్నాను’’
“ఎక్కడున్నాడతను?’’
“హాస్పిటిల్ లో’’
“హాస్పిటల్ లోనా?’’ అతనికి ఏమీ అర్థం కావడం లేదు.
“అవును- నాకోసం వారం రోజులుగా నిద్రాహారాలు మానేశాడు. నేను వెళితే తప్ప అతను బతకదు. మీరెళ్ళిపొతే నేను హాస్పిటల్ కు వెళ్ళిపోవాలి’’
“అది కాదు లిఖితా’’ అతను ఏదో చెప్పబోతుంటే ఆమె అడ్డు తగిలింది.
“సారీ- మీరు ఏం చెప్పినా ప్రయోజనం వుండదు. మీరు ఆ రోజు మన పెళ్ళి రద్దయి పోయిందంటే నేనేమైనా మాట్లాడానా? ఆత్మాభిమానం వున్న దాన్ని కాబట్టి మౌనంగా వచ్చేశాను. మీకూ ఆత్మాభిమానం వుందని నిరూపించుకోవాలంటే ఇంకొక్క క్షణం ఇక్కడ వుండకండి’’
ఇక లాభం లేదని స్పష్టంగా తెలిసిపోవడంతో సతీష్ పైకి లేచాడు.
అతను వీథి మలుపు తిరగ్గానే జితేంద్ర కోసం లిఖిత హాస్పిటల్ కి బయల్దేరింది.
*అయిపొయింది*
|
|

