(186).png)
గుమ్మంలో ప్రళయ రుద్రుడిలా నించున్న విజయ్ ని చూసి… కంగారుతో తప్పించుకోబోయాడు. మల్లన్న మొహం పగిలిపోయేలా ఓ ముష్టి ఘాతం తగిలింది. అప్పటికే భవనంలో దీపాలన్నీ వెలిగాయి. నోటినించి రక్తం కారుతూ లేచి నించోబోయాడు మల్లన్న. అతని జుత్తు పట్టుకొని పైకి లేవనెత్తాడు జగదీష్. మల్లన్న అతని చేతుల్లోంచి తప్పించుకోడానికి గింజుకుంటున్నాడు.
”ఇది ఉక్కు పిడికిలిరా ముసలి రాబందా! నమ్మకంగా వుంటున్నట్టు నటిస్తూ యజమానిని హత్య చేశావు. ఇప్పుడు అమ్మగారిని చంపబోయావు ,చెప్పరా! చెప్పు ఎందుకు చేశావీ పనులు?” గద్దిస్తూ ఎడాపెడా కొట్టాడు జగదీష్.
సావిత్రమ్మ గోడుగోడున ఏడుస్తోంది కూతురు దగ్గర చేరి. గణపతి, మోహన్ కూడా ఉద్రేకాన్ని ఆపుకోలేక మల్లన్నని కొట్టడం మొదలుపెట్టారు.
”ఆగండి” అరిచాడు మల్లన్న.
అందరూ ఆగారు. అతను పారోపోవడం అన్న సమస్య లేదు. పైగా రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. మల్లన్న పెడరెక్కలు విరిచి కట్టేశారు ముత్యాలు, తిరుపతయ్య.
”జి.కె.ని నేనే చంపాను” అన్నాడు.
”తెలుసు. మరి అమ్మగార్ని ఎందుకు చంపబోయావు?” అడిగాడు జగదీష్.
ఫెళ్లుమని నవ్వాడు మల్లన్న. ”కక్ష ! నాలో పెరిగిన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికే నేనీ పనులు చేశాను”
విజయ్ చేతిలో ఫోటోని చూపిస్తూ… ”జి.కె. మొదటి భార్య వసుంధరదేవికి, నీకూ సంబంధం ఏమిటి?” అడిగాడు.
మల్లన్న కళ్ళలో నీరు నిలిచింది. ”ఆమె నా కూతురు బాబూ!”
బాంబు పడినట్టు ఉలిక్కిపడ్డారు అందరూ.
”అవును. అందరికీ తెలిసిపోయాక చెప్పడం మంచిది. నా కూతుర్ని చూసి జి.కె. పెళ్ళి చేసుకుంటానన్నాడు. దాని అదృష్టానికి పొంగిపోయాను. కానీ నేను నా కోతురని ఎవరికీ చెప్పకూడదన్నాడు. దాని సుఖాన్ని ఎందుకు కాదనాలని ఒప్పుకున్నాను. ఇద్దరు కూతుళ్ళని కన్నది వసుంధర. అయిన నిత్యం అనుమానించేవాడు, హింసించేవాడు. చూస్తూ సహించేవాడిని. ఒకరోజు నేను చూస్తుండగానే దాన్ని మేడమెట్లపై నించి తోసి చంపేశాడు. ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయిందని చెప్పాడు
అందరికీ. నేను నోరు విప్పితే నా మనవరాళ్ళని బయటికి గెంటేస్తానన్నాడు. జి.కె.లాంటి వాదిపైన పగతీర్చుకోవాలంటే నాలాంటి చిన్నవాడికి అవకాశం తక్కువ. ఈలోగా పెద్దకూతురికి బలవంతంగా పెళ్ళి చేశాడు జగదీష్ బాబుతో. ఆ పెళ్ళి ఇష్టంలేక అది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. నీ కూతురు ఎవడ్నో ప్రేమిస్తే నాకెందుకు ఇచ్చి దాని గొంతు కోశావు? అని జగదష్ నిలదీసేసరికి రాజేశ్వరి మరణాన్ని హత్యగా చిత్రీకరించి జగదీష్ ని జైలుకి పంపాడు.
తండ్రి చేసే పనులు చూసి ఏవగింపుతో ఇల్లు విడిచి పెట్టింది దేవయాని. అప్పుడే నాగమణిని పెళ్ళి చేసుకున్నాడు మళ్ళీ.
|
|


