.png)
కాలం గడవనితనం కాదు ... ఏమీ తోచనితనం ... ప్రతి సెకనూ ఓ నిమిషంలా భారంగా గడుస్తున్న సమయం ... జయంత్ లో కదలిక లేకపోవడంతో పక్కనే ఉన్న డాక్టరు అభినయ్ కన్సల్టింగ్ రూము వైపు నడిచింది గాయత్రి. డాక్టరు అభినయ్ కి ఎదురుగా ఓ అపరిచితుడు కూర్చొని వున్నాడు. అతడి రూపం చూస్తే అర్థమవుతోంది ఈ సొసైటీలో అతడి సోషల్ స్టేటస్ ఏమిటి అన్నది.
అతడు డాక్టరు అభినయ్ కి ఏదో చెబుతున్నాడు. ప్రయత్నం లేకుండానే అతడి మాటలు గాయత్రికి వినిపిస్తున్నాయి. చూడటానికి అతడు మోటు మనిషిలా కనిపిస్తున్నా, అతడు సొంత విషయాలు డాక్టరుతో డిస్కస్ చేస్తున్నందున డోరు దగ్గరే ఆగిపోయింది గాయత్రి.
"నేను లారీ డ్రైవర్ని డాక్టరు గారూ ... నెలకు ఇరవై రోజులు తగ్గకుండా డ్యూటీ మీద వుంటాను. ఏ డ్రైవరు డ్యూటీ ఎక్కకపోయినా వాడి డ్యూటీ కూడా నేనే చేస్తాను. ఎందుకో తెలుసా ... ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు రెసిడెన్సియల్ కాలేజీలో. అమ్మాయి పదోతరగతికి వచ్చింది. నా పిల్లలు యిద్దరూ పెద్ద చదువులు చదవాలి, వారి చదువులకి చాలా ఖర్చు అవుతుంది. అందుకే నేను కష్టపడేది. కానీ మా ఆవిడ మరోలా అర్థం చేసుకుంటుంది.
ఇంటిపట్టున వుండకుండా వుండేందుకు నేను డ్యూటీ ఎక్కుతున్నానని దాని అనుమానం. లైనులో మజా చేసుకుంటానని కూడా అనుకుంటోంది. కాని నిజానిజాలు నాకు తెలుసు. నేను డ్యూటీ దిగీ దిగగానే వేన్నీళ్ళు పెడుతుంది, కోడికూర వండుతుంది. మల్లెపూలు ముడుచుకుంటుంది. పిల్లాడి స్కూలుకి వెళ్ళగానే తలుపెస్తుంది పగలయినా! మనిషి మహా స్పీడు, ఒక్కోసారి నాకే అనిపించేది సెక్స్ అంటే ఇంత పడిచచ్చే మనిషి నేను లైనుకి వెళ్ళిన తర్వాత ఎలా వుండగలుగుతుందా? అని ...
మొదట్లో ఈ భావన ప్రశ్నగానే వుండేది. తర్వాత ఈ భావం అనుమానంగా మారింది. పిల్లవాడు రెసిడెన్షియల్ కాలేజీలో చదువు తున్నాడు గనుక, వాడు పండుగలకి తప్ప మిగతా రోజులలో ఇంటికి వచ్చే అవకాశం లేదు. అమ్మాయి స్కూలుకి వెడితే తిరిగి వచ్చేది సాయంకాలమే! ఈ లోపు ఇంట్లో ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలియదు. ఆమెకి సెక్స్ అంటే చాలా ఇష్టం. నేను నెలకి పాతిక రోజులు ఇంట్లో వుండను, ఈ మధ్య కాలంలో ఆమె ఏ వెధవపనీ చేయడం లేదంటే నమ్మడమెలా?
మా ఇంటికి పాలవాడు, కూరగాయలవాడు, ఆఖరికి చీరలు మూటవాడు వస్తాడు, వీరిలో ఏ ఒక్కడితోనైనా ఆమె తన సరదా తీర్చుకోవచ్చు గదా .... అన్న అనుమానం నాలో బలపడసాగింది. దానికితోడు కూరగాయల వాడు .... పాలవాడు ఆమెకి అప్పుయిస్తారు ... చీరాల మూటవాడు అయితే చీరే వెల అయిదారు నెలల్లో వాయిదాలుగా తీసుకుంటాడు ... వారికి ఆమెపట్ల ఎంతో నమ్మకం. వారు మా ఇంట్లో సభ్యులుగానే మెలుగుతారు.
నాది అనుమానం కాదు నిజమే ... అన్న అభిప్రాయం నాలో రోజు రోజుకీ బలపడుతోంది. దానికి తగ్గట్టు ఆమె ప్రవర్తనలో నాకు తేడా కనిపిస్తోంది. ఆమెకీ వారికీ శారీరక సంబంధం వుందని నాకు సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను డ్యూటీకి వెడితే అనుక్షణం నాకు నా భార్య గురించే ఆలోచిస్తున్నాను. ఆమె వారితో లైంగిక చర్యలో వున్నట్టు నా కళ్ళకు కనిపిస్తోంది. నేను ఇది భరించలేను ... ట్రీట్ మెంట్ ఇవ్వండి డాక్టర్ ...''
డాక్టరు అభినయ్ కి విషయం అర్థమయింది. కాని అర్థం కానిది ఒక్కటే ... ఎవరికీ ట్రీట్ మెంట్ అడుగుతున్నాడు ఇతను? అని ....
|
|


