.png)
"నాన్నా ...'' అన్న పిలుపుతో గుడికి బయల్దేరబోతున్నవాడల్లా ఆగిపోయాడు. గుమ్మం దగ్గర గాయత్రి ఆమె చూపులు నెలకు గుచ్చుకుని వున్నాయి. కుడికాలు బొటనవ్రేలితో నేలమీద రాస్తోంది. తండ్రితో ఏదైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు గాయత్రి ఎన్నడూ తండ్రి ముఖంలోకి సూటిగా చూడదు. ఆ విషయం ఆ తండ్రికి అనుభవంలోనిదే.
"ఏమిటమ్మా ...'' అంటూ వెనుదిరిగి రెండు అడుగులు వేసిన వాడల్లా "చెప్పమ్మా ...'' అన్నట్టుగా తల నిమిరాడు.
"నాకు ... నాకు ... ఇక్కడ ఏమీ తోచడం లేదు నాన్నా ...''
"ఇంతకాలం ఉద్యోగం చేసినదానివి. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా వుండడమంటే అలాగే వుంటుందమ్మా''
"నాకు ఇప్పుడు ఇద్యోగం కూడా చేయాలనిపించడం లేదు ...''
"నీవు ఉద్యోగం చేయాలనుకున్న చేయలేవమ్మా ...''
"కాని ఒంటరితనాన్ని ... నిశ్శబ్దాన్ని భరించలేకున్నాను నాన్నా'' తడారిన కళ్ళతో పవిటతో అడ్డుకుంటూ అన్నది.
"మనసులోని భయం ... ఆందోళన, ఒంటరిగా వున్నప్పుడు మరింత భయపెడతాయి. నీవు ఒంటరిదాన్ని అనుకోవడం నీ భ్రమ. పంచభూతాలు లేనిచోటు అంటూ ఏదీ లేదు. ధర్మదేవత వేయి కళ్ళతో నిన్ను వీక్షిస్తూనే వుంటుంది. ధర్మాన్ని తప్పినరోజున నీవు భయపడాలి ... బాధ పడాలి. మనసుని భగవంతుని మీద లగ్నం చెయ్యి. గాయత్రీ మంత్రం జపించు, భయాందోళనలు, ఆకలిదప్పులు నిన్ను ఏమీ చేయలేవు. ఇక్కడ ఏకాగ్రత కుదరకపోతే నాతోపాటు ఆలయానికి రా ... దైవసాన్నిధ్యంలో ఏకాగ్రత కుదురుతుంది ...''
"నాన్నా ... కొందరు నల్లమందుకి, మరికొందరు నిద్రమాత్రాలకి, ఇంకొందరు మద్యానికి అలవాటు పడతారు. మత్తులో జోగాదానికి. మీరు నాకూ అటువంటి మత్తు పదార్థాన్నే ఇస్తున్నారు. అయితే ఆ మట్టుపదార్థం పేరు 'భక్తీ', ఉపవాసాలు, ప్రణాచారాలు, మడి తడి పేరుతొ మతం మట్టుకి నన్ను బానిసను చేస్తున్నారా?'' అని అడిగింది గాయత్రి.
"మానవజన్మే ప్రలోభాల పుట్ట. నాలుక పలురకాల రుచుల్ని కోరుకుంటుంది. శరీరం సుఖంకోసం అర్రులు చాస్తుంది. మనసు చంచాలమయింది. భోగభాగ్యాలవైపు పరుగెడుతుంది. ఇవేమీ శాశ్వతం కావని తెలుసు ... కడతేరిన తర్వాత కట్టుకున్న ఇల్లాలు వీథి గుమ్మం వరకే వస్తుందని తెలుసు, కన్నకొడుకు చితి రగిల్చేవరకే వుంతాడనీ తెలుసు, శరీరం, అందం శాశ్వతమానుకుని వెంపర్లాడతాం.
ఆ వెంపర్లాటలో జీవుడు చేసే పాపాలు ఎన్నో, ఆ పాప పరిహారానికి పునర్జన్మ ... మళ్ళీ వేదన, ప్రలోభాలు ... నేను సంసార బంధంనుంచి 'నా'అన్న వ్యామోహం నుంచి బయటపడలేకపోయాను. దురదృష్టంలో అదృష్టం - నీకైనా ఈ బంధాల్ని తెంచుకునే అవకాశం లభించింది. ముక్తిమార్గాన నిన్ను నడిపించడానికే ప్రయత్నం చేస్తున్నాను ... చిన్నపిల్లవి, ఇంతకన్నా నీకు అర్థం కాదు ..
.'' ప్రయత్నిస్తే అర్థమవుతుంది కానీ ఆలోచించే, తర్కించే శక్తి ఇప్పుడు నాకు లేదు; మిమ్మల్ని గుడ్డిగా అనుసరించడం మినహా. నా సొంత నిర్ణయాలు నన్ను ఘోరంగా మోసం చేశాయి. ఆ జ్ఞాపకాలే నన్ను బాధపెట్టకుండా వుంటే అదే చాలు ... పూజలు, వ్రతాలవల్ల ఆ బాధ నన్ను దరిజేరకుంటే మీరు చెప్పినట్లే చేస్తాను ...''
ఆ తండ్రి ఏమనుకున్నాడో ఏమో "అంతా ఆ దేవుడి మీద భారం వేయి తల్లీ ... పద, గుడికి వెళ్దాం'' అంటూ ఆమెని బయల్దేరదీశాడు. ఆ రోజున ఆలయ ప్రాంగణమంతా కోలాహాలంగా వుంది. ముక్కోటి ఏకాదశి అయినందున ఆ రోజున భక్తులతో గుడి కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు గుడి ఆవరణలోకి ప్రవేశించాడు.
|
|


