.png)
డాక్టరు అభినయ్ కాలు క్లచ్ మీదకీ కుడిచేయి గేరు మీదకు అప్రయత్నంగా జరిగాయి. కారు వేగం తగ్గింది - నెమ్మదిగా ఆగింది. అభినయ్ కారు ఆపడానికి కారణం రోడ్డు పక్కన వున్న పోలీసు స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నా వ్యక్తులు. రాజితతోపాటు ఓ నది వయస్కుడు, ఇద్దరు యువకులు ఉన్నారు. ఇద్దరు యువకులలో ఒకరు నల్లకోటు ధరించి వున్నాడు. పోలీసు స్టేషన్ లో పని పూర్తయినట్లుంది, ఆ నల్లకోటు వ్యక్తి వారి వద్ద శెలవు తీసుకున్నాడు.
ఆటో కోసం కాబోలు రోడ్డువైపు తేరిపార జూస్తున్న రజిత అప్పుడు గమనించింది. ఓ వారగా ఆగివున్న అభినయ్ కారుని. ఆమె తనని చూసిందని నిర్థారించుకున్న తర్వాత కారు దిగాడు అభినయ్ పలకరింపుగా నవ్వుతూ.
"హాస్పిటల్ కేనా ... అయితే మాకు లిఫ్ట్ ఇవ్వాలి'' చొరవగా కారు డోరు తీస్తూ అడిగింది రజిత.
"రండి ...'' అంటూ బ్యాక్ డోర్ తెరిచాడు. మిగిలిన ఇద్దరూ కారులో కూర్చోవడానికి వీలుగా రజిత ఫ్రంట్ సీటులో కూర్చుంది. ఇగ్నీషన్ త్రిప్పుతూ అడిగాడు అభినయ్
"పోలీసు స్టేషన్ లో ఏం పని వచ్చింది?'' అని.
"బైదిబై చెప్పడం మరిచాను. ఈయన ఆంజనేయులుగారు, మా ఆఫీసులో పనిచేస్తారు. ఈయన మిసెస్ కూడా మా ఆఫీసులోనే పనిచేస్తారు. పక్కన వున్నది ఆంజనేయులువారి ఫాదర్'' అంటూ పరిచయం చేసింది.
"హలో ...'' అంటూ విష్ చేశాడు అభినయ్.
"ఆంజనేయులుగారి మిసెస్ కి ఈ మధ్య ఒంట్లో బాగుండడంలేదు. గాలి సోకిందని వీరి అనుమానం. పక్కింట్లో వ్యక్తి ఈ పని చేశాడని వీరి నమ్మకం. ఆ అభిప్రాయంతో పక్కింటివాడి దంతాలు రాలిపోయేలా కొట్టారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా వుంది. హాస్పిటల్ లో వున్నాడు. హత్యా ప్రయత్నం క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. అడ్వకేట్ సాయంతో బెయిల్ తీసుకున్నాం ...'' క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది రజిత.
"ఆమెకి గాలి సోకిందని మీరు ఎందుకు అనుకున్నారు?'' గర్భం రాకమునుపు సరసి ప్రవర్తన ... గర్భిణి సమయంలో కుంకుమపువ్వు గట్రా మింగినవైనం ... గర్భస్రావం ... మిడ్ వైఫ్ వాఖ్య ... సరస్సి ఒకటికి నాలుగుసార్లు స్నానం చేయడం ... పక్కింటి వాడిని నుదుట కుంకుమ బొట్టు పెట్టమని అడగడం వాడు గోడదూకి పారిపోవడం ... బ్లాక్ డ్రెస్ వేసుకున్న అయ్యప్ప భక్తుడు తెల్లవారుజామున మూలికలు, ఆకులు నూరడం ... తామిద్దరూ కలిసి అతడ్ని బాదడం ... సవివరంగా చెప్పాడు ఆంజనేయులు.
అంతా విన్న వినయ్ అన్నాడు "మీరు చాడువున్నవారు, రీజనింగ్ ని తెలుసుకునే ప్రయత్నం చేయరా? గాలి సోకింది - బాణామతి ప్రయోగించారు అని అనుకోకూడదు. ప్రతి నేలా బహిస్టుకి ముందు స్త్రీలు కొందరు ప్రిమెన్ స్ట్రల్ టెన్షన్ కి గురవుతారు. సరసి విపరీత ప్రవర్తనకి కారణం ఇదే. మీరు అనుకుంటున్నట్టు ఇతరత్రా కారణాలు కావు. దానికి మీరు 'గాలి సోకింది' అని పేరు పెట్టారు. ప్రెగ్నెన్సీ రావడంతో ఋతుస్రావం ఆగిపోతుంది.
ఈ ప్రీమెన్ స్ట్రల్ సిండ్రోమ్ తొలగిపోతుంది, ప్రెగ్నెన్సీ పోవదమన్నది చాలా కారణాలున్నాయి. గైనకాలజిస్ట్ ఎనలైజ్ చేసి చెప్పవలసిన విషయం. కాని, మిడ్ వైఫ్ మిడిమిడి జ్ఞానంతో ఏదో అంటే ... సరసి మరోలా అర్థం చేసుకున్నారు. మానసికంగా కృంగిపోయారు. ఈ స్థితిని "అబ్ససివ్ కంపల్సిన్ స్యూరోసిస్'' అంటారు. ఒకటికి పదిసార్లు స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం, డ్రెస్ చేసుకోవడం చేశారు. మీరు క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించి వుంటే ఆ డాక్టరు మీకు అన్ని విషయాలూ విడమరిచి చెప్పేవారు,
మందులు వాడితే వెంటనే తగ్గిపోఎది. పిచ్చి పిచ్చి అనుమానాలతో వైద్యం చేయించక వ్యాధిని ముదరబెట్టారు. ఆమె మానసికంగా బాధపడేలా చేశారు. అది చాలదన్నట్టు ఇప్పుడు పోలీసు కేసులో చిక్కుకున్నారు''
తండ్రీ కొడుకులు ఇద్దరికీ తమ తప్పిదం తెలిసింది.
*****
|
|


