The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Psycho - 2>>Psycho
సైకో - 68

గాయత్రీ ... నేను అకౌంట్స్ జనరల్ ని ... జయంత్ ని. నా దగ్గర నీ కాకమ్మ కథలు పనికిరావు ...'' అని చెప్పడం ప్రారంభించాడు.

"గాయత్రీ ... నీవు సనాతన కుటుంబంలో జన్మించావు. సంధ్యవార్చనిదే మీ ఇంట్లో పచ్చినీళ్ళయినా ముట్టరు. మీకు మది తడి ఎక్కువ. అటువంటి కుటుంబంలో పుట్టిన నీవు వర్ణ సంకరానికి ఒడిగట్టావు నా కులమేమితో, గోత్రమేమితో, వంశమేమిటో తెలుసుకోకుండా - తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నన్ను ప్రేమించావు.

మీ వారికి కల్లిబొల్లి కబుర్లు చెప్పావు, నన్ను పెళ్ళి చేసుకున్నావు రజిత నీ ఫ్రెండ్, ఆమెకి ఏ ప్రేమాయణం తెలియకుండా చాలా జాగ్రత్తపద్దావు, చాటుమాటుగా నన్ను ఎక్కడెక్కడో ఎన్నోసార్లు కలిశావు. కనిపెంచిన తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని మోసం చేశావు. నా కోసం - నా పొందుకోసం. అటువంటి నీవు ఇప్పుడు నన్ను కూడా మోసం చేయడం లేదు అంటే ఎలా నమ్మమంటావు?'' సూటిగా ప్రశ్నించాడతడు.

స్పందించడం మానవ సహజం. మనుషులే కాదు పశుపక్షాదులు స్పందిస్తాయి. జీవితంలో ఎవరికీ ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ఇవ్వడం జరుగుతుంది. ఒక స్త్రీ జీవితంలో కన్నవారికి ఒక రకమైన ప్రాధాన్యత వుంటుంది. కట్టుకున్న వాడికి వేరొక ప్రాధాన్యత వుంటుంది. తాను కన్నవారికి మరొక ప్రాధాన్యత వుంటుంది. తాను కన్నవారి కోసం తనని కన్నవార్ని, కట్టుకున్నవాడిని కూడా త్యాగం చేస్తుంది స్త్రీ. ప్రేమ వేరు, కామం వేరు.

తాను ప్రేమించిన వాడికోసం తనని ప్రేమించిన వాడికోసం ఆడపిల్ల ఆస్తిని, అంతస్థుని వదులుకోవడానికి దుస్సాహసం చేస్తుంది. ఈ రోజున ప్రేమ వివాహాలలో నూటికి తొంభై శాతం ఆడవారు తమ ఇంట్లో తెలియకుండా, తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతూ ఆటగాడని చాటుమాటుగా కలుసుకునేవారే; లేఖల ద్వారా, ఫోనుల ద్వారా స్వీట్ నథింగ్స్ ఎక్చేంజ్ చేసుకున్నవారే. ఆ సమయంలో ఏ ఆడపిల్లా తన చర్యల్ని మరో కోణం నుంచి చూడరు.

అతగాడిపట్ల ఆమెకు వుండే నమ్మకం అటువంటిది. కాని ఈ రోజున జయుంత్ అదే విషయాన్ని ఎత్తిచూపుతూ "గతంలో నీ కన్నవారి కళ్ళుగప్పి నన్ను కలిశావు. ఈ రోజున నన్ను ఏమార్చి మరోకడితో కులకడం లేదు అన్న నమ్మకం ఏమిటి?'' అని ప్రశ్నిస్తున్నాడు జయంత్. అతడు అందగాడు ... చదువుకున్నవాడు ... గొప్ప హోదాలో వున్నవాడు. సంస్కారంలేని ఆ చదువు ఎందుకోసం? జీవితంలో కొన్ని మధురస్మృతులుగా మిగిలిపోతాయి.

ఆ మధుర స్మృతుల్ని మంటగలిపేవాడూ ఓ మనిషేనా? అటువంటి వాడికి భార్యగా బ్రతికితేనేం, లేకుంటేనేం? అసలు అటువంటి వాణ్ణి మనిషిలా ఎందుకు చూడాలి? జుగాప్ప, ఏహ్యం, తనపై తనకే కసి, అంతకుమించిన హేయమైన భావన ఆమెను ఆవరించింది. అటువంటి పశువుతో మాట్లాడటం అనవసరం, అటువంటి వాడి మొహంలోకి చూడాలంటేనే కలవరం అన్నట్టుగా దృష్టిని పక్కకు మరల్చింది. ఆమె మౌనం, ఆమె నేలచూపులు అతడి అనుమానానికి మరింత బలాన్ని ఇచ్చాయి.

నవ్వుకుంటూ నెమ్మదిగా రెండు అడుగులు ముందుకేశాడు. అలా ముందుకు నడుస్తూనే కాలితో తలుపు మూశాడు. జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించే ముందు చేతిలోని సూట్ కేస్ కింద పెట్టాడు. "గాయత్రీ'' అంటూ ఆమెని సమీపించాడు. అతడి పిలుపుకి అడుగుల సవ్వడికి అప్రయత్నంగా తలెత్తింది. అతడి పెదవుల మధ్య పొగలు కక్కుతున్న సిగరెట్ .., అంతకుమునుపు యాష్ ట్రేలో కనిపించిన సిగరెట్ ... మోర్ సిగరెట్. సిగరెట్ తాలూకు మిస్టరీ పూర్తిగా విడిపోయింది.