The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Psycho>>Psycho
సైకో - 92

"నథింగ్ డూయింగ్ ... వాడు ఈ ఇంట్లో ఇంక ఒక్క క్షణం వుండడానికి వీల్లేదు. నిన్ను కూడా మెడపట్టి గెంటేవాణ్ణి కాని, నా కొడుక్కి అదే రెండవవాడికి తల్లిని దూరం చేయలేక భారిస్తున్నాను''

కత్తివేటుకి నెత్తురు చుక్క లేకుండా పాలిపోయిన ఆమె ముఖం నెమ్మదిగా రక్తపు రంగులో పులుముకుంది రోషంతో ... "ఏమిటి, ఏమిటి మీరు మాట్లాడేది? వాడు మీ కొడుకు కాదా?''

"కాదు ... కాదు ... కాదు ... ముమ్మాటికీ కాదు. మనకు పెళ్ళయిన తొమ్మిది నెలలకే వీడు పుట్టాడు. అసలు నీకు గుర్తుందా మనకి మూడు నిద్రలూ అయిన తర్వాత వెంటనే నేను ట్రెయినింగ్ కి వెళ్ళిపోయాను. ఆ మూడురోజుల్లో కూడా మూడోరోజుకదా మొదటి రెండు రోజులూ వృధాగానే గడిచిపోయాయి కదా, ఒక్కరోజు వుంటేనే పిల్లలు పుడతారా?

అతడు మాట్లాడుతున్నదేమిటో అర్థమయిన ఆ ఇల్లాల్ని ఉన్మాదం ఆవరించింది. "అది నోరా, చీపురు కట్టా ... ఛీ ఛీ నీలాంటి వాడితో కాపురం చేసేకంటే పిల్లలిద్దర్నీ వెంట బెట్టుకుని చస్తే బాగుణ్ణు''

"ఆ పని చేస్తే చెయ్ కానీ నా చిన్నకొడుకుని కూడా నీ పెద్ద కొడుకుతో చంపెయ్యకు''

"చస్తాను ... తప్పక చస్తాను ... ఎవడికో పిల్లవాణ్ణి కన్నందుకు కాదు, అంతటి అభాండం నీవు నా నేత్తినేసినందుకు. నేను చస్తే నీవు అన్నదే నిజమని, అందుకే నా ముఖం నీకు చూపలేక చచ్చానని అనుకుంటావు. అది నిజం కాదని పెద్దవాడు నీ కొడుకేనని నిరూపిస్తాను. ఆ తర్వాత ఇంత సిగ్గుమాలినోడితో ఇంతకాలం కాపురం చేసినందుకు సిగ్గుతో చితికిపోయి చస్తాను. అప్పటివరకు ఇక్కడే ఈ ఇంట్లోనే నీ ఎదురుగా వుంటాను'' అంటూ ప్రతినబూనిన ఆ ఇల్లాలు పెద్దకొడుకుని పులి ఎన్ని హింసలు పెట్టినా భరించింది. ఏ రాత్రివేళో ఎవరూ చూడకుండా ఎక్కడ చంపుతాడోనని కళ్ళల్లో వత్తులేసుకుని కాపాడుకుంది.

సరైన తిండి, నిద్ర లేక కట్టేపుల్లలా తయారయిన ఆమెకి అర్థం కానిది ఒక్కటే - తనకి భర్త మినహా మరో మగవాడితో పరిచయం లేదు. పులి చెప్పిన దాంట్లో రెండు నిజాలున్నాయి. పెళ్ళయిన తొమ్మిదినెలలకే తాను తల్లి అయింది. అంతకుమించి మూడు రాత్రులలో ఒకే ఒక రాత్రి తాము కలిసింది. తర్వాత తామిద్దరి మధ్య చాలా గ్యాప్ వుంది. ఒక్కసారి కలిసినా బిడ్డలు కలుగుటారా? ఆ సందేహంతోనే దగ్గరలోని ఓ డాక్టర్ ని సంప్రదించింది.

ఆ డాక్టర్ అభినయ్ కావడం యాదృచ్చికం.

విషయం విన్న అభినయ్ చెప్పింది ఒక్కటే "మీరు మీవారితో కలిసిరండి'' అని. డాక్టర్ సలహాని ఆ రోజే భర్తకు చెప్పింది ఆ ఇల్లాలు

డాక్టరు దగ్గరికి రావడానికి పులి అంగీకరించాడు ఒక షరతు మీద ... "బ్లడ్ రిపోర్టులు డాక్టరుగారికి చూపిద్దాం ... ఆయన ఈ బిడ్డ నా బిడ్డ కాదంటే?''

"అప్పుడు వాడు మీకళ్ళేదుటే కాదు ఈ లోకంలో కూడా వుండడు వాడే కాదు వాడి పుట్టుక పాపిష్టి పుట్టుక అయితే ఆ పాపిష్టి దాన్నయిన నేను కూడా ...''

"ఆహా ... నీ సంగతి సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. మర్చిపో ... కానీ ఆ పిల్లవాణ్ణి మాత్రం మన ఇంట్లో వుంచొద్దు. ఏ అనాథాశ్రమంలోనో వుంచుదాం'' అని చెప్పి భార్య వెంట బయల్దేరాడు.

ముందుగా తీసుకున్న అపాయింట్ మెంట్ ప్రకారం డాక్టరు అభినయ్ ని కలిశారు పులి, అతడి భార్య.