.png)
మాసిన జుత్తు, నలిగిపోయిన దుస్తులుం బేర్ ఫుట్ తో హఠాత్తుగా చూస్తే చొరస్తాలో మట్టిగొట్టుకుపోయిన శిలావిగ్రహంలా వున్నాడు. ఇంకా స్పష్టంగా చూస్తే చీకిపారేసిన పండుతాటికాయలా వున్నాడు. ఆకలవుతోంది కాబోలు చేయి చాపి అడుకుంటున్నాడు. పూజ పూర్తయిన ముత్తయిదువలు అతడి చేతిలో ప్రసాదం పెడుతున్నారు. ఆబగా ఆ ప్రసాదం తినేసి ఎంగిలిచేతిని చొక్కాకి తుడుచుకుంటున్నాడతను.
అతడి ప్రవర్తన, అతడి దుస్తులు అతడో పిచ్చివాడని చెబుతున్నా అతడి పర్సనాలిటీ, ముఖవర్చస్సు, మేని రంగు అతడి అభిజాత్యాన్ని చాటి చెబుతున్నాయి. అతడ్నే గమనిస్తున్న ఓ ముత్తయిదువ ప్రక్కామెతో ఇలా అన్నది "చూడు అతను చూడటానికి దొరబాబులా వున్నాడు. కాని దేవుడు అతనికి అన్నీ ఇచ్చి మతిస్థిమితం ఇవ్వలేదు. పాపం, ఏ జన్మలో ఏ పాపం చేశాడో - ఈ జన్మలో అడుక్కుంటూ పిచ్చోడిగా బ్రతుకుతున్నాడు''
"అతనా ... మన పూజారిగారి అల్లుడు. పెద్ద ఆఫీసరు ఉద్యోగం, కారు, బంగ్లా వుండేవి. మన పూజారిగారి అమ్మాయిని కావాలని ఏరికోరి పెళ్ళి చేసుకున్నాడు. కాని ఆ అమ్మాయి ఇతడ్ని వదిలేసింది. దానితో పిచ్చోడయిపోయాడు. ఉద్యోగం, కారు, బంగ్లా అన్నీ పోయాయి. ముష్టోడయ్యాడు''
ఆ ఆలయ ప్రాంగణంలోని మహాలక్ష్మమ్మ మ్రాను దగ్గర నూటొక్క వొత్తులు వెలిగిస్తున్న గాయత్రి ఏ వ్యక్తి అయితే ఏది వినరాదో ఆ వ్యక్తి ఆ విషయం విన్నది. ఆమె చేతిలోని అగరబత్తి జారి క్రిందపడింది. అప్రయత్నంగా ఆవైపు చూసింది. కాళ్ళకు చెప్పులు లేకుండా, మాసిన గడ్డంతో, నలిగి దుమ్ముకొట్టుకుపోయిన దుస్తులతో, వారు వీరని చూడకుండా కనిపించిన ప్రతివార్ని చేయిచాపి అడుక్కుంటున్నాడు జయంత్.
అకౌంట్స్ జనరల్ గా పిన్నవయస్సులోనే పెద్ద ఉద్యోగం నిర్వహించిన జయంత్ .. నెలకు వేలాది రూపాయలు ఆర్జించిన జయంత్ ... ఇస్త్రీ మడత చేరగాకుండా, గడ్డం మాయకుండా ఎప్పటికప్పుడు కొత్త డ్రెస్ లో ఫ్రెష్ గా కనిపించే జయంత్ ... ఇప్పుడిలా ... ఓ బిచ్చగాడిలా ... అంతకుమించి ఓ పిచ్చివాడిగా ... తట్టుకోలేకపోయింది గాయత్రి. భోరున ఏడ్చేసింది. ఏడూస్తూనే అతడి దగ్గరికి పరుగెత్తింది. కూతురు హఠాత్తుగా పూజమాని ఆ విధంగా వెళ్ళడం చూసిన తల్లికూడా ఆమె వెంట వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ భర్తని కూడా పిలుచుకువెళ్ళింది.
"అమ్మా గాయత్రీ ...~! ఏమిటమ్మా ఇది, దాటిపోయిన కష్టాన్ని తిరిగి కోరి కౌగిలించుకుంటున్నావా?''
"నాన్నా ...! మీరు నాకు కర్మసిద్ధాంతాన్ని ఒంటబట్టించారు. మీ సిద్ధాంతం ప్రకారం నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఈ జన్మలో అనుభవించనివ్వండి. లేకుంటే మరోజన్మ ఎత్తి ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వుంటుంది. నుదుటితాతని తప్పించడం ఎవరి వశం? మనం కాదనుకున్నా ఈయన నాకు భర్త, మీకు అల్లుడు కాకపోడు. నా భర్త పిచ్చివాడిగా వీథులలో తిరుగుతుంటే నేను హాయిగా, ప్రశాంతంగా వుండగలనా?
చిన్నప్పట్నుంచీ సతీసావిత్రి, అనసూయ, దమయంతి, సీత కథల్ని విన్న నేను ఆయనను ఎలా విడిచి పెట్టగలను? నా నుదుట రాత ఎలా వుంటే అలాగే జరగనివ్వండి. బ్రహ్మరాతను మార్చడానికి నేనెవర్ని? నాన్నా ...! అంతకుమించి మానవతా సిద్దాన్తానని నమ్మినదానిని. ఈయన నా భర్తగా, ఒకప్పటి బాస్ గా కాకపోయినా సాటిమనిషిగా నేను స్పందించకపొతే నేను మనిషిని ఎలా అవుతాను?
మనకు తెలిసిన వ్యక్తి మతి స్థిమితం తప్పి బజారుపాలయితే అతడ్ని సైక్రియాటిస్ట్ కి చూపించడం మన నైతిక బాధ్యత. మన బాధ్యతని మనం విస్మరించిన రోజున ఈ సమాజంలో ఏ రోడ్డు చూసినా పిచ్చివాళ్ళే కనిపిస్తారు. మతిస్థిమితం లేని వ్యక్తిని వెంటనే డాక్టరుకి చూపిస్తే ఈ దుర్గతి పట్టదు. జయంత్ గారి భార్యగా, స్టెనోగా కాక సాటి మనిషిగా నా డ్యూటీ నన్ను చేయనివ్వండి.
మీరు చెప్పే పాపపుణ్యాలు నిజమయితే ఈ గుడిలో లక్ష దీపాలు వెలిగించిన పుణ్యం ఓ మతిస్థిమితం లేని వ్యక్తికీ సేవచేయడం వలన, మామూలు మనిషిని చేయడం వలన వస్తుంది. దయచేసి నా ప్రయత్నానికి అడ్డు రాకండి'' అంటూ చేతులు జోడించింది గాయత్రి.
*****
|
|


