- ముచ్చెర్ల రజనీ శకుంతల
.png)
ఆ రోజే అక్షయ అమెరికా నుంచి వచ్చేది. సంవత్సర విరహం తరువాత కలవబోతున్నారు ఆ దంపతులు. ఎప్పుడెప్పుడు ఫ్లయిట్ వస్తుందా, శ్రీవారు ఎప్పుడొస్తారా? ఇంటికి వెళ్ళి హాయిగా ఎప్పుడు గడుపుదామా అని వుంది. వీళ్ళందర్నీ అవతలికి తోసేసి అక్షయ్ ని తీసుకుని డైరెక్టుగా లాక్కుపో వాలన్నంత ఆత్రం. వినీత ఆత్రానికి తగ్గట్టు అమెరికా ఫ్లయిట్ అరగంట లేటని ఎనౌన్స్ చేశారు. ఛ ... ఛ ... ఇండియా ట్రైన్స్ కాదు అమెరికా ఫ్లయిట్స్ కూడా లేటే ... జార్జిబుష్ కి కంప్లైంట్ ఇవ్వాలి మరోసారి మనసులోనే విసుక్కుంది వినీత. అరగంట తర్వాత రానే వచ్చాడు అక్షయ్. చక్కటి మైసూర్ సిల్క్ చీరలో కుందనపు బొమ్మలా ఉన్న వినీతని చూడగానే అక్షయ్ కి కూడా మనసు వివశత్వానికి లోనైంది.
అక్కడున్న తల్లీతండ్రిని పలకరించకపొతే బాగుండదని పలకరించాడు. వినీత మాత్రం భర్త బట్టతలనే గమనిస్తోంది. అతని కళ్ళు మాత్రం కొంటెగా వినీతని పరీక్షిస్తున్నాయి. అన్నీ గమనిస్తూనే ఉండి వినీత. కార్లో ఇంటికి వెళ్ళేటప్పుడు వినీత పక్కనే కూర్చుని ఎవరూ చూడకుండా నడుం మీద గిల్లాడు. 'అబ్బా ...! అనబోయి పెద్దవాళ్ళున్నారని ఆపుకుంది. ఇంటికి పద నీ పని చెప్తా ...' అన్నట్టు చూసింది భర్తవైపు. ఆమెకి భర్తకి బట్టతలెలా వచ్చిందీ అర్థం కావట్లేదు.
*****
ఉద్యోగరీత్యా వన్ ఇయర్ ట్రైనింగ్ కి పంపిస్తే కంపెనీ ఖర్చే కదా అని అక్షయ్ అమెరికా వెళ్ళాడు. భార్యని విడిచిపెట్టి ఉండలేక పోయినా మంచి ఆఫర్ అని వెళ్ళాడు. మళ్ళీ ఇదిగో ఇలా ట్రైనింగ్ పూర్తిచేసుకుని వచ్చాడు. అందరికీ తెచ్చిన గిఫ్ట్స్ పంచాడు. రాత్రి భోజనాల్లోకి తల్లి స్వయంగా కొడుక్కి ఇష్టమైన వన్నీ చేసింది. "మమ్మీ ...! ఇవన్నీ తినడం అలవాటు పోయింది. మెల్లగా అలవాటు చేసుకుంటాలే'' అంటూ శాండ్ విచ్, జ్యూస్ తో సరిపెట్టుకున్నాడు.
*****
రాత్రి పదకొండు అయ్యేవరకూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అతనికి దేనిమీదా ధ్యాస లేదు. ఎదురుగా కూర్చుని అత్తగారికి యాపిల్ కోసిస్తున్న వినీతపైనే ఉండి చూపంతా. తెల్లటి వాయిల్ చీరలో, రూబీ బ్లౌజ్ లో అప్పుడే విచ్చిన మల్లెమోగ్గలా ఉండి వినీత. అతనికి ఎంత త్వరగా రూమ్ లోకి షిఫ్ట్ అవుదామా అని వుంది. వినీత కూడా యథాలాపంగా పనిచేస్తోందే తప్ప దృష్టి అక్కడ లేడు. భర్త బట్టతలా గురించి ఎప్పుడు తెల్సుకుందామా అని వుంది. "ఇక చాల్లేరా కబుర్లు ... రేపు చెప్పుకుందాం''అంది అత్తగారు ఇద్దరి మనసు చదివేసినట్టు. హమ్మయ్య అనుకున్నారిద్దరూ.
*****
ఎ.సి. రూమంతా స్ప్రే చేసి పెట్టినట్టుంది వినీత. రూమ్ లోకి రాగానే జిల్ మనిపించింది ఇద్దరికీ. అమ్మకి తెలియకుండా దాచిపెట్టిన మల్లెపూల గంప ఇవతలికి తీసి భార్య మీద పోసాడు కుప్పలా. దోసిటితో తీసి ఇంకా ఇంకా పోయసాగాడు నవ్వుతూ. వినీత "అరె ఇవేక్కదివి?'' అంది ఆశ్చర్యపోతూ.
"శ్రీమతికి ఫస్ట్ నైట్ గుర్తు చేద్దామని నేనే పనివాడికిచ్చి ఈ ఏర్పాటు చేయించా. సంవత్సరం తర్వాత మన కలయిక అద్భుతంగా వుండొద్దూ ...!'' అన్నాడు.
"అది సరే గాని ... ముందు ఇది చెప్పండి'' అంది నిలదీస్తూ.
"ఏమిటి?'' ఆశ్చర్యంగా అడిగాడు.
"చిన్నప్పటి నుంచీ నువ్వంటే నా కిష్టమని తెలుసుగా'' అంది వినీత.
"తెలుసు ...!''
"నువ్వంటేనే కాదు, నీ ఉంగరాల జుత్తన్నా కూడా బోల్డు ఇష్టంకదా .. చిన్నప్పట్నుంచీ జుట్టు చూసి మురిసిపోయేదాన్ని''
"అందుకేగా మీ అమ్మా, మా మమ్మీ మనిద్దరికీ పెళ్ళి కూడా చేసింది ...'' అతను సపోర్టుగా అన్నాడు.
"కదా ...! ఇప్పుడు చూడు సంవత్సరం కింద వుండాల్సిన నీ ఉంగరాల జుట్టు కాస్తా అమెరికా వెళ్ళి బట్టతలాగా చేసుకున్నావు. హాయిగా అప్పుడప్పుడు నీ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ఆదుకోవాలని ఎంత సరదా పడ్డాను ... అసలీ బట్టతలెలా వచ్చింది ...!''
"వినీ ...! అక్కడి నీళ్ళు పడక కొంచెం, వెదర్, ఫుడ్ చేంజ్ అయి కొంచెం జుట్టు రాలిపోతుందేది. అయినా ఇప్పుడది అంత పెద్ద సమస్యా? త్వరగా రా నైట్ ని వేస్ట్ కానీకు'' మంచం పైకి లాగుతూ అన్నాడు.
"మీ బట్టతలని నేను చూళ్లేక పోతున్నాను. అయినా అమెరికాలో బోలెడన్ని విగ్ లుంటాయిగా ఒకటి కొనుక్కోలేకపోయారా? లేకపోతే హెయిర్ వీవింగ్ చేయించుకో లేకపోయారా?''
"అది ఏదో ఒకటి తర్వాత ఆలోచిద్దాంగానీ నువ్వు రావోయ్'' అంటూ ఇక ఆమెని మాట్లాడనివ్వలేదు అక్షయ్.
*****
అలా అలా వారం రోజులు గడిచిపోయాయి. వినీతకి భర్త బట్టతలే సమస్యగా మారింది. మాంచి రొమాంటిక్ మూడ్ లో భర్త ఉంగరాల జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దగ్గరకు లాక్కోవడం అలవాటు. అది కాస్తా బట్టతలగా మారడంతో రోమాన్స్ లో ఏదో మిస్సయినట్టుగా ఉండేది వినీతకి. క్షణాలు కరుగుతున్నాయి ... నిమిషాలు తరుగుతున్నాయి ... రోజులు గడుస్తున్నాయి. అందమైన వెన్నెల రాత్రిళ్ళు, అద్భుతమైన సమాగమాలు ... అనంతమైన అనుబూతుల క్షణాలు ... ముద్దులూ .. .ముచ్చట్లూ ... వినీతకు కాలం తెలియడం లేడు. సాయంత్రమైందంటే శ్రీవారితో షికార్లు, సినిమాలు, షాపింగ్ లూ ... అన్నీ బాగానే వున్నా ఒకే ఒక చిన్న బాధ ...!
భర్త గుండెలమీద తల పెట్టినప్పుడు, అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ఆడుకోవాలన్న చిన్నపిల్ల కోరిక తాలూకు బాధ తప్ప తనని అలా బట్టతలతో చూడలేకపోతుందని అర్థమైంది అక్షయ్ కి, ముఖ్యంగా రొమాంటిక్ మూడ్ లో. చేయాలి ... ఏదైనా చేయాలి వినీత కోసం అనుకున్నాడు.
*****
కిచెన్ లో బిజీగా వుంది వినీత. అక్షయ్ కి ఇష్టమైన జీడిపప్పు ఉప్మా అతనొచ్చేలోగా చేయాలని ఆమె ఆరాటం, సరిగ్గా అప్పుడే వెనకనించి ఓ రెండు చేతులు వచ్చి వినీత నడుమును చుట్టేశాయి. వెంటనే కెవ్వున కేకవేసి ,వెనక్కి తిరిగి ఆ శాల్తీని చూసి భయంతో మరోసారి పెద్దగా కేకేవేసింది.
"ఏయ్ వినీతా ...!''
"వదులు ... ఎవడ్రా నువ్వు ... మా వారొచ్చారంటే నీ పని పడతారు'' అంటూ గింజుకుంటోంది.
"ఏయ్ వినీతా ...! నేను ...'' అంటూ ఇంకా ఇంకా దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు.
వినీతకు అయోమయంగా ఉంది. గొంతు భర్తదే ... ఆకారమూ భర్తదే .... కానీ నెత్తిమీద నల్లగా నిగానిగాలాడుతున్న ఉంగరాల జుట్టు! ఆమె అనుమానం అర్థమై పకపకా నవ్వి చెప్పాడు అక్షయ్. "ఓహ్ ... ఇదా ... నీకిలా ఇష్టమన్నావుగా అందుకే మా ఫ్రెండొకడు ఢిల్లీ వెళ్తుంటే తెప్పించా. ఇది బావుంటే ఇలానే హెయిర్ వీవింగ్ చేయించుకుంటా ... హేపీనా ఇప్పుడు?''
"ఎంత ముద్దుస్తున్నావో'' అంటూ అతని జుట్టును కదలించబోయింది.
"ఏయ్ ఆగాగు ... గట్టిగా పీకితే వెంట్రుకలు కావు, విగ్గే వూడొస్తుంది'' అన్నాడు అక్షయ్. కాస్త డిసప్పాయింట్ అయినా, తన ముచ్చట తీరిందని మురిసిపోయింది వినీత.
*****
తలంటేప్పుడు కాస్త సందేహించింది వినీత "కాస్త జాగ్రత్త'' అని చెప్పాడు అక్షయ్. కాన్సన్ట్రేషన్ అంతా అతని విగ్గుమీదే ఉంది ... అందుకే ఎప్పటిలా హుషారుగా అనిపించలేదు వినీతకు. తను తలంటుకుంటే తనని దగ్గరకు లాక్కుని అల్లరి చేసే అక్షయ్ నీళ్ళు కొన్ని తీసి తన మీద చల్లే అక్షయ్, దగ్గరకు లాక్కుని తనని కూడా టబ్ లోకి లాగే భర్త ... కానీ కానీ ఇప్పుడలా చేస్తుంటే ఆ విగ్గులో అతను కొత్త మనిషిలా అనిపిస్తున్నాడు. అతను తనను బెడ్ రూమ్ దగ్గర హత్తుకుంటే ...
తన నున్నగా తగిలినా ఏదో ఎఫెక్షనేటివ్ ఫీలింగ్ కలిగేది. తనవాడు అనే ఫీలింగ్ ఉండేది. కానీ ... ఇప్పుడు ... ఎవరో పరాయి వ్యక్తిని దగ్గరకు తీసుకుంటున్నట్టు ఉంటోంది. ఎందుకలా? ఆ విగ్గు కృత్రిమంగా ... కృతకంగా వుందా? తననుంచి ఆ విగ్గు తన భర్తని వేరు చేస్తోందా? ఎందుకో రాత్రిళ్ళు అతనితో గడిపినా ఎంజాయ్ చేయలేకపోతోంది. భరించరాని దిగులు వినీతలో.
*****
"ఏయ్ వినీతా ...!'' "చూడు ఈ పుట్టుమచ్చ నీ నడుంమీద ఎలా మెరిసిపోతోందో?'' ఆమె పొట్టమీద నిమురుతూ నడుం ముదతని టచ్ చేస్తూ అన్నాడు.
అక్షయ్ ను తన గుండెల మీదకు చేర్చుకుంది. వినీత కళ్ళల్లో నీళ్ళు ...
"ఏయ్ పిచ్చీ ... ఏమిట్రా కన్నీళ్ళు '' అక్షయ్ చలించిపోయాడు భార్య కళ్ళల్లో నీళ్ళు చూసి.
రెండు చేతులూ తలమీడకు పోనిచ్చి బలంగా విగ్గును లాగి మూలకు గిరాటేసింది.
"వినీ ...!!!''
"సారీ అక్షయ్ ... నాకు నువ్వేకావాలి నీ మనసే కావాలి ... ఛ ... నేనెంత ఫూలిష్ గా మాట్లాడాను? నువ్వెలా ఉన్నా నాకు నచ్చుతావు. నువ్వు నాకు కావాలి ...''
"ఏయ్ పిచ్చి మొద్దూ ...! అదేంటి, నేనింకా హెయిర్ వీవింగ్ చేయించుకోవాలనుకుంటుంటే ...!''
"ఏం అక్కర్లేదు ... సహజంగా నీకుందే ఈ బట్టతలే నాకు ముద్దు అంటూ బట్టతల మీద ముద్దు పెట్టుకుంది''
ఏమిటి విషయం?''
"ఆ విగ్గుతో నిన్ను దగ్గరకు తీసుకుంటుంటే నేనేదో వేరే వ్యక్తితో గడుపుతున్నట్టుంది. నా భర్త, నా అక్షయ్ లా అనిపించడం లేదు. విగ్గుతో ఉన్న నిన్ను టచ్ చేయలేకపోతున్నాను. నాకు నా పాత అక్షయే కావాలి, విగ్గులూ, హెయిర్ వీవింగ్ లూ ఏమీ అక్కర్లేదు. నా బట్టతలా మొగుడే నాక్కావాలి'' అంది అతడ్ని తిరిగి మాట్లాడనీయకుండా ముద్దుల్లో ముంచెత్తుతూ.
అతని భార్య మనసు అర్థమైంది. భార్య మనసెరిగి నడుచుకునే మంచి భర్త అతను. ఇద్దరి మధ్యా రొమాంటిక్ వార మొదలైంది. మా ఆయన్నే ప్రేమిస్తా? మరోసారి మనసులోనే అనుకుంది వినీత.
|
|


