.png)
ఇది విన్న భవానీ ఆవేశంతో పరుగుపరుగున వచ్చి శీలభద్రుడి ప్రక్కన నిల్చుంది. అందరూ ఆశ్చర్యంతో భవానీని చూశారు. ఆమె అందరికీ ఆదిశక్తిలా అగుపించింది.
"పంచ భూతల సాక్షిగా, దైవసాక్షిగా శీలభద్రుడు నా భర్త! భర్తలేని జీవితం భార్యకు వ్యర్థం. నన్ను కూడా శీలభద్రుడితో పాటు బలివ్వండి!'' ఆదేశిస్తున్నట్టుగా అంది భవానీ!
అనుకొని విధంగా మలుపు తిరిగిన ఈ పతాక సన్నివేశాన్ని మహారాజే కాదు అందరూ కళ్ళార్పకుండా చూశారు. చెవులారా వారి మాటలు విన్నారు. ప్రక్రుతి స్తంభించినట్టుగా స్థాబ్దులై కింకర్తవ్యమూడులై నిలుచున్నారు గానీ ఎవరూ కిమ్మన లేదు.
శీల తల్లి, భవానీ తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం ఆదిత్య ధారాపాతంగా కన్నీరు కారుస్తున్నాడు. శిల్పులంతా 'ఇదేమి ఘోరకలి?' అని బావురుమన్నారు.
"ఎవమస్తు?'' అన్న పదం తాంత్రికుడి నోటి నుండి రాగానే మహారాజు లేచి పెదవి విప్పాడు. "తాంత్రికాచార్యా? ఆగండి! చనిపోయే ముందు ఆ ప్రాణి చివరి కోర్కె అడిగి తీర్చటం ఇక్కడ సాంప్రదాయం''
"అలాగే మహారాజా! శీలా, భవానీ మీ చివరి కోరిక ఏమిటి?'' అడిగాడు తాంత్రికుడు.
"మమ్మల్ని బలి ఇచ్చిన తర్వాత మా శిలాఫలకాల్ని ఈ మందిరంలోనే ప్రతిష్టింపచేయండి. ఇదే మా ఇద్దరి చివరి కోరిక!''
"తథాస్తు'' అని తాంత్రికుడు అనగానే అతడి అనుచరుల చేతుల్లోని కరవాలాలు పైకి లేచాయి.
విజయగర్వంతో చిరునవ్వును చిందిస్తూ శీలభద్రుడు భవానీ వైపు ప్రేమగా చూశాడు. అదుగో! అదే చూపు తనకు కావాలి! ఆ చల్లని చూపుకోసమే తను ఎంతోకాలంగా ఎదురు చూసింది. శీలభద్రుడి పదాలకు నమస్కరించి ధర్మపత్నిగా అతని వామపక్షాన నిలిచి తల వంచింది భవానీ. నగారాలు మ్రోగాయి. మంత్రాలు అక్షింతలై శీల, భవానీల తలపై కురిశాయి. 'శీల-భవానీలకు ప్రజలు జయ-జయ నాదాలు పలికారు. పసుపు-కుంకుమాల్లో తడిసిన అక్షింతలు ఇద్దరి మీద చల్లారు. కరవాలాలు మెరుపు తీగల్లా పైకి లేచాయి. గంధపు చెక్కలు భగ్గుమన్నాయి - ఇంతలో ఓ విచిత్రం జరిగిపోయింది.
గాలిలో లేచిన ఖడ్గాలను తీక్షణంగా చూశారు శివానందాచార్యులు. వాయుదేవుడిని ధ్యానించి తన చూపును అజేయ ఆయుధంగా శక్తిని నింపి ఖడ్గాల మీద ప్రయోగించాడు. శక్తి సమన్వితమైన ఆయన చూపు ఖడ్గాల దిశను మార్చివేశాయి. అంతే! ఆ ఖడ్గాలు తాంత్రికుడి శిరస్సును చేదించాయి. మరో ఖడ్గం అతని శ్రస్సును తీసుకెళ్ళి యజ్ఞగుండంలో పడేసింది. ఎవరూ ఊహించని ఆశ్చర్యం జరిగిపోయింది.
"శివానంద స్వాములవారికి జయము, జయము'' అంటూ నినాదాలు ప్రతిధ్వనించే సరికి అందరూ సంభ్రమాశ్చర్యంలోంచి తేరుకున్నారు. అందరూ మంచే జరిగిందని సంబరపడ్డారు.
*****
'ఖజురాహో కథను పూర్తీ చేసి సుభ్రహ్మణ్యం పిళ్ళై బాధతో తలవంచుకున్నాడు. అతని అంతర్మథనానికి పొంగిన కన్నీరు అమృతధారగా లిన్ కు దర్శనమిచ్చింది. అతని హృదయం కూడా కలతచెందింది. పిళ్ళై భుజాలను తడుతూ ధైర్యం పలుకుతూ-
"డోంట్ వర్రీ! పాస్ట్ ఈజ్ పాస్ట్! ఇట్ నెవర్ కమ్స్ అగేయిన్!'' అన్నాడు లిన్.
తల్లారింది. ఇద్దరూ రాత్రంతా మేల్కొన్నారు. లిన్ డార్ట్న్ తన చివరి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు.
శీలభద్రుడు, భవానీల ఆ శిలాప్రతిమలు ఎక్కడున్నాయని లిన్ అడిగిన ప్రశ్నకు జవాబుగా మీరు వెళ్ళిపోయేలోగా చూపిస్తానని చెప్పి వెళ్ళిన పిళ్ళై మళ్ళీ రాలేదు. ఇద్దరు కుర్రాళ్ళ చేత కబురు పంపాడు. తను స్వయంగా వారింటి దగ్గరకు వెళ్లి వచ్చాడు. టెంపో తీసుకుని ఖజురాహో అంతా పిళ్ళై కోసం గాలించాడు. కానీ ఆటను ఎక్కడా అగుపించలేదు. లిన్ కు అది ఆశ్చర్యంగా అనిపించింది. అర్థాంతరంగా అతడు అదృశ్యమయ్యాడెందుకన్న ప్రశ్న లిన్ కు చివరి వరకూ శేష ప్రశ్నగానే మిగిలిపోయింది.
|
|


