The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Khajuraho>>Khajuraho
ఖజురాహో - 83

భవానీ ఆశ్చర్యంతో శీలభద్రుడిని చూసింది.

శీల పసివాడిలా ఏడ్వసాగాడు. భవానీ చేతిలోని సమ్మెట క్రింద పడిపోయింది.

గుడి గంటల ధ్వని ఖజురాహోలో ప్రతిధ్వనించసాగింది. అంతఃపురంలోని కాపలావారు నాలుగు గంటలు కొట్టి- జాగరణ హెచ్చరికలు చేశారు. బ్రహ్మముహూర్తం ఎప్పుడో మొదలైనట్టుంది. బ్రాహ్మణుల మంత్రోచ్చారణలు అంత నిశ్శబ్దంలో దూరంగా ప్రతిధ్వనిస్తున్నాయి. అలసిపోయిన భవానీ, శీల మీద ఒరిగిపోయింది.

*****

ఆరోజే నూతనంగా నిర్మించిన మందిరానికి ప్రాణ ప్రతిష్ట. ఉదయం నుండే నగరప్రజలు మందిరం దగ్గర గుమిగూడసాగారు. బంగారు పల్లకిలో కూర్చున్న తాంత్రికుడు తన అనుచరులతో వచ్చేశాడు. మహాకాల భైరవానంద స్వామి అంతకు పూర్వమే ఏర్పాటు చేసిన ఉన్నత ఆసనం మీద ఆసీనులయ్యారు. వైష్ణవానందులు, శివానందా చార్యులు, మహాశిల్పులు, వాచస్పతి, నగర ప్రముఖులు, ధర్మ గురువులు, వ్యాపారశ్రేష్ఠులు, తిరుణాళ్ళకు తరలి వచ్చినట్టుగా వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నారు. మహారాజు, మహారాణి సపరివారంగా విచ్చేశారు. భవానీ తన కుటుంబంతో ఓ ప్రక్కగా కూర్చుంది. మహామంత్రి ఆదిత్య అటూ-ఇటూ హడావిడిగా తిరుగుతున్నాడు.

మహారాజు మందిరానికి రాగానే ప్రజలు అభివాదం చేస్తూ లేచి నిల్చున్నారు. రకరకాల వాయిద్యాలు మారుమ్రోగాయి. శీలభద్రుడు కూడా ఏవో ఏర్పాట్లు చేయటంలో మునిగివున్నాడు. భైరవానందస్వాముల వారు శీలభద్రుడిని ప్రత్యేకంగా పిలిపించి - "బిడ్డా! శీలభద్రా! నీ అద్భుత శిల్ప నిర్మాణము ఈ నూతన మందిరానికి జీవం పోసింది. నీవు ఏమి కోరుకున్నా యివ్వటానికి సిద్ధంగా వున్నాను. నిన్ను మహామంత్రిని చేయమంటావా చెప్పు!'' అన్నాడు.

"మరి ఆదిత్యను ఏం చేస్తారు?'' అడిగాడు శీలభద్రుడు.

"అతనేమౌతాడో నీవే చూస్తావుగా!''

"మీరు నాకు ఇవ్వాలనుకున్న కానుక సందర్భం వచ్చినప్పుడు అడిగి తీసుకుంటాను మాట తప్పారు కదా!'' అన్నాడు శీల.

"కాలం గతి తప్పుతుందేమో గానీ, ఈ మహాకాలుని మాంటంటే అది శిలాశాసనమే. నీ కళాసాధన ఆచంద్ర తారార్కం ఉంటుంది. మహారాజు కీర్తిని, ఖజురాహో ఔన్నత్యాన్ని పెంచావు. మహారాజు, మహారాణి కూడా నీ పట్ల ప్రసన్నులుగా వున్నారు. నీ అకుంఠిత దీక్ష, సాధన, అత్యంత ప్రశంసణీయము. వెళ్ళు నీ పని చూసుకో! మొహూర్తపు వేళ దగ్గర పడుతోంది'' అని శీలను పంపేసాడు భైరవానంద స్వామి.

"ఏర్పాట్లన్నీ శీలభద్రుడే చేస్తున్నాడు. మహామంత్రి అగుపించటం లేదేంటి?'' మహారాణి గండదేవుని అడిగింది.

"ఎక్కడో వుంటాడు. వస్తాడు. గర్భగుడిలో జ్యోతిర్లింగ ప్రతిష్టలో మునిగి పనులు చేయిస్తూ వుంటాడు'' అన్నాడు మెల్లగా మహారాజు.

బలిపీఠాన్ని చూస్తూ మహారాణి ఏదో అడిగితే, మహారాజు ఏదో మెల్లగా మహారాణి చెవిలో చెబుతున్నాడు. మహాకాళ భైరవానంద స్వాములవారు వస్త్రధారణ ప్రజలనందరినీ ఆకర్షించసాగింది. హిమాలయాల మధ్య అప్పుడే ఉదయించిన సూర్యభానుడిలా వెలిగిపోతూ వున్నాడు. అడుగడుగునా ప్రజలు ఉత్కంఠతో తాంత్రికుడిని చూస్తున్నారు. ఆ ఉత్కంఠకు ప్రముఖ కారణం నరబలి! దానికి ఎవరిని ఎన్నుకుంటారన్న ఆసక్తి అందరిలోనూ వుంది.

నగారాల ధ్వనులు ప్రతిధ్వనించాయి. బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణలు ప్రారంభమయ్యాయి.