.png)
అర్థరాత్రయినా శీలభద్రుడి కుటీరంలో దివిటీల వెలుగు ప్రతిఫలిస్తోంది. శరత్ చెంద్రుని చల్లని వెన్నెల బయట కురుస్తోంది. ఎటు చూసినా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కాని కీచురాళ్ళు మేల్కొనే వున్నాయి. అంతరాత్రయినా భవానీ, శీలభద్రులు మేల్కొనే వున్నారు. భవానీ-శిల్పం ప్రక్కనే శీలభద్రుడి శిల్పం-రెండింటినీ కుటీరానికి ఒక ప్రక్కపెట్టి వుంచారు. ఆ రెండు శిల్పాలని తదేకంగా చూస్తోంది భవానీ.
శీలభద్రుడు వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకున్నాడే గానీ నిదుర పోలేదు. అంత నిశ్శబ్దంలో చిన్న వెక్కిళ్ళశబ్దం వినబడుతోంది. శీలభద్రుడు వెళ్ళి భవానీ దగ్గర నిల్చుని భవానీని పరీక్షగా చూశాడు. ఆవిడ గుండ్రని ఎత్తయిన పాలిండ్లు శ్వాస-ప్రస్వ్హాసలకు అదురుతున్నాయి.
"ఏమిటీ భవానీ! ఎందుకు ఏడుస్తున్నావు?'' భుజాన్ని తన అరచేతితో తాకుతూ అడిగాడు శీల.
"ఏమీ లేదులే శేలా!''
"అర్థరాత్రయినా నిడురపోకుండా, ఇలా నిశ్శబ్దంలో నీలో నీవే ఎందుకు బాధపడుతున్నావు? ఏం జరిగింది?''
"నీ మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను శీలా!''
"ఎందుకలా మాట్లాడుతున్నావు భవానీ?''
"మీరు చెక్కిన శిల్పాల్లో నాకెలాంటి స్థానముందో అర్థం చేసుకోలేకపోతున్నాను''
"శిల్పానికీ, నీకూ పోలికా? అంటే శిలల్ని ప్రేమించినంతగా నిన్ను చూసుకోవటం లేదనా నీ భావం?''
"మీ పని పూర్తయింది. మీరు పొందాలనుకున్నది పొందారు. కానీ నేను పొందాలనుకున్నదే పోగొట్టుకున్నాను''
"పోగొట్టుకున్నావా? ఏమిటి నీవంటున్నది? నీవు కోరుకున్నదేమిటి, పోగొట్టుకున్నదేమిటి? నాకు అర్థమయ్యేలా చెప్పు భవానీ!'' వ్యాకుల చిత్తంతో భవానీ అందమైన చుబుకనని మునివ్రేళ్ళతో పట్టుకుంటూ అడిగాడు శీలభద్రుడు.
అదే తడి నయనాలతో శీలభద్రుడిని చూసింది భవానీ. ఆ చూపులో ఎన్ని యజ్ఞాల మంటలో, ఎన్ని వివశతల చితిమంటలో, ఎన్ని సుడిగుండాల వలయాలో అగుపించాయి శీలభద్రుడికి. భవానీ మొదటి చూపు శీలకు ఇప్పటికీ గుర్తుంది. ఆ చూపునకూ, ఇప్పటి చూపునకూ ఎంత తేడా వుందో? "మహా శిల్పిగా నిన్ను చూడాలనుకున్నది వాస్తవమే కానీ నా కోసమే బ్రతికి, నన్నే ఆరాధించే ప్రేమికుడిగా నిన్ను పొందాలనుకుని పోగొట్టు కున్నాను. నాకు మిగిలిందేమిటన్న ప్రశ్నార్థకంలో పడిపోయాను మహాశిల్పీ!'' జీరగా వస్తున్నా భవానీ తీయని కంఠం సెలయేర్ల సవ్వడిని గుర్తుకు తెస్తున్నాయి.
"అదిగో ఆ కిటికీ లోంచి కనిపిస్తున్న ఆలయాన్ని జాగ్రత్తగా చూడు భవానీ! అడుగడుగునా, ఎటు చూసినా నీ ప్రతిబింబాల్నే మలిచాను. ఎందుకంటావా? అందులో నా ప్రేమ, ఆరాధన, తపస్సు-అవన్నీ నీ కోసమేనన్న భావన అగుపించాలనే అలా చేశాను. కాదంటావా?'' బాధగా అడిగాడు శీలభద్రుడు.
జవాబుగా భవానీ మళ్ళీ వెక్కి వెక్కి ఏడ్చింది. "నీవు ఎదిగినంత ఎత్తుకి నేను ఎదగలేకపోయానేమో శీలా! నీవు నిలుచున్నా చోటుకు నేను కూడా దగ్గరగా వుండాలన్నదే నా తపన, నీవు ప్రపంచానికి శిల్పాల ద్వారా పంచాలనుకున్న ప్రమామృతం నాకు దొరక్కుండా పోతుందన్న బాధతప్ప మరేయితర భావనా నాలో లేదు. నీవే నా లక్ష్యం. కానీ నీ లక్ష్యం మరోకటైతే మనిద్దరం, నీవు చెక్కిన శిల్పంలోని సమానాంతర రేఖల్లా అయిపోతామేమోనన్న భయంతో నిద్ర పట్టటం లేదు. ఎన్ని యుగాల నిరీక్షణానంతరం నిన్ను చేరుకున్నట్టుగా అనిపించిన నాకు, మళ్ళీ నిన్ను పోగొట్టుకోలేను శీలా!'' బొంగురు పోయిన కంఠంతొ అంది భవానీ.
"నేను మీ ముందు ఎన్నో భంగిమల్లో నిల్చున్నాను. శృంగార ముద్రలో, కామక్రీడా విన్యాసంలో, దేవీరూపంలో, విరహిణిగా మతృరూపంలో వస్త్రాలంకారంలో, నగ్నంగా కూడా, కామాసక్త తీవ్రభావంతో అగుపించినా నీవు చలించ లేదు. నీకను చూపుల్లో నిర్లిప్తతను చూసి దిగులు పడిపోయాను. నన్ను సరియైన భంగిమల్లో వుంచటానికి ఎన్నోమార్లు నన్ను స్పృశించావు కూడా. కానీ నీ చేతులు కంపించలేదు. నీ శ్వాస ప్రక్రియలో ఉత్తేజం అగుపించలేదు.''
"అందుకే అన్ని కళాఖండాలు వెలిశాయి. నీవనుకున్నట్టుగా నేను చలించి వుంటే ...'' అంటూ శీలభద్రుడు అర్థోక్తిగా భవానీ వైపు చూశాడు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం!
|
|


